మరో పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్.. ఏడ్చేశాడా..?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసహంపై వ్యాఖ్యలు చేసి పలు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి భారత ప్రభుత్వం తొలగించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు మరో పథకానికి అమీర్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. భాజపా నేతృత్వంలో నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం అమీర్ ఖాన్ ను జల్ యుక్త షివర్ పథకానికి బ్రాండ్ నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రారంభోపన్యాసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అమీర్ ఖాన్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ వార్త విన్న అమీర్ ఖాన్ మాత్రం భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది.  బ్రాండ్ అంబాసిడర్ గా నియమించగానే అమీర్ కళ్లు చమర్చినట్లు చెప్పుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఎదుటే కొట్టి చంపారు..

కేరళలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇంట్లోనే కొట్టి చంపేశారు. వివరాల ప్రకారం.. 27 ఏళ్ల సుజిత్ కేరళ, కన్నూరు జిల్లా పాపినిసేరిలో ఉంటున్నాడు. అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అయితే గత కొద్ది రోజులుగా కేరళలో ఆర్ఎస్ఎస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం సుజిత్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో చొరబడి.. తన తల్లిదండ్రులు ఎదుటే అతనిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అడ్డుకోబోయిన అతని తల్లి దండ్రులను కూడా గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన సుజిత్ ను ఆస్పత్రికి తరలించబోయే లోపులోనే మరణించాడు. సీపీఎం కార్యకర్తలే అతన్ని చంపినట్లు సుజిత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సీఎంకు రిస్ట్ వాచ్ తిప్పలు..

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తను ధరించే రిస్ట్  వాచ్ వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానిని వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అసలు సీఎం గారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం విపపక్షాల పోరు తట్టుకోలేకేనట. గత కొన్ని రోజులుగా ఆయన రూ.70 లక్షల విలువ చేసే గడియారాన్ని ధరిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకుగాను ఆయనపై విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నారు. రూ.70 లక్షల విలువ చేసే వాచ్‌ను సీఎం సిద్ధరామయ్య తన ఆస్తుల్లో చూపకుండానే అఫిడవిట్‌ను దాఖలు చేశారంటూ.. పలు విమర్శలు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం తన రిస్ట్ వాచ్ ను వేలం వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

డీకే అరుణకు టీఆర్ఎస్ గాలం..?

ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పలువురు నేతలను అధికార పార్టీని తమ పార్టీలోకి తీసుకుంది. ఈనేపథ్యంలోనే దాదాపు తెలంగాణలోని టీడీపీ ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ చూపు కాంగ్రెస్ పార్టీపై పడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పాలమూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు గాలం వేసినట్టు సమాచారం. అంతేకాదు ఆమె కూడా త్వరలో టీఆర్ఎస్  లో చేరుతున్నట్టు అప్పుడే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే డీకే అరుణ మాత్రం ఆ వార్తలను ఖండించింది. తాను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం జరుగుతోందనీ.. ఎట్టి పరిస్థితిల్లో తాను పార్టీ మారేది లేదని.. ఇది టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్రభుత్వం కలలుగంటోందని, అది ఎన్నటికీ సాధ్యం కాదన్నారు.

విరాట్ కోహ్లీకి మళ్లీ కోపమొచ్చింది..

భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాస్త కోపం ఎక్కువని అది అందరికి తెలిసిందే. గతంలో కూడా ఆయన మీడియా పై ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మీడియాపై కోపడ్డాడు కోహ్లీ. అయితే అప్పటికి.. ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే.. అప్పుడు అనుష్క శర్మతో కలిసి ఉండేవాడు.. ఇప్పుడు లేడు.. అదే తేడా.. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగే సరికే కోహ్లీ కోపడ్డాడు. కోహ్లి - అనుష్క శర్మ మధ్య బంధానికి తెరపడిందంటూ ఇటీవల వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లిని.. ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్‌లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారని ఓ విలేకరి ప్రశ్నించాడు.. దానికి విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఉన్నవాళ్లకు ఎందుకిస్తానని, ఇస్తేగిస్తే మా కుటుంబంలో ఎవరికైనా ఇస్తా లేకపోతే.. జట్టు సహచరులకు ఇస్తానని అన్నారు. అంతేకాదు ఎవరికిస్తే మీకెందుకని మండిపడ్డాడు. అక్కడితో ఆగకుండా.. అసలు జరిగే కార్యక్రమం గురించి అడగకుండా.. ఇలాంటి ప్రశ్నలు అడిగి ఎందుకు విషయాన్ని మరోవైపు మళ్లించే ప్రయత్నం ఎందుకు చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

28 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ డిగ్రీ పట్టా..

ఒకటి కాదు రెండు కాదు దాదాపు 28 ఏళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాను పొందాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హన్స్‌రాజ్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ తన డిగ్రీ పట్టాను మాత్రం తీసుకోలేదు. అయితే షూటింగ్ లో భాగంగా తాజాగా ఢిల్లీ వెళ్లిన షారుఖ్ కాలేజ్ కు వెళ్లి తన డిగ్రీ పట్టాను తీసుకున్నారు. ఈ సందర్బంగా షారుఖ్ కు పట్టా అందజేసిన కాలేజ్ ఫ్రిన్సిపాల్ రమాశర్మ మాట్లాడుతూ.. షారుఖ్‌ఖాన్‌కు చాలా ఏళ్ల తర్వాత డిగ్రీని అందించడం చాలా సంతోషంగా ఉందని.. షారుఖ్ డిగ్రీని ఎన్నో ఏళ్లుగా తాము భద్రంగా ఉంచామని తెలిపారు. అంతేకాదు షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తమ కాలేజీలో చదివినందుకు చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులపై దాడికి నిరసనగా మార్చ్..

పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు జర్నలిస్టులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి గాను ఇప్పుడు జర్నలిస్టులపై న్యాయవాదులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు మార్చ్ నిర్వహించారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ జాతీయ పత్రికలు, టీవీ చానళ్లకు చెందిన సీనియర్ ఎడిటర్లు, వందలసంఖ్యలో జర్నలిస్టులు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్ట్ లపై దాడి చేసిన న్యాయవాదుల లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బార్ కౌన్సిల్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించారు ఇదిలా ఉండగా దీనిపై మాట్లాడేందుకు గాను జర్నలిస్టుల బృందం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్బంగా వారు న్యాయస్థానం సాక్షిగా ఓ జర్నలిస్టులపై న్యాయవాదులు దాడికి పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని.. జర్నలిస్టులపై దాడిచేసినవారిపై తక్షణమే కేసులు నమోదు చేయాల్సిందిగా రాజ్‌నాథ్‌కు వినతిపత్రం అందించారు.

నా జోలికొస్తే అలానే ఉంటుంది..బీజేపీ ఎమ్మెల్యే

జెఎన్ యూ వ్యవహారంలో భాగంగా పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంగణంలో బీజేపీ ఢిల్లీ శాసనసభ్యుడు ఓపీ శర్మ వామపక్ష కార్యకర్తను కొట్టిన సంగతి తెలిసిందే.  జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్యాకుమార్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే తాను చేసిన దానిని సమర్ధించుకుంటున్నారు ఆ నేత. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తుంటే అభ్యంతరం తెలిపానని.. దానిని తనపై దాడి చేశారని..నా తలకు దెబ్బ కూడా తగిలిందని అన్నారు. వారు దాడి చేసినందుకే ఎదురుదాడికి దిగానని.. అంతేకాదు నన్ను కొడుతుంటే నేను తిరిగి కొట్టొద్దా..? అంటూ ఎదురు ప్రశ్నించారు. నన్ను ఎవరైనా కొడితే ప్రతిస్పందన అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

రాజకీయ రీ ఎంట్రీకి లగడపాటి..?

లగడపాటి రాజగోపాల్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ నిరంతరం వార్తల్లో ఉండేవారు. అయితే రాజకీయ సన్యాయం తీసుకుంటానని చెప్పిన ఆయన గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో వెలసిన ఫ్లెక్సీలు చూస్తుంటే మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లగడపాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు..ఈ పోస్టర్లపై నటుడు పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకుల ఫొటోలు ఉండడం విశేషం. దీంతో లగడపాటి మల్లీ రాజకీయాల్లోకి వస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు లగడపాటి కూడా రాజకీయ ప్రముఖులతో మంతనాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఏ పార్టీలో చేరాలన్న దానిపై తర్జన భర్జనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ అయితే బెటరని అభిమానులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేక రైళ్లకు ఇక ప్రత్యేక బాదుడు

  పండుగల సమయాలలో వచ్చే అధిక రద్దీని తట్టుకోవడానికి ఇప్పటిదాకా రైల్వేలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసేవి. దానికోసం అదనంగా ఏమీ రుసుముని వసూలు చేసేవి కావు. కానీ ఇప్పడు రైల్వేల పంథా మారిపోయింది. అవసరం ఉన్నచోట భారీగా బాదేయాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇప్పటికే తత్కాల్‌ సమయంలోనూ, టికెట్టుని రద్దుచేసుకునేటప్పుడూ రైల్వేలు భారీ రుసుముని వసూలు చేస్తున్నాయి. సాధారణ ప్రయాణికులకు భారం కలుగకుండానే ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇలాంటి మార్గాలన్నింటినీ ఎంచుకుంటున్నాయి. దాంతో ఇకమీదట ప్రత్యేక రైళ్లన్నింటికీ ప్రత్యేక బాదుడుని అమలు చేయాలని నిశ్చయించుకుంది. వరదలూ గట్రా వచ్చినప్పుడో, రైలు ప్రమాదాలకు గురైనప్పుడో తప్ప మిగతా సందర్భాలలో ఈ బాదుడు ఇక తప్పనిసరి! కాబట్టి ఈసారి సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనుకుంటే జేబుకి చిల్లుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉండగలరు.

తెలంగాణ-ఒడిశా జాయింట్ ఆపరేషన్.. ఉగ్రవాదులు అరెస్ట్

తెలంగాణ-ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒడిశా రూర్కెరాలో సిమీ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. సిమీ ఉగ్రవాదులైన అమ్జార్, జకీర్, మెహబూబ్, సాలిఖ్ అరెస్ట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు 2013లో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. అనంతరం అనేక ప్రాంతాల్లో వీరు తలదాచుకోగా.. తెలంగాణ-ఒడిశా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరికి నల్గొండలో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు ఎజాజుద్దీన్, అస్లాంతో వీరికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రాంతంలో విచారించేందుకు తరలించారు. కాగా వీరి దగ్గర నుంచి అయిదు దేశవాళీ రివార్వర్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్కాతమ్ముళ్లను కలిపిన ఫేస్ బుక్

టెక్నాలజీ వల్ల లాభాలు,నష్టాలూ రెండూ ఉంటాయి. ఉపయోగించుకునే తీరు బట్టి ఫలితం మారుతుంటుంది. తాజాగా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఇద్దరు అక్కాతమ్ముళ్లను కలిపింది. కెనడాకు చెందిన షైలో విల్సన్ తల్లి తన చిన్న కొడుకును పుట్టగానే వేరొకరికి దత్తత ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్లు వేరే ప్లేస్ కు మారిపోవడంతో మళ్లీ కలవలేకపోయారు. ఇది జరిగిన పాతికేళ్లకు, షైలో విల్సన్ తన ఫేస్ బుక్ లో తమ్ముడి గురించి పోస్ట్ పెట్టింది. మాథ్యూ హ్యాండ్ ఫోర్డ్ అనే పేరుతో పెరిగిన ఆమె తమ్ముడు కూడా,తన సొంత కుటుంబం కోసం ఆరా తీస్తున్నాడు.   అనుకోకుండా, ఎవరో షేర్ చేయడంతో, తన అక్క పెట్టిన పోస్ట్ చూశాడు. నా తమ్ముడు ఫలానా హాస్పిటల్లో పుట్టాడు. తన పేరు మాథ్యూ అని అన్ని డిటెయిల్స్ తో ఆమె పెట్టిన పోస్ట్ చూసి మాథ్యూ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆమెకు మెసేజ్ చేసి, అడ్రస్ కనుక్కుని వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. ఊహ తెలియకముందే దత్తత వెళ్లిపోయిన మాథ్యూ, తన సొంత అక్కను, కుటుంబ సభ్యులను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. టెక్నాలజీని సవ్యంగా వాడుకుంటే, ఎంత అద్భుతమో ఈ అక్కాతమ్ముళ్లే ఉదాహరణ.

ఆ ఇద్దర్నీ బెంగళూర్ కు ఇచ్చేసిన హైదరాబాద్

ఐపిఎల్ ట్రేడింగ్ విండోలో బ్యాట్స్ మేన్ కె ఎల్ రాహుల్, ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ ఇద్దర్నీ బెంగళూరు టీం కు ట్రేడింగ్ విండోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ చేసింది. 2013లో బెంగళూరుకు ఆడిన రాహుల్ ఇప్పుడు తిరిగి తన సొంత గూటికి చేరుకోవడం విశేషం. జమ్ముకశ్మీర్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న పర్వేజ్ రసూల్ ను దక్కించుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందన్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీం యజమాని విజయ్ మాల్యా.   ప్లేయర్స్ ట్రాన్స్ ఫర్ ను ఐపిఎల్ కౌన్సిల్ కన్ఫామ్ చేసింది. ఇప్పటికే ఐపిఎల్ లో స్ట్రాంగెస్ట్ టీం గా రాయల్ ఛాలెంజర్స్ కు పేరున్న సంగతి తెలిసింది. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్లతో, బెంగళూర్ టీం అభేద్యంగా కనబడుతోంది. ఏప్రిల్ 9 న మొదలయ్యే ఐపిఎల్ మే 29 వరకూ జరగనుంది.

చెన్నైపై ఇంకా మమకారం పోలేదు..ధోనీ

ఐపిఎల్ లో కొత్త టీం బాధ్యతలు స్వీకరించటం తనకు కూడా కొత్తగానే ఉందంటున్నాడు ధోనీ. ఎనిమిదేళ్ల పాటు ఒకే టీంలో ఉండి ఇప్పుడు మరో కొత్త టీం కు ఆడటం కాస్త డిఫరెంట్ గా ఉన్నా, ఇది కూడా నచ్చిందట. మరి చెన్నై సూపర్ కింగ్స్ ను మర్చిపోయారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ధోనీ ఎమోషనల్ అయ్యాడు. " మర్చిపోయాను అని చెప్తే అబద్ధమవుతుంది. అన్ని సంవత్సరాల పాటు ఆడిన కారణంగా, ఆ టీం తో ఎంతో కొంత మమకారం ఉంటుంది. ఐపిఎల్ ఆరంభమైనప్పటినుంచీ నేను అడుతున్న జట్టు చెన్నై. ఒక ప్రొఫెషనల్ ఆటగాడు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. నా మీద నమ్మకముంచినందుకు కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. " అన్నాడు.   పుణే జట్టుకు జెర్సీ ఆవిష్కరణ సమయంలో ఇలా తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో, ఐపిఎల్ నుంచి చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు సస్పెండ్ అవడంతో వాటి స్థానంలో రైనా కెప్టెన్ గా గుజరాత్ లయన్స్, ధోనీ కెప్టెన్ గా రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ వచ్చిన సంగతి తెలిసిందే..ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకూ ఐపిఎల్, క్రికెట్ అభిమానుల్ని అలరించనుంది.