జ్యుడీషియల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటుకు వీలు కలిగించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 179 మంది సభ్యులు ఓటువేయగా, రాంజెఠ్మలానీ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కలిగిస్తుంది. ఈ బిల్లుతోపాటుగా, కమిషన్ ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినట్టయింది. ఈ బిల్లుకు లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

ఫూలన్‌దేవి హంతకుడికి జీవిత ఖైదు

  మాజీ బందిపోటు, పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఖైదుతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది. బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు హత్యకు గురైన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది

బలవంతంగా సర్వే చేయొద్దు.. ప్రజలకు ఇష్టముంటేనే సర్వే: హైకోర్టు

  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనే విషయం ప్రజల ఇష్టమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దాంతో హైకోర్టు స్పందిస్తూ వ్యక్తిగత వివరాలను అడిగి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే సర్వేలో పాల్గొనాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని పేర్కొంది. ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే న్యాయ సమ్మతం కాదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. న్యాయస్థానం ఈరోజు రెండు పక్షాల వాదననూ వింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే తప్పనిసరి కాదని, స్వచ్ఛందంగానే ఈ సర్వేని నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాల కోసమే సర్వేని నిర్వహిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడమని ఆయన తెలిపారు. పౌరుల బ్యాంకు, తపాలా ఖాతాలు, మొబైల్ నంబర్ లాంటివి ప్రజల వ్యక్తిగత వివరాలనని, వాటిని ప్రభుత్వం అడగరాదని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. గణాంకాల చట్టం ప్రకారం సర్వేకు ముందుగా ప్రకటన ఇవ్వాలని అన్నారు.

పైలెట్ గుర్రు.. విమానం తుర్రు..

  ముంబై నుంచి బ్రసెల్స్ వెళ్తున్న జెట్ ఎయిర్వేస్కు చెందిన ఈ బోయింగ్ 777 విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తోంది. ఇంతలో ఆ విమానం అకస్మాత్తుగా ఐదు వేల అడుగుల కిందకి దిగిపోయింది. విమానంలో వున్న ప్రయాణికులు ఇదేంటా అనుకున్నారు. అయినా పైలెట్‌ అన్నీ చూసుకుంటాళ్ళే మనకెందుకు భయం అనుకున్నారు. అక్కడే ప్రయాణికులు పప్పులో కాలేశారు. విమానం ప్రయాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పైలెట్ ఆ సమయంలో కాక్‌పిట్‌లోని తన సీట్లో కూర్చుని హాయిగా నిద్రపోతున్నాడు. సాధారణంగా విమానాలు దూర ప్రయాణం చేస్తున్న సమయంలో పైలెట్లకు కాసేపు నిద్రపోయే అవకాశం వుంటుంది. అయితే ఆ సమయంలో కో పైలెట్ అలెర్ట్.గా వుండాలి. అయితే ఈ విమానంలో పైలెట్ నిద్రపోతున్న సమయంలో ఆ విమానంలో వున్న మహిళా కో పైలెట్ హాయిగా తన ట్యాబ్‌ను చూసుకుంటూ కూర్చుంది. పైలెట్, కో పైలెట్ ఇద్దరూ పట్టించుకోకపోవడంతో ఆ విమానం అకస్మాత్తుగా ఐదు వేల అడుగుల కిందకు దిగిపోయింది. ఆ ప్రాంతంలో 34వేల అడుగుల ఎత్తున ప్రయాణించాల్సిన విమానం 29వేల అడుగుల ఎత్తునే ప్రయాణిస్తుండటంతో అంకారా ఏటీసీ ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే విమానానికి ప్రమాద హెచ్చరిక పంపింది. దాంతో ఎంచక్కా ట్యాబ్‌తో ఆడుకుంటున్న కో పైలెట్టమ్మకి తెలివొచ్చి విమానాన్ని అదుపు చేసింది. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని తేల్చిన జెట్ ఎయిర్వేస్ సంస్థ.. పైలట్లిద్దరినీ గ్రౌండింగ్ చేసి దర్యాప్తు చేస్తోంది.

సర్వే: కేంద్రం ఆరా తీయలేదట...

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న చేయ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారం కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమను ఎలాంటి సమాచారం కోరలేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే మీద టీడీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఈ వార్తలను ఖండించారు. తెలంగాణ సర్వేపై హోంమంత్రికి ఫిర్యాదు చేయలేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి తెలిపారు. సర్వే రాజ్యాంగబద్దమా, కాదా అనే వివరణ మాత్రమే కోరామని చెప్పారు. సర్వే తప్పా, ఒప్పా అనేది తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని ఆయన అన్నారు.

అలా ప్రారంభోత్సవం.. ఇలా యాక్సిడెంట్...

  హైదరాబాద్‌ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ వాహనాల ప్రారంభోత్సవం గురువారం ఉదయం ట్యాంక్ బండ్ మీద జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు ఈ వాహనాలు అందించారు. అయితే కేసీఆర్ అలా వాహనాలు అందించారో లేదో ఇలా యాక్సిడెంట్ జరిగింది. ప్రారంభోత్సవం అయిన తర్వాత రెండు ఇన్నోవా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అది కూడా ఎక్కడో కాకుండా ట్యాంక్ బండ్ మీదే కావడం విచిత్రం. శుభమా అని ప్రారంభోత్సవం కాగానే వాహనాలకు యాక్సిడెంట్ కావడం అశుభసూచకం అనిపించినప్పటికీ, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందరూ లైట్‌గా తీసుకున్నారు.

తెలంగాణలో పేకాట క్లబ్‌లు ఉండకూడదు: కేసీఆర్

  తెలంగాణలో పేకాట క్లబ్ అనే మాటే వినపడకుండా తమ ప్రభుత్వం చేస్తుందని, ఈ విషయంలో పోలీసులు కూడా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖకు మూడు వందల బైక్‌లు వంద ఇన్నోవా వాహనాలను కేసీఆర్ హైదరాబాద్‌లోని టాంక్ బండ్ మీద జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ భద్రత విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనలను తెలిపారు.   1. హైదరాబాద్ నగరం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం. అవి మూడు నెలలో పనిచేయడం ప్రారంభిస్తాయి.   2. అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తాం.   3. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. 4. హైదరాబాద్‌లో పేకాట   క్లబ్ అనే మాటే వినపడకుండా చేస్తాం.   5. పోలీసులు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలి.

అమీర్‌ఖాన్ ‘పీకే’ పోస్టర్ కేసు.. కొట్టేసిన సుప్రీం కోర్టు...

  అమీర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’కి సంబంధించిన పోస్టర్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నగ్నంగా వున్న అమీర్‌ఖాన్ అవసరమైన చోట ఒక పాత మోడల్ టేప్ రికార్డర్ని అడ్డం పెట్టుకుని వుంటాడు. ఈ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో అంతే వివాదాస్పదం కూడా అయింది. ఈ పోస్టర్ మీద, ఈ సినిమా మీద సుప్రీం కోర్టులో కేసు నమోదు అయింది. ఈ సినిమా మీద రకరకాల ఆరోపణలు చేస్తూ, ‘పీకే’ సినిమా విడుదలను నిలిపివేయాలని సదరు పిటిషన్లు కోరాయి. అయితే గురువారం నాడు సుప్రీం కోర్టు ఆ కేసులు అన్నిటినీ కొట్టేసింది. కళలు, వినోదం విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. సదరు సినిమా చూడటం ఇష్టం లేనివాళ్ళు చూడకుండా వుండొచచని, విడుదల ఆపాలనడం మాత్రం న్యాయం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను ఆపితే నిర్మాత హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా.. మొత్తుకుంటున్న జైరాం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించేసిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కి ఇంతకాలం తర్వాత సడెన్‌గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయనకి అనుమానం వచ్చేసింది. దాంతో ఆయన తెగ బాధపడిపోతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టు కనబడుతోందన్న సందేహాన్ని జైరాం రమేష్ ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అర్జెంటుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విషయమై జైరాం రమేష్‌కు ఇటీవల ప్రణాళిక, పథకాల అమలు శాఖ మంత్రి ఓ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ప్రణాళిక సంఘంలో ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తోందని తెలిపారు. అయినప్పటికీ జైరాం రమేష్ కేంద్రానికి లేఖ రాసి తన మంచితనం చాటుకునే ప్రయత్నం చేశారు.

సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...

  ఆగస్టు 19న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని, సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు ప్రజలు కచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొన్నారు. సర్వే నిర్వహించిన రెండు వారాలలోగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 14 వేల డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి డాటా ఎంట్రీ సెప్టెంబర్ 4వ తేదీకి పూర్తి చేయాలని, పూర్తి చేసిన సర్వే వివరాలపై సెప్టెంబర్ 10 నుంచి స్కూట్న్రీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, వారికి ఒక్కొక్క బుక్‌లెట్‌లో పది ఫారాలు అదనంగా చేర్చి మొత్తం 30 సర్వే ఫారాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సర్వే ఫారాలు ఇంగ్లీష్‌లో, గ్రామీణ ప్రాంతాలలో తెలుగులో వుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పంద్రాగస్టు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోట మీద నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోటను ఇప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలు ఇప్పటికే గోల్కొండ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా వుంటే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నాడు సాయుధ బలగాలు రిహార్సల్ చేశాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు రూట్లలో గోల్కొండ కోటకు వివిఐపిలు, విఐపిలను అనుమతించేందుకు వీలుగా ప్రత్యేకంగా పాస్‌లను జారీ చేసి, వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను కూడా కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. పంద్రాగస్టు రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ నగరంలో, గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ఆయన తెలిపారు.

నరేంద్రమోడీ సమర్థుడు: అమెరికా

  నరేంద్రమోడీ సమర్థుడైన పాలకుడు అని అమెరికా ప్రతినిధుల సభ పేర్కొంది. గడచిన 30 ఏళ్ళలో లేనివిధంగా భారతదేశంలో పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని.. భారత్-అమెరికాల మధ్య ఆయన నవీన సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ పేర్కొంది. నరేంద్ర మోడీ హయాంలో భారత్ - అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని.. వాణిజ్యం, రక్షణ సహకారం బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని అమెరికా ప్రతినిధుల సభ వ్యక్తం చేసింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో... ఆ దేశ ప్రతినిధుల సభ ఒక నివేదికను రూపొందించింది. దానిని సభ్యులకు అందజేసింది.