నేషనల్ హెరాల్డ్..సోనియా, రాహుల్ కు ఊరట..

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసు వ్యవహారంలో కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు వారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. సోనియా, రాహుల్ తో పాటు మరో ఐదుగురికి కూడా సుప్రీం మినహాయించింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అగ్రిగోల్డ్ చైర్మన్, ఎండీకి 14రోజుల రిమాండ్..

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సీతాపతి నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై విధివిధానాల రూపకల్పన.. అగ్రిగోల్డ్ ఎండీ, ఛైర్మన్ అరెస్ట్ పై ఈ కమిటీ చర్చించనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఆస్తుల విలువ వివరాలను కోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అగ్రిగోల్డ్ చైర్మన్ వెంకటరామారావు, ఎండీ శేషునారాయణలను సీఐడీ అధికారులు ఏలూరు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈనేపథ్యంలో వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించి.. అనంతరం జైలుకు తరలించనున్నారు.

టీ టీడీపీ.. అనుకున్నదే జరిగింది..

తెలంగాణ టీడీపీకి అనుకున్నదే జరిగింది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అలా టీఆర్ఎస్ లోకి చేరారో లేదో.. మరో ఎమ్మెల్యే కూడా వారి దారిలోనే టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నిన్ననే టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయితే ఇదేమి అంత షాకింగ్ న్యూసేం కాకపోవచ్చు. ఎందుకంటే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లోకి చేరుతూనే తనతో పాటు ఇంకా కొంతమంది నేతలు వస్తారు అని ముందే హింట్ ఇవ్వడంతో అందరూ ఆతరువాత ఎవరు టీడీపీని విడతారా అని ఆసక్తిగా చూశారు. ఇక అందరి ఎదురుచూపులకు తెర దించుతూ రాజేందర్ రెడ్డి కారెక్కేశారు. కాగా ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీఆర్ఎస్ లోకి చేరారు. ఇంకా ఐదుమంది మాత్రమే ఉన్నారు. మరోవైపు ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామంటూ.. టీడీఎల్పీని నేతగా మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు టీఆర్ఎస్ లో విలీనమవుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

మోడీతో కేసీఆర్ బేటీ...

సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భేటీ అయిన సందర్భాలు చాలా తక్కువ. రాష్ట్ర విభజన తరువాత అయితే కేసీఆర్ కేంద్రానికి కాస్త దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ కోరినా ఆయనకు కలిసే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చాలా కాలం తరువాత కేసీఆర్ మోడీతో ఈరోజు భేటీ కానున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం సీఎం నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ర్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు తదితర అంశాల గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించాలని ఆహ్వానించడంతోపాటు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించనున్నారు.

సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ కన్నుమూత..

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ (49)ఈ రోజు కన్నుముశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పలు టీవీ చానెళ్లలో పని చేసిన ఆయన తెలుగు కవిత్వంలో తన ప్రత్యేకమైన ముద్రను వేశారు. ఆయన మాగ్జిమమ్ రిస్క్, మేల్‌కొలుపు, మ్యూజిక్ డైస్ కవితా సంకలనాలను వెలువరించారు. కాగా అరుణ్ సాగర్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మరోవైపు అరుణ్ సాగర్ మృతికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ అరుణ్ సాగర్ మరణం చాలా బాధాకరం, తీరని లోటని అన్నారు. టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివని బాలకృష్ణ అన్నారు

పఠాన్‌కోట్‌లో 250 మంది గూఢచారులు?

పఠాన్‌కోట్ వైమానిక స్థావరం వద్ద పట్టబడుతున్న గూఢచారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న సందీప్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతో అసలు ఇంతకీ పఠాన్‌కోట్‌కి సంబంధించిన రహస్యాలు పాకిస్తాన్‌కి ఎలా చేరాయి అన్న విషయం మీద నిఘా వర్గాలు మరింత దృష్టిని పెట్టాయి. ఇందులో భాగంగా పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి తరచూ ప్రవేశించే అవకాశం ఉన్న 250మందితో కూడిన జాబితాను రూపొందించాయి. పఠాన్‌కోట్‌లో జరిగే చిన్నాచితకా మరమ్మతుల కోసమో, సైనికులకి ఏవన్నా సౌకర్యాలను అందించడానికో తరచూ లోపలికి ప్రవేశించే ఈ వ్యక్తులలో ఎవరైనా కూడా గూఢచారులుగా పనిచేసే అవకాశం ఉందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. అందుకని ఈ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరి గురించీ నిజాలను వెలికితీస్తున్నాయి. పఠాన్‌కోట్‌ మీద దాడి చేసేందుకు పాకిస్తాన్‌లో ఒక పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారనీ, ఇందుకు స్థానికంగా ఉన్న చాలామంది పాకిస్తాన్‌ గూఢచారులు తగిన సమాచారాన్ని అందించారనీ నిఘా వర్గాల అంచనా! ఈ ఇంటి దొంగలను పట్టుకోవాలన్నదే ఇప్పుడు పోలీసులు ప్రయత్నం. కానీ జరగాల్సిన నష్టమైతే ఎప్పుడో జరిగిపోయింది. పఠాన్‌కోట్‌లో జరిగిన దాడిలో 7గురు సైనికులు మరణించడంతో పాటు, దేశంలోని రక్షణ దళాలు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది.

టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయే..

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలను క్లీన్ స్వీప్ చేసి గెలుపును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే టీఆర్ఎస్ కి 40 వేల కోట్ల రూపాయిలు కావాలని.. తన హామీలను ఎలా అమలు చేస్తుందో వేచి చూడాల్సిందేనని అన్నారు. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడుతూగతంలో కంటే టీడీపీకి లక్షన్నర ఓట్లు అదనంగా వచ్చాయి.. అయినా ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా పోటీ చేశాం.. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019 ఎన్నికలు అని..రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని వ్యాఖ్యానించారు. ఇంకా టీ టీడీపీ నుండి ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లు పార్టీ మార్పుపై స్పందించి ఎంత మంది పార్టీని మారిన కేడర్ ఎటూ పోదని.. టీడీపీకి గట్టి క్యాడర్ ఉందని.. టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని అన్నారు.

తెలంగాణలో టీడీపీకి గట్టి క్యాడర్ వుంది.. లోకేశ్

1. హైదరాబాద్  మహానగర పాలక సంస్థ ఎన్నికలలో గతం కంటే లక్షాన్నర ఓట్లు ఎక్కువ వచ్చాయి . ఇంటిపేరు కస్తూరి వారు -- ఇళ్ళంతా గబ్బిలాల కంపనీ - ఎన్ని లచ్ఛలొస్తే ఏట్లే సామీ - ముక్కీ మూలిగీ గెలిచిందొకటే గా...!! 2. తెరాస హామీలు అమలు చేయాలంటే 60 వేల కోట్లు కావలి. అంత సొమ్ము ఎక్కడ నుంచి తెస్తారో చూడాలి. ఆంధ్రాలో మీ నాయనిచ్చిన హామీలకి వేల కోట్లెట్టా తెస్తన్నాడో - ఇయ్యి కూడా అట్టాగే... ఆళ్ళ సావేదో ఆళ్ళు సస్తార్లే....!! 3. తెలుగుదేశం అసలు లక్ష్యం 2019 మంత్లీ టెస్టుల్లోనే  గ్రేడులిట్టా ఏడిచాయ్ - ఇదే ప్రిపరేషన్ తో ఎలితే ... బోర్డ్ ఎక్షామ్ లో బోడిగుండే ...!! 4.తెలంగాణలో తెలుగుదేశానికి గట్టి క్యాడర్ వుంది . పోయినోళ్ళంతా పోగా మిగిలిందే పుంజెడు మంది - ఇంతోటి మందకి కేడరంటూ పెద్ద పదాలెందుకులే సామీ .. !! 5. తెరాస కు ప్రధాన ప్రత్యర్ది తెలుగుదేశమే .... దేంట్లో - బైకులేసుకుని రోడ్ల మీద తిరగటంలోనా...??

ఎర్రబెల్లిపై రేవంత్ ఫైర్.. అప్పుడ రాత్రి ఇప్పుడు పగలు అంతే..

ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీని నుండి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎర్రబెల్లిపై దుమ్మెత్తి పోశారు. ఎప్పటినుండో టీఆర్ఎస్ తో ఎర్రబెల్లి స్నేహం చేసేవారని.. ఇప్పుడు అది బయట పడిందని అన్నారు. ఇన్ని రోజులు చీకటిలో మంతనాలు జరిపేవారు.. ఇప్పుడు పగలు కలుస్తారు అంతే.. అంతకు మించి తేడా ఏం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కులాల వారీగా రాజకీయ నేతలు ఏకమవుతున్నారని అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ కు సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే అందరి చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

గుండె పగిలిపోయిందంటున్న కోహ్లీ..

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమాయణం గురించి తెలియని వారుండరూ. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లి తిరిగొచ్చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఇక వీరిద్దరి బంధం తెగిపోయింది.. బ్రేకప్ చెప్పేసుకున్నారు అని పలు వార్తలు వచ్చినా వారిద్దరి నుండి మాత్రం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు కోహ్లి చేసిన ఒక పోస్ట్ ద్వారా మాత్రం  వీరిద్దరూ విడిపోయారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ తన గుండె పగిలిపోయింది అంటూ ఒక ఫొటోని పోస్ట్ చేశాడు. అయితే కొంత సేపటికి దాన్ని డిలీట్ చేశాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో.. నేను బాధతో ఉన్న చిత్రాన్ని డిలీట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నా.. నన్ను క్షమించండి అంటూ ఆ ఫొటోని మళ్లీ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా కొహ్లీ ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎనభై వేలకు పైగా లైక్స్ రెండు వేలకు పైగా కామెంట్స్ రావడం గమనార్హం. మరి ఇంతకీ కొహ్లీ బాధ అనుష్క గురించేనా.. లేక ఇంకేదైనా ఉందా..!

నడుస్తున్న వ్యక్తులపై దూసుకెళ్లిన కారు..

చెన్నైలో ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఒక కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నవ్యక్తులపై దూసుకుంటూ వెళ్లింది. వివరాల ప్రకారం చెన్నైలోని ఎరుపు రంగు శాంట్రో కారు రోడ్డు వెళుతున్నఐదుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అయితే ఈ ఘటన మొత్తం  సీసీటీవీ పుటేజీలో రికార్డవడంతో ఆ కారు బ్యాంక్‌ ఉద్యోగి వెంకటేష్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ పోలీసు అధికారి జవహర్‌ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ మద్యం సేవించి లేడని.. అతనికి డ్రైవింగ్‌లో అనుభవం కూడా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. రాహుల్

కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించగలదు.. ఈ వ్యాఖ్యలు చేసింది ఏవరనుకుంటున్నారా..? ఇంకెవరూ మన రాజకీయ మేధావి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇప్పటికే పొలిటికల్ సెటైర్లు పడుతుంటాయి. ఆయన చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే రాహుల్ గాంధీపై సెటైర్లకు కొదువుండదు. ఇప్పుడు మళ్లీ తాజాగా అలాగే విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్. కేరళ పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని సీపీఎం ఓడించలేదని.. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాంగ్రెస్‌ను ఓడించగలదని అన్నారు. అంతేకాదు బిహార్‌లో బీజేపీ ఏం చేయడానికి ప్రయత్నిస్తోందన్న విషయాన్ని పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్నామని, అందుకే నితీష్, లాలు, కాంగ్రెస్ పార్టీలను ఒకటిగా చేశామని చెప్పారు. బిహార్‌లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో వాళ్లు ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతి చెందారన్నారు. అయితే అంతా బానే ఉంది కానీ కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించడం ఏంటబ్బా అని.. రాహుల్ ఉద్దేశం ఏంటో అని అనుకుంటున్నారు.

"నాలో నీలో గజల్ శ్రీనివాస్" - పుస్తక ఆవిష్కరణ

కళాకారుల జీవితం స్ఫూర్తి దాయకం అని వారిపై గ్రంధాలు వెలువడడం అభినందనీయమని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి అన్నారు.  డా. ఎస్. అర్. ఎస్. కొల్లూరి రచించిన "నాలో నీలో గజల్ శ్రీనివాస్" పుస్తకావిష్కరణ కార్యక్రమం యువకళావాహిని అధ్వర్యంలో బంజారా హిల్స్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన డా ఎన్. గోపి గ్రంధాన్ని ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గొప్ప వాగ్గేయ కారుడని తన గాత్రంతో లక్షల మందిని  చైతన్య పరిచే శక్తీ శ్రీనివాస్ సొంతమని అన్నారు. ఈ కార్యక్రమానికి  శ్రీ సారిపల్లి కొండలరావు సభాధ్యక్షత వహించగా,  ముఖ్య అతిదిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మ రాజు జ్యోతి ప్రజ్వలన చేసారు.   ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిదిగా విచ్చేసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ అర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో తెలుగు వెలుగులను ప్రకాసవంతం చేస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతున్న చైతన్య మూర్తి గజల్ శ్రీనివాస్ అని అన్నారు. మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత జె, కె. భారవి మాట్లాడుతూ, మూడు సార్లు గిన్నీస్ రికార్డ్స్ ను సొంతం చేసుకుని, 125 భాషలలో గానం చేసిన అత్యంత ప్రతిభావంతుడు డా. గజల్ శ్రీనివాస్ అని అన్నారు. గ్రంధ సమీక్ష చేసిన సినీ గేయ రచయిత శ్రీ సిరశ్రి మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ గారి 30 సంవత్సరాల గాన ప్రస్థానాన్ని, చేస్తున్న సేవా కార్యక్రమాలను, డా. కొల్లూరి 125 నానీలులో రాయడం హృద్యంగా ఉంది అన్నారు. మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ మానవతా విలువలను, ప్రపంచ శాంతిని, గాంధేయ వాదాన్ని ఈనాటి తరానికి తనదైన శైలిలో అందిస్తున్న శ్రీనివాస్ గారిపై ఈ గ్రంధం రాయడం ఔచిచ్యవంతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ రాజ్ కందుకూరి, శ్రీ జి. హనుమంత రావ్ మరియు వై కె నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యే భేటీ.. ఎందుకంటే..

వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రి దేవినేని ఉమతో కలిసి జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే ఇప్పడు వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీంతో జలీల్ ఖాన్ టీడీపీలోకి చేరనున్నట్టు అప్పుడే వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై దేవినేని ఉమ మాట్లాడుతూ.. తన నియోజన అభివృద్ధి పనుల నిమిత్తం జలీల్ ఖాన్ చంద్రబాబును కలిశారు అంతేకాని దీనిలో రాజకీయ ఉద్దేశం ఏం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు చంద్రబాబు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలనే కలిశారని.. ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అభివృద్ధే కోరుకుంటున్నారని అన్నారు.