భారీ అగ్ని ప్రమాదం.. 8మంది పిల్లలకు గాయాలు

  హైద‌రాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీ తలాబ్‌కట్టాలోని బన్‌ రోటీ తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. అయితే అక్కడ కిరోసిన్‌ డబ్బాలు ఉండటంతో మంటలు మ‌రింత చెల‌రేగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రుల‌ను ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులకు తరలించారు. ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న‌ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.   ఇదిలా ఉండగా అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని హిడెన్ రిట్జ్ ప్రాంతానికి చెందిన మూడంతస్తుల అపార్ట్ మెంట్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు పరుగుపరుగున బయటకు వచ్చేసరికి కాస్త ప్రమాదం తప్పింది. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

మూడోసారి కూడా ఎగనామం పెట్టిన మాల్యా..

  కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలుగా తీసుకొని వాటిని చెల్లించకుండా ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా దర్యాప్తు సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా ఈరోజు కూడా డుమ్మా కొట్టాడు. గతంలో ఈడీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించినా తనకు ఏప్రిల్ వరకూ గడువు కావాలని కోరాడు. దీనికి ఈడీ కూడా ఒప్పుకొని ఏప్రిల్ 2 న తమ ముందు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పుడు కూడా తాను హాజరుకాకుండా మే నెల వరకూ గడువు కావాలని కోరాడు. అయితే దీనికి ఆగ్రహించిన ఈడీ ఏప్రిల్ 9న ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కానీ మాల్యా మాత్రం ఈసారి కూడా ఈడీ ముందు హాజరుకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో హాజరు కాలేనని.. బ్యాంకులతో చర్చిస్తున్నానని.. గడువుకావాలని కోరారు. దీంతో  మాల్యా అభ్యర్థనకు ఏ విధంగా స్పందించాలో తెలియక ఈడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారట.

పఠాన్ కోట్ పై దాడి.. మసూద్ తో పాటు ముగ్గురిపై అరెస్ట్ వారెంట్లు

  పఠాన్ కోట్ విమానం స్థావరం పై ఉగ్రవాదులు దాడిపై దర్యాప్తు వేగం పుంజుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు ఆధారాలు పాక్ కు అందించినా వారు మాత్రం మాట మారుస్తూనే ఉన్నారు.  ఈ దాడికి అసలు సూత్రధారి జైషే మొమ్మద్ చీఫ్ మసూద్ అజార్ అని ఆధారాలు చూపించినా.. పాక్ ప్రభుత్వం మాత్రం అతనిని అదుపులోకి తీసుకున్నాం.. గృహనిర్భంధంలో ఉంచాం అంటూ చెబుతూ మాయమాటలు చెప్పింది. అంతేకాదు మసూద్ సహా ఈ దాడి పథక రచనలో పాలుపంచుకున్న అతడి సోదరుడు రవూఫ్, మరో ఇద్దరు పాకిస్థానీలు కషిఫ్ జాన్, షాహిద్ లతీఫ్ లను అరెస్ట్ చేయాలని కోరింది. కానీ పాక్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఇంకా ఈ దాడికి పాల్పడింది మనవాళ్లే అని చెబుతూ బుకాయించింది. దీంతో నిన్న ఎన్ఐఏ అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మసూద్ తో పాటు మిగిలిన ముగ్గురిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

నేటి నుండి ప్రారంభంకానున్న ఐపిఎల్ 9

మొన్నటి వరకూ ఏపీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు ఐపిఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. నేటి నుండి ప్రారంభమయ్యే సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమ్యాచుల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి. బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులతో హోరెత్తించారు. వీరితో కలిసి వెస్టిండీస్ జట్టు సభ్యుడు డ్వేనీ బ్రేవో కాలు కదిపి దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్ లో అసలు పోరు నేటి నుంచి మొదలు కానుంది. వాంఖడే స్టేడియం వేదికగానే జరగనున్న ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కొత్త జట్టు పుణే సూపర్ జెయింట్స్ తలపడనుంది.

జయలలితపైనే కాదు.. మమతాపై కూడా హిజ్రా పోటీ

  త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై దేవి అనే హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా పోటీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురైంది. కోల్ కతాలోని భవానీ నగర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగుతన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దీదీ నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్ మున్షీ, బీజేపీ అభ్యర్థిగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ లు బరిలోకి దిగుతున్నారు. ఇక లోక్ జనశక్తి పార్టీ తరఫున బాబీ హాల్డర్ అనే ఓ హిజ్రా బరిలోకి దిగుతున్నారు.

బాలుడిని చంపి.. ఆపై రక్తం తాగి..

  అమెరికాలో ఓ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిని చంపి ఆపై అతని రక్తం తాగిన ఓ నరరూప రాక్షసుడి ఉదంతం కలకలం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్ బోర్డర్ కు దగ్గరలో ఉన్న ఆంటానియోలో డేవిడ్ కార్డెన్నా అనే 12 ఏళ్ల బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. అయితే అతనిని  లుసియో వాస్క్యూజ్ (38) అనే వ్యక్తి ఇనుప పైపుతో కొట్టి గొంతుకోసి హత్య చేసి అనంతరం అతని రక్తాన్ని తాగాడు. ఈవిషయాన్ని లుసియోనే పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం తన వాంగ్మూలంలో తెలిపాడు. 1998లో జరిగిన ఈ ఘటనపై అప్పటినుండి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా దీనిపై విచారణ జరిపినకోర్టు అతనికి  మరణ శిక్షను విధించింది. చివరిసారిగా  తన కుటుంబ సభ్యులను కలవడానికి నిరాకరించిన లుసియో.. కేవలం జైలు లోపలే ఉండి కిటికీ ద్వారా అతని కుటుంబసభ్యలను చూశాడు. అంతేకాదు తాను చంపిన బాలుడు తల్లి దండ్రులు కూడా వారి పక్కనే ఉండగా.. అతను వారిని చూసి తనను క్షమించాలని వేడుకున్నాడు. అనంతరం లుసియోకి పెంటోబార్బిటోన్ ఎక్కువ మోతాదులో ఇచ్చిన 24 నిమిషాల అనంతరం మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

శ్రీనగర్ నిట్.. 1500 మందికి 600 మంది పోలీసులు

  శ్రీనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో స్థానికేతర విద్యార్దులకు, స్థానిక విద్యార్ధులకు మధ్య గొడవలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి మరింత చేయి దాటకుండా ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. అయితే ముందు  రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లను పంపిన కేంద్రం పంపినా కూడా పరిస్థితి నెమ్మదించకపోవడంతో సహస్త్ర సీమా బల్ కు చెందిన మూడు దళాలను పంపింది. అంటే ప్రస్తుతం 600 మంది పోలీసులు కాపలాగా ఉన్నారన్నమాట. మొత్తం వర్శిటీలో 1500 మంది విద్యార్థులుండగా వారికి 600 మంది పోలీసులు కాపలా అంటే.. ప్రతి ఇద్దరి విద్యార్ధులకు ఓ సైనికుడు ఉన్నట్టన్నమాట. ఈ సందర్బంగా  జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ.. ఇకపై వర్శిటీలో కేంద్ర బలగాల పహారా కొనసాగించాలని.. వర్శిటీలో ప్రతి ఒక్కరి బాధ్యతా తమదేనని చెప్పారు. కాగా ఇండియాలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది

విలేకరికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన రైనా..

  ఈమధ్యన క్రికెటర్లు ఇంటర్య్వూ చేసేవాళ్లకి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇటీవలే ధోని తన రిటైర్మెంట్ పై అడిగినందుకు విలేకరికి షాకిస్తే.. టీ20 ప్రపంచం కప్ గెలిచిన ఆనందంలో ఏకంగా తన కాళ్లను బెంచ్ పై పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడు రైనా కూడా తన సమాధానంతో రిపోర్టర్ కి షాకిచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఐపిఎల్ ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు కొత్త జట్టు గుజరాత్ లయన్స్ కు కెప్టెన్ గానూ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో అతడి ఫామ్ పై సందేహాలు రేకెత్తేలా విలేకరి ఓ ప్రశ్న సంధించాడు. ‘‘మీరు టీమిండియాకు కోచ్ గా గానీ, లేదా ఏదో ఒక నేషనల్ టీంకు కోచ్ గా వ్యవహరిస్తారంటూ వార్తలొస్తున్నాయి. మీరు ప్లేయర్ గా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? కోచ్ గా కంఫర్ట్ గా ఉంటుందని భావిస్తున్నారా?’’ అని పొంతన లేని ప్రశ్నను రిపోర్టర్ సంధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైనా... ‘‘మీ ప్రశ్న ఎలా ఉందంటే... మీరు భార్యతో కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? లేదా మరెవరితోనైనా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? అన్నట్టుగా ఉంది. 11 ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్నాను. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని ఆ విలేకరికి రైనా గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చాడు. బీసీసీఐ నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా’’ అని రైనా చెప్పిన సమాధానంతో ఆ రిపోర్టర్ షాక్ తిన్నాడట.

చిత్రహింసలు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య విషయంలో రోజుకో అంశం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు పోలీసులు. ప్రత్యూష శరీరంపై ఆమెను చిత్రహింసలకు గురి చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ క్రమంలో సదరు చిత్రహింసలు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు.  అంతేకాక ఈ విచారణకు సాక్షులుగా హాజరైన పలువురు కూడా ఇదే వాదనను వినిపించారు. నిత్యం ప్రత్యూష, రాహుల్ ల మధ్య వాగ్వాదం జరిగేదని కోర్టుకు తెలిపారు. ప్రత్యూషను మానసికంగానే కాక శారీరకంగానే రాహుల్ బాధ పెట్టేవాడని కూడా వారు పేర్కొన్నారు. దీంతో కోర్టు రాహుల్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా రాహుల్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని తరపు లాయర్ కూడా తాను కేసు వాదించనని.. రాహుల్ ఇంకా కొన్ని విషయాలు తనకు చెప్పకుండా దాస్తున్నాడని అన్నాడు.

షార్టులు వేసుకురావద్దన్న ప్రొఫెసర్.. మరుసటి రోజు అమ్మాయిలందరూ షార్టుల్లో

  ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో ఏదో ఒక వివాదంపై ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది. హెచ్ సీయూ, జెఎన్యూ, రీసెంట్ గా శ్రీనగర్ నిట్ తాజాగా బెంగళూరులోని లా యూనివర్శిటీలో మరో వివాదానికి తెర పడింది. ఈయూనివర్శిటిలో విద్యార్థినులకు, ప్రొఫెసర్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఒక అమ్మాయి తరగతికి షార్ట్ వేసుకొని వచ్చినందుకు ప్రొఫెసర్ సదరు విద్యార్ధినిని ఆక్షేపించారు. దీంతో ఆ అమ్మాయికి మద్దతుగా..మరుసటి రోజు తరగతి గదిలోని అమ్మాయిలందరూ షార్టులతో వచ్చారు. ప్రొఫెసర్ తీరును వ్యతిరేకిస్తూ.. తామేసుకున్న దుస్తుల గురించి కామెంట్లేంటని, తాము ఎలాంటి దుస్తులను వేసుకోవాలన్నది ఆయనకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీలో ప్రొఫెసర్ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించిన విద్యార్థినులు ఇండిపెండెంట్ కమిటీని వేసి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ ప్రొఫెసర్ స్పందిస్తూ, తాను చేసింది మంచి పనేనని, దర్యాఫ్తునకు సిద్ధమని, విచారణలో భాగంగా ఏం అడిగినా సమాధానం చెబుతానని అంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ మొట్టికాయలు.. ఆ మాత్రం తెలియదా..

  తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులచేత మొట్టికాయలు తినడం అలవాటే. ఈసారికూడా సుప్రీం చేతిలో మొట్టికాయలు తినే పరిస్థితి వచ్చింది. ఇరు రాష్ట్రాలు విడిపోయిన తరువాత పలు శాఖలకు సంబంధించి అనేక వివాదలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల వివాదం అయితే ఎప్పటినుండో కోర్టు చుట్టు తిరుగుతోంది. అయితే ఇప్పుడు ఏపీ స్థానికత ఉండి, తెలంగాణ విద్యుత్ విభాగంలో ఉద్యోగులుగా ఉన్న వారికి ఊరటను కలిగిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ, ఏపీ స్థానికతగా ఉన్న ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు వేతనాలు చెల్లించడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు తెలంగాణాలో ఉన్నంత కాలం, తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు గతంలో ఈ వ్యవహారంలో.. రెండు రాష్ట్రాలు కలిసి ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని.. బకాయిలు రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా సుప్రీం కొట్టేసి ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే, అక్కడి ప్రభుత్వమే జీతం ఇవ్వాలని, అది కూడా తెలియకుండా ప్రభుత్వం ఎలా నడుపుతున్నారని తెలంగాణ సర్కారును చీవాట్లు పెట్టింది.

అరెస్ట్ వారెంట్ పై సుజనా.. డిఫాల్ట్ కు, ఫ్రాడ్ కూ తేడా ఉంది

  కేంద్ర మంత్రి సుజనా చౌదరికి నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మారిషన్ బ్యాంకు నుండి కోట్ల రూపాయలు రుణం తీసుకొని కట్టని నేపథ్యంలో బ్యాంకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన కోర్టు సుజనాకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన సుజనా.. తాను భారత చట్టాలను అమితంగా గౌరవించే వ్యక్తుల్లో ఒకడినని, కోర్టులను గౌరవిస్తానని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లానని, తనకు సంబంధం లేని కేసు ఇదని తెలిపారు. సదరు కంపెనీలో తనకు ఒక్క శాతం కన్నా తక్కువ వాటానే ఉందని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోలేదని తాను చెప్పడం లేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, డిఫాల్ట్ కు, ఫ్రాడ్ కూ ఎంతో తేడా ఉందని అన్నారు. మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

85 విమానాలు.. 25 వేలమంది ప్రాణాలు గాల్లోనే

కోల్ కతా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదం తప్పిపోవడం వల్ల దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అసలు సంగతేంటంటే.. కోల్ కతా విమానాశ్రయంలోని ఏటీసీ టవర్. ఇక్కడి నుండి మొత్తం 85 విమానాలు గాల్లో ఎగురుతూ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సంబంధాలు పెట్టుకుని ఉన్నాయి. వీటిలో దాదాపు 25 వేలమంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఏటీసీతో అన్ని విమానాలు ఒక్కసారిగా సంబంధాలూ తెగిపోయాయి. రాడార్లు పనిచేయడం మానేశాయి. వీహెచ్ఎఫ్ (వెరీ హై ఫ్రీక్వెన్సీ) లింకులు తెగిపోయాయి. దీంతో పది నిమిషాల పాటు అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.  ఏటీసీ సెంటర్ లో పనిచేస్తున్న 35 మంది కంట్రోలర్లు ఈ సమాచారాన్ని దగ్గరి విమానాశ్రయాలకు చేర్చేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. "ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎక్కడ ఏ అనర్థం జరుగుతుందోనని భయం. ల్యాండ్ లైన్లు కూడా పనిచేయలేదు. కానీ అదృష్టవశాత్తూ నాగపూర్, వారణాసి ఏటీసీలను కాంటాక్టు చేసి పైలట్లకు సమాచారాన్ని ఇవ్వగలిగాం" అని ఓ కంట్రోలర్ తెలిపారు. పరిస్థితి ఇంకొంచెం అదుపుతప్పినా భయంకర విమాన ప్రమాదాలు చూడాల్సి వచ్చేదని ఓ కంట్రోలర్ తీవ్ర ఆందోళన మధ్య వ్యాఖ్యానించారు.

మమతాపై మోడీ ఫైర్.. రాష్ట్రాన్ని కాపాడాలి

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీ పై మండిపడ్డారు. కోల్‌కతా ఫ్లైఓవర్ కూలిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.. ఇది చాల బాధాకరమైన విషయం.. కేవలం అవినీతి వల్లే కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రమాదం జరిగిందని అన్నారు. టీఎంసీ.. టెర్రర్, హత్యలు, అవినీతి సంస్థగా మారిందని..టీఎంసీ అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈ ఘటన ద్వారా దేవుడు ఓ సందేశం పంపించారన్నారు. అంతేకాదు ఘటనా స్థలాన్ని చూడటానికి వచ్చిన మమతా బెనర్జీ.. జరిగిన ప్రమాదం గురించి మాట్లాడకుండా.. రాజకీయాల గురించి మాట్లాడారని.. ఎంతసేపు ఆమె దృష్టి పదవిపైనే కానీ.. చనిపోతున్న వారు ఆమెకు కనిపించలేదు అని మోడీ విమర్శించారు.

ఇకనుండి ఐఐటీ ప్రవేశాల కోసం ఇంటర్ వెయిటేజీ రద్దు..

  జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ ఫీజులను కేంద్రం ఒక్కసారిగా అమాంతం పెంచిన సంగతి తెలిసిందే. ఏడాదికి 90 వేలు ఉన్న ఫీజును ఏకంగా రూ. 2 లక్షలకు పైగా పెంచింది. అయితే ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్‌ఆర్‌డీ) మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకూ అమలు చేస్తున్న ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పద్ధతి 2017 నుండి అమలుకానున్నట్టు తెలిపారు హెచ్‌ఆర్‌డీ అధికారులు.  2017 నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే నేరుగా జేఈఈ ర్యాంకులను కేటాయించనున్నట్లు.. జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలని లేదా టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వంలోకి చాగంటి కోటేశ్వరరావు

తన ప్రవచనాలతో ప్రజల్లో ఆధ్మాత్మిక చింతనను నెలకొల్పుతున్న ఉపన్యాస చక్రవర్తి,బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుదైన గౌరవం కల్పించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చాగంటి ప్రవచనాలు తెలుగు ప్రజలను ముందుకు నడిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సమాజ హితం కోసం ఆయన సలహాలు ప్రభుత్వానికి అవసరమని ముఖ్యమంత్రి కొనియాడారు.

ఎన్ఐఏ కు సాయపడింది పాకిస్థానీయులేనట..

పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు కమెండోలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రవాదులే అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చెబుతున్నా.. పాకిస్థాన్ నుండి వచ్చిన జిట్ బృందం మాత్రం అదంతా వట్టిదే అని.. అసుల ఈ దాడికి పాల్పడింది ఆ దేశానికి చెందినవారే అంటూ మాటమార్చుతున్నారు. అయితే అసలు దాడికి దిగింది పాకిస్థాన్ జాతీయులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎలా గుర్తించింది? అంత ఖచ్చితంగా పాకిస్థాన్ ఉగ్రవాదులే దాడి చేశారు అని చెప్పడానికి కారణం.. పాకిస్థాన్ కు చెందిన వారే ఎన్ఐఏ అధికారులకు ఫోన్లు చేసి ఉగ్రవాదులు ఎవరన్న విషయాలను వెల్లడించారట.   అసలు సంగతేంటంటే.. దాడి జరిగిన అనంతరం.. ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న పాక్ వంటకాల ప్యాకెట్లు, సెల్ ఫోన్ సంభాషణలు ఆధారంగా వారు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే చనిపోయిన నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను తమ వెబ్ సైట్ లో పెట్టిన ఎన్ఐఏ... వారి గురించిన వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరింది. దీనిలో భాగంగానే.. పలు వారికి పలు దేశాలతో పాటు పాకిస్థాన్ నుండి కూడా కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వారు ఉగ్రవాదులు ఎవరన్న విషయం అధికారులకు వెల్లడించారు. కానీ పాక్ మాత్రం వాటన్నింటిని తోసిపుచ్చి మరోసారి తన కపటబుద్దిని చూపిస్తూ.. అసలు ఎన్ఐఏ అధికారులు తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని చెప్పేసింది.