కేసీఆర్ ను ఆకాశానికెత్తిన కోమటిరెడ్డి.. టీ కాంగ్రెస్ లో కలకలం

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పైటు ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన.. అందరి ప్రశంసలు అందుకున్నారు. దేశంలోనే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మొద్దమొదటి వ్యక్తిగా.. అంతేకాకుండా.. ఏకధాటిగా మూడు గంటలు ప్రసంగం చేసిన వ్యక్తిగా కూడా కీర్తి గణించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన పపర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతిపక్షనేతలను కూడా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సాగు నీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా బాగుందని..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రస్తావించిన అంశాలకు కార్యరూపం ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే... కేసీఆర్ కు ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు.   అయితే కోమటరెడ్డి ప్రశంసించింది బాగానే ఉన్నా..ఆయన వ్యాఖ్యలపై టీ కాంగ్రస్ నేతల్లో గుబులు రేగుతుంది. ఇంత సడెన్ గా కేసీఆర్ ను పొగడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏ ఉద్దేశ్యంతో కోమటరెడ్డి కేసీఆర్ ను ప్రశంసించారో ఆయనకే తెలియాలి.

కేరళ కాంగ్రెస్‌లో కొట్లాట మొదలు

  ఇప్పటికే సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయిన కేరళ కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు మరో విఘాతం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లను కేటాయించే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధీరన్‌కి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలవడం కష్టమని ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు ఏ సీటు ఎవరికి అందించాలన్న దాని మీద కూడా కొట్లాటలు మొదలయ్యయి.   తన అనునాయులకే సీట్లను అందించాలని చాందీ పట్టుబడుతుండగా, సదరు సీట్లను వేరేవారికి ఇవ్వాలని సుధీరన్‌ వాదిస్తున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సోనియాగాంధి ఇరువురితో నేతలతోనూ సమావేశం అయినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో మీలో మీరే సమస్యను పరిష్కరించుకోండంటూ, రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న ఇతర పార్టీలు కూడా ఈ వివాదం పట్ల గుర్రుగా ఉన్నాయి. పొత్తుల ప్రకారం తమకి కేటాయించాల్సిన సీట్ల గురించి కూడా కాంగ్రెస్‌ కొట్టుకోవడంతో ఆ పార్టీలు విస్తుపోతున్నాయి. మొత్తానికి కేరళ కాంగ్రెస్ నేతలు పరాజయం వైపుకి నిదానంగా అడుగులు వేస్తున్నట్లున్నారు.

ట్రంప్ కు చాలా విషయాలు తెలియదు.. ఒబామా

  వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారని.. ఇలాంటి నాయకులను అమెరికా ప్రజలు ఎన్నుకోరని.. క్రమశిక్షణగల వారిని మాత్రమే ఎన్నుకోవలసిన అవసరం ఉందని, ఆ విష‌యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని ట్రంప్‌పై ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు చాలా విషయాలు తెలియవని.. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహన అవసరమని ఒబామా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని అన్నారు. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భిక్షగాడికి 65 లక్షల లాటరీ!

  అనంతపురానికి చెందిన 35 ఏళ్ల పొన్నయ్య కూలి పని చేసుకుంటే బతికేవాడు. అయితే ఆ మధ్య జరిగిన ఓ ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకోవడంతో, పొన్నయ్య బతుకు దుర్భరమైపోయింది. తన భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకునేందుకు ఏదో ఒక పని కోసమని పొన్నయ్య, కేరళలోని వెల్లరాడ అనే పట్నానికి చేరుకున్నాడు. అక్కడ కూడా ఏ పనీ దొరక్కపోవడంతో, బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టాడు. రోజంతా అక్కడా ఇక్కడా బిచ్చం ఎత్తుకుని, రాత్రివేళకి బస్టాండులో నిద్రపోయేవాడు. అలా పోగైన డబ్బుని ఇంటికి పంపేవాడు.   కాస్తో కూస్తో మిగిలిన డబ్బుతో లాటరీ టికెట్లను కొనుక్కునేవాడు. ఆ వ్యసనమే అతని పాలిట వరంగా మారింది. కేరళ ప్రభుత్వం నడిపే అక్షయ అనే లాటరీలో పొన్నయ్యకు 65 లక్షల రూపాయల లాటరీ తగిలింది. ఇంకా కన్సొలేషన్ బహుమతులు కింది మరో 90 వేలు కూడా దక్కాయి. దీంతో పొన్నయ్య సంతోషానికి అంతం లేకుండా పోయింది. లాటరీకి సంబంధించిన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసుకుని తన ఇంటికి బయల్దేరాడు పొన్నయ్య.

మళ్లీ జయలలితదే అధికారామా..!

త్వరలో తమిళనాడు సహా.. ఇంకా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో.. ఇండియా టీవీ - సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేల్లో తమిళనాడులో మళ్లీ జయలలితే అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా పశ్చిమ బెంగాలో లో కూడా మమతా బెనర్జీ అధికారం చేపట్టే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. తమిళనాడులో 234 సీట్లకు గాను జయలలిత 130 స్థానాల్లో గెలుపొందనుండగా డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 70 సీట్ల వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని మూడో కూటమి (వామపక్ష పార్టీలతో కలిపి)తో పాటు ఇతరులు 34 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీకి  ఒక్క సీటు కూడా దక్కదని తేల్చి చెప్పింది.

పాపం.. మళ్లీ రోజాకు బ్యాడ్ లక్

  రోజాకు టైం సరిగా ఉన్నట్టు కనిపించడంలేదు. హైకోర్టు తన సస్పెన్షన్ కొట్టివేసినా ప్రభుత్వం హైకోర్టు రెండో డివిజన్ లో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం పిటిషన్ పై కోర్టు మద్దతు తెలిపింది. అక్కడ చుక్కెదురైన రోజా.. మళ్లీ  ఈవిషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. పలు పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. రోజా పిటిషన్ పై విచారణ జరపకుండానే ముగించారు. అయితే విచారణకు సమయం లేదని.. సోమవారం పిటిషన్ పై విచారణ జరుపుతామని చెప్పారు. మరోవైపు తన పిటిషన్ విచారణ నేపథ్యంలో రోజా నిన్న ఢిల్లీలో వాలిపోయారు. విచారణ కోసం ఆమె ఆసక్తిగా ఎదురచూశారు. కానీ సుప్రీం మాత్రం రోజాకు షాకిస్తూ సోమవారం విచారిస్తామని చాలా కూల్ చెప్పింది. మరి సోమవారం ఏం జరుగుతుందో చూడాలి.

ఈడీ మళ్లీ షాకిచ్చిన మాల్యా.. మే నెలలో చూద్దాం..

  కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు ఓ ఝలక్కిచ్చారు. విజయ్ మాల్యాకు గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాల్సిందేనని నోటీసులు జారీ చేయగా దానికి ఆయన ఏప్రిల్ వరకూ గడువు కోరారు. దీంతో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి గడువు ఇస్తూ.. ఏప్రిల్ 2వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు తాను విచారణకు రాలేనని తేల్చి చెప్పారు.  తాను విచారణకు రాలేనని, మే నెలలో అయితే చూద్దామంటూ ఈడీకి సమాచారం పంపారట. ఆశ్చర్యం ఏంటంటే.. విచారణ తేదీలను దర్యాప్తు సంస్థలు నిర్దేశించాల్సి ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం విజయ్ మాల్యానే తనకు నచ్చినట్టు తేదీలను ఖరారు చేస్తున్నారు. దీంతో ఈడీ ఆధికారులు ఏం చేయాలో తెలియక లోలోపలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. కాగా వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేసిన విజయ్ మాల్యా ఇటీవలే నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పిన సంగతి విదితమే.

చిన్నారి పెళ్లికూతురిని హత్య చేశారా!

  చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు లోగిళ్లలో సైతం సందడి చేసిన నటి ప్రత్యూషా బెనర్జీ. ఈ నటి నిన్న ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. ప్రేమ వ్యవహారంలో విఫలమైనందుకు ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని తొలుత అందరూ భావించారు. కానీ ఈ విషయంలో ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌ మీద కొన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రత్యూషని రాహుల్‌ ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మృతి చెంది ఉందని వైద్యులు నిర్థరించారు. అయితే ఈ సందర్భంగా రాహుల్ చాలా ప్రశాంతంగా ఉన్నట్లు వినికిడి. పైగా ప్రత్యూష మృతదేహం మీద ఉరి వేసుకున్నట్లు ఉన్న ఆనవాళ్లు చాలా బలహీనంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎవరన్నా ఉరివేసుకుని మరణిస్తే సదరు వ్యక్తి నాలుక, కళ్లు బయటకు వస్తాయని.... ప్రత్యూష శరీరం మీద ఇలాంటి గుర్తులేవీ లేవని చెబుతున్నారు. పోలీసులు అనుమానాలను మరింత బలపరిచేలా ప్రత్యూష చెంప మీద గాయం కనిపిస్తోందనీ, ఆమె నోట్లోంచి రక్తం వచ్చినట్లు కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాహుల్‌తో జరిగిన పెనుగులాటలోనే ఆమె మరణించిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇది ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని ఆమె సహచర నటుడు అజాజ్ ఖాన్ కూడా ఆరోపిస్తున్నారు.

కేంద్రంపై చంద్రబాబు కారాలు, మిరియాలు.. ఘాటుగా లేఖ

రాష్ట్రం విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఒకపక్క తెలంగాణ రాష్ట్రం మిగులుబడ్జెట్ తో ఉండగా ఏపీ మాత్రం లోటు బడ్జెట్ తో మిగిలింది. అయితే ఏపీకి ఆర్ధిక సాయం అందిస్తామని చెబుతున్న కేంద్రం మాత్రం అప్పటినుండి ఇదిగో సాయం చేస్తాం.. అదిగో సాయం చేస్తాం అంటూ గడుపుతూ వస్తుంది తప్ప.. సరైన సాయం చేసింది లేదు. ఇప్పటివరకూ పావలా వంతు కూడా సాయం అందలేదు. ఇక మొదట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సర్దుకుపోయారు కానీ ఇప్పుడు మాత్రం కాస్త కేంద్రం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నట్టు తెలుస్తోంది.  ఈనేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కారును నిలదీసేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి ఘాటుగా లేఖ రాయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. ఈ రోజు జరిగే కేబినేట్ మీటింగ్ లో దీనిపై చర్చించి ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినేట్ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ-బీజేపీలు మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంపై సీరియస్ అయితే రెండింటి మధ్య ఉన్న మైత్రి ప్రమాందలో పడే అవకాశం ఉంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఒకే కారులో హరికృష్ణ, కొడాలి నాని.. ఏం విశేషం లేదన్న నాని..

  ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  విజయవాడలోని బందరు రోడ్డులో ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా హాజరయ్యాడు. దీంతో ఈ కార్యక్రమంపై మరింత దృష్టి ఏర్పడింది. హరికృష్ణతో కలిసి ఒకే కారులో వచ్చిన ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలన్నింటికి బ్రేక్ వేస్తూ నాని ముందే వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరుతో నిర్మిస్తున్న ఆస్పత్రి అందుకే హాజరయ్యా.. ఇంకా మా గురువు హరికృష్ణ ఆస్పత్రికి నిధులిచ్చారు.. అంతే తప్ప దీనికి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు.. నా రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని తెలిపారు.

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ.. 4న ప్రమాణ స్వీకారం

ఇన్ని రోజులుగా ఉన్న అనేక అనుమానాలకు బ్రేక్ పడుతూ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గత కొద్ది కాలంగా పీడీపీ-బీజేపీ పొత్తుపై పలు ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు వాటన్నింటిని తొలగిస్తూ ఏప్రిల్ 4వ తేదీన మెహబూబా ముఫ్తీ జమ్మూకాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నర్ ఎన్ఎన్ వోరాకు తెలిపారు. కాగా భార‌త్‌లో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న రెండో మ‌హిళగా మెహబూబా ముఫ్తీ రికార్డ్ సాధించారు. మొట్ట‌మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రి 'అన్వారా తైముర్'. ఈమె అస్సాం రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సుమారు 7 నెల‌లు విధులు నిర్వహించారు.

చిన్నారి పెళ్లి కూతురు నటి ఆత్మహత్య..

  చిన్నారి పెళ్లి కూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. హిందీలో 'బాలికా వధు'.. తెలుగులో చిన్నారి పెళ్లి కూతురిగా ప్రసారమయ్యే ఈ సిరియల్ లో ప్రత్యూష బెనర్జీ ఆనందీ పాత్రలో నటించింది. అయితే  ముంబయిలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి తరువాత తను పరారవ్వడం.. వేరే నటితో రిలేషన్ తో ఉండటం ఈ అనుమానాలకి దారి తీస్తున్నాయి. ఇంకా ప్రత్యూష  'బిగ్‌బాస్‌-7' రియాల్టీ షోలో కూడా ఆమె పాల్గొంది.

రష్యా అధ్యక్షులు... ప్రేమలో పడ్డారు!

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్యలుద్మిలీతో 2013లో పుతిన్‌ విడాకులు తీసుకున్నప్పటి నుంచీ, ఇలాంటి వార్తలు రావడం బహుశామూడోసారి. ఒకసారి జిమ్నాస్ట్ అలీనాతోనూ, మరోసారి బాక్సర్ నటాలియాతోనూ పుతిన్‌ పీకల్లోతుప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి చైనా వ్యాపారవేత్త వెండీతో ప్రేమలో పడ్డారని గుసగుసలువినిపిస్తున్నాయి. వెండీ మరెవ్వరో కాదు! మీడియా రాజుగా పేరు పొందిన రూపర్ట్ మర్డోక్‌ మాజీ భార్య.2013లో వెండీ, మర్డోక్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కాలంలో బ్రిటన్ మాజీ ప్రధానిటోనీ బ్లెయిర్‌తో వెండీ ప్రేమ గురించి అంతర్జాతీయ పత్రికలన్నీ పుంఖానుపుంఖాలుగా కథనాలువెలువరించాయి. మరోసారి సదరు పత్రికలకు కావల్సిన సరుకు అందేట్లే ఉంది!

భారత్‌ పరాజయం.. బంగ్లా కేప్టెన్‌కు పట్టరాని ఆనందం

  ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ ఓడిపోయినంత మాత్రాన, అవతలి జట్టు మీద కసి పెంచుకోవడం ఎంతవరకు సంస్కారం! తమను ఓడించిన ఇండియా, వెస్టిండీస్‌ చేతిలో భంగపడినందుకు... ఓ బంగ్లా ఆటగాడి ప్రతిస్పందన చూస్తే విషయం మనకే అర్థమవుతుంది. ముష్‌ఫికుర్‌ రహ్మాన్‌ బంగ్లా వికెట్‌కీపరే కాదు, టెస్టు క్రికెట్‌లో ఆ జట్టుకి నాయకుడు కూడా! గత వారం భారత్‌ చేతిలో బంగ్లా జట్టు తృటిలో ఓడిపోవడంతో, రహ్మాన్ మనసు గాయపడినట్లుంది. అందుకే నిన్న వెస్టిండీస్ చేతిలో భారత్‌ పరాజయం కావడం చూసి రహ్మాన్‌కు పట్టలేని సంతోషం వేసింది. ‘ఇండియా ఓడిపోయింది. ఈ ఆనందం పట్టలేకపోతున్నాను’ అంటూ మ్యాచ్‌ ముగిసిన వెంటనే రహ్మాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.   వెంటనే విమర్శల వెల్లువ మొదలైంది. ప్రత్యర్థులను గౌరవించడమే ఆటగాడి వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఒకరంటే, అసలు బుర్ర పనిచేస్తోంద అంటూ మరొకరు మండిపడ్డారు. దీంతో రెహ్మాన్‌ చేసిన చిమ్టా పనికి క్షమాపణ చెప్పక తప్పలేదు. తన మాటలు నొప్పించి ఉంటే క్షమించమనీ, తాను వెస్టిండీస్‌ జట్టు మీద అభిమానంతోనే ఇలాంటి ట్విట్టర్‌ను పోస్టు చేశానని నీళ్లు నమిలాడు. అయినా కూడా భారతీయ అభిమానులు ఊరుకుంటారా! ఇప్పటికిప్పుడు వెస్టిండీస్ జట్టు మీద అభిమానం ఎలా పొంగుకు వచ్చిందని దులిపిపారేశారు. భారతీయ అభిమానులను రెచ్చగొడితే ఏం జరుగుతుందో రెహ్మాన్‌కు ఈ దెబ్బతో తెలిసి వచ్చి ఉంటుంది.  

భారత్ మాతా కీ జై నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా..

  హెచ్ సీయూ, జెఎన్యూ వివాదాల తరువాత దేశ వ్యాప్తంగా వివాదమైన మరో అంశం ఏంటంటే భారత్ మాతాకీ జై నినాదం. ఈ నినాదంపై వివాదం ఏదో ఒక రకంగా.. ఎక్కడో చోట బయటపడుతూనే. ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని దరూల్ ఇఫ్తా దారుల్ ఉలూమ్ - డియోబంద్‌కు చెందిన ఇస్లామిక్ సెమినరీ ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన మెడ మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అని వ్యాఖ్యానించడంతో అసలు దుమారం రేగింది. అయితే దీనికి కొందరు ముస్లింల నుండి మద్దతు లభించినా.. కొందరు ముస్లింల నుండి మాత్రం వ్యతిరేకత లభించింది. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ నినాదంపై స్పష్టత కోరుతూ లేఖలు రాశారు. 'దారుల్ ఉలూమ్‌'కు చెందిన ఇస్లామిక్ సెమినరీ మత పెద్దలు ఈ లేఖలను పరిశీలించి.. ‘భారత్ మాతా కీ జై’ నినాదానికి ముస్లింలు దూరంగా ఉండాలంటూ ఫత్వా జారీ చేశారు. ఎందుకంటే ముస్లింల పవిత్ర ఖురాన్ ప్రకారం వారికి అల్లా ఒక్కడే దేవుడు.. అయితే భారత మాత ఓ దేవతా మూర్తి కావడంతో వారు విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి ఈ నినాదానికి దూరంగా ఉండాలని చెప్పారు. అయితే ఈ నినాదానికి దూరం కానీ.. జాతీయత, దేశ భక్తికి తాము వ్యతిరేకం కాదని ఇస్లామిక్ సెమినరీ స్పష్టం చేసింది. మరి ఈ ఫత్యా జారీ వల్ల ఎంత దుమారం రేగుతుందో చూడాలి.