రోను తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

రోను తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 4 నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలు వెళ్లాలని అధికారులు సూచించారు.   మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకూ 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 15.5, రణస్థలం 13.8 వర్షపాతం నమోదైంది. ఇక తుపాన్‌ కారణంగా పాపికొండ వెళ్లవలసిన పర్యాటక బోటులు నిలిచిపోయాయి. పట్టిసీమ, పురుషోత్తమపట్నం గ్రామాల వద్ద గోదావరి ఒడ్డున పర్యాటక బోట్లు నిలిచిపోయాయి.

నగరంలో నలుగురు బాలికలు అదృశ్యం...

  హైదరాబాద్ నగరంలో బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్, చందానగర్ కు చెందిన నలుగురు బాలికలు స్వప్న (12), పద్మ (10), రేణుక (9), కావేరి (8) ఐదు రోజులుగా కనిపించకుండా అదృశ్యమయ్యారు. దీంతో బాలికల తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను ఎవరన్నా కిడ్నాప్ చేశారా.. లేక వారే ఎటైనా వెళ్లారా అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో స్వప్న అనే బాలిక ఇలాగే వెళ్లిపోయిందని.. మళ్లీ తిరిగొచ్చిందని.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అలాగే మిగిలిన బాలికలను కూడా తీసుకెళ్లిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో తెలియాలంటే వారు దొరికాల్సిందే.

సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఊమెన్ చాందీ..

  కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎల్డీఎఫ్ పార్టీ గెలుపొంది.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఊమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ పరాజయం పాలైంది. ఈనేపథ్యంలోనే ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న ఊమెన్ చాందీ ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ పి.సదాశివమ్ కు రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాగా కేరళలో మొత్తం 140 స్థానాలకి ఎన్నికలు జరగగా.. వాటిలో ఎల్డీఎఫ్ 91 స్థానాలలో, యూడీఎఫ్ 47 స్థానాలు, బీజేపీ ఒక స్థానం.. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

టీడీపీ మహానాడు.. రుచికరమైన మెనూ రెడీ..

  టీడీపీ అత్యంత ఘనంగా జరుపుకునే మహానాడు సభలు ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్ని మొదట హైదరాబాద్లో నిర్వహించాలని చూసినా ఆఖరికి ఏపీలోని తిరుపతిలో వేదిక ఖరారైంది. ఈ సభలకి టీడీపీ నేతలు, వేలాది మంది ప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతారు. అయితే ఈ సభలకి సంబంధించిన మెనూ అప్పుడే సిద్దమైపోయిందట. సభకు వచ్చే వారికి రుచికరమైన భోజనం అందించాలన్న నేపథ్యంలో దాదాపు 25 రకాల శాకాహార వంటకాలతో కూడిన మెనూను రెడీ చేశారంట. ఈ మెనూలో రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయట. రాయలసీమ సంగటి ముద్దలు, జొన్న రొట్టెలు, ఐదు రకాల చెట్నీలు, సగ్గుబియ్యంతో కూడిన బెల్లం పాయసం, అలసంద వడలు, కట్ బజ్జీలు, పనసకాయ బిరియానీ, పాలతాళికలు ఇలా పలు రకాల రుచికరమైన వంటకాలు చేయనున్నట్టు సమాచారం.

రెచ్చిపోయిన టీఎంసీ కార్యకర్తలు.. సీపీఐ కార్యాలయానికి నిప్పు..

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఎంసీ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు కొంతమంది అసన్సోల్ లో ఉన్న సీపీఐ(ఎం) కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో ఫర్నీచర్ దగ్ధమై పోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, కార్యాలయంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని, అయితే ప్రేక్షక పాత్రపోషించారని సీపీఎం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల్లో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఎవరెవరికి ఎన్ని స్థానాలు..

  ఐదు రాష్టాల్లోని ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు నుండి జయలలిత, పశ్చిమ బెంగాల్ నుండి మమతా బెనర్జీ ఇద్దరూ మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఇక కేరళలో కూడా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 91 స్థానాలు ఎల్డీఎఫ్ సొంతం చేసుకోగా.. యూడీఎఫ్ 47, బీజేపీ ఒక స్థానం.. ఇతరులు మరోస్థానంలో గెలిచాయి. ఇక సీఎం పీఠానికి సీపీఎం నేతలు విఎస్‌ అచ్యుతానందన్‌, పిన్రాయ్‌ విజయన్‌లు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.   ఇక పుదుచ్చేరిలో కూడా ఓట్ల లెక్కింపు ముగిసింది. 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. ఏఐఎన్ఆస్సీ 8 స్థానాల్లో, ఏఐఏడీఎంకే 4 చోట్ల విజయం సాధించగా, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది.   అంతేకాదు పశ్చిమ బెంగాల్ లో ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. తృణమూల్ కాంగ్రెస్ 212 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో విజయం సాధించగా, వామపక్ష పార్టీలు 31 స్థానాల్లో విజయ బావుటాను ఎగురవేశాయి. బీజేపీ 3 సీట్లకు పరిమితం కాగా, మరో నాలుగు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.   తమిళనాడులో కూడా ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఎఐఎడిఎంకే 126 స్థానాలలో విజయం సాధించగా డీఎంకే కూటమి 106 స్థానాలలో విజయం సాధించింది.   అసోంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 87 సీట్లు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 25, ఏఐయూడీఎఫ్ 13, ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధించాయి.  

కేటీఆర్ చెబుతానన్న సస్పెన్స్ న్యూస్ ఇదే..

  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు రోజుల క్రితం ట్విట్లర్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్లుండి అంటే ఈరోజు తానో బిగ్ న్యూస్ చెబుతానని.. అందరూ వెయిట్ చేయండని ట్వీటారు. ఇక అంతే అప్పటినుండి కేటీఆర్ చెబుతానన్న విషయం ఏంటబ్బా అని అటు సామాన్యా ప్రజల దగ్గర నుండి పార్టీ నేతల వరకూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక కొంతమందైతే తమకు నచ్చిన కథనాలు రాసేశారు. అయితే ఇప్పుడు అందరి సస్పెన్స్ కు తెర దించుతూ కేటీఆర్ ఆ విషయం చెప్పారు. కేసీఆర్ చేసిన ట్వీట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. "నేను చెప్పాలనుకుంటున్న బిగ్ న్యూస్ ఏంటని అడుగుతున్న వారికి నా సమాధానం ఇదే... 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే బిగ్ న్యూస్... నాక్కూడా తెలియదు" అని ట్వీట్ చేశారు. అంతేకాదు దీనికి సమాధానాన్ని తన స్నేహితుడు రానా దగ్గుబాటి వద్ద తెలుసుకోవాలని కూడా అన్నారు. మరి రెండురోజులు ఊరించి ఇప్పుడు ఈ న్యూస్ చెప్పిన కేటీఆర్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి కేటీఆర్ కూడా తనలో ఉన్న కామెడీ యాంగిల్ ను ఈరకంగా చూపించారన్నమాట.

చరిత్ర తిరగరాసిన అమ్మ... ముఫ్పై ఏళ్ల తరువాత

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చరిత్రను తిరగరాశాయి. ఇప్పటి వరకూ ఉన్న సంప్రదాయాన్ని ముక్కలు చేస్తూ మరోసారి అమ్మకే పట్టం గట్టారు తమిళవాసులు. ఎన్నికలు ముగిసిన రోజు నుండి ఈసారి డీఎంకే పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు. దానికి తోడు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈసారి జయలలిత నెగ్గడం కష్టమే.. డీఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుంది అని చెప్పగానే ఇక అందరూ డీఎంకేనే విజయం సాధిస్తుంది అనుకున్నారు. మరోవైపు ఓటు వేసిన అనంతరం జయలలిత ఆరోజు నుండి ఇప్పటివరూక ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో వెళ్లిపోయారు. అంతేకాదు రెండోసారి సీఎం పదవిపై కూడా తమిళనాడులో సంప్రదాయం ఉంది.. ఇక ఈరోజు ఓట్ల లెక్కింపు మొదలైన నేపథ్యంలో కూడా ముందు డీఎంకే ఆధిపత్యం చూసి ఇక ఆపార్టీదే గెలుపు అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏడీఎంకే పార్టీ గెలుపు సాధించింది. 1989 తర్వాత తమిళనాడులో వరుసగా రెండో సారి అధిక్యం సాధించిన పార్టీగా ఏఐఏడీఎంకే చరిత్ర సృష్టించనుంది. ఇప్పటి వరకు జయలలిత ఐదు సార్లు, కరుణానిధి ఐదు సార్లు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే విజయం సాధిస్తే ఆరోసారి జయలలిత సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.   ఈసందర్భంగా ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అమ్మ ప్రకటించారు. డీఎంకే పార్టీ అబద్ధపు ప్రచారాలు ఓడిపోయాయన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబాన్ని ఉద్దేశించి తమిళనాడు ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరించారని అన్నారు.

ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మమతా బెనర్జీ

ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన ప్రజలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగరవేయడంతో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. విక్టరీ సంకేతం చూపిస్తూ చిరునవ్వులు చిందించారు. ప్రత్యర్ధి శక్తులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని, కానీ ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని మమతా కొనియాడారు. అన్నింటికి మించి ఎన్ని సమస్యలు, కష్టాలు ఎదురైనా ఎన్నికల సంఘం ప్రశాంతంగా  ఎన్నికలు నిర్వహించిందని ప్రశంసించారు. ఈ నెల 27న తమ పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు.

ఘన విజయం సాధించిన తుమ్మల.. కారు జోరుకు కాంగ్రెస్ ఖతం..

  పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 45, 750 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ఘనం విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గరనుండి తుమ్మల తన ఆధికత్యను కొనసాగిస్తూనే ఉన్నారు.. మరోవైపు టీఆర్ఎస్ కూడా తుమ్మల విజయంపై మొదట నుండి ధీమా వ్యక్తం చేస్తూనే ఉంది. దీంతో తమ అంచనాలకు తగ్గట్టుగానే పాలేరు ఉపఎన్నికి టీఆర్ఎస్ కైవసం అయింది. మొత్తం 17 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగగా.. లెక్కింపు ముగిసే సమయానికి తుమ్మల 45వేల 650 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. దీంతో తుమ్మల విజయం సాధించారు. అయితే అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు అప్పుడే టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.   ఇక ఈ ఉపఎన్నికకు తుమ్మలకు అభ్యర్ధిగా బరిలో దిగిన రాంరెడ్డి సుచరితా రెడ్డికి నిరాశే మిగిలింది. మొదటి నుండి చూపించిన కారు జోరు తాకిడికి కాంగ్రెస్ తట్టుకోలేక పోయింది. దీంతో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ ప్రభుత్వంలో మూడు ఉపఎన్నికలు జరుగగా మూడింటిని టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా నాలుగో ఉపఎన్నిక స్థానాన్ని కూడా టీఆర్ఎస్సే కైవసం చేసుకుంది.

కేరళ సీఎం కుర్చీపై మంతనాలు..

  కేరళలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలను రివర్స్ చేసి ఎల్డిఎఫ్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసింది. ఇక గెలుపు ఎల్డిఎఫ్ దే అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్పుడే సీఎం కుర్చీ ఎవరు చేపడుతారు అనే విషయంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపు నుండి ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.  సిపిఎం నేతలు విఎస్‌ అచ్యుతానందన్‌ (92), పిన్రాయ్‌ విజయన్‌లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. విఎస్‌ అచ్యుతానందన్‌ పాలక్కాడ్ జిల్లాలోని మలంపుఝ నుండి ఆధిక్యంలో ఉండగా ఇక పిన్రాయ్‌ విజయన్‌ కన్నూర్ లోని ధర్మదామ్ నుండి ఆధిక్యతలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి సీఎం పదవి దక్కే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే ఈ సందర్బంగా అచ్యుతానందన్‌ మాట్లాడుతూ.. సీఎం పదవిని ఎవరు అధిష్టిస్తారు అనే విషయంపై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది అని చెప్పారు.   కాగా కేరళలో మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకూ ఎల్డీఎఫ్ 95, పీడీఎఫ్ 42, బీజేపీ 01, ఇతరులు 2 స్థానాల్లో ఉన్నారు.