కొల్లం ప్రమాదంపై అనుమానాలు.. మూడు కార్లనిండా బాంబులు..

  కేరళలోని  కొల్లం.. పుట్టంగళ్ ఆలయం సమీపంలో బాణసంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగి 100 మందికి పైగా ప్రాణాలు పోగా.. 400 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాదంపై కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. అదేంటంటే.. ఆలయం సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లును పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగినదగ్గరనుండి కార్లు అక్కడే ఉండటం గమనించిన పోలీసులు తనిఖీలు చేయగా.. కార్ల నిండా బాంబులు.. పేలుడు పదార్ధాలు ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా వారు బాంబులను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. మరోవైపు ఈప్రమాదం సహజంగా జరిగిందా.. లేక దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

అంబేద్కర్ భారీ విగ్రహాం ఇక్కడే?

రాజ్యాంగ నిర్మాత, దళిత జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అయితే అది ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయో అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఆర్ గార్డెన్ సమీపంలోని 36 ఎకరాల స్థలంలో ఈ విగ్రహాం ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు..పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కమిటీ తీర్మానించింది. ప్రపంచంలోనే అంబేద్కర్‌కు సంబంధించి ఎత్తైన విగ్రహాం కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న బాబాసాహెబ్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గర అంబేద్కర్ టవర్స్‌తో పాటు బోరబండలో దళిత్ స్టడీ సెంటర్‌ను ఏకకాలంలో నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.  

పవన్ గురించి జోస్యం చెప్పిన జ్యోతుల...

  నేడు జ్యోతుల నెహ్రూ వైసీపీ ని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని.. ఒక్కోసారి ఒక్కోమాట మాట్లాడుతుంటాడు.. అలాంటి ఆయన మాటలను నమ్మడం ఎలా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తాం.. కానీ ఆయన చెప్పే మాటలపై మాత్రం తమకు నమ్మకం లేదని అన్నారు. నిన్న ఒక మాట చెప్పి, ఆపై రేపు తాను చెప్పినదానికే భిన్నంగా వ్యాఖ్యానించడం ఆయన నైజమని విమర్శించారు. ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.

టీడీపీలో విబేధాలు.. ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి

  టీడీపీ పార్టీలో పార్టీ నేతల మధ్య విబేధాలు ఒకదాని తరువాత ఒకటి బయటపడుతున్నాయి. ఇప్పటికే అనంతలో జేసీ ప్రభాకర్ రెడ్జి, ప్రభాకర్ చౌదరి మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇప్పుడు వైసీపీ పార్టీనుండి వెళ్లిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య విబేధాలు బయటపడ్డాయి. గతంనుంటే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారారు.. ఒకే పార్టీలో ఉన్నా కూడా వీరిమధ్య సయోధ్య కుదరలేదు. ఈ నేపథ్యంలోనే రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యలయంలో మాట్లాడిన ఆయన ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీలో చేరేంత వరకూ బానే ఉన్నా.. చేరిన తరువాత ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని.. తమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు తనను, సీఎం రమేష్ ను ఆహ్వానిచంవద్దని.. ఆదినారాయణరెడ్డి అనుచరులు కార్యకర్తలను బెదిరిస్తున్నారని.. వారు వినకపోవడంతో ఇళ్ళపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించారు. లోపల ఒకటి పెట్టుకొని.. బయటకు ఒకటి నటించే ఆదినారాయణ రెడ్డి తన ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

బిల్ కలెక్టర్‌లా పన్ను వసూలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా జనగాం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనదైన స్టైల్లో ప్రజాసేవ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన బిల్ కలెక్టర్ అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే స్వచ్ఛ చేర్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా పంచాయతీకి 3.86 లక్షల మొండి బకాయిలు రావాల్సి ఉందని తేలింది. వీటిని రాబట్టడంలో పంచాయతీ అధికారులు విఫలమయ్యారు.   ఈ విషయం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. వెంటనే గ్రామ సర్పంచ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి స్వయంగా తానే రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌లా మారారు. ప్రజాప్రతినిధులను, పోలీసులను వెంటబెట్టుకుని ఒక్కో దుకాణం వద్దకూ వెళ్లి దుకాణ యజమానుల ముక్కుపిండి మరి పన్నురాబట్టారు. అవి చెల్లించని వారి షట్టర్లకు తాళాలు వేయించారు. ఇలా రెండు గంటల్లో ఏకంగా 70 వేల రూపాయలు వసూలు చేశారు. మిగిలిన సోమ్మును తానే వసూలు చేసి ఇస్తానని పంచాయతీకి హామీ ఇచ్చారు. మన ఎమ్మెల్యేగారి పట్టుదలను ప్రజలు మెచ్చుకుంటున్నారు.  

కరుణానిధి వరాలు ఇవే..

  తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఏపార్టీ, ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి.. ఎవరు ఏ నియాజక వర్గం నుండి పోటీ చేయాలి అని ఇప్పటికే అంతా సిద్దమైపోయింది. దీనిలో భాగంగానే నేతలు ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి.. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏరకంగా మేనిఫెస్ట్ తయారుచేయాలో కూడా చేసేవారు. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధి తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో కరుణానిధి ప్రజలకు ఇచ్చిన వరాల వివరాలు..   * ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ * టీఏఎస్ఎంఏసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కల్పన * విద్యార్థులకు ఉచిత నెట్ * నమాజ వార్ పథకం ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేయడంలో శిక్షణ * సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ప్రారంభం * రైతులకు కనీస మద్దతు ధర * ప్రొహిబిషన్ చట్టం అమలు * కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమిళం అధికారిక భాషగా ప్రవేశపెట్టడం * ప్రసూతి సెలవులు 9 నెలలకు పెంపు * లోకాయుక్త ఏర్పాటు * కొత్త పారిశ్రామిక వేత్తలకు రూ.లక్ష పెట్టుబడి * అన్ని జిల్లాల్లో ఉపాధి కేంద్రాలు * 750 చేనేత యూనిట్లకు ఉచిత విద్యుత్ * రేషన్ కార్డు లేనివారికి పదిహేను రోజుల్లో స్మార్డ్ కార్డు * అన్న ఉనావగమ్ ప్రారంభం * ప్రత్యేక నీటి పారుదల శాఖ * వరదల నివారణకు 200 ప్రత్యేక చెక్ డ్యాములు * మధ్యాహ్న భోజనంలో ఉచిత పాల పథకం * అన్ని రకాల పరువునష్టం కేసులు వెనక్కి * కుడాంకుళం ప్రాజెక్టుకు సంబంధించి పెట్టిన కేసులన్నీ రద్దు * శాసన మండలి ఏర్పాటు * విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ * పాఠశాలల్లో అన్ని ఖాళీల భర్తీ * నెలకు 20 కేజీల ఉచిత బియ్యం * ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు * నాలుగో పోలీసు కమిషన్ ఏర్పాటు * స్వచ్ఛ తమిళనాడుగా మార్పు * జల్లికట్టు కొనసాగింపునకు కృషి * పేదల గృహనిర్మాణాలకు రూ.3లక్షల సబ్సిడీ * సబ్సిడీ ధరల్లో మొబైల్ ఫోన్లు

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల దారుణహత్య

ఆస్ట్రేలియా, అమెరికా , జర్మనీ, బ్రిటన్ ఇలా దేశమేదైనా భారతీయులపై ప్రతిరోజు వివిధ దేశాల్లో దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఉక్రెయిన్ వచ్చి చేరింది. ఉక్రెయిన్‌లో ఇద్దరు భారతీయ విద్యార్ధులు దారుణ హత్యకు గురికాగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. భారత్‌కు చెందిన ప్రణవ్ శాండిల్య, అంకుర్ సింగ్, ఇంద్రజిత్ చౌహన్‌లు ఉక్రెయిన్‌లోని ఉజ్‌గొరొడ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు. నిన్న ఉక్రెయిన్ జాతీయులు భారతీయ విద్యార్ధులపై కత్తులతో దాడి చేసారు. ఈ దాడిలో ప్రణవ్, అంకుర్ సింగ్‌లు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..ఇంద్రజిత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి మరణాన్ని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

మరో అవార్డు సొంతం చేసుకున్న మథర్ థెరిస్సాకు

  40 సంవత్సరాలపాటు తన జీవితాన్ని సేవకు అంకింత చేసిన నోబుల్ బహుమతి గ్రహీత మథర్ థెరిస్సాకు పారిస్ సెయింట్ హుడ్ హోదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకున్నారు మథర్ థెరిస్సా. ఆమెక ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డ్ లభించింది. సాధారణంగా ఈ అవార్డును అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ.. విజయాలను సాధించిన వారికి అందజేస్తారు. దాదాపు 2010 నుండి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించిన పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ ఏడాది కూడా ఈ అవార్డులను అందజేయనున్నారు. మొత్తం 14 విభాగాల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. థెరిస్సాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకోవటానికి ఇటలీ నుంచి శుక్రవారం లండన్ చేరుకున్నారు.

సెలవుపై మోడీకి లేఖ రాస్తా.. సుమన్

  మహాత్మ జ్యోతిరావు పూలే 189వ జయంతి సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, ఓయూజేఏసీ, తెలంగాణ విద్యార్థి సేఫ్టీ ఫెడరేషన్, బీసీ జేఏసీ, విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలేకు సముచిత స్థానం కల్పించాలని, ఆయన జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని అన్నారు. అంతేకాదు దీనిపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాస్తానన్నారు. ఇంకా హక్కుల సాధనకు బీసీలందరూ ఏకమై పోరాడాలని.. బీసీల సభలు ఎక్కడ జరిగినా ప్రతి బీసీ హాజరుకావాలని సూచించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు.. 11 మంది మృతి

  విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోయాయి. వివరాల ప్రకారం..విశాఖపట్నం ఎన్ఏడీ దరి బుచ్చిపాలేనికి చెందిన ఈదలాడ శ్రీను అనే వ్యక్తి తన కుటంబంతోపాటు, వదిన వారి పిల్లలతో కలిసి తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరాడు. అయితే నక్కపల్లి దగ్గరకు రాగానే కారు టైరు పగిలిపోవడంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ను గుద్దింది. ఈలోపు ఏం జరిగిందా అని ఆలోచించుకొనే లోపే భారీ పైపులతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోయి కారులో ఉన్నవారందరూ మృతి చెందారు. ముఖ్యంగా లారీ కారుని తొక్కుకుని వెళ్లడంతో, కారు ఇంజిన్‌కింద చిక్కుకుపోయి తుక్కుతుక్కయ్యింది. ఇందులోని వారంతా దుర్మరణం చెందడంతోపాటు శరీరభాగాలన్నీ మాంసపు ముద్దలైపోయాయి. అంతేకాదు చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులే ఉండటంతో ఆ ఘటన చూసినవారందరినీ కలిచి వేస్తుంది.

సాయిపూజ వల్లే మహారాష్ట్రలో కరువు -స్వరూపానంద

షిర్డీ సాయిబాబాపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరువు విలయ తాండవం చేస్తోంది దీనికి కారణం షిర్డీసాయిబాబా పూజా ఫలితమేనన్నారు. దేవుడిని పూజించవచ్చు కాని ఫకీరైన సాయిబాబాను పూజించడం ఏమిటని ప్రశ్నించారు. అందుకనే మరాఠా గడ్డ కరువు కాటకాలతో అల్లాడుతోందన్నారు. పూజకు యోగ్యత లేని వారిని పూజించిన చోట కరువు, వరదలు, చావు భయం లాంటివి మనుషులను వెంటాడుతుంటాయన్నారు. 94 ఏళ్ల స్వరూపానంద గతంలో పలుమార్లు సాయిబాబాని టార్గెట్ చేశారు. సాయిబాబా దేవుడు కాదని ఆయనను పూజించరాదని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దూమారం రేగడంతో పాటు ఆయనపై ఏకంగా కేసు నమోదైంది.  

నా భార్యకు 'భారత్ మాతాకీ జై' అని పేరు పెడతా.. కన్నయ్య కుమార్

  దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో జెఎన్ యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు కన్నయ్య తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో హాట్ ఏదంటే భారత్ మాతాకి జై వివాదం అని చెప్పొచ్చు. ఎవరో ఒకరు.. ఎక్కడో దగ్గర దీనిపై నోరు కదుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే కన్నయ్య కుమార్ కూడా ఈ నినాదంపై నోరు తెరిచాడు. తనకు పెళ్లయిన తరువాత తన భార్యపేరు 'భారత్ మాతాకీ జై' అని పెట్టుకోమని చెబుతానని.. తన పేరును కూడా అదే విధంగా మార్చుకుంటానని చెప్పారు. తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్ల పేరును ‘భారత్ మాతాకీ జై’ అని పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. మరి కన్నయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రభుత్వం ప్రయత్నించాలి..షిఫ్ట్ చేసుకోమనం సరికాదు.. ధోని

  మహారాష్ట్రలో నీటి సమస్య కారణంగా అక్కడ ఐపీఎల్ మ్యాచులు నిర్వహించవద్దని  ఓస్వచ్ఛంధ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు వేరే ఎక్కడైనా నిర్వహించుకోవాలని సూచించింది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచులు మహారాష్ట్ర నుంచి తరలించడం గురించి తాము పట్టించుకోమని, ప్రజలకు నీళ్లు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. దీనిపై మహేంద్ర సింగ్ ధోనీ స్పందించి.. నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో దానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం యత్నించాలని నీటి సమస్య చాలా కాలంగా ఉందని, దానిని పరిష్కరించేందుకు మంచి పరిష్కారం చూడాలి.. అంతేకాని మ్యాచులను షిఫ్ట్ చేసుకోమనం సరికాదని అన్నారు.

దుబాయ్ రికార్డును దుబాయే.. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తులో మరో భవంతి

  దుబాయ్ రికార్డును దుబాయే బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలో ఎత్తైన భవంతి ఏదంటే టక్కున దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనం గుర్తుకొస్తుంది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎమ్మార్ ఎంతో శ్రమించి 2,700 అడుగులు ఉన్న ఈ భవంతిని నిర్మించి ప్రపంచంలో ఎత్తైన భవంతిగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇప్పుడు అదే సంస్థ తమ రికార్డును తామే బద్దలు కొట్టేందుకు రంగంలోకి దిగింది. 2020 నాటికి బుర్జ్ ఖలీఫాను తలదన్నే రీతిగా మరో భవంతిని నిర్మిస్తామని ఎమ్మార్ చైర్మన్ మొహమద్ అలబ్బార్ చెప్పారు.  దాదాపు ఓ మిలియన్ డాలర్ల ఖరీదుతో కట్టనున్న ఈ నిర్మాణం ఎత్తు ఎంత అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా ఉండే ఈ నిర్మాణం ఎత్తు ఎంతన్న విషయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

తెలుగు సీఎంలపై పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చేయలేకపోతున్నారు.. కేసీఆర్ పై అదొక్కటే అసంతృప్తి

  పవర్ స్టార్ పవన కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సందర్భంగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికోసం చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారని.. కానీ ఆయన పక్కన ఉన్నావారు మాత్రం వ్యవస్థను ముందుకు సాగనీయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన తనలో ఉంది.. అలాగే చేయలేకపోతున్నా అనే బాధ కూడ ఉందని అన్నారు. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నుండి ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం తప్పుదారికి సంకేతం.. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది.. పదవి, అధికారం లేకుంటే ప్రజాసేవ చేసేందుకు వీలుండదా అని వ్యాఖ్యానించారు.   ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఓ ప్రణాళిక బద్దంగా వెళుతున్నారు.. ఆయన ఓ విజన్ తో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీలోకి నేతలు చేరడంపై ఆయన స్పందిస్తూ.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకోని పోవడం... నిజంగా అది అంత అవసరం లేదుకదా? అనిపిస్తుంది.. నాకు అదొక్కటే చంద్రశేఖరరావు ఆలోచనా విధానంపై అసంతృప్తి అని అన్నారు.

రియాలిటీ షో చేశాడు..ప్రాణం తీసుకున్నాడు

రియాలిటీ షోలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడంతో పాటు వారి ప్రాణాలు తీస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జలీల్ అనే యువకుడు రియాలిటీ షోను అనుకరించబోయి ప్రాణాలు తీసుకున్నాడు. పాతబస్తీలోని జాన్‌మాల్‌కు చెందిన 22 ఏళ్ల జలాలుద్దీన్‌కు రియాలిటీ షోలు చూడటమంటే ఇష్టం. ఆ షోలో స్టార్లు చేసినట్టే తాను చేసేవాడు. మొన్నామధ్య ఒక షోలో ఒక స్టార్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని చూసిన జలీల్ తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా తనకేమి కాదని స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. చెప్పినట్టుగానే స్నేహితుల ఎదుటే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఉన్న యువకుడు తర్వాత మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. జలీల్ ఒంటిపై నిప్పంటించుకున్న వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  

కేరళ కొల్లం ప్రమాదానికి అసలు కారణం అదేనట..

  కేరళ జిల్లాలోని కొల్లం సమీపంలో బాణసంచా కాలుస్తుండగా జరిగిన ప్రమాదంలో 112 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయాలయిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ బాణసంచా ప్రదర్శన ఇక చివరికి వచ్చినందన్న సమయానికి ఇంతటి ప్రమాదం జరిగింది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాన్ని గాయాలతో తప్పించుకున్న వినోద్ అనే యువకుడు చాలా స్పష్టంగా వివరించాడు. అతని మాటల్లో.. ఈ పేలుడుకు అసలు కారణం సన్ ఫ్లవర్ అనే వెరైటీ రాకెట్ కారణమట. ఈ రాకెట్ ను కాల్చినప్పుడు చాలా ఆకర్షణీయమైన వెలుగులు వస్తాయి.. వాటిని చూడటానికి అందరూ ఇష్టపడతారు.. ఈనేపథ్యంలోనే సన్ ఫ్లవర్ రాకెట్ ను కాల్చామని.. అయితే అది వెళ్లాల్సిన ఎత్తుకంటే చాలా తక్కువ ఎత్తులో వెళ్లింది.. అలా దాని దాని నిప్పురవ్వలు బాణసంచా ఉంచిన  ఓ మినీ వ్యాన్ లో పడ్డాయి.. అంతే అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే ఘోర ప్రమాంద జరిగిందని వివరించాడు.   ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉందనుకున్నవారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా త్రివేండ్రం ఆస్పత్రికి తరలిస్తున్నారు.