కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కు చెందినదా..?

అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికి చెందింది అంటే వెంటనే భారతదేశానికి చెందినది అని అంటుంటారు. కానీ ఇది వారి దేశానికి చెందినది అంటున్నాడు ఓ న్యాయవాది. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కు చెందిన జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది.. కోహినూర్ వజ్రం పాకిస్థాన్‌దేనని అంటున్నాడు. దీనిపై పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టులో పిటషన్ కూడా వేశాడు. 'అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ర్టాన్ని పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఎత్తుకెళ్లింది.. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు.. కాబట్టి న్యాయంగా ఆ వజ్రం పాకిస్థాన్‌కు చెందాల్సిందే' అని తన పిటిషన్లో పేర్కొన్నాడు. కోహినూర్‌పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786 లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. మరి మనతో అన్ని విషయాల్లో పోటీ పడే పాకిస్థాన్ ఇప్పుడు కోహినూర్ వజ్రంలో కూడా పోటీ పడుతుంది. మరి దీనికి భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

బంగారం కొనుగోలుకు పాన్ కార్డ్.. బంగారు షాపులు బంద్..

నేడు దేశవ్యాప్తంగా బంగారు షాపుల బంద్ చేపట్టారు. రూ 2.లక్షల జ్యుయెలరీ కొనుగోళ్లకు పాన్ కార్డ్ తప్పనిసరి అని కేంద్రం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఇది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర వైఖరికి నిరసనగా జ్యుయెలరీ అసోసియేషన్స్ బంద్ నిర్వహిస్తున్నారు. రూ 2.లక్షల జ్యూయెలరీ నిబంధనను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 120 కోట్ల జనాభాలో కేవలం 22 కోట్ల మందికే పాన్ కార్డ్ లు ఉన్నాయని, ఈ నిబంధన వలన 30 శాతం 30 శాతం తగ్గిపోయిన బిజినెస్ తగ్గిపోయిందన అంటున్నారు. కాగా మొత్తం 175 అసోసియేషన్స్ బంద్ లో పాల్గొన్నాయి.

చెంపదెబ్బకు 5 లక్షలు

ఇదేమీ దూకుడు సినిమాలో సన్నివేశం కాదు- చెంపదెబ్బకి ఇచ్చిన రియాక్షన్‌ చూసి బహుమతి ఇచ్చేయడానికి! కానీ బాలీవుడ్‌ నటుడు గోవిందాకి నిజజీవితంలో ఇలాంటి సన్నివేశమే ఎదురైంది. 2008లో గోవిందా ఒక షూటింగ్‌లో పాల్గొంటుండగా, ఆయన కుర్చీ వెనకాల చేరి ఒక అభిమాని గోల చేయడం మొదలుపెట్టాడు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన గోవిందా సదరు అభిమాని చెంప మీద ఒక్కటి ఇచ్చాడు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాలలో బిత్తరపోయిన అభిమానులు నెమ్మదిగా పక్కకి తప్పుకుంటారు. కానీ సంతోష్ రాయ్ అనే ఆ అభిమాని మాత్రం ఊరుకోలేదు. గోవిందా తనకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ ముంబై హైకోర్టులో ఒక కేసు దాఖలు చేశాడు. ఆ కోర్టు కేసుని కొట్టవేసినా పట్టు వదలకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు తీర్పు సంతోష్‌కి అనుకూలంగా రావడంతో, గోవిందా ఆ అభిమానికి క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారం కింద మరో 5 లక్షలు కూడా సమర్పించుకోవలసి వచ్చింది.

దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య!

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ... ఇలా అయిదు భాషల్లోనూ విజయం సాధించిన సినిమా దృశ్యం. అయితే ఒక బిహార్‌ యువకుడు తను చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఇదే సినిమాను ఇప్పుడు వాడుకున్నాడు. కానీ సినిమాకీ, నిజజీవితానికీ కావల్సినంత తేడా ఉంటుంది కాబట్టి పట్టుబడిపోయాడు. వివరాల్లోకి వెళ్తే- బిహార్‌కి చెందిన రజనీష్‌సింగ్‌, తాను ఒక గొప్పింటి బిడ్డనని చెప్పి ‘సృష్టి’ అనే అమ్మాయిని వలలో వేసుకున్నాడు. ఈ విషయం సృష్టికి తెలియడంతో ఆమె రజనీష్‌తో గొడవపడి తన ఊరికి వెళ్లేందుకు బయల్దేరింది. విషయం బయటకి పొక్కితే తన పరువు పోతుందని భావించిన రజనీష్‌ ఆమెను తన పిస్తోలుతో కాల్చి చంపేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకు మక్కీకి మక్కీ ‘దృశ్యం’ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకున్నాడు. తన ఆచూకీ గురించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు, తన సెల్‌ఫోన్‌ను ఒక ట్రక్కు మీదకి విసిరేశాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఒక నదిలోకి వదిలేశాడు. అయితే రజనీష్‌ సినిమాప్లాన్‌ కాస్తా ఫ్లాప్‌ అయ్యింది. ట్రక్కు మీద పడిన ఫోన్‌ అక్కడికక్కడ పగిలిపోవడంతో సిగ్నల్స్‌ అక్కడే ఆగిపోయాయి. సృష్టి ప్రియుడైన రజనీష్‌ని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో, అతను నిజం ఒప్పుకోక తప్పలేదు!

101 పరుగులకే చాప చుట్టేసిన టీం ఇండియా

  ఆస్ట్రేలియాలో ఇరగదీసిన టీం ఇండియా, శ్రీలంకతో టి20 మ్యాచ్ లో ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. పుణెలో జరుగుతున్న మొదటి టి20 లో, అనుభవం లేని శ్రీలంక కుర్ర బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు భారత బ్యాట్స్ మెన్. కేవలం అశ్విన్ మాత్రమే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని స్కోర్ తప్పితే, మిగిలిన భారత బ్యాట్స్ మెన్ స్కోర్లు మొబైల్ నెంబర్ ను తలపించాయి. పిచ్ పై పచ్చికను ఎక్కువగా ఉంచి పేసర్లకు స్వర్గధామంలా డిజైన్ చేయడంతో, శ్రీలంక స్వింగ్ బౌలింగ్ ను అడ్డుకుని బ్యాట్స్ మెన్ నిలబడలేకపోయారు. కేవలం 101 పరుగులకే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బౌలర్లలో రజిత, శానక చెరో మూడు వికెట్లు, చమీర రెండు, సేననాయకే ఒక వికెట్ తీశారు. మరి భారత బౌలర్లు పిచ్ ను ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి..

ఈ చిరుతపులికి కోరలు లేవు కాబట్టి సరిపోయింది!

గత ఆదివారం బెంగళూరులోని ఒక పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి ఆ రోజంతా అధికారులకి చెమటలు పట్టించింది. తన దారికి ఎదురువచ్చిన అధికారుల మీదా, పర్యావరణవేత్తల మీదా చిరుతపులి తీవ్రంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ చిరుతకు ఒక కన్ను సరిగా కనిపించడం లేదనీ, కోరలు కూడా సరిగా లేవనీ తేలింది. లేకపోతే, చిరుత దాడికి గురైన వారు మృత్యువాత పడక తప్పేది కాదు. బెంగళూరు శివార్లలో ఉన్న మరాఠహళ్లి అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బెంగళూరులో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు పర్యావరణవేత్తలని కలచివేస్తున్నాయి. కేవలం చిరుతలే కాదు… ఏనుగులు, దేవాంగపిల్లులు, జింకలు, అరుదైన పక్షులు తరచూ బెంగళూరు పట్టణంలో ప్రవేశిస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకో, పట్టుకునేందుకు పట్టణవాసులు చేస్తున్న ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతున్నాయి. బెంగళూరు పట్టణం నిదానంగా విస్తరిస్తూ, తన చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు మేధావులు. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న అద్రంగి, ఉజ్జని వంటి అటవీ ప్రాంతాల నుంచి అప్పుడప్పుడూ పొరపాటున పట్టణంలో ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టణవాసులు మాత్రం ఎప్పటిలాగే అటవీ జంతువులు తమ నివాస ప్రాంతాలలోకి చొచ్చుకువస్తున్నాయని వాపోతున్నారు! ఇంతకీ ఎవరు ఎవరి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నట్లు?

ప్రియాంక సీక్రెట్ తెలియాలంటున్న కత్రినా..

సాధారణంగా ఒక హీరోయిన్ ను ఒక హీరోయిన్ పొగుడుకోవడం చాలా రేర్. అందులోనూ బాలీవుడ్ లో ఇది కొంచెం ఎక్కువ. అక్కడ హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ మాత్రమే కాదు.. కొంద మంది హీరోయిన్ల సంగతైతే.. పచ్చగడ్డి వేస్తేనే భగ్గమంటుందా అనే రేంజ్ లో కోల్డ్ వార్ జరుగతుంటుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కత్రినా కైఫ్ మరో నటి ప్రియాంక చోప్రాని మాత్రం పొగిడేసింది. ఫితూర్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె  ప్రియాంక హాలీవుడ్‌ ఎంట్రీ గురించి ప్రస్తావించింది. హాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని అవన్నీ ప్రియాంకలో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. మరి ఇది విన్న ప్రియాంక కత్రినాకు తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెబుతుందో లేదో చూడాలి. 

అవార్డులతో ఉపయోగం లేదు...ఇర్ఫాన్‌ ఖాన్‌

బాలీవుడ్ నటులు ఈమధ్య వివాద్సపద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు వారి జాబితాలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా చేరిపోయాడు. ఇర్ఫాన్‌ ఖాన్‌ అవార్డులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అవార్డులు ఎవరికీ ఉపయోగకరంగా ఉండట్లేదని.. ‘అవార్డులు గెలుచుకోవడం వల్ల నటీనటులకు.. దర్శకులను ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. వీటి వల్ల డబ్బులు రావు.. అవకాశాలు రావు. ఎందుకంటే వాటికి ప్రాధాన్యం లేకుండా పోతోంది. అదే హాలీవుడ్‌లో అయితే అకాడమీ.. గ్లోబల్‌ అవార్డులకు ఎంతో ప్రాధాన్యముంది. ఎవరైనా ఆ అవార్డును గెలుచుకుంటే వారి కెరీర్‌ అమాంతం ఉన్నతస్థాయికి చేరుతుంది. మంచి సినిమా అవకాశాలు వస్తాయి. డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది’ అని అవార్డులపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవలే అవార్డుల గురించి రిషికపూర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.

కాపులను చేర్చడానికి వీల్లేదు.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని..

ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ ఆందోళనలు చేపడితే.. ఇప్పుడు కాపులను బీసీల్లో చేర్చడానికి వీల్లేదంటూ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈరోజు విజయవాడలో బీసీ సంఘాల నేతలు సమావేశమైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని మురళీ గౌడ్ అనే వ్యక్తి గందరగోళం సృష్టించాడు. వివిధ పార్టీల్లో పదవులు అనుభవిస్తూ బీసీ సంఘాల కోసం ఏం చేశారు అంటూ.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సమావేశం దగ్గరకు పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారు..

తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ జంపింగ్ పై ఆపార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పైన కత్తి పెట్టి  టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు.  పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంటులో చట్టం తేవాల్సి ఉందని..  ఒత్తిడి చేసి ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారని, పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారని, ఇలా చేస్తే భవిష్యత్తులో కెసిఆర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరించారు.

విజయవాడలో బీసీ సంఘాల సదస్సు..

విజయవాడలో ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆకలి పోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు. కాపుల్ని బీసీల్లో ఏ ప్రతిపాదికన చేర్చుతారంటూ గతంలోనే హైకోర్టు ప్రశ్నించింది అని గుర్తుచేశారు. అంతేకాదు జనాభాకు తగినట్టు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకుంటేనే బీసీల్లో కలపడానికి అర్హత ఉంటుంది.. అయినా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలే తప్ప ఇతర కులాల్ని చేర్చకూడదని అన్నారు. సమాజంలో చిన్న చూపుకి గురవుతున్న కులాలవారికి.. అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నదే రిజర్వేషన్ల ఉద్దేశం. బలప్రయోగం ద్వారా బీసీల్లో కలపాలని చూస్తే మాత్రం ఉత్తరాదిన జూట్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

ISIS తీవ్రవాదుల జీతాల తగ్గింపు

ప్రపంచమంతా ఏకమై ఇప్పడు ISIS మీద విరుచుకుడటంతో, ఆ సంస్థ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దాంతో తన సైనికులకు అందించే జీతాలను కూడా సగానికి సగం తగ్గించాల్సి వచ్చింది. సిరియా, ఇరాక్‌ దేశాలలో తను ఆక్రమించిన చాలా ప్రాంతాలను ISIS ఖాళీ చేయాల్సి రావడంతో… ఈ మద్య ISIS బాగా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరాజయాల వల్ల నెలనెలా కోట్లాది రూపాయల ఆదాయం లభించే చమురు బావులు కాస్తా ఆ సంస్ఘ నుంచి చేజారిపోయాయి. ఒకప్పుడు నెలకి 20-60 వేల వరకూ జీతాలను అందించిన ISIS, ప్రస్తుతం వాటిలో సగానికి పైగా కోతని విధించాల్సి వచ్చింది. ఒకపక్క వరుస పరాజయాలు, మరో పక్క వైమానిక దాడులలో మరణిస్తున్న సైనికులు…. వీటన్నింటి మధ్యా జీతాలను కూడా తగ్గించేయడంతో ఇప్పడు ISISలో పనిచేస్తున్న సైనికులు కొందరు నిదానంగా జారుకుంటున్నట్లు సమాచారం! అందుకని ఆ సంస్థ ఇప్పడు తక్కువ జీతంతో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల కోసం ఎదురుచూస్తోంది.

చంద్రబాబు చాలా మంచి నాయకుడే కానీ...

టీడీపీ కుత్బాల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పార్టీకి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అఫీసుకి తన రాజీనామా లేఖ పంపారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో.. క్యాంపు ఆఫీసులోనే టీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితమయ్యారు.. ఆయన లేని లోటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు చాలా మంచి నాయకుడని, తమ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరు ఉందని, కానీ ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అందుకే తాను తెరాసలో చేరానని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ పై కూడా ప్రశంసలు కురిపించారు. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని.. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చేవిగా ఉన్నాయన్నారు. ఆ సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు.

తెలంగాణలో టీడీపీ..ముగ్గురు గ్రేటర్ ఎమ్మెల్యేల జంప్

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ప్రస్తుతం టీ టీడీపీ పరిస్థితి చూస్తుంటే. గ్రేటర్ ఎన్నికల అనంతరం టీ టీడీపీ పార్టీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచి కష్టాల్లో ఉంటే ఇప్పుడు దానికి తోడు ఆ పార్టీలోకి నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీడీపీని వీడి కారెక్కనున్నారు. ఎమ్మెల్యే వివేకానంద ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను కూడా పంపించేశారంట. ఇక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడమే తరువాయి. అంతేకాదు మరో నేత అరికెపూడి గాంధీ కూడా నేడో రేపో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.