ఏం చేస్తే ట్రైన్ ఆగుతుంది..దొంగల కొత్త రాబరీ స్కెచ్

  దొంగలు ఆప్‌డేట్ అవుతున్నారు..ఇంతకు ముందు ట్రైన్‌లలో దొంగతనాలు చేయాలంటే ప్యాసింజర్లలాగా రైలెక్కి  తర్వాత ఏ అటవీ ప్రాంతంలోనే చైన్ లాగి బీభత్సం సృష్టించి అందినకాడికి ఊడ్చుకెళ్లేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా తెలివి మీరుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద జరిగిన రైలు దొపిడీ. ట్రైన్ నడవడానికి ఆయువు పట్టైన సిగ్నల్ వ్యవస్థపై దొంగలు ఫోకస్ చేశారు. సిగ్నల్ పనిచేయకపోతే రైలు దానంతట అదే ఆగుతుందని తెలుసుకున్నారు.   కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ వెళ్తున్న బసవ ఎక్స్‌ప్రెస్‌ను దోచేయడానికి స్కెచ్ గీశారు. గార్లదిన్నెను దోపిడి స్పాట్‌గా డిసైడయిన దొంగలు అక్కడికి సమీపంలోని సిగ్నల్ వైర్లు కట్ చేశారు. యమస్పీడుగా వస్తున్న బసవ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌ సిగ్నల్ పనిచేయకపోవడం గమనించి ట్రైన్ ఆపారు. ఇంకేముంది బండి ఆగడం ఆలస్యం దొంగలు ఖుషీ చేసుకుంటూ ప్రయాణికుల కోచ్‌ల్లోకి చొరబడి రెచ్చిపోయారు. కత్తులతో బెదిరిస్తూ అందినకాడికి దోచుకున్నారు. తమ కొత్త ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో దొంగలు పండగ చేసుకుంటుండగా..దొంగల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

శ్రీనగర్ నిట్.. తెలుగు విద్యార్ధుల కష్టాలు.. ఉండలేకపోతున్నాం..

  టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ అయిపోయింది. వెస్టిండీస్ కప్ గెలిచింది. కానీ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిన నేపథ్యంలో మొదలైన అల్లర్లకు మాత్రం ఇంకా బ్రేక్ పడలేదు. ఈ గొడవలు కాస్త శ్రీనగర్ నిట్ వరకూ చేరారు. అయితే అల్లర్లో అందరి సంగతేమో కానీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు మాత్రం అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే.. టీ 20 వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే క్యాంపస్లో పాక్ జెండాలతో.. భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక విద్యార్దులకు.. స్థానికేతర విద్యార్ధులకు మధ్య ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలతో క్యాంపస్ అట్టుడికిపోవడంతో గత శుక్రవారం క్యాంపస్ ను మూసేశారు. తిరిగి మంగళవారం తెరిచారు. అయినా, ఉద్రిక్తతలు చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే స్థానికేతర విద్యార్థులు మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశారు. క్యాంప్‌సలోని వాతావరణం తమను తీవ్రంగా భయపెడుతున్నదని, తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని అనుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు స్వస్థలాలకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున వారిపై దాడి చేసి.. లాఠీఛార్జ్ కూడా చేయడంతో దాదాపు 50 మందికి పైగా గాయాలయ్యాయి.     మరోవైపు శ్రీనగర్ లో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కరువైందని ఆరోపణలు వెల్లువెత్తాయి.శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో స్థానికేతర విద్యార్థులపై లాఠీచార్జ్‌పై కేంద్రం సీరియస్‌ అయింది. ఈ ఘటనపై విచారణ జరపాలని జమ్మూకశ్మీర్‌ సీఎంకు కేంద్ర హోంమంత్రి సూచించారు. నిట్‌ క్యాంపస్‌లో భారీగా బలగాలను మోహరించారు. శ్రీనగర్‌ నిట్‌ క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అంతేకాదు పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించారు.  కాగా మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 120 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నాయి.  

ఎల్‌కే అద్వానీకి సతీ వియోగం..

  బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి సతీ వియోగం కలిగింది. ఎల్‌కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. చాలాకాలంగా కమలా అద్వానీ వీల్‌చైర్‌పైనే ఉంటున్నారు. అంతేకాదు ఆమె మతిమరుపుతో కూడా సతమతమవుతున్నారు. ఈనేపథ్యంలోనే నిన్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1965లో వివాహమైన అద్వానీ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.     మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని మోడీ కమల అద్వానీ మృతి పట్ల సంతాపం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా అంత్యక్రియలను  గురువారం సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నారు.

'వాడెబ్బ' అన్న జేసీ.. జగన్ కు సారీ

ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జేసీ బ్రదర్స్ నైజం. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. తమకు ఏది అనిపిస్తే అది.. ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని జేసీ దివాకర్ రెడ్డి మొదటి సారి సారీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే.. జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్యామ్‌కు గండి పడిందని, నీళ్లు నిలిచే పరిస్థితి లేదని.. వెల్లువలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తారని ఆయన అన్నారు. తండ్రిని చూపడం కాదు, తానేమిటో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే జగన్‌ను 'వాడెబ్బ' అంటూ జెసీ సంభోదించి నోరు జారారు. దీంతో గమనించిన జేసీ వెంటనే సారీ సారీ సారీ అంటూ, దాదాపుగా లెంపలేసుకున్నంత పని చేశారు. మా వాడు అన్న భావనతోనే అన్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని, జగన్ దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ... మీరు కూడా తప్పుగా రాయవద్దని కోరారు. మొత్తానికి మొదటిసారి జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పారు. మరి దీనికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీదున్న గౌరవమా లేక జగన్ అంటే భయమా.. ఆయనకే తెలియాలి

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు కోర్టు ఆదేశం.. వేరే ఎక్కడైనా ఆడుకోండి..

  టీ 20 ప్రపంచ కప్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు అభిమానులకు ఐపిఎల్ ఫీవర్ పట్టుకుంది. అయితే ఈ ఐపిఎల్ గురించి అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఒక్క మహారాష్ట్రం మాత్రం తమ రాష్ట్రంలో ఐపిఎల్ నిర్వహించొద్దని తేల్చిచెప్పింది. ఈనేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రజలు ఇప్పటికే నీటితో కటకటలాడిపోతుంటే ఐపీఎల్ మ్యాచ్ ల కోసం పిచ్ ల తయారీ, ఇతర అవసరాలకోసం నీటిని వృధా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మహారాష్ట్ర ప్రజలకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఇప్పటికే నీటి సమస్యతో ఉన్న మహారాష్ట్ర ప్రజలపై తాము కూడా సానుభూతితో ఉన్నామని..  వీలైతే నీళ్లు ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు మ్యాచ్ లను తరలించమని హైకోర్టు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు సూచించింది. అయితే దీనికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఈ మ్యాచ్ ల కోసం తాము కొనుగోలు చేసి ఉపయోగించనున్న నీరు త్రాగటానికి పనికొచ్చేది కాదని కోర్టుకు తెలిపింది.  అయినా కూడా కోర్టు సంతృప్తి చెందలేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

డ్రైవర్‌లేకుండా మెట్రో రైలు.. పట్టాలెక్కేందుకు సిద్ధం

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుకు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించిన సంగతి తెలసిందే. ఇప్పుడు మరో సరికొత్త రైలు పట్టాలెక్కనుంది. డ్రైవర్‌లేకుండా నడిచే మెట్రో రైలు దిల్లీలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ‌(డీఎంఆర్‌సీ) ఈ రైలును ప్రవేశపెట్టనుంది. పలు ఆధునిక ఫీచర్లతో ఈ ఏడాది చివరికల్లా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు డీఎంఆర్‌సీ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన భాగాలను దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి తెప్పించింది. ఇంకా ఈ రైలులో సీసీటీవీ, యూఎస్‌బీ పోర్ట్‌లతో పాటు పలు సదుపాయాలు ఉంటాయి.

సీలింగ్ ఫ్యాన్లు తీసేస్తే ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతాయా?

చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్ర‌త్యూష బెన‌ర్జీ ఆత్మ‌హ‌త్య‌తో యావ‌త్ దేశం మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చించుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు సూచ‌న‌లు చేస్తున్నారు. ఇలాంటి విష‌యాల్లో ముందుండే బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించడానికి త‌న‌దైన స్టైల్లో సూచ‌న‌లు చేసింది. మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించాలంటే ముందు ఇళ్ల‌లో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాల‌ని కోరింది. ఈ విష‌యాన్ని మీడియా ముఖంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి విజ్ఞ‌ప్తి చేసింది. కూతుళ్లు, సోద‌రీమ‌ణులు, కోడ‌ళ్లు సీలింగ్ ఫ్యాన్ల‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వీటికి బ‌దులు టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి అంటూ సూచించింది. అయినా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌నుకునే వారికి సీలింగ్ ఫ్యాన్లు ఒక్క‌టేనా ప్రాణం తీసుకోవడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి.

క్షమాపణకు సిద్దమైన రోజా..

  ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముగిసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యలు మాట్లాడుతూ.. రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నాం.. త్వరలో స్పీకర్ కు నివేదకి అందజేస్తామని తెలిపారు. ఇంకా రోజా.. అనితపై నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. అనిత మనసు గాయపడితే క్షమాపణలు చెప్పడానికి సిద్దమని చెప్పినట్టు తెలుస్తోంది.   కాగా టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యో రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన సంగతి తెలిసిందే. గతంలో రెండుసార్లు అవకాశం ఇచ్చినా కమిటీ ముందుకు రాని రోజాకు మరో అవకాశం ఇచ్చారు. అయితే గతంలో కమిటీకి హాజరుకాని రోజా.. హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన కారణంగా ఈసారి మాత్రం కమిటీకి హాజరయ్యారు.

బ్రతికుండగానే ప్రిన్సిపాల్ కు సమాధి కట్టిన విద్యార్ధులు..

కేరళలోని పలక్కాడ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఓ ప్రిన్సిపాల్ కు సమాధి కట్టారు. వివరాల్లోకి వెళితే.. పలక్కాడ్ లో గవర్నమెంట్ విక్టోరియా కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎన్ సరసు గత మార్చి 31న ఈ కళాశాలకి వచ్చారు. అయితే ప్రిన్సిపాల్ గా ఆఖరి రోజు కావడంతో కళాశాలకు వచ్చిన ఆమెకు దిమ్మతిరిగే షాకిచ్చారు విద్యార్ధులు. అలా కాలేజీ ఆవరణలోకి అడుగుపెట్టిన ఆమెకు అక్కడ సమాధి ఒకటి కనిపించింది. ఇది ఎవరి సమాధి అని అక్కడి విద్యార్ధులను అడుగగా.. వారు మీదే అని చెప్పారు. దీంతో ఆ సమాధానం విన్న ఆమె నిర్ఘాంతపోయారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'తరగతులను బహిష్కరించేందుకు, నిరసన తెలిపేందుకు ఎస్ ఎఫ్ఐ విద్యార్థులకు నేను అనుమతి ఇవ్వలేదు.. కాలేజీలు ఈవెంట్లు, నిరసనల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా అమలు చేశాను.. అందుకే దానికి ప్రతీకారంగా నాకు ఈ బహుమతి ఇచ్చారు అని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో విద్యార్ధులు మాత్రమే కాదు.. లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉంది' అని తెలిపారు. ప్రిన్సిపాల్ సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

లోకేష్ పోటీ చేసేది ఇక్క‌డి నుంచే..

  టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టేందుకు అన్ని క‌లిసి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న లోకేష్ ను ఎలాగైనా కేబినెట్ లోకి తీసుకోవాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి మంత్రిని చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తే లోకేష్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేడ‌ని ఇలా దొడ్డి దారిన మంత్రిని చేశారనే విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బాబు ఊహించారు.   ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు రెండు ప్ర‌శ్న‌ల‌కు ఒకేసారి స‌మాధానం చెప్పాల‌ని డిసైడ్ అయిన టీడీపీ అధినేత త‌న‌యుడి కోసం నియోజ‌క‌వ‌ర్గాన్ని రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారంట‌. కృష్ణా జిల్లా పెన‌మలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్ తో పోటీ చేయించాల‌ని బాబు వ్యూహం వేశారని ప‌చ్చ కండువాలు గుస‌గుస‌లాడుతున్నాయి. పెన‌మ‌లూరు బెజ‌వాడ‌ను ఆనుకుని ఉంటుంది. అక్క‌డ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంతో పాటు టీడీపీ బ‌ల‌మైన బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. అదీ కాక ఆ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌.  స్థానిక ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కూడా తాను లోకేష్ కోసం రాజీనామా చేస్తాన‌ని ఇంత‌కు ముందే ప్ర‌క‌టించారు. ఇన్ని అనుకూల‌త‌లు ఉండ‌బ‌ట్టే ఏపీ సీఎం పెనమ‌లూరుని ఎంపిక చేసిన‌ట్టున్నారు.

ద‌గ్గుబాటి సురేశ్ కి టీడీపీ టిక్కెట్

  రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన స్థానాల‌కు గానూ వ‌చ్చే జూన్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశ వ్యాప్తంగా జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల‌న నుంచి మొత్తం 6 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఖాళీలున్నాయి. తెలంగాణ‌లో ఉన్న ఖాళీల‌ను టీఆర్ఎస్ ద‌క్కించుకోనుండగా..ఇక ఏపీలో ఉన్న స్థానాల‌ను మూడు టీడీపీ, ఒక‌టి వైసీపీకి ద‌క్క‌నున్నాయి. రాజ్య‌స‌భ టిక్కెట్లు కేటాయింపు తెలుగు దేశానికి క‌త్తిమీద సాముగా త‌యారైంది. చాలా మంది రాజ్య‌స‌భ టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే వీట‌న్నింటిలోంచి  ఒక వార్త ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.   టాలీవుడ్ అగ్ర నిర్మాత‌, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ద‌గ్గుబాటి సురేష్ ని టీడీపీ త‌ర‌పున పెద్దల స‌భ‌కు పంపిస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ద‌గ్గుబాటి కుటుంబం తొలి నుంచి టీడీపీతో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తోంది. రామానాయుడు బాప‌ట్ల నుంచి తెలుగు దేశం త‌ర‌పున లోక్ స‌భకు ఎంపిక‌య్యారు. సురేశ్ కి కూడా చంద్రబాబుతో సత్సంబంధాలున్నాయి. దానితో పాటు సినిమా   ఇండ‌స్ట్రీని కూడా త‌న వైపు తిప్పుకోవ‌డానికి సురేశ్ ను రాజ్య‌స‌భ‌కు పంపితేనే బెట‌ర‌నే ఆలోచ‌న‌లో ఉన్నారని టాక్. మ‌రి టీడీపీ అధినేత మైండ్ గేమ్ ఎలా ఉంటుందో.

రాహుల్ గురించి ప్రత్యూషకు తెలిసిన నిజం.. అదేనా..?

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో.. ఈ ఘటనకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త అంశం వెలుగుచూసింది. ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు రాహుల్ సింగ్ పైన పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యూష ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. రాహుల్ ప్రత్యూషను మోసం చేశాడని.. తన ఆస్తిపాస్తుల గురించి ప్రత్యూషకు అబద్దం చెప్పాడని..  ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. అంతేకాదు రాహుల్‌కు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడని.. ఈ మధ్యే ప్రత్యూషకు అసలు నిజం తెలిసిందని.. తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాహుల్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   మరోవైపు రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం రాహుల్ పరిస్థితి బాలేదని.. ప్రత్యూష నన్ను పిలుస్తోంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అతని తండ్రి తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాహుల్ పై ప్రత్యూష తల్లిదండ్రులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అతను డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. అంతేకాదు రాహుల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు బయటకొస్తాయో చూడాలి.

ఇండియాలో ఫేస్ బుక్కే కింగ్..

  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఫేస్ బుక్. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరి వ్యక్తుల మధ్య అనుసంధానంగా నిలుస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తో వస్తున్న ఫేస్ బుక్ అంటే అందరికీ మక్కువ ఎక్కువ. ప్రపంచంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకున్న ఈ ఫేస్ బుక్ మన దేశంలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ఐఎంఆర్బీ నిర్వ‌హించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మన దేశంలో ఫేస్‌బుక్‌ను.. ట్విట్టర్, యూట్యూబ్ కంటే 2.4 రెట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారని ఈ అధ్యయనంలో పేర్కొంది. అంతేకాదు 70 శాతం మంది స్మార్ట్ ఫోన్ ద్వారానే ఫేస్ బుక్ ను వాడుతున్నారని తెలిపింది. ఇక ఫేస్ బుక్ తర్వాత స్దానాన్ని మాత్రం వాట్సప్ ఆక్రమించింది.

జయలలితకు పోటీగా హిజ్రా..

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. ఇప్పటినుండే పార్టీలన్నీ ఎన్నికల బరిలో విజయం పొందడానికి వారి వారి ప్రయత్నాల్లో సమాయత్తమవుతున్నాయి. మరోవైపు పార్టీల్లోకి వచ్చే వాళ్లు వస్తున్నారు.. మారే వాళ్లు మారుతున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ గ్లామర్ ఫీల్డ్ కు సంబధించిన వారిని పార్టీల్లోకి తీసుకోవడంపై ఎక్కువ దృష్టిసారించిన నేతలు.. ఇప్పుడు హిజ్రాలకి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అమ్మగా భావించి.. రాజకీయరంగంలో చక్రం తిప్పుతున్న జయలలితపైనే పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. జయలలిత తమిళనాడులోని ఆర్కే నగర్ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజక వర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటికి సిద్దమైంది. సినీ దర్శకుడు సీమన్ పెట్టిన పార్టీ తరుపున ఆమె జయలలితకు పోటీ ఇవ్వబోతోంది. మరి జయలలితను అధిగమించి ఆమె గెలుస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికలు వరకూ ఆగాల్సిందే.

చైన్ స్నాచింగ్.. పసికందు మృతి.. ట్విస్ట్ తల్లే చంపిందా..?

  హైదరాబాద్ నగరం నేరేడ్ మెట్ లో చైన్ స్నాచర్లు ఓ మహిళపై దాడి చేయడం.. ఈ దాడిలో 25 రోజుల పసికందు చనిపోవడం తెలిసిందే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. ఆ పసికందును తల్లే చంపేసింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. వివరాల ప్రకారం.. నేరెడ్ మెట్ లో పూర్ణిమ అనే యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఆమెపై  చైన్ స్నాచర్లు దాడి చేశారు. ఈ పెనుగులాటలో ఆమె ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు కిందపడి మరణించింది. అయితే పోలీసుల మాత్రం తల్లే ఈ హత్య చేసిందని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన దానిపై పోలీసులు అనుమానించి ఆమె ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అబద్దం చెబుతున్నారని, తన కోడలు బయటకు వెళ్లినప్పుడు బంగారపు పుస్తెల తాడు ఉందని, ఆమె ఇంటికి వచ్చేసరికి లేదని తన మనవడు అంటే తమకూ ప్రేమేనని, కానీ తమ కోడలి పైన అభాండాలు వేయవద్దని అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

వాట్స్ యాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్..

వాట్స్ యాప్ యూజర్స్ కి ఓ గుడ్ న్యూస్. ఇక నుండి వాట్స్ యాప్ పూర్తి సురక్షితమైందని.. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ ప్లాట్ ఫాంలపై వాట్స్ యాప్ ను పూర్తి ఎన్ క్రిప్ట్ చేశామని, ఇక ఎవరు ఏం మెసేజ్ లు పంపుకున్నా మరొకరికి తెలిసే అవకాశాలు లేవని వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ వెల్లడించారు. ఇంకా జాన్ కౌమ్.. సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లకు మీ మెసేజ్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కనిపించవు. మేము కూడా తెలుసుకోలేమని వెల్లడించారు. అంత పటిష్ఠమైన భద్రతా వలయాల మధ్య నుంచి సమాచారం బట్వాడా అవుతుంది" అన్నారు. కాగా దేశంలో ఇప్పటికే 100 కోట్లమందికి పైగా వాట్స్ యాప్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

పదిమందిని బహిష్కరించిన విజయకాంత్.. కారణం ఆయన సతీమణా..?

  తమిళనాడు రాజకీయ పార్టీల్లో రోజుకో సరికొత్త అంశం చోటుచేసుకుంటుంది. అందునా డిఎండికె పార్టీలో రోజుకో ఆసక్తికరమైన అంశం తెరకెక్కుతోంది. డిఎండికె అధ్యక్షుడు అధినేత విజయ్ కాంత్ తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ముందు చెప్పినా.. ఆ తరువాత పిడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం ముందునుండి డీఎంకేతో పొత్తు పెట్టకోవాలని విజయకాంత్ కు చెప్పారంట. విజయకాంత్ మాత్రం వారి మాటలను తోసిపుచ్చి ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ఏమాత్రం సహించలేని పార్టీ నేతలు ఆయనను ప్రశ్నించారు. ఇందుకుగాను విజయకాంత్ అలా ప్రశ్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమందిని పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించారు. దీంతో డిఎండికె పార్టీలో మరోసారి ముసలం ఏర్పడింది. మరోవైపు విజయ్‌కాంత్‌ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన సతీమణి ప్రేమలత, ఆమె తమ్ముడు సుదీష్‌లేనని ఆరోపించారు.