రేవంత్ ను వ్యూహాత్మకంగా విచారిస్తున్న ఎసిబి

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు వ్యూహాత్మకంగా విచారిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ను ఎసిబి ఆఫీస్ లో విచారిస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ ఆయనను చర్లపల్లి జైలులోనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ లను మాత్రమే ఎసిబి ఆఫీస్ కి తీసుకెళ్ళిన అధికారులు, రేవంత్ ని మాత్రం జైలులోనే విచారించడం ముందస్తూ వ్యూహంగా తెలుస్తోంది. రేవంత్ తరపు న్యాయవాదులు తమకు సమాచారం ఇవ్వకుండా ఎసిబి అదికారులు విచారణ చేస్తున్నారంటూ ఎసిబి ఆఫీస్ ఎదుట ఆందోళనక దిగారు. రేవంత్ ఎసిబి ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతారన్నది ఉత్కంఠగా మారింది.

40 ఎకరాలు భూమి విరాళం ఇచ్చిన అశ్వినీ దత్త్

  ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్త్ గన్నవరం మండలంలో కేసరపల్లి గ్రామంలో తన 40ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో సుమారు 550ఎకరాల భూములను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాని కోసమే అశ్వినీ దత్త్ తన 40ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేరు. ఆయన ఈరోజు జిల్లా ఆర్.డి.ఓ.ని కలిసి ఆ భూమి తాలూకు యాజమాన్య పత్రాలను అందజేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రాజకీయ నేతలు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు.

ఒంగోలు గిత్తలతో అరక దున్నిన బాబు

నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు భూమి పూజ నిర్వహించారు.అనంతరం ఒంగోలు గిత్తలతో అరక దున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నవ ధాన్యాలు చల్లారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య శాస్ర్తోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం సాగింది. వైదిక సంప్రదాయం ప్రకారం వేదపండితులు పూజలు చేశారు. చంద్రబాబు సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సుజనా చౌదరి, ఏపీ సభాపతి కోడెల శివప్రసాద రావు, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత‌కి స్టార్ ఇమేజ్ తెచ్చిన రామానాయుడు

డి.రామానాయుడుకి ముందు.. డి.రామానాయుడు త‌రువాత‌.. ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల‌కి సంబంధించి చెప్పుకోవాల్సివ‌స్తే ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌ల‌సిన మాట‌. అంత‌గా త‌న‌దైన ముద్ర‌ను నిర్మాణ రంగంలో వేసారు రామానాయుడు. నాణ్య‌త ఉన్న సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. ఎన్నో ఘ‌న‌విజ‌యాల‌ను అందించి నిర్మాత‌గా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ మెగా ప్రొడ్యూస‌ర్‌. ఐదు ద‌శాబ్దాల పాటు నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాల‌కు చిరునామాగా నిలిచిన రామానాయుడు జ‌యంతి నేడు (జూన్ 6). ఈ సంద‌ర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను స్మ‌రించుకునే ప్ర‌య‌త్నం ఇది. రైతు బిడ్డ నుంచి నిర్మాత వ‌ర‌కుః ప్ర‌కాశం జిల్లా కారంచేడు గ్రామంలో జూన్ 6, 1936న జ‌న్మించారు రామానాయుడు. వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన రామానాయుడు.. సినిమాల‌పై ఉన్న ఇష్టంతో 1965లో ఎన్టీఆర్ న‌టించిన రాముడు - భీముడు చిత్రంతో సోలో ప్రొడ్యూస‌ర్‌గా అడుగులు వేశారు. 1971లో వ‌చ్చిన ప్రేమ‌న‌గ‌ర్‌తో  ఇక వెనుక‌కు చూడ‌వ‌ల‌సిన ప‌రిస్థితి లేకుండా భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.  1965 నుంచి 2014 వ‌ర‌కు త‌న బ్యాన‌ర్‌లో  దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాల‌ను అందించారాయ‌న‌. ఈ 50 ఏళ్ల‌లో నాలుగైదు సంద‌ర్భాల్లో మిన‌హాయిస్తే ప్ర‌తి ఏడాదిలోనూ త‌న‌ సినిమాల‌తో సంద‌డి చేశారు. ఒక్కో ఏడాదిలో అయితే ఐదారు సినిమాల‌ను నిర్మించిన ట్రాక్ రికార్డూ ఉంది. రికార్డులు రివార్డులు అవార్డులు అత్య‌థిక సంఖ్య‌లో సినిమాల‌ను నిర్మించిన నిర్మాత‌గా గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన రామానాయుడు..  మ‌రెవ‌రికి సాధ్యం కాని విధంగా 13 భాష‌ల్లో సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసి త‌న పేరిట మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.   ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్క‌రాన్ని త‌న సొంతం చేసుకున్నారు. స్టార్స్ ప్రొడ్యూస‌ర్ రామారావు, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా ఓ త‌రంలోని టాప్ హీరోలంద‌రితోనూ సినిమాల‌ను నిర్మించి హిట్స్‌ను కైవ‌సం చేసుకున్న రామానాయుడు.. త‌రువాత త‌రంలోని స్టార్ హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తోనూ సినిమాల‌ను తీసి స‌క్సెస్‌ల‌ను అందిపుచ్చుకున్నారు.  స్టార్స్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ స్టార్ హీరోల‌తో సినిమాలు తీసి మెప్పించ‌డ‌మే కాదు.. నూత‌న న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న కొన్ని సినిమాల‌ను నిర్మించారు. హ‌రీష్‌, మాలాశ్రీ‌ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన  ప్రేమ‌ఖైదీ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. స్టార్‌ల‌ను కాకుండా క‌థ‌ల‌ను న‌మ్మి ఆయ‌న సినిమాలు తీసేవారు. అందుకే ఆయ‌న నిర్మించిన సినిమాల్లో సింహ‌భాగం విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి.  ఎంతో మంది కొత్త న‌టీన‌టులును, సాంకేతిక‌నిపుణుల‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాకుండా.. వారిలో చాలా మందిని స్టార్స్‌గా మ‌లిచిన ఘ‌న‌త కూడా ఉన్నందున స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు రామానాయుడు. న‌ట‌నా కోణం నిర్మాత‌గా ఎన్నో ఘ‌న‌విజ‌యాల‌ను సొంతం చేసుకున్న రామానాయుడు.. న‌టన మీద ఆస‌క్తితో కొన్ని సినిమాల్లో చిరు పాత్ర‌ల‌ను పోషించారు. మ‌రి కొన్ని సినిమాల్లో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌ల్లోనూ మెప్పించారు. హోప్ సినిమా కోసం పూర్తినిడివి ఉన్న పాత్ర‌ను చేసి అల‌రించారు. నాయుడుగారి కుటుంబం - సినిమాకే అంకితం  సినిమాల‌పై త‌న‌కున్న ప్రేమ‌ను త‌న వ‌ర‌కే ప‌రిమితం చేసుకోలేదు రామానాయుడు. త‌న కొడుకుల‌ను, మ‌న‌వ‌ళ్ల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసారు. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్‌బాబు నిర్మాత‌గా తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డిస్తే.. మ‌రో త‌న‌యుడు వెంక‌టేష్ క‌థానాయ‌కుడుగా అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడోత‌రంలో రామానాయుడు మ‌న‌వ‌ళ్లు రానా, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు. నిర్మాత‌గా స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకున్న రామానాయుడు  ఫిబ్ర‌వ‌రి 18, 2015న క‌న్నుమూశారు.  నిర్మాత‌కు స్టార్‌డ‌మ్ ని తీసుకువ‌చ్చిన ఆయ‌న లాంటి  నిర్మాత‌ బ‌హుశా మ‌ళ్లీ పుట్ట‌క‌పోవ‌చ్చు.

నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజ

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి పూజా కార్యాక్రమాలు తుళ్ళూరు మండలంలో మండడం గ్రామంలో సర్వ్ నెంబర్స్:135,136లలో ఈరోజు తెల్లవారు జామున సుమారు 4.30గంటల నుండే ప్రారంభం అయ్యాయి. వైఖానస ఆగమనశాస్త్రంలో దిట్ట నల్లూరు విఖనస భట్టాచార్యులు, దాశరధి శ్రీనివాసా దీక్షితుల నేతృత్వంలో మొదట స్థల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తరువాత వరుసగా విఘ్నేశ్వర పూజ, కలశ, ఆగారం, విష్వక్సేన, అష్ట దిక్పాల, నవగ్రహ, నాగేటి పూజలు, వాస్తు పురుష పూజ, గోపూజ, వృషభ పూజ నిర్వహిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి మరి కొద్ది సేపటిలో అంటే 8.49నిమిషాలకు భూమి పూజ చేసి అనంతరం హల పూజలో భాగంగా భూమి పూజ చేసిన అ ప్రాంతానికి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నేలను దున్ని పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చంద్రబాబు స్వయంగా అరకపట్టి నేలను దున్నుతుంటే ఆయన అర్ధాంగి భువనేశ్వరి స్వయంగా విత్తనాలు చల్లుతారు.   ఇదివరకు రాజులు తమ రాజ్యాలను స్థాపించే ముందు తమ రాజ్యంలో ప్రజలు అందరూ భోగ భాగ్యాలతో, పాడిపంటలతో కలకాలం సుఖంగా, సంతోషంగా ఉండేందుకుగాను ఈవిధంగానే ముందుగా అన్ని పూజలు నిర్వహించిన తరువాత భూమిని దున్ని విత్తనాలు చల్లేవారని చరిత్రలో పేర్కొనబడింది. అందుకే చంద్రబాబు నాయుడు దంపతులు కూడా వేదపండితులు సూచించిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ అన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. హలపూజ తరువాత దంపతులిరువురూ వేద పండితులకు ఘనంగా సంభావన ఇచ్చి వారి ఆశీర్వచనం పొందుతారు.

జయలలిత కోర్టు కేసుల బిల్లు జయకే

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సుమారు గత రెండు దశాబ్దాలుగా కర్నాటక రాష్ర్టంలో సాగింది. తమిళనాడులో విచారణ జరిగితే కోర్టు తీర్పుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక పొరుగు రాష్ట్రమయిన కర్ణాటకలో జరపాలని జయలలిత అభ్యర్ధన మేరకే ఆమె కేసు అక్కడికి బదిలీ అయ్యింది. ఏళ్ల తరబడి ప్రత్యేకకోర్టులో ఆ తరువాత కర్నాటక హైకోర్టులో సాగిన కేసుల నుండి ఆమె చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో బయటపడి మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోయి చాలా కులాసాగా రాష్ట్రాన్ని తనదైన శైలిలో పరిపాలించుకొంటున్నారు. కానీ ఇన్నేళ్ళుగా ఆమె కేసు జరుగుతున్నప్పుడు తమ ప్రభుత్వం సుమారు రూ.5 కోట్లు పైనే ఖర్చు పెట్టిందని దానిని చెల్లించమని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది.   అయితే కర్నాటక హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించి కేసుల నుండి విముక్తి చేస్తే అందుకు సంతోషించవలసిన కర్నాటక ప్రభుత్వం, ఊరుకోకుండా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చేయబోతున్నప్పుడు అది పంపిన బిల్లును జయలలిత చెల్లిస్తారా? ఒకవేళ చెల్లిస్తే ఆమెకు సుప్రీంకోర్టుకి ఈడ్చినందుకు కూడా మున్ముందు బిల్లు చెల్లించమని అడుగుతుందేమో కూడా? ఒకవేళ ఆమె ఇప్పుడు చెల్లించకపోతే ఆమె నుండి ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి కర్నాటక ప్రభుత్వం మరొక కొత్త కేసు వేస్తుందేమో? దానికి కూడా జయలలితనే బిల్లు చెల్లించమని అడిగినా ఆశ్చర్యం లేదు.ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు కేసుల బిల్లును ఆయనకే పంపించాలేమో?  

బ్లాక్ మెయిల్ చేసినా బెదిరేది లేదు.. చంద్రబాబు

ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల నేరవర్పు గురించి నేనొకటి చెబితే ఓ వార్తా పత్రికా దాన్ని వేరేలా రాసి దుర్మార్గంగా వక్రీకరించిందని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శీలంవారిపేటలో నిర్వహించిన జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం విడిపోయి ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్టు మేము చెబితే హామీలు అమలు కష్టసాధ్యమన్నట్టుగా రాశారని మండిపడ్డారు. పేదవారు ప్రమాదంలో చనిపోతే రూ.9లక్షల భీమా ఇప్పించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా గ్రామంలో పనులేమి సరిగా జరగడంలేదని గ్రామస్తులు సీఎంకు ఫిర్యాదు చేయగా సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు జరగపోతే సహించేది లేదని హెచ్చరించారు. తమపై కొంత మంది కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటి వాటికి భయపడేది లేదని చంద్రబాబు అన్నారు.

రేపు తెల్లవారుజామునుంచే భూమి పూజ కార్యక్రమాలు

ఎన్నో అనుమానాల మధ్య ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంఖుస్థాపన జూన్ 6న జరగబోతుంది. రాజధాని శంఖుస్థాపన నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమాలు శనివారం తెల్లవారుజాము మూడుగంటల నుండే ప్రారంభంకానున్నాయి. మందడం సర్వే నెంబరు 135, 136 లో ఉదయం 8 గంటల 49 నిమిషాలకు పూజ జరగనుంది. ఈపూజా కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. అనంతరం చంద్రబాబు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్‌ క్యాంప్‌ కార్యాలయాన్నే ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చారు.

జయలలితకు పోటీగా కుష్బూ?

అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా విడుదలైన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా కూడా ఆరునెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు చైన్నైలోని రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదికూడా లేకపోవడంతో జయలలితపై తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తెలిపారు. ఇక ఇతర పార్టీ అభ్యర్ధులు బరిలో దిగుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి కుష్బూ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా

నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఏసీబీ కోర్టు ఈ విచారణను ఈ నెల తొమ్మిదో తేదికి మరోసారి వాయిదా వేసింది. అయితే 8న కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా మరోవైరు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ జరిగింది. ఇరువర్గాల వాదోపవాదనలు విన్న ఏసీబీ జడ్జి తీర్పును సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డిని కస్టడీకి అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

డబ్బు, డ్రగ్స్ ఇస్తే పుట్టబోయే బిడ్డను ఇస్తా.. తల్లి ప్రకటన

పెంచే స్తోమత లేకనో.. ఇతర కారణాలవల్లనో పిల్లల్ని అమ్మే తల్లులను చూశాం. కానీ.. ఇక్కడ ఓ సూపర్ ఫాస్ట్ తల్లి మాత్రం ఇంకా తనకు పుట్టని బిడ్డను అమ్మకానికి పెట్టింది. అది కూడా తనకు తిండిలేక కాదు... కేవలం "డ్రగ్స్, డబ్బు ఇస్తే చాలు నాకు పుట్టబోయే బిడ్డను ఇచ్చేస్తా" అని ఫేస్ బుక్ లో ఓ ప్రకటన ఇచ్చింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఓ తల్లి "తాను ఆరు నెలల గర్బవతినని త్వరలోనే ఒక బిడ్డకు జన్మనిస్తున్నానని, అయితే ఆ బిడ్డ నాకు అవసరం లేదని డ్రగ్స్, డబ్బు ఇస్తే వారికి నా బిడ్డను అప్పగిస్తాన"ని క్రయిగ్ లిస్ట్ అట్లాంటా ఫేస్ బుక్ లో ఇటీవల ఒక ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనతో నెటిజన్లు మండిపడి సదరు మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రకటన ఎక్కడినుండి వచ్చిందో.. ఎవరిచ్చారో కూపీ లాగే పనిలో ఉన్నారు.

రేపిస్టులు అమాయకులు.. గోవా మంత్రి

రేపిస్టులు ఒట్టి అమాయకులు.. వారికేం తెలియదు ఇవి ఎవరో అన్న మాటలు కాదు ఓ మంత్రి పదవిలో ఉండి బాధ్యతలు స్వీకరిస్తున్న దిలీప్ పరులేకర్. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆయన మాట్లాడుతూ రేప్ లు ఎక్కడ జరగట్లేదు చెప్పండి.. నా దృష్టిలో ఇవి చాలా చిన్న సంఘటనలు.. పాపం రేప్ చేసిన నిందుతులు చాలా అమాయకులు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మంత్రిగారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు గోవా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా స్పందించి ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. గోవా పర్యటనకు వెళ్లిన ఇద్దరు ఢిల్లీ మహిళల్నీసోమవారం ఐదుగురు కలిసి సామూహిక హత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రి పలికిన పలుకులు ఇవి.

పార్టీ మారినా పర్లేదు.. పార్టీకి నష్టం చేస్తే ఊరుకోం.. రఘువీరా

పార్టీ నుండి వెళ్లిపోయినా పర్వాలేదు కానీ.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే మాత్రం ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి హెచ్చరించారు. విశాఖపట్నంలోని మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ పార్టీ వీడి వెళ్లిపోయినా పెద్ద నష్టం లేదని, కానీ తను పార్టీని వీడి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం ఆయన ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరని ఆయనకే తెలిసివస్తుందని ఎద్దేవ చేశారు. అయితే తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బొత్స పై కేంద్ర అధిష్ఠానం సస్పెండ్ వేటు వేసింది. కాగా ఈనెల 7వ తేదీన వైఎస్ఆర్సీపీ లో చేరుతున్న నేపథ్యంలో బొత్స కూడా మూడు రోజుల క్రితమే రాజీనామ లేఖను పార్టీ అధినేత్రి అయిన సోనియాగాంధీకి పంపించారు.

నిద్రపోతున్నా వారే గుర్తుకొస్తున్నారు.. చంద్రబాబు

నిద్రపోతున్నా కూడా తనకు పేదల సంక్షేమమే గుర్తుకొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరులో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్త్రీలకు కూడా అవకాశాలు కల్పించాలని, వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా హరిటేజ్ గురించి గుర్తు చేస్తూ.. 20 ఏళ్ల కిందట తన భార్య నిర్వహణలో ప్రారంభించిన హరిటేజ్ ఇప్పుడు రూ.2100కోట్ల టర్నోవర్ ఇస్తుందని అన్నారు. అంతేకాక త్వరలో కేటాయించబోయే మద్యం దుకాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని, ప్రజలకు హాని కలిగకుండా ఉండేలా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ.200 కోట్లతో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ అనుసంధానతను కల్పిస్తామన్నారు. ఈ నెల 8న జరిగే తెదేపా బహిరంగ సభలో పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు.