ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్న చంద్రులు
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన చంద్రబాబుకు, కేసీఆర్ ఎదురుపడటంతో ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు గవర్నర్ ప్రసంగిస్తూ శ్రీదుర్ముఖి నామ సంవత్సరంలో తెలుగువారికి అన్ని శుభాలే కలుగుతాయని తెలిపారు. మంచి వర్షాలు కురిసి, ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల్లోని మంత్రులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.