జయలలితకు పోటీగా హిజ్రా..

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. ఇప్పటినుండే పార్టీలన్నీ ఎన్నికల బరిలో విజయం పొందడానికి వారి వారి ప్రయత్నాల్లో సమాయత్తమవుతున్నాయి. మరోవైపు పార్టీల్లోకి వచ్చే వాళ్లు వస్తున్నారు.. మారే వాళ్లు మారుతున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ గ్లామర్ ఫీల్డ్ కు సంబధించిన వారిని పార్టీల్లోకి తీసుకోవడంపై ఎక్కువ దృష్టిసారించిన నేతలు.. ఇప్పుడు హిజ్రాలకి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అమ్మగా భావించి.. రాజకీయరంగంలో చక్రం తిప్పుతున్న జయలలితపైనే పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. జయలలిత తమిళనాడులోని ఆర్కే నగర్ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజక వర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటికి సిద్దమైంది. సినీ దర్శకుడు సీమన్ పెట్టిన పార్టీ తరుపున ఆమె జయలలితకు పోటీ ఇవ్వబోతోంది. మరి జయలలితను అధిగమించి ఆమె గెలుస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికలు వరకూ ఆగాల్సిందే.

చైన్ స్నాచింగ్.. పసికందు మృతి.. ట్విస్ట్ తల్లే చంపిందా..?

  హైదరాబాద్ నగరం నేరేడ్ మెట్ లో చైన్ స్నాచర్లు ఓ మహిళపై దాడి చేయడం.. ఈ దాడిలో 25 రోజుల పసికందు చనిపోవడం తెలిసిందే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. ఆ పసికందును తల్లే చంపేసింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. వివరాల ప్రకారం.. నేరెడ్ మెట్ లో పూర్ణిమ అనే యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఆమెపై  చైన్ స్నాచర్లు దాడి చేశారు. ఈ పెనుగులాటలో ఆమె ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు కిందపడి మరణించింది. అయితే పోలీసుల మాత్రం తల్లే ఈ హత్య చేసిందని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన దానిపై పోలీసులు అనుమానించి ఆమె ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అబద్దం చెబుతున్నారని, తన కోడలు బయటకు వెళ్లినప్పుడు బంగారపు పుస్తెల తాడు ఉందని, ఆమె ఇంటికి వచ్చేసరికి లేదని తన మనవడు అంటే తమకూ ప్రేమేనని, కానీ తమ కోడలి పైన అభాండాలు వేయవద్దని అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

వాట్స్ యాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్..

వాట్స్ యాప్ యూజర్స్ కి ఓ గుడ్ న్యూస్. ఇక నుండి వాట్స్ యాప్ పూర్తి సురక్షితమైందని.. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ ప్లాట్ ఫాంలపై వాట్స్ యాప్ ను పూర్తి ఎన్ క్రిప్ట్ చేశామని, ఇక ఎవరు ఏం మెసేజ్ లు పంపుకున్నా మరొకరికి తెలిసే అవకాశాలు లేవని వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ వెల్లడించారు. ఇంకా జాన్ కౌమ్.. సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లకు మీ మెసేజ్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కనిపించవు. మేము కూడా తెలుసుకోలేమని వెల్లడించారు. అంత పటిష్ఠమైన భద్రతా వలయాల మధ్య నుంచి సమాచారం బట్వాడా అవుతుంది" అన్నారు. కాగా దేశంలో ఇప్పటికే 100 కోట్లమందికి పైగా వాట్స్ యాప్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

పదిమందిని బహిష్కరించిన విజయకాంత్.. కారణం ఆయన సతీమణా..?

  తమిళనాడు రాజకీయ పార్టీల్లో రోజుకో సరికొత్త అంశం చోటుచేసుకుంటుంది. అందునా డిఎండికె పార్టీలో రోజుకో ఆసక్తికరమైన అంశం తెరకెక్కుతోంది. డిఎండికె అధ్యక్షుడు అధినేత విజయ్ కాంత్ తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ముందు చెప్పినా.. ఆ తరువాత పిడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం ముందునుండి డీఎంకేతో పొత్తు పెట్టకోవాలని విజయకాంత్ కు చెప్పారంట. విజయకాంత్ మాత్రం వారి మాటలను తోసిపుచ్చి ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ఏమాత్రం సహించలేని పార్టీ నేతలు ఆయనను ప్రశ్నించారు. ఇందుకుగాను విజయకాంత్ అలా ప్రశ్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమందిని పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించారు. దీంతో డిఎండికె పార్టీలో మరోసారి ముసలం ఏర్పడింది. మరోవైపు విజయ్‌కాంత్‌ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన సతీమణి ప్రేమలత, ఆమె తమ్ముడు సుదీష్‌లేనని ఆరోపించారు.

కేసీఆర్ శ్రీవారికి చేయించిన ఆభరణాలు ఇవే

  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తిరుమల శ్రీవారు, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళీ, కురివి వీరభద్రస్వామికి బంగారు అభరణాలను చేయిస్తానని మొక్కుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల తర్వాత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనుకున్నట్లుగానే దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తానని దానికి నిధులు కూడా విడుదల చేశారు.   సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచార్యులను ఆభరణాల కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. ఆభరణాల తయారీ టెండర్లను తమిళనాడులని కొయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాలిదాస్ జ్యువెలర్స్ దక్కించుకుంది. దీనిలో తొలి విడతగా తిరుమల వెంకన్న ఆభరణాలైన శాలిగ్రామ హారం, మకరకంఠ సిద్ధమయ్యాయి. 20 కిలోల బరువుతో సుమారు 5 కోట్లు వెచ్చించి వీటిని తయారు చేశారు. ఈ నెలాఖరున సీఎం కేసీఆర్ తిరుమలకి వెళ్లి మొక్కు చెల్లించనున్నారు.

మొన్నే సీఎంగా ప్రమాణ స్వీకారం.. అప్పుడే మెహబూబా ముఫ్తీకి షాక్

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో మెహబూబా ముఫ్తీకి అప్పుడే షాక్ తగిలింది. బీజేపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్న సజ్జద్ ఘనీ లోన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మెహబూబా మప్తీ ఘనీకి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఘనీ మాత్రం తనకు వైద్య, ఆరోగ్య శాఖ వస్తుందని ఆశించారు. దీంతో తనకు కేటాయించిన శాఖకు అసంతృప్తి చెందిన ఘనీ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను మెహబూబాకు పంపడానికి బదులుగా బీజేపీ హై కమాండ్ కు పంపారు. మరోవైపు అటు బీజేపీ, ఇటు పీడీపీ ఘనీని బుజ్జగించేదుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఘనీ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ మెహబూబాతో ఈ విషయంపై మాట్లాడితే కాని సర్దుబాటు జరిగేలా లేదని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు.

ఆవు ప్రాణమా.. మొసలి ప్రాణమా.. తేల్చనున్న కోర్టు..

  ఆవు ప్రాణమా.. మొసలి ప్రాణమా అంటే.. ఈ రెండింటిలో ఎవరైనా ఆవు ప్రాణమా అనే చెప్తారు. కానీ ఈ రెండింటిలో ఏ ప్రాణం ముఖ్యమో అన్న విషయం ఓ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తెలియనుంది. ఇంతకీ అసలు సంగతేంటంటే.. అమెరికా కోర్టులో ఓ విచిత్రమైన కేసు ఒకటి వచ్చింది. మొసలి ప్రాణం గొప్పదా? లేక ఆవుల ప్రాణాలు గొప్పవా? అన్న ఆసక్తికరమైన కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒకిచోబి అనే ఏరియాలో ఒక రైతుకు బోలెడన్ని ఆవులు ఉండేవి. అయితే కాల క్రమేణా ఆవుల సంఖ్య తగ్గుకుంటూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన నిఘా వేసి చూడగా ఒక మొసలి ఆవులను తింటుందని గమనించాడు. ఇక ఆ మొసలిని చంపి దానిని ప్రొక్లయినర్ సాయంతో వేలాడదీసి.. ఫొటో తీసి మరీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు చూసిన జంతు సంరక్షకులు ఆరైతుపై కేసు పెట్టగా  ప్రస్తుతం ఫ్లోరిడా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వన్యప్రాణిని చంపడం తప్పా? కాదా? అన్నది కోర్టు తేల్చనుంది. మరి కోర్టు ఏ రకమైన తీర్పునిస్తుందో చూడాలి.

వైసీపీ నుండి మరో వికెట్ డౌన్.. ఎమ్మెల్యే సునీల్ టీడీపీలోకి..

వైసీపీ పార్టీనుండి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు టీడీపీలోకి వలసలు కట్టారు. ఇప్పటికే తుమ్మల రాజకీయంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరుతుంటే.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సునీల్ టీడీపీ లోకి జంప్ అవనున్నారు. అయితే సునీల్ టీడీపీ చేరిక వెనుక హస్తం మాత్రం మంత్రి నారాయణదే అని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు. సునీల్‌ను విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి నారాయణ వెంట తీసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన తెదేపా కండువా కప్పుకున్నారు. కాగా మరి కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది.

ఈసారైనా రోజా సారీ చెబుతుందా..?

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మరో ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై ఫిర్యాదు చేయడంతో రోజాను కమిటీ ముందు హాజరు కావాలని ఇప్పటికీ చాలాసార్లే కమిటీ ఆదేశించింది. అయితే రోజా మాత్రం ఇంతవరకూ కమిటీ ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ముందు రోజా వ్యవహారశైలిపై మండిపడ్డ కమిటీ..ఆ తరువాత మరోసారి రోజాకు కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగానే ఈరోజు రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్న అనిత విషయంలో తన వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా రోజా మాత్రం అనితపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా లేరు. మరోవైపు రోజా క్షమాపణ చెప్తే ఆమె పట్ల ప్రివిలేజ్ కమిటీ కాస్తంత సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

టీఆర్ఎస్ లోకి పొంగులేటి.. తుమ్మల నడిపిన రాజకీయం..!

వైసీపీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పొంగులేటి చేరిక వెనుక మాత్రం తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందని అంటున్నారు రాజకీయ పెద్దలు. మంత్రి తుమ్మల నడిపిన రాజకీయ ఫలితమే తెలంగాణాలో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పాయం వెంకటేశ్వర్లు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయినట్టు సమాచారం. మరోవైపు ఏపీ నుండి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నాకేం తెలియదు అంటున్న అమితాబ్..

పనామా పేపర్స్ నల్ల కుబేరుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 500 మంది భారతీయుల పేర్లు ఉన్న సంగతి.. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా ఉన్న సంగతి విదితమే. అయితే దీనిపై ఐశ్వర్యరాయ్ స్పందించి.. అది అంతా అబద్దమే అని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇప్పుడు దీనిపై మామ అమితాబ్ కూడా స్పందించి.. విదేశాల్లో నాకు కంపెనీ ఉందని.. దానికి నేను డైరక్టర్ అని వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు.. నాకు ఎలాంటి కంపెనీ లేదు.. నేను దేనికీ డైరక్టర్ ను కాదు అని చెప్పారు. మరి ఎవరిది ఎంత నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇక‌పై మ‌గాళ్ల‌క్కూడా ప్యాట‌ర్నిటీ లీవులు

  సాధారణంగా మెట‌ర్నిటీ లీవులంటే మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ ఇక‌పై మ‌గాళ్ల‌కు వీటిని వ‌ర్తింపజేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని యోచిస్తోంది. స‌రోగ‌సీ ద్వారా సంతానం పొందాల‌నుకునే మ‌హిళా ఉద్యోగుల‌కు 180 రోజులు ప్రెట‌ర్నిటీ లీవు ఇవ్వాల‌ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ ప్ర‌తిపాదించింది. స‌రోగ‌సీతో తండ్రులయ్యే పురుషుల‌కూ ఆరు నెల‌లు ప్రెట‌ర్నిటీ సెల‌వులు ఇవ్వాల‌ని సిఫార‌సు చేసింది. స‌రోగ‌సీ ద్వారా సంతానం పొందే మ‌హిళ‌ల‌కు లేదా అద్దెగ‌ర్భం మోసే త‌ల్లుల‌కు మెట‌ర్నిటీ సెల‌వులు ఇవ్వ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వీస్ రూల్స్ లో లేదు. త‌మ చిన్నారుల‌ను కంటికి రెప్ప‌లా చూసుకునే స‌రోగ‌సీ దంప‌తుల‌కు 180 రోజులు సెల‌వు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేరకు నిబంధ‌న‌ల‌ను త‌న వెబ్ సైట్ లో పెట్టింది.

లోకేష్ కోసం ఇంత త్యాగమా..

టీడీపీ యువనేత నారా లోకేష్ ను కేబినెట్లో తీసుకునేందుకు నారా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ ను కేబినేట్లో తీసుకోవడానికి చంద్రబాబు ఆ పార్టీ నేతలతో సంప్రదించడం.. దానికి పార్టీ నేతలు కూడా ఓకే అనడం జరిగిందట. దీనిలో భాగంగానే ఇప్పుడు నారా లోకేష్ ను కేబినెట్ లో తీసుకునేందుకు వీలుగా మేము రాజీనామా చేస్తామంటే మేము రాజీనామా చేస్తామంటూ ఆయన కోసం విజయవాడ టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధపడుతున్నారట. అయితే లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించడంతో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాను రాజీనామాకు సిద్దమని చెప్పాడు. మరోవైపు లోకేష్ కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దీనిపై మాట్లాడుతానని ఆయన అన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపి కేబినెట్ లోకి తీసుకోవాలని కోరుతానని ఆయన చెప్పారు.

విశ్వనాథన్ ఆనంద్ హృదయనాథ్ పురస్కారం..

  ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ఆయనకు హృదయనాథ్ పురస్కారం దక్కింది. సాధారణంగా ఈ పురస్కారం దేశంలో వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన, విజయవంతమైన వ్యక్తులను ఈ పురస్కారంతో గౌరవిస్తారు. ఇప్పుడు ఈ పురస్కారం ఈయనను వరించింది. ఈ పురస్కారానికి ఎంపికైన విశ్వనాథన్ ఆనంద్ కు రూ.2 లక్షల నగదు, ఒక జ్ఞాపిక ను అందజేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మహారాష్ట్రలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. కాగా గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో లతా మంగేష్కర్, బాబా సాహెబ్ పురందరె, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియా, ఏఆర్ రెహ్మాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

ప్రత్యూష బెనర్జీ నన్ను పిలుస్తోంది అంటున్న రాహుల్ సింగ్..

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పరిస్థితి  ఏం బాలేదని.. ఐసీయూలో ఉన్నాడని అతని లాయర్ చెప్పాడు. అయితే ఇప్పుడు రాహుల్ రాజ్ సింగ్ షాక్ కు గురయ్యాడని అతని తండ్రి తెలిపారు. తన కుమారుడి ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడు చిత్రంగా ప్రవర్తించాడని ఆయన చెప్పారు. ప్రత్యూష తనను పిలుస్తోందని, తాను కూడా వెళ్తానని తనతో చెప్పాడని ఆయన పేర్కొన్నారు. దీంతో తన కొడుకు ఏమైపోతాడోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుమారుడు కోలుకోవాలని ప్రార్థించాలని ఆయన కోరారు. కాగా ప్రత్యూష బెనర్దీ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ రాజ్ సింగ్ పై ఆరోపణలు వస్తున్న సంగతి కూడా విదితమే.

నిరాశనే మిగిల్చిన 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌'.. కేవలం 7 నిమిషాలేనా..?

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు అని.. ఈ రైలులో అన్ని సౌకర్యాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన  'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలు నిరాశనే మిగిల్చిందా అంటే అవుననే అంటున్నారు ప్రయాణికులు. ఎందుకంటే. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలు హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి ఆగ్రా స్టేషన్‌ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకుంటుంది. అయితే ఇప్పుడున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఆదా చేసినట్టు చెబుతున్నారు ప్రయాణికులు. అందునా శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో రూ. 1010 టికెట్ కాగా గతిమాన్ లో ఇదే క్లాస్ సీటుకు 1500 రూపాయలు. కేవలం 7 నిమిషాలకే  50 శాతం అధికంగా చెల్లించడం వృథా అని అంటున్నారు. మొత్తానికి ఎంత వేగంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అంతే స్పీడ్ గా నిరాశను మిగిల్చింది గతిమాన్ ఎక్స్ ప్రెస్.