తమిళనాట బస్సు ప్రయాణం ఫ్రీ.... వృద్ధులకు మాత్రమే!
posted on Feb 18, 2016 @ 3:07PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్కడి పెద్దవారికి ఓ తీపికబురు అందించారు. ఫిబ్రవరి 24 నుంచి ఆ రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు బస్సు ప్రయాణం ఉచితం కాబోతోంది. ఈ పథకాన్ని తొలుత చెన్నైలో అమలుచేసి, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు దాటిన వారు చెన్నై నగరంలోని ఏ సిటీబస్సులోనైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం వారు రవాణా సంస్థ నుంచి టోకెన్లను పొందవలసి ఉంటుంది. అయితే నెలకి పది టోకెన్లను మాత్రమే గరిష్టంగా వినియోగించుకోగలరు. ఈ పథకాన్ని అమలుచేయడం ద్వారా తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని జయలలిత గర్వంగా ప్రకటించారు. ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈ పథకం మంచి ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ పథకాన్ని ఫిబ్రవరి 24నే ఎందుకు అమలు చేస్తున్నారయ్యా అంటే... ఆ రోజు జయలలితగారి పుట్టినరోజు అన్న సమాధానం వినిపిస్తోంది!