డబ్బు, డ్రగ్స్ ఇస్తే పుట్టబోయే బిడ్డను ఇస్తా.. తల్లి ప్రకటన

పెంచే స్తోమత లేకనో.. ఇతర కారణాలవల్లనో పిల్లల్ని అమ్మే తల్లులను చూశాం. కానీ.. ఇక్కడ ఓ సూపర్ ఫాస్ట్ తల్లి మాత్రం ఇంకా తనకు పుట్టని బిడ్డను అమ్మకానికి పెట్టింది. అది కూడా తనకు తిండిలేక కాదు... కేవలం "డ్రగ్స్, డబ్బు ఇస్తే చాలు నాకు పుట్టబోయే బిడ్డను ఇచ్చేస్తా" అని ఫేస్ బుక్ లో ఓ ప్రకటన ఇచ్చింది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఓ తల్లి "తాను ఆరు నెలల గర్బవతినని త్వరలోనే ఒక బిడ్డకు జన్మనిస్తున్నానని, అయితే ఆ బిడ్డ నాకు అవసరం లేదని డ్రగ్స్, డబ్బు ఇస్తే వారికి నా బిడ్డను అప్పగిస్తాన"ని క్రయిగ్ లిస్ట్ అట్లాంటా ఫేస్ బుక్ లో ఇటీవల ఒక ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనతో నెటిజన్లు మండిపడి సదరు మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రకటన ఎక్కడినుండి వచ్చిందో.. ఎవరిచ్చారో కూపీ లాగే పనిలో ఉన్నారు.

రేపిస్టులు అమాయకులు.. గోవా మంత్రి

రేపిస్టులు ఒట్టి అమాయకులు.. వారికేం తెలియదు ఇవి ఎవరో అన్న మాటలు కాదు ఓ మంత్రి పదవిలో ఉండి బాధ్యతలు స్వీకరిస్తున్న దిలీప్ పరులేకర్. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆయన మాట్లాడుతూ రేప్ లు ఎక్కడ జరగట్లేదు చెప్పండి.. నా దృష్టిలో ఇవి చాలా చిన్న సంఘటనలు.. పాపం రేప్ చేసిన నిందుతులు చాలా అమాయకులు అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. మంత్రిగారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు గోవా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఉర్ఫాన్ ముల్లా స్పందించి ప్రభుత్వం తీరువల్లే గోవాలో నేరాలు పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. గోవా పర్యటనకు వెళ్లిన ఇద్దరు ఢిల్లీ మహిళల్నీసోమవారం ఐదుగురు కలిసి సామూహిక హత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రి పలికిన పలుకులు ఇవి.

పార్టీ మారినా పర్లేదు.. పార్టీకి నష్టం చేస్తే ఊరుకోం.. రఘువీరా

పార్టీ నుండి వెళ్లిపోయినా పర్వాలేదు కానీ.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే మాత్రం ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి హెచ్చరించారు. విశాఖపట్నంలోని మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ పార్టీ వీడి వెళ్లిపోయినా పెద్ద నష్టం లేదని, కానీ తను పార్టీని వీడి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం ఆయన ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరని ఆయనకే తెలిసివస్తుందని ఎద్దేవ చేశారు. అయితే తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బొత్స పై కేంద్ర అధిష్ఠానం సస్పెండ్ వేటు వేసింది. కాగా ఈనెల 7వ తేదీన వైఎస్ఆర్సీపీ లో చేరుతున్న నేపథ్యంలో బొత్స కూడా మూడు రోజుల క్రితమే రాజీనామ లేఖను పార్టీ అధినేత్రి అయిన సోనియాగాంధీకి పంపించారు.

నిద్రపోతున్నా వారే గుర్తుకొస్తున్నారు.. చంద్రబాబు

నిద్రపోతున్నా కూడా తనకు పేదల సంక్షేమమే గుర్తుకొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరులో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్త్రీలకు కూడా అవకాశాలు కల్పించాలని, వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా హరిటేజ్ గురించి గుర్తు చేస్తూ.. 20 ఏళ్ల కిందట తన భార్య నిర్వహణలో ప్రారంభించిన హరిటేజ్ ఇప్పుడు రూ.2100కోట్ల టర్నోవర్ ఇస్తుందని అన్నారు. అంతేకాక త్వరలో కేటాయించబోయే మద్యం దుకాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని, ప్రజలకు హాని కలిగకుండా ఉండేలా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ.200 కోట్లతో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ అనుసంధానతను కల్పిస్తామన్నారు. ఈ నెల 8న జరిగే తెదేపా బహిరంగ సభలో పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు.

చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు.. మత్తయ్య

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ దొరికిపోయిన నేపథ్యంలో చంద్రబాబును ఏలాగైనా ఇరికించాలని చూస్తున్నారని ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలని, లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించైనా చెప్పిస్తామని బెదిరిస్తున్నారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలిండియా దళిత క్రైస్తవ సమాఖ్య కార్యదర్శి బాధ్యతగా స్టీవెన్ సన్ దగ్గరకు వెళ్లానని అంతేకాని . ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రతి 5 నిమిషాలకొకసారి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, నిన్ను కేసు నుంచి తప్పిస్తాం.. అంతే కాదు రూ. 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, రేవంత్ లపై ఉన్న వారి కోపానికి నన్ను బలిపశువును చేస్తున్నారని వాపోయారు.

ఆయనపై మేమేమీ కేసు పెట్టమనలేదు:కడియం

  రేవంత్ రెడ్డి కేసు వ్యవహారంలో తెలంగాణా హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరస్పర విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఈకేసులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉన్నట్లు తాము నమ్ముతున్నామని, తమ వద్ద ఆయన ఫోన్ సంభాషణల రికార్డులు ఉన్నాయని, వాటిని తగిన సమయంలో బయటపెడతామని నాయిని రెండు రోజుల క్రితం వరంగల్ వెళ్ళినప్పుడు మీడియాతో అన్నారు. ఈకేసులో చంద్రబాబు నాయుడు పేరును కూడా జోడించాలని అనేకమంది తమను కోరుతున్నారని అన్నారు. కానీ తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిన్న మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై కేసుపెట్టమని కోరలేదని, ఆ సంగతి ఏసీబీయే చూసుకొంటుందని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

  తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రశ్నించేందుకు ఆయనను తమకు 5రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కూడా నిన్న కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు ఈరోజే కోర్టు విచారణకు చేపడుతుంది. రేవంత్ రెడ్డి తరపున జంద్యాల రవిశంకర్, ప్రమోద్ రెడ్డి అనే ఇరువురు లాయర్లు వాదించనున్నారు. ఈనెల 11వ తేదీన ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఉన్నందున బెయిలు మంజూరు అవుతుందో లేదోననే చాలా ఆందోళనతో ఉన్నారు. కానీ ఏసీబి అధికారులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకొని ఈకేసు విషయంలో మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్నందున వారు ఆయనకు బెయిలు మంజూరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఒకవేళ బెయిలు మంజూరు కానట్లయితే రేవంత్ రెడ్డి తన కుమార్తె నిశ్చితార్ధ కార్యక్రమానికి కోర్టు అనుమతి తీసుకొని హాజరవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కోర్టు బెయిలు మంజూరు చేస్తుందా లేదా అనే విషయం మరి కొన్ని గంటలలోనే తేలిపోతుంది. ఒకవేళ మంజూరు కాకపోయినట్లయితే లాయర్లు హైకోర్టులో మరో బెయిలు పిటిషన్ దాఖలు చేయవచ్చునని సమాచారం.

కేంద్రమంత్రి పీయుష్ గోయల్ తో కేసీఆర్ భేటీ

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తాము రాష్ట్రంలో నిర్మించే థర్మల్ ప్లాంట్ లకు బొగ్గు కేటాయించాలని కోరారు. నార్త్ గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్ వరకు ట్రాన్స్ మిషన్ కారిడార్ ను త్వరగా పూర్తి చేయాలని, ట్రాన్స్ మిషన్ లైన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఇదే విషయంపై ప్రధాని మోడీకి లేఖలు రాశామని, తాము రాసిన లేఖలను పీయుష్ గోయల్ కు చూపించారు. అంతేకాదు చత్తీస్ గఢ్ నుండి 1000 మెగా వాట్ల విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నామని పీయుష్ కి తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ కేసీఆర్ అడిగిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు.

భయపడను.. బులెట్ లా దూసుకెళ్తా.. చంద్రబాబు

రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు సూత్రధారి వేరే ఉన్నారని, చంద్రబాబు ఫోన్ సంభాషణలు మాదగ్గర ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నాయిని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తమపై చేసే తప్పుడు వ్యాఖ్యలకు భయపడమని, బుల్లెట్ లా దూసుకెళ్తామని అన్నారు. ముందు తెదేపా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ పై కేసు పెట్టాలని, అసలు జగన్ ఏ అర్హతతో తమ పార్టీని విమర్శిస్తున్నారో తెలియడంలేదు, 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు ఆ హక్కు లేదని ఎద్దేవ చేశారు.   మరోవైపు నాయిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తమ దగ్గర చంద్రబాబు సంభాషణలు ఉన్నాయి అంటున్నారు.. మా ఎమ్మెల్యేలతో కేసీఆర్, కేటీఆర్, కవిత మాట్లాడిన వాయిస్ రికార్డింగులను ముందు బయట పెట్టండి అని మండిపడ్డారు. ఏసీబీ మీ ఒక్కరికే కాదు మాకు కూడా ఉంది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు.

వాళ్ల తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదు.. యనమల

తెలంగాణ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదని ఏపీ ఆర్ధికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారికి టీడీపీని సూటిగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా దొంగదారిలో రేవంత్ రెడ్డిని ఇరికించారని మండిపడ్డారు. అసలు ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు గతంలోనే వెల్లడించిందని అన్నారు. ఇలాంటి అక్రమ కేసుల వల్ల రేవంత్ రెడ్డికి ఎలాంటి నష్టం లేదని ఈ కేసు నుండి రేవంత్ రెడ్డి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మీద పగ సాధించాలనే కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఇలాంటి పనులు చేస్తున్నారని, ఆంధ్రా ప్రజలు జగన్ ను ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమించరని విమర్శించారు.

చంద్రబాబు విచారణకు గవర్నర్ అనుమతి?

  నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ట అయిన నేపథ్యంలో ఏసీబీ ఇంకా కేసుకు సంబంధిన మొత్తం సమాచారం కోసం గట్టి ప్రయత్నమే చేస్తుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే ఈ పని చేశాడా.. లేక ఎవరైనా చేయించారా.. అనే విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నప్పటికీ తెర వెనుక ఉన్న పాత్రధారి మాత్రం చంద్రబాబునాయుడే అని ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అవడమే దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. మరోవైపు ఈ కేసులో పక్కా ఆధారాలను ఏసీబీ సేకరిస్తుంది. ఈ ఆధారాలతోనే చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ గవర్నర్ దగ్గర అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఏసీబీ చంద్రబాబుకు ఈ వారం కాని వచ్చే వారం కాని నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆన్ లైన్ ద్వారా పుష్కర జలాలు

మరో నెలరోజుల్లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి.. అయితే ఎంతో ప్రాముఖ్యం ఉన్న గోదావరి పుష్కరాలకు వెళ్లలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుష్కరాలకు వెళ్లలేనివారికి మేము సైతం సేవలందిస్తామంటూ ముందుకొచ్చింది పోస్టల్ డిపార్ట్ మెంట్. అదేంటంటే గోదావరి పుష్కరాలకు వెళ్లలేనివారికి పోస్టాఫీసుల ద్వారా గోదావరి నుంచి సేకరించిన నీటికి పంపిణీ చేసేందుకు సన్నద్దమయ్యారు. అంతేకాదు ఈ నీటి కోసం www.appost.in/eshop అనే సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ ఏర్పాటు కూడా చేశారు. జూన్ 3 నుండి జులై 14 అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు వరకు అందుబాటులోకి వస్తాయని, జూలై 14 నుంచి 25 వరకు... గోదావరి జలాలను పంపిణీ చేస్తామని ఏపీ ప్రధాన పోస్ట్‌మాస్టర్‌ బీవీ సుధాకర్‌ తెలిపారు. డెలివరీ చార్జెస్‌తో కలిపి 500 ఎంఎల్‌ బాటిల్‌ ధర 20 రూపాయలుగా నిర్ణయించామని సుధాకర్ అన్నారు.

ఏపీ రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం

ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా జూన్ 6వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి వస్తుంది. అవి.. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు.. ఎటువంటి పర్యటనల్లో పాల్గొనకూడదు.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్వహించే కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కి లేఖ పంపగా ఆయన ఈ లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఈ లేఖపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.