నిద్రపోతున్నా వారే గుర్తుకొస్తున్నారు.. చంద్రబాబు
posted on Jun 5, 2015 @ 11:42AM
నిద్రపోతున్నా కూడా తనకు పేదల సంక్షేమమే గుర్తుకొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరులో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్త్రీలకు కూడా అవకాశాలు కల్పించాలని, వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా హరిటేజ్ గురించి గుర్తు చేస్తూ.. 20 ఏళ్ల కిందట తన భార్య నిర్వహణలో ప్రారంభించిన హరిటేజ్ ఇప్పుడు రూ.2100కోట్ల టర్నోవర్ ఇస్తుందని అన్నారు. అంతేకాక త్వరలో కేటాయించబోయే మద్యం దుకాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని, ప్రజలకు హాని కలిగకుండా ఉండేలా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ.200 కోట్లతో విద్యుత్ స్తంభాల ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్ అనుసంధానతను కల్పిస్తామన్నారు. ఈ నెల 8న జరిగే తెదేపా బహిరంగ సభలో పాత్రికేయులకు ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు.