టీం ఇండియా ఏం చేయబోతోంది..?
శ్రీలంకతో జరుగుతున్న టి20 సీరీస్ లో మొదటి మ్యాచ్ ఘోరంగా ఓడిన టీం ఇండియా, రెండో మ్యాచ్ లో ఘనంగా గెలిచి లెక్క సరిచేసింది. మూడు మ్యాచ్ ల సీరీస్ లో రెండు దేశాలు చెరొకటి గెలవడంతో, వైజాగ్ లో జరగబోయే మూడో టి20 ఆసక్తికరంగా మారింది. మొదటి మ్యాచ్ ఓడిన తర్వాత, నెంబర్ వన్ ర్యాంక్ నుంచి మూడో ర్యాంకు కు పడిపోయింది టీంఇండియా. ఇప్పుడు మూడో మ్యాచ్ గనుక నెగ్గితే, తిరిగి నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంటుంది.
ప్రయోగాలకు దూరం అని చెబుతూనే, రాంచీ మ్యాచ్ లో బుమ్రాను డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించి సక్సెస్ అయ్యాడు ధోనీ. మరి ఈసారి యువీని కాస్త ముందుగా పంపి మరో ప్రయోగం చేస్తాడా..? హార్ధిక్ ను హార్డ్ హిట్టర్ గా ఉపయోగించుకోబోతున్నాడా..? ఇవీ ఇప్పుడు అభిమానులకున్న ప్రశ్నలు. వైజాగ్ పూర్తి బ్యాటింగ్ వికెట్. భారీ స్కోర్లు నమోదు కావడానికి ఆస్కారం ఉంది. దీంతో బ్యాటింగ్ బలంగా ఉండే టీం ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. బౌలర్స్ తో పాటు బ్యాట్స్ మెన్ కూడా బాగానే రాణిస్తున్నా, టీం గా కలిసి ఆడటంలో శ్రీలంక విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో మూడో టి20 లో భారత్ ను లంకేయులు ఎలా అడ్డుకుంటారన్నది అందరూ ఎదురుచూస్తున్న అంశం.