అది నా రక్తంలోనే ఉంది.. రాష్ట్రపతిని కలిసిన రాహుల్
posted on Feb 18, 2016 @ 2:44PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ అరెస్ట్ వ్యవహారం గురించి కేంద్రంపై వ్యవహరిస్తున్న తీరు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. కన్నయ్య కుమార్ అరెస్టు వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అసంబద్ధంగా ఉందని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. కాగా రాహుల్ గాంధీతో పాటు 17 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగానే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ దేశ ద్రోహి అంటూ అతనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై స్పందించి.. దేశ భక్తి తన రక్తంలోనే ఉందని అన్నారు. మా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల గొంతు నొక్కాలని చూడడం సరికాదని అన్నారు.