రైతు ఆత్మహత్యలపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాషనైపోయింది..

రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. తాజాగా భారతీయ జనతా పార్టీ ఎంపీ గోపాల్‌ శెట్టి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 124మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక వచ్చింది. అయితే దీనిమీద స్పందించిన ఎంపీ గోపాల్‌ శెట్టి ఈ ఆత్మహత్యలన్నీ నిరుద్యోగం, పేదరికం కారణంగానే జరగడం లేదని.. రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్‌ అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అంతే దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఇదే అవకాశంగా ఎంపీ గారిపై మండిపడుతుంది. రైతులు పంటలు విఫలమై, అప్పులతో ఆత్మహత్య చేసుకుంటోంటే వారి గురించి ఇంత దారుణంగా మాట్లాడటం అన్యాయమని అన్నారు. ఇక చేసేది లేక తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తనను క్షమించాలని కోరారు.

భర్త అంత్యక్రియల కోసం... కొడుకులను తాకట్టుపెట్టిన సావిత్రి

  పేదరికం ఎంతటి సవాళ్లును ముందుంచుతుందో చెప్పే కథ ఇది. జనవరి 26న దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటుంటే... ఓ స్త్రీ మాత్రం తన భర్తకి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నకొడుకులునే 5,000కి తాకట్టు పెట్టింది. ఒడిషాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనలో రైబా అనే పేదవాడు గత నెల 26వ తేదీన చనిపోయాడు. రైబా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతుండటంతో, అప్పటికే అతని చికిత్స కోసం ఇల్లు గుల్లైపోయింది. రైబా చనిపోయేనాటికి ఇంట్లో చిల్లిగవవ్వ కూడా మిగల్లేదు. అతని అంత్యక్రియల కోసమని రైబా భార్య సావిత్రి, ఆర్థికసాయం చేయమంటూ తమ ఊరిలోని ప్రతి గడపనీ తట్టింది. కానీ ఉపయోగం లేకపోవడంతో చివరికి తన ఐదుగురు పిల్లల్లో పెద్దవారైన ఇద్దరిని (ముఖేష్‌- 13, సుఖేష్‌- 11) పొరుగింటాయనకి తాకట్టు పెట్టింది. ఈ సంఘటనను స్థానిక అధికారులు కొట్టిపడవేస్తున్నప్పటికీ, తాకట్టు జరిగిన మాట నిజమేనని గ్రామస్తులు చెబుతున్నారు. పురాణాలలో సతీసావిత్ర భర్త ప్రాణాలను దక్కించుకునేందుకు అష్టకష్టాలూ పడితే, ఒడిషాలో నేటి సావిత్రి అతనికి శవసంస్కారం జరిపించేందుకు కూడా ఎంతో త్యాగాన్ని చేయాల్సి వచ్చింది. ఎంతైనా కలియుగం కదా!

బాలయ్య టాటూ నా మజాకా..

నాని తాజాగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా ఈనెల 12 రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఎలా హిట్టయిందో.. ఈ సినిమాలో నాని వేసుకున్న టాటూ కూడా అంత హిట్టయింది. ఇంతకీ ఆ టాటూ ఏంటనుకుంటున్నారా.. జైబాలయ్య అనే టాటూ. ఈ సినిమాలో నాని బాలయ్య ఫ్యాన్. దీంతో చేతిపై జై బాలయ్య టాటూతో కనిపిస్తాడు. అయితే సినిమాలో నాని వేయించుకున్న టాటూ అటు బాలయ్య అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంది. ఒక్క అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఈ టాటూ నచ్చడంతో తమ చేతుల మీద వేయించుకొని సరదా తీర్చుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య టాటూ బానే వర్కవుట్ అయినట్టు కనిపిస్తుంది.

తమిళనాట బస్సు ప్రయాణం ఫ్రీ.... వృద్ధులకు మాత్రమే!

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్కడి పెద్దవారికి ఓ తీపికబురు అందించారు. ఫిబ్రవరి 24 నుంచి ఆ రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు బస్సు ప్రయాణం ఉచితం కాబోతోంది. ఈ పథకాన్ని తొలుత చెన్నైలో అమలుచేసి, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వారు చెన్నై నగరంలోని ఏ సిటీబస్సులోనైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం వారు రవాణా సంస్థ నుంచి టోకెన్లను పొందవలసి ఉంటుంది. అయితే నెలకి పది టోకెన్లను మాత్రమే గరిష్టంగా వినియోగించుకోగలరు. ఈ పథకాన్ని అమలుచేయడం ద్వారా తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని జయలలిత గర్వంగా ప్రకటించారు. ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈ పథకం మంచి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ పథకాన్ని ఫిబ్రవరి 24నే ఎందుకు అమలు చేస్తున్నారయ్యా అంటే... ఆ రోజు జయలలితగారి పుట్టినరోజు అన్న సమాధానం వినిపిస్తోంది!

అది నా రక్తంలోనే ఉంది.. రాష్ట్రపతిని కలిసిన రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ అరెస్ట్ వ్యవహారం గురించి కేంద్రంపై వ్యవహరిస్తున్న తీరు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కన్నయ్య కుమార్‌ అరెస్టు వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అసంబద్ధంగా ఉందని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. కాగా రాహుల్ గాంధీతో పాటు 17 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ దేశ ద్రోహి అంటూ అతనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై స్పందించి.. దేశ భక్తి తన రక్తంలోనే ఉందని అన్నారు. మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల గొంతు నొక్కాలని చూడడం సరికాదని అన్నారు.

నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం.. జర్నలిస్ట్ కు హెచ్చరిక

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న ఆడవాళ్లపై అరాచకాలు ఆగవు. ఇప్పటికే రోజుకో ఘటన చూస్తూనే ఉన్నాం.. రోజుకో వార్త వింటూనే ఉన్నాం. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం వింటే మాత్రం కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటంటే.. ఒకటి రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ఓ వ్యక్తి ట్విట్టర్‌లో హెచ్చరించడం. వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంటూ.. అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే జెఎన్‌యూ వివాదం గురించి. దీనిలో భాగంగానే న్యాయవాదులు జర్నలిస్ట్ లపై దాడి చేసినందుకు గాను ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే అమరేందర్ సింగ్ అనే వ్యక్తి ఆమెను బదిరిస్తూ ఒకటిరెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్ రేప్ జరుగుతుంది, స్పృహలోకి రండి, భారతమాతతో చెలగాటమాడకండి అంటూ అతను ట్వీట్ చేశాడు. దీంతో ఆమె  భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్లు 354 (ఎ)1 (అమర్యాదకరంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడడం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయలేదు.

ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 30వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తరువాత వెంకయ్యకు ఏ పదవి దక్కుతుందో అన్న దానిపై పలు చర్చలు జరుగుతున్న సంగతి కూడా విదితమే. వెంకయ్య పదవి ముగిసిన తరువాత ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే ప్రధాని మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్యను వదులుకునేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది.  దీనిలో భాగంగానే బీజేపీ నుంచే నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. సాధారణంగా బీజేపీ నియమ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడికి మూడు సార్లు మాత్రమే రాజ్యసభకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వెంకయ్యకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవి గురించి వస్తున్న వార్తలపై వెంకయ్య మాట్లాడుతూ రాజ్యాంగ పదవి కంటే.. పార్టీ పదవే తనకు ముద్దు అని తేల్చి చెప్పారు. తాను ఉషాపతినేనని ఉపరాష్ట్రపతి కాబోనని ఆయన అన్నారు. మరి ఏ జరుగుతుందో చూడాలి.

రాహుల్ ను ఉరితీయండి..

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ జెఎన్‌యూ వివాదంపై స్పందించి అక్కడి విద్యార్దులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై రాజస్థాన్‌లోని బర్మర్‌ జిల్లా బైటూ నియోజకవర్గం.. బిజెపి ఎమ్మెల్యే కైలాష్‌ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఫ్జల్‌ గురు అమర వీరుడని కీర్తించే వారికి మద్దతు పలకడం దారుణమని.. రాహుల్ గాంధీ దేశ ద్రోహి అని.. ఆ 'రాజకుమారుడి'ని ఉరి తీయడమో కాల్చి చంపడమో చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రాజకుమారుడి'గా కాంగ్రెస్‌ నేతలు పేర్కొనే రాహుల్‌గాంధీకి దేశంలో నివసించే హక్కు లేదని కైలాష్‌ అన్నారు. మరి కైలాష్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

బాంబు పేలి 28 మంది మృతి.. 61 మందికి గాయాలు..

టర్కీలో వరుస బాంబు పేలుళ్లు సంభంవిస్తున్న నేపథ్యంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. టర్కీలో రాజధాని అంకారాలో కారు బాంబు పేలుడు సంభవించింది. వివరాల ప్రకారం.. అంకారాలో టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 28 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో 61 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై టర్కీ ఉప ప్రధాని స్పందిస్తూ.. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని.. వాహనాల్లో బాంబులు నింపి ఉండటం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అన్నారు.

ఆంజనేయస్వామి పై కేసు.. కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు..

అదేదో సినిమాలో తనకు జరిగిన నష్టానికి దేవుడే కారణమంటూ ఒక వ్యక్తి దేవుడిపై కోర్టులో కేసు వేస్తాడు. తాజా సంఘటన చూస్తుంటే కూడా ఆ సినిమాలో మాదిరిగానే అనిపిస్తుంది. హిందూ దేవుడు ఆంజనేయస్వామిని కోర్టుకు హాజరుకావాలంటూ బిహార్‌లోని ఓ దిగువ న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.. బిహార్‌లో రోహ్తస్‌ జిల్లాలోని డెహ్రీ ఆన్‌ సోన్‌లో రోడ్డుపక్కన పంచముఖి' హనుమాన్ ఆలయం ఉంది. అయితే ఇది  రోడ్డును ఆక్రమించుకొని ఉన్నందువల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీంతో ప్రజాపనుల విభాగం అధికారులు దీనిపై కోర్టులో కేసు దాఖలు చేసి హనుమాన్ ఆలయం తొలగించడంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో ఆంజనేయస్వామి కోర్టకు హాజరుకావాలంటూ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటీసులను ఆలయానికి అంటించారు. మరి ఆంజనేయస్వామి కోర్టుకు వస్తారా..?

పొలిటికల్ హీట్ పెంచిన జగన్ వ్యాఖ్యలు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ ను పెంచారు. ఆమధ్య వైసీపీ నేతలు టీడీపీ చేరుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాజాగా ఒక వైసీపీ ఎమ్మెల్యే చంద్రబాబును కలిసిన నేపథ్యంలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిపై స్పందించిన జగన్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ చేరడానికి ఎలాంటి ఆసక్తి చూపించడంలేదు.. ఇంకా చెప్పాలంటే టీటీడీ ఎమ్మెల్యేలో మాతో టచ్ లో ఉన్నారు అంటూ టీడీపీకి షాకిచ్చారు. అంతేకాదు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయండంటూ చంద్రబాబు కు సవాల్ కూడా విసిరారు. ఇంకా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరతామని చెప్పారు.

ముదిరి పాకాన పడుతున్న జెఎన్‌యూ వివాదం..

జెఎన్‌యూ వివాదం రోజు రోజుకి ముదిరి పోతుంది. ఈసారి ఈ వ్యవహారంపై ఎబివిపీ విద్యాసంఘాలు స్పందించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డాయి. జెఎన్‌యూ క్యాంపస్ లో దేశ వ్యతిరేక నినాదాలు దురదృష్టకరమని.. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని.. కేంద్ర వ్యవహారం శైలి నచ్చక రాజీనామా చేసినట్టు ఏబీవీపి తెలిపింది. మరోవైపు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందో. అయితే ఇప్పుడు ఈ కోసును ఉపసంహరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జెఎన్‌యూ ప్రాంగణంలో కన్హయ్య కుమార్‌ దేశ వ్యతిరేక నినాదాలేమీ చేసినట్లు ఆధారాలు లేవని హోం మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అతడిపై కేసును ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి.

ప్రత్యేక హోదా రాలేదని ఆత్మహత్య..

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. కృష్ణాజిల్లా గుడివాడలోని ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు సిరిపురపు తులసీరాణి కుమారుడు ఉదయభాను అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రత్యేక హోదా రాలేదన్న మనస్థాపంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకు పూనుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఉదయభాను అవివాహితుడు. అతను రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయభాను ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్మార్టం నిమిత్తం  మృతదేహన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టీవీ నటుడు ఆత్మహత్య.. సహనటి అరెస్ట్

ఒడిసాలో టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేగింది. అయితే ఇతని ఆత్మహత్యలో భాగంగా నటి ప్రలిప్త ప్రియదర్శిని అలియాస్ జెస్సీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇద్దరి మధ్య వచ్చిన అర్ధిక విభేధాలే కారణని చెబుతున్నారు పోలీసులు. వివరాల ప్రకారం టీవీ నటులు జెస్పీ, చందన్ ఫిబ్రవరి 6న ఏర్పాటుచేసిన ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి చందన్ రాలేదు. అదే కార్యక్రమానికి రాజా రావడంతో చంద్రన్ ప్లేస్ లో అతనిని షోలో పాల్గొనాలని కోరగా అతని ఒప్పుకున్నాడు. అయితే పార్టీ నిర్వాహకులు షో ముగిసిన తరువాత రాజాకు రూ. 2వేలు, జెస్సీకి రూ. 27,000 చెల్లించడంతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో జేస్సీ అతనిని అవహేళనగా మాట్లాడేసరికి తీవ్ర మనస్థాపానికి గురై రాజా ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో జెస్సీని పోలీసులు అరెస్ట్ చేశారు.

జాట్‌ రిజర్వేషన్..నాలుగో రోజుకి చేరిన ఉద్యమం

  హర్యానాలో తమకు రిజర్వేషన్లని కల్పించమంటూ జాట్ వర్గంవారు చేస్తున్న ఉద్యమం ఇవాల్టికి నాలుగోరోజుకి చేరుకుంది. రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలైన రోహ్‌తక్, సోన్‌పేట్ వంటి ప్రాంతాలలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఆందోళనకారుల రాష్ట్ర రహదారులని సైతం నిర్బంధించడంతో రాకపోకలన్నీ స్తంభించిపోయాయి. రైళ్లు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హర్యానా ముఖ్యమంత్రి ‘మనోహర్‌లాల్ ఖట్టర్‌’ జాట్‌లను చర్చలకు ఆహ్వానించినప్పటికి కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉండటం విశేషం. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే జాట్‌ వర్గం వారు తమకి రిజర్వేషన్లని కల్పించమని ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఈ ఉద్యమాలు హింసాత్మకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి హర్యానాలో 47 శాతం వరకూ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం 50 శాతం వరకూ రిజర్వేషన్లను పొడిగించవచ్చు. కాబట్టి మిగిలిన 3 శాతం రిజర్వేషన్లను జాట్‌ వర్గానికి కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. కానీ జాట్ నేతలు మాత్రం కంటితుడుపు ప్రకటనలు కాకుండా స్పష్టమైన హామీలను ఇస్తేనే తాము ఉద్యమాన్ని విరమిస్తామని పట్టుదలతో ఉన్నారు.