చెంపదెబ్బకు 5 లక్షలు
posted on Feb 10, 2016 9:02AM
ఇదేమీ దూకుడు సినిమాలో సన్నివేశం కాదు- చెంపదెబ్బకి ఇచ్చిన రియాక్షన్ చూసి బహుమతి ఇచ్చేయడానికి! కానీ బాలీవుడ్ నటుడు గోవిందాకి నిజజీవితంలో ఇలాంటి సన్నివేశమే ఎదురైంది. 2008లో గోవిందా ఒక షూటింగ్‌లో పాల్గొంటుండగా, ఆయన కుర్చీ వెనకాల చేరి ఒక అభిమాని గోల చేయడం మొదలుపెట్టాడు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన గోవిందా సదరు అభిమాని చెంప మీద ఒక్కటి ఇచ్చాడు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాలలో బిత్తరపోయిన అభిమానులు నెమ్మదిగా పక్కకి తప్పుకుంటారు. కానీ సంతోష్ రాయ్ అనే ఆ అభిమాని మాత్రం ఊరుకోలేదు. గోవిందా తనకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ ముంబై హైకోర్టులో ఒక కేసు దాఖలు చేశాడు. ఆ కోర్టు కేసుని కొట్టవేసినా పట్టు వదలకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు తీర్పు సంతోష్‌కి అనుకూలంగా రావడంతో, గోవిందా ఆ అభిమానికి క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారం కింద మరో 5 లక్షలు కూడా సమర్పించుకోవలసి వచ్చింది.