రేవంత్ రెడ్డి చంచల్ గూడ టు చర్లపల్లి

రేవంత్ రెడ్డికి 14 రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే చంచల్ గూడ జైలు అధికారులు చంచల్ గూడలో తీవ్రవాదులున్నారని, సరిపడా బ్యారక్ లు లేవని ఈ సమయంలో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడం కష్టమని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, జైలులో తనకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు తెదేపా నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిని కలిసి పరామర్శించారు. 

నౌక ముగిని 405 మంది గల్లంతు

చైనాలో తుఫాన్ కారణంగా ఓ నౌక అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 450 మంది జలమయం అయ్యారు. వివరాల ప్రకారం ఈస్టెన్ స్టార్ అనే నౌక చైనాలోని అతి పొడవైన నదిగా పేరొందిన యాంగ్జీ నది మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారిగా విపరీతమైన గాలులు, తుఫానుతో ప్రతికూల వాతవరణం ఏర్పడి నౌక నదిలో మునిగి పోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే నౌకలో మొత్తం 405 మంది ప్రయాణికులు, 47 మంది సిబ్బంది ఉండగా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగారు. తుఫాన్ వల్ల సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందని, గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.. కేసీఆర్

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని వారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, అలాంటి వారికోసం ఎంతటి కష్టానైనా భరిస్తానని అన్నారు. అంతేకాక ఆయన చేపట్టిన, చేపట్టబోయే పలు అంశాల గురించి సభాపూర్వకంగా తెలియజేశారు. * సంక్షేమ పథకాల కోసం 28 వేల కోట్లు * మిషన్ కాకతీయ పథకం ద్వారా 46వేల చెరువులు బాగు చేస్తాం * హరితహారం కింద 300 కోట్ల మొక్కలు నాటుతాం * వచ్చేనెల జులైలో 25వేల ఉద్యోగాలకు ప్రకటనల జారీ * 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడతాం * 50 వేల డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం * ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ * రూ.91వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టలతో 2018 నాటికి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ * అంగన్ వాడీ ఉద్యోగులకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం * మహిళల భద్రతకోసం షీ టీమ్స్ ఏర్పాటుచేశాం * రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ * రూ. 20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం

అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా... చంద్రబాబు

రాష్ట్రాన్ని విభజించినవారే అసూయపడేలా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముందున్న ఒకే ఒక సంకల్పం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణమని, దీనికోసం మేము అహర్నిశలు శ్రమిస్తామని ప్రజలు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు. అంతేకాక నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషిచేస్తామని దీక్షకు వచ్చిన ఉద్యోగులు, ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ కోరుకునేదని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుప్రజలంతా ఒక్కటేనని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు.

తెలంగాణ ఆవిర్బావ వేడుకలు ప్రారంభం

ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మొదట పోలీసుల గౌరవ వదనం స్వీకరించారు. తరువాత పోలీసు కవాతు, తెలంగాణ సంస్కృతిని తలపించేలా చేసిన శకటాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు పలువురిని సత్కరించారు.

నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం

ఆంధ్రరాష్ట్ర నవనిర్మాణ దీక్షలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చాలా దారుణంగా విడదీసి ప్రజలకు అన్యాయం చేశారని, అయినా ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందని అన్నారు. అంతేకాకుండా విభజన వల్ల విద్యార్ధులు తమ మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు కోల్పోయారన్నారు.

జూన్ 7న వైకాపాలో బొత్స చేరే అవకాశం

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే. ఆయన ఈనెల 7వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఆయన ఈనెల 9న విజయనగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి ఆయన సమక్షంలో వైకాపాలో చేరుదామని భావించినట్లు వార్తలు వచ్చేయి. కానీ పార్టీలోకి తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లా వైకాపా నేతల ముందు ఆ విధంగా బల ప్రదర్శన చేయడం వలన వారి నుండి మరింత వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో దానిని విరమించుకొన్నట్లు సమాచారం. కనుక లోటస్ పాండ్ నివాసంలోనే జగన్ సమక్షంలో జూన్ 7న  వైకాపాలో చేరాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఫలితాలు

  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. ఆరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలపి 120 మంది ఎమ్మెల్యేలు వుండగా, 118 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కి హాజరు కాలేదు. పోలైన ఓట్లలో 5 ఓట్లు చెల్లలేదు. ఒక ఎమ్మెల్యే నోటా హక్కును వినియోగించుకున్నాడు. విజయం సాధించిన టీఆర్ఎస్ సభ్యులు... 1. కడియం శ్రీహరి, 2. తుమ్మల నాగేశ్వరరావు, 3. నేతి విద్యాసాగర్ రావు, 4. యాదవ్ రెడ్డి, 5. బి.వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత.

రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక కేసీఆర్ హస్తం?

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇస్తూ దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఇప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డిని కావాలనే ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని, దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కు కొంతసేపటికి ముందు కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో మరికద్ది సేపటిలో మీరో వార్త వింటారు అని చెప్పినట్టు సమాచారం, అలా కేసీఆర్ చెప్పిన కొంత సేపటికే రేవంత్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక కేసీఆర్ ఉన్నట్టు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి సంవత్సరం అయిన సందర్భంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. అయితే సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరిన శిల్పాలను చూస్తే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తున్నాయి. ఈ వేడుకలకు పలువురు కళాకారుల, పోలీసులు అప్పుడే రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారు. మరోవైపు పోలీసు అధికారులు మైదానంలో ఎలాంటి అవరోధాలు, అవాంఛిత ఘటనలు జరగకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ మైదానం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

100 రాహుల్ గాంధీలు.. ఒక్క మోడీ

వంద మంది రాహుల్ గాంధీలొచ్చినా ప్రధాని నరేంద్రమోడీ ముందు సాటిరాలేరని శివసేవ మండిపడింది. శివసేన తన అధికార పత్రిక సామ్నాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించింది. మోడీ ప్రభుత్వాన్ని సూటు-బూటు సర్కారు అని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. విశ్రాంతి పేరిట చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ బయటకు వచ్చిన తరువాత చాలా హుషారుగా ఉన్నారని కానీ మోడీ ముందు ఆ హుషారు ఎంతో సేపు ఉండదని ఎద్దేవ చేశారు. అన్ని పార్టీలూ కాంగ్రెస్ పార్టీలా ఉండవని, అనేక కుంభకోణాల పేరిట నగదు సూటుకేసులను మార్చుకున్న పార్టీ కాంగ్రెస్ అని శివసేన విమర్శించింది.

అనుకూలంగా ఉంటే ముడుపులిస్తామన్నారు.. సీబీఐ జడ్జి

బొగ్గు కుంభకోణంలో నిందితులకు అనుకూలంగా ఉండాలని దానికి ఎంత కావాలంటే అంత ముడుపులు చెల్లిస్తామని నన్ను లోపర్చుకోవాలని చూశారని సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ స్కాంకు సంబంధించిన ఒక నిందితుడి తరపు న్యాయవాది తనను కలిశాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని తెలిపారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జడ్జి హెచ్చరించారు. దీంతో జడ్జి మాటలకు ఖంగుతిన్న న్యాయవాది అతనికి క్షమాపణలు చెప్పారు. అయితే జడ్జి గారు, తనను మభ్యపెట్టడానికి ప్రయత్నించిన న్యాయవాది పేరును మాత్రం బటయపెట్టలేదు.

మరో మలుపు తిరిగిన జయలలిత కేసు..

అక్రమాస్తుల కేసుపై జయలలిత పై ఉన్న ఆరోపణలు తొలగించి కర్ణాటక కోర్టు ఆమె కేసును రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఆ తరువాత ఆమె ఈ నెల 17న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పదవిని కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు జయలలిత కేసు మరో కొత్త మలుపు తిరిగింది. జయలలిత కేసు తీర్పును సవాల్ చేయాలని కర్ణాటక హైకోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెపై శిక్ష నిలిపిపేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ కేసు విచారణకు వెళితే జయలలిత మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో జయలలిత తీర్పును సవాల్ చేస్తూ డీఎంకే పార్టీ నేతలు కోర్టులో అప్పీలు చేస్తామని, మాకు ఆ హక్కు ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.