బాబుని బ్రహ్మ దేవుడు కూడా రక్షించ లేడు: కేసీఆర్

  రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇంత వరకు పరోక్ష యుద్ధం చేస్తున్న ఆంద్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులిరురువు ఇప్పుడు ప్రత్యక్ష యుద్దానికి దిగారు. చంద్రబాబు నిన్న మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా తన జోలికి వస్తే వదిలిపెట్టనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు కూడా. అందుకు కేసీఆర్ వెంటనే బదులిస్తూ ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను (చంద్రబాబు నాయుడు)ని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. తెలంగాణాలో సమస్యలు పరిష్కరించుకోవడానికే తమకు రోజుకి 20గంటలు పనిచేసినా సరిపోవడం లేనప్పుడు ఇటువంటి వ్యవహారాల గురించి ఆలోచించే తీరిక తమకెక్కడిదని ప్రశ్నించారు. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు తెలంగాణా రాష్ట్రం ఇచ్చినా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని చేసి కాంగ్రెస్ సన్నాసులు తమకీ తలనొప్పులు తగిలించిపోయారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడుకి పోలీసులు, ఎసిబి ఉండొచ్చునేమో కానీ ఆయనేమీ హైదరాబాద్ కి ముఖ్యమంత్రి కాదనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. అసలు ఒక్క యంయల్సీని గెలిపించుకోలేవని తెలిసినప్పుడు పోటీలో ఎందుకు నిలబెట్టావని ప్రశ్నించారు. స్టీఫెన్ సన్ తెలంగాణా బిడ్డ గనుక ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎసిబికి పిర్యాదు చేసి రేవంత్ రెడ్డి ని పట్టించారని అన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి కావాలో అది అయి తీరుతుంది. ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి. నేడు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలర్‌ ఎగరేసుకుని దేశం ముందు నిలబడింది. ఇక ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్‌ జాగ్రత్త!” అని తీవ్ర స్వరంతో చంద్రబాబు నాయుడుని హెచ్చరించారు.

నేను ఒంటరి వాడిననుకొన్నారా?

  తెదేపా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా సంకల్పం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “హైదరాబాద్ మరో తొమ్మిదేళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అక్కడ గౌరవప్రదంగా నివసించే హక్కు మా అందరికీ ఉంటుంది. హైదరాబాద్ మీ జాగీరు కాదని తెరాస నేతలు గుర్తుంచుకోవాలి. నేను ఏదో మామూలు వ్యక్తినని, ఒంటరి వాడిననే అపోహలో నన్ను ఏదో చేయాలనుకొంటే మీకే ప్రమాదం. నా వెనుక ఐదు కోట్లమంది ప్రజలున్నారు. నేను వారందరికీ ప్రతినిధిని, వారు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని. కనుక నాతో చెలగాటమాడోద్దని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రినయిన నా ఫోనే ట్యాపింగ్ చేసే దుస్సాహాసం చేసారు. అందుకు వారు తగిన శిక్ష అనుభవించక తప్పదు. నాతో పెట్టుకొంటే కబడ్ధార్ జాగ్రత్త! నీకు పోలీసులు ఉన్నట్లే నాకూ పోలీసులు ఉన్నారు. నీకు ఎసిబి ఉన్నట్లే నాకూ ఎసిబి ఉంది. తలుచుకొంటే నేను తగిన విధంగా బుద్ధి చెప్పగలను. కానీ గౌరవనీయమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అటువంటి నీచ రాజకీయాలు, కుట్రలు చేయడం భావ్యం కాదనే ఉద్దేశ్యంతోనే మీ ఆటలన్నీ సహిస్తున్నాను."   "రాజకీయాలు చేయడం కాదు రాష్ట్ర అభివృద్ధిలో నాతో పోటీపడమని అధికారం చేప్పట్టిన మొదటి రోజే నేను కేసీఆర్ కి సవాలు విసిరాను. కానీ అతను నాతో పోటీ పడలేకనే ఈవిధమయిన కుట్రలు పన్నుతున్నాడు. ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతోంది అంటే బుద్దున్నవాడెవడూ దానిని చెడగొట్టాలనుకోడు. కానీ కేసీఆర్ మాత్రం ఓవైపు సంబరాలు చేసుకొంటూ మా మహాసంకల్ప కార్యక్రమానికి చెడగొట్టాలని ప్రయత్నించాడు. అక్కడ ట్యాంక్ బ్యాండ్ మీద కూర్చొని టీ-న్యూస్ ఛానల్లో ఆడియో టేపులు అంటూ ఏవో రిలీజ్ చేయించాడు. వాటిని చూసి నేనేదో భయపడిపోతాననుకొన్నాడు కానీ నేను బులెట్ లా దూసుకుపోతాను. ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి?" అని ప్రశ్నించారు.   "అసలు మా యంయల్యేలని కొనుకొన్నది నువ్వు కాదా...అని అడుగుతున్నాను. మా పార్టీ జెండాతో యంయల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రిగా ఉంచుకొన్న నువ్వా నాకు నైతిక విలువల గురించి పాఠాలు చెప్పేది? అతను నేటికీ సిగ్గు లేకుండా తెదేపా యం.యల్యేగా కొనసాగుతుంటే ఎందుకు రాజీనామా చేయించడంలేదు?అదేనా నైతిక విలువలు పాటించడమంటే?రాజకీయాల గురించి, నైతిక విలువల గురించి నీ నేను దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన ఖర్మ నాకు పట్టలేదు. ఇప్పటికయినా ఇటువంటి పిల్లచేష్టలు కట్టిపెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించడం నేర్చుకో,” అని చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది... గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 'మహాసంకల్పం' పేరిట గుంటూరులో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం అయిందని, ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఎప్పటికైనా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి పునాది రాయి పడిందని.. ఇక అభివృద్దే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహాసంకల్పం పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు, గవర్నర్ ఆవిష్కరించారు.

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు కర్నాటకలో ఫిర్యాదు..

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం దాని వెనుక తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నాడంటూ ఎన్నో అనుమానాలు, ఆరోపణల మధ్య ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. దీని ఆజ్యం పోసినట్టుగా స్టీఫెన్ సన్ ను చంద్రబాబు ప్రలోభ పెట్టారంటూ నిన్న రాత్రి దానికి సంబంధించిన ఆడియో టేపులను టీన్యూస్ ఛానల్ లో బయటపెట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి నిప్పులు చెరుగుతోంది. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్ధులు, తెదేపా అభ్యర్ధులు పోటాపోటీగా ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమను ప్రలోభపరిచారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసుల ఎదుట వాంగ్మూలాలు నమోదు చేస్తుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేతలు తమను ప్రలోభపరిచారంటూ తెలంగాణ టీడీపీ నేతలు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే టీడీపీ వాంగ్మూలాలు తెలంగాణ పోలీసులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో కర్నాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏసీబీ ఎప్పుడెప్పుడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడదామ అనే గట్టి ప్రయత్నమే చేస్తుంది. అయితే స్టీఫేన్ సన్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించడానికి లేదా విచారణ జరపడానికి ఏసీబీ ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారు

తెలంగాణ తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారంటూ చంద్రబాబు స్టీఫెన్ ల ఆడియో టేపులను టీ న్యూస్ ఛానల్ నిన్న రాత్రి బటయపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ గవర్నర్ ను కలిసి ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలకు మంచిది కాదని, ఇలాంటి పరిణామాలు జరగడం చాలా బాధాకరమని దత్తాత్రేయ అన్నారు. అయితే ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పడేమి మాట్లాడలేనని, ఈ వ్యవహారమంతా గవర్నర్ చూసుకుంటారని స్పష్టం చేశారు.

చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు... పరకాల

నోటుకు ఓటు కేసులో ఎలాగైనా సీఎం చంద్రబాబును ఇరికించాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న రాత్రి చంద్రబాబు సంభాషణల ఆడియో టేపును బయటపెట్టడం.. అది కూడా తన సొంత ఛానల్ అయిన టీ న్యూస్ లో ప్రసారం చేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ పనికి ఏపీ ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడెక్కడో మాటలన్నీ గుచ్చి చంద్రబాబు మాటలంటున్నారని.. అసలు ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నీచంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించినప్పుడు ఈ సంభాషణ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరని, ఆయనను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి మొదటి వారికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కావాలనే ఈ టేపును విడుదలచేశారని అయినా తమ సభ జరుగుతుందని, తమ సంకల్పం బలపడుతుందని అన్నారు.

రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా

  నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టు ఈరోజు కౌంటర్ దాఖలు చేయమని ఏసీబీ అధికారులను ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రేవంత్ రెడ్డికి కనీస సౌకర్యాలు కల్పించట్లేదని అతని తరపు న్యాయవాది పిటిషన్ వేయగా ఏసీబీ అధికారులు దీనికి స్పందించి ఆయనకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని నివేదికను సమర్పించారు.

రేవంత్ రెడ్డి మూడోరోజు కస్టడీ.. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నరేవంత్

  నోటుకు ఓటు కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డి మూడో రోజు ఏసీబీ కస్టడీలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి జ్వరం, గొంతునొప్పితో ఆరోగ్యం సరిగా లేకపోవడంవలన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఏసీబీ రేవంత్ రెడ్డిని విచారించనుంది. అయితే రేవంత్ రెడ్డికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అవేమి పట్టించుకోవట్లలేదని, రేవంత్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని అతని తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.

సీఎం క్యాంపు కార్యలయం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజ రోజు జరగాల్సిన సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్‌ క్యాంప్‌ కార్యాలయాన్నే ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు యనమల రామకృష్ణ, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కడప విమానశ్రయానికి అన్నమయ్య పేరు

    కడప విమానశ్రయం ప్రారంభించబోతున్నట్లు వార్తలు వెలువడగానే, దానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలంటూ వైకాపా డిమాండ్ చేసింది. కానీ దానికి సుప్రసిద్ద వాగ్గేయకారుడు అన్నమయ్య పేరు పెట్టామని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయనున్నట్లు నిన్న విమానశ్రయాన్ని ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కడప విమానశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో బాటు కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే కడప జిల్లా ప్రజల కోరిక నెరవేరిందన్నారు. త్వరలోనే కడప నుంచి చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌లకు కూడా విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపనకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగవచ్చని ఆయన అన్నారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ కడప విమానాశ్రయం నుండి ఏ 320 విమానాలు నడిపేందుకు కూడా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.   కడప విమానాశ్రయం ఆరంభం అవడం వలన కడప జిల్లా వాసులకు చాలా సౌకర్యం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వారందరి కంటే ఎక్కువగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు చెందిన వైకాపా నేతలకే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. హైదరాబాద్, కడప, బెంగుళూరుల మధ్య తరచుగా తిరిగే జగన్మోహన్ రెడ్డికి ఈ విమాశ్రయం ప్రారంభం కావడం చాలా సౌకర్యం కలిగించిందని భావించవచ్చును. ముఖ్యమంత్రి ప్రారంభించిన కడప విమానాశ్రయం, ఆయనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ద్వేషించే, విమర్శించే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా ఉపయోపడటం చాలా విచిత్రమే.

వైకాపాలో చేరిన బొత్స అండ్ కో.

  ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన భార్య బొత్స ఝాన్సీ రాణి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. వారితో బాటు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ తులసి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెలాఖరులోగా బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ఆయన సమక్షంలోనే మరికొంతమంది కాంగ్రెస్ నేతలను, పార్టీ కార్యకర్తలను వైకాపాలో చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లైపోసక్షన్ వల్లే ఆర్తి మృతి?

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో గుండెపోటు కారణంగా మరణించినట్టు ఆమె మేనేజర్ ప్రకటించినప్పటికీ ఆమె శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకునే లైపోసక్షన్ శస్త్ర చికిత్స విఫలం కావడం వల్లే మరణించి వుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లైపోసక్షన్ శస్త్ర చికిత్స విఫలం అయితే గుండెపోటు రావడం జరుగుతూ వుంటుందని వైద్యులు చెబుతున్నారు. మొదటి సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చిన ఆర్తి అగర్వాల్ తెలుగు పరిశ్రమలోని అగ్ర కథానాయకులతోపాటు యువ కథానాయకుతో నటించినా తన స్టార్‌డమ్‌ని ఎక్కువకాలం నిలుపుకోలేకపోయారు. ప్రేమ విఫలం, రెండుసార్లు ఆత్మహత్యాయత్నం, వైవాహిక జీవిత వైఫల్యంతోపాటు బాగా పెరిగిపోయిన శరీర బరువు ఆమెను మానసికంగా కృంగదీశాయి. తన కెరీర్‌ని కొనసాగించడానికి ఆమె చిన్న చిన్న సినిమాలలో నటించడానికి కూడా అంగీకరించారు. ఇప్పుడు ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది.

షాకింగ్ న్యూస్‌ ఆర్తి అగ‌ర్వాల్ మృతి

క‌థానాయిక ఆర్తి అగ‌ర్వాల్ (31) క‌న్ను మూసింది. అమెరికాలోని న్యూజెర్సీ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ.. ఆర్తి మృతి చెందింది. ఆర్తి కొంత‌కాలంగా శ్వాస‌కోస సంబంధ‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఇది ఆత్మ‌హ‌త్య అని చెబుతున్న‌వాళ్లూ ఉన్నారు. గ‌తంలో ఓసారి ఆర్తి ఆత్మ‌హ‌త్యాప్ర‌య‌త్నం కూడా చేసింది. ఆర్తి మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను క‌ల‌చివేసింది. నువ్వునాకున‌చ్చ‌వ్‌, ఇంద్ర‌, అందాల రాముడు, నువ్వులేక నేనులేనులాంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఒక‌ట్రెండు సినిమాలూ ఆమె చేతిలో ఉన్నాయి. ఆర్తి మ‌ర‌ణంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.

రేవంత్ ను వ్యూహాత్మకంగా విచారిస్తున్న ఎసిబి

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు వ్యూహాత్మకంగా విచారిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ను ఎసిబి ఆఫీస్ లో విచారిస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ ఆయనను చర్లపల్లి జైలులోనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ లను మాత్రమే ఎసిబి ఆఫీస్ కి తీసుకెళ్ళిన అధికారులు, రేవంత్ ని మాత్రం జైలులోనే విచారించడం ముందస్తూ వ్యూహంగా తెలుస్తోంది. రేవంత్ తరపు న్యాయవాదులు తమకు సమాచారం ఇవ్వకుండా ఎసిబి అదికారులు విచారణ చేస్తున్నారంటూ ఎసిబి ఆఫీస్ ఎదుట ఆందోళనక దిగారు. రేవంత్ ఎసిబి ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతారన్నది ఉత్కంఠగా మారింది.