విజయ్‌కాంత్‌ ఓటమిని తట్టుకోలేక అభిమాని ఆత్యహత్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీనటుడు విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే పార్టీ ఘోర పరాజయం పాలవ్వడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా అన్నాగ్రామం సమీపంలోని కొంగరాయనూర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి డీఎండీకే ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసీటు కూడా సాధించలేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. ఈ క్రమంలో సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుబ్రమణి ఆత్మహత్య తనను కలచివేసిందని, కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండాలని ఆయన సూచించారు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్..

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. జగ్మోహన్‌ దాల్మియా అనంతరం బీసీసీఐ పగ్గాలు చేపట్టిన శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయడానికి నిబంధనలు అడ్డొస్తుండటంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనుకున్నట్లుగానే ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. దీని కోసం ఇవాళ ముంబైలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఠాకూర్‌కు మద్దతు తెలిపారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా ఠాకూర్ చరిత్ర సృష్టించారు. 41 ఏళ్ట ఠాకూర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇంకా అధికారంలోనే బంజారాహిల్స్..

నిన్న కురిసిన భారీ వర్ష బీభత్సం నుంచి భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి దెబ్బకు ఎక్కడి చెట్లు అక్కడే కూలిపోయాయి. కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విరిగిపడ్డ చెట్లను, కొమ్మలను తొలగించడంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమ శక్తి కొలది తొలగిస్తున్నా ఇంకా చాలా చోట్ల చెట్లు అలాగే ఉండిపోయాయి. అవి తీస్తే గాని విద్యుత్ శాఖ సిబ్బందికి కరెంటు పునరుద్దరించడం సాధ్యంకాదు. గాలివాన దెబ్బ బలంగా పడిన బంజారాహిల్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీకి రైల్వేజోన్ కూడా రానట్టేనా..!

  ఒక పక్క ఏపీకి రైల్వే జోన్ కావాలని నేతలు పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అమర్ నాథ్ అనే వ్యక్తి దీక్ష చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలో రైల్వో జోన్ పై రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రైల్వే జోన్‌ రావాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల రైల్వే శాఖ వివక్ష చూపడం లేదని, గత బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలకు నిధులు గణనీయంగా పెంచినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరి ఏపీకి రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది.

మేరికోమ్‌ "రియో" ఛాన్స్ మిస్

భారత స్టార్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ ఆశలు ఆవిరయ్యాయి. రియో ఒలింపిక్స్‌ బెర్తే లక్ష్యంగా వరల్డ్ ఛాంపియన్ షిప్‌‌ రెండో రౌండ్‌లో ఇవాళ జరిగిన 51 కేజీల విభాగంలో జర్మనీ క్రీడాకారిణి అజిజ్ నిమానీ చేతిలో మేరీకోమ్ ఓటమి చవిచూసింది. తొలి రౌండ్‌లో తన పంచ్‌లతో ఆధిక్యాన్ని చూపే ప్రయత్నం చేసినా, నిమానీ వాటిని తిప్పికొట్టింది. ఆ తర్వాత రౌండ్‌లో మేరీ దూకుడును కొనసాగించినా, అజిజ్ ముందు మేరీ ఆటలు సాగలేదు. దీంతో  0-2 తేడాతో ఓటమి తప్పలేదు. సెమీ ఫైనల్ చేరితే బెర్త్ కన్ఫామ్ అనుకున్న దశలో మేరీకోమ్ ఇంటి ముఖం పట్టడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

టిఫిన్ పెట్టలేదని..కోడల్ని చంపిన మామ

విజయవాడలో దారుణం జరిగింది. ఓ కోడలిని మామ అత్యంత కిరాతకంగా గొంతునులిమి చంపాడు. అది కూడా టిఫిన్ పెట్టలేదన్న చిన్న కారణంతో.. విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన జూలిపూడి సత్యనారాయణ కుమారుడు శివాజీ పెట్రోల్ బంకు‌లో పనిచేస్తాడు. సుమతి అనే వ్యక్తిని శివాజీ ప్రేమించాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితమే ఆ యువతిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు.   ఈ క్రమంలో ఇవాళ ఉదయం శివాజీ యధావిధిగా బంక్‌లో విధులకు వెళ్లాడు. సుమతి పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చింది. ఆ సమయంలో మామ సత్యనారాయణ టిఫిన్ పెట్టకుండా పెత్తనాలేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపంలో ఇంటి తలుపు గడియ పెట్టి టీవీ సౌండ్ పెంచి సుమతి గొంతు నులిమి చంపేశాడు. ఇది గమనించిన స్థానికులు సత్యనారాయణని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య చేయడానికి కారణం టిఫిన్ కాదని..కొడుకు ప్రేమ వివాహం చేసుకుని రావడమేనని పోలీసులు భావిస్తున్నారు.

మరో అమ్మాయిపై గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పలువురు ఆగ్రహం..

  వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ ఆటలో తన బ్యాట్ కు ఎంత పని చెబుతాడో.. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి తన నోటికి కూడా అంతే పని చెబుతాడు. గతంలో స్పోర్ట్స్ యాంకర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న గేల్ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ద టైమ్స్ మేగజీన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మహిళా జర్నలిస్టును అభ్యంతరకర ప్రశ్నలు అడిగి విమర్శలపాలయ్యాడు. దీంతో ఇప్పుడు గేల్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేల్ ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని.. అతను ఇలాంటి వ్యాఖ్యలు చేసే మీద పెట్టే దృష్టి.. ఆటపై పెడితే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విచ్చలవిడితనం మీద లగ్నం చేస్తే...అతని భవిష్యత్ నాశనమవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

తన సమస్యను స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేసిన గవర్నర్..!

గవర్నర్..రాష్ట్ర ప్రభుత్వ నిజమైన అధిపతి. పాలన ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నా మొత్తం పనులన్నీ జరిగేది గవర్నర్ పేరుమీదనే. అలాంటి వ్యక్తి సామాన్య పౌరుడిలా తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. నిన్న హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రాజ్‌భవన్‌ సమీపంలోని రోడ్డు లో చెట్లు కూలి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీనిని గమనించిన నరసింహన్ వెంటనే జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ నంబర్‌కు సామాన్యుడిలా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది కూలిపోయిన చెట్లను తొలగించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల పనితీరును గవర్నర్ ప్రసంశించారు.

మార్కెట్లో దిగిందో లేదో..కారు విరాట్ సొంతం..!

టీమిండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి ఉన్న కార్ల పిచ్చి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్‌లోకి కొత్త కార్, బైక్ ఇలా ఏది రిలీజైనా తన సొంతం చేసుకోవాల్సిందే. తాజాగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ ఆడీ నుంచి మరో కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆడీ ఆవిష్కరించిన ఆర్8వీ10 ప్లస్ కారును కంపెనీ ఇవాళ మార్కెట్‌లోరి రిలీజ్ చేసింది. దీని ధర రూ.2.60 కోట్లుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈ కారును విరాట్ కొనుగోలు చేశాడు. అందుకు గుర్తుగా కారుతో దిగిన ఫోటోను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

బంగ్లాదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతున్న రోను..

  రెండు రోజుల నుండి ఏపీని జలమయం చేస్తున్న రోను తుఫాను..ఇప్పుడు బంగ్లాదేశ్ పై తన ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుండి బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్న తుఫాను తీరం దాటకముందే తన ప్రభావాన్ని చూపుతోంది. బలమైన ఈదురు గాలులతో మొదలైన ఈ తుఫాను కారణంగా చెట్లు నేలకూలాయి. పూరి గుడిసెలు, మట్టితో కట్టిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ ఐదుగురు మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పటికే చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ తీరానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ఈరోజు తీరం దాటే అవకాశం ఉందని.. తుపాను కారణంగా గంటకు 88 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 60వేల మంది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు.

'సూపర్ సేల్' తో ముందుకొచ్చిన ఎయిర్ ఇండియా...

  భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎయిర్ ఇండియా ఒక సరికొత్త స్కీముతో ముందుకొచ్చింది. 'సూపర్ సేల్' పేరుతో ఒక స్కీమును ప్రారంభించింది. గతంలో స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఏషియా ఇండియా తదితర సంస్థలు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించేశాయి. స్పైస్ జెట్ రూ. 511 (పన్నులు అదనం), ఇండిగో రూ. 800 (పన్నులు అదనం)కు టికెట్లను విక్రయించాయి. ఇప్పుడు అదే బాటలో ఎయిర్‌ ఇండియా సైతం నడుస్తోంది. మే 25 నుంచి సెప్టెంబరు 30లోపు తమ విమానాల్లో ప్రయాణాలు చేయాలనుకున్న వారు 'సూపర్ సేల్‌' స్కీమ్ ద్వారా తగ్గింపు ధరకే టిక్కెట్లను పొందవచ్చని తెలిపింది. దేశీయ రూట్లలో టిక్కెట్‌ ప్రారంభ ధర 1,499(పన్నులతో కలిపి)గా ఉందని చెప్పింది. తాము నడుపుతున్న అన్ని రూటల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.

ఏపీ మెడికల్ ఫలితాల్లో తెలంగాణ హవా..టాప్-10లో ఆరుగురు

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 మెడికల్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్ధులు సత్తా చూపారు. టాప్‌-10లోని పదిమందిలో ఆరుగురు తెలంగాణ విద్యార్థులే. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాత్విక్‌రెడ్డి 155 మార్కులతో 2వ ర్యాంక్ సాధించాడు. టాప్‌-10లో నిలిచిన తెలంగాణ విద్యార్థులు వీరే: 1 సాత్విక్ రెడ్డి-2వ ర్యాంక్ రంగారెడ్డి 2 యజ్ఞప్రియ-3వ ర్యాంక్ హైదరాబాద్ 3 ఇక్రమ్‌ఖాన్-5వ ర్యాంక్ హైదరాబాద్ 4 సాహితి సావిత్రి-6వ ర్యాంక్ హైదరాబాద్ 5 గ్రీష్మా మీనన్-8వ ర్యాంక్ వరంగల్ 6 శివకుమార్-9వ ర్యాంక్ నల్గొండ

మోడీతో టిమ్ కుక్ భేటీ.. అప్ డేటెడ్ వెర్షన్ ను ప్రారంభించిన కుక్

  యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.  ఆయన ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఢిల్లీలోని 7 రేస్ కోర్స్ గల ప్రధాని అధికారి నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా 'నరేంద్ర మోదీ మొబైల్ యాప్'కు సరికొత్త అప్ డేటెడ్ వర్షన్ ను స్వయంగా తయారు చేయించుకుని వచ్చిన టిమ్ కుక్.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ప్రారంభించారు. భేటీ అనంతరం.. టిమ్‌ చేతుల మీదుగా మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోడీ ట్వీట్‌ చేశారు. ఈ సరికొత్త వర్షన్ లో 'మై నెట్ వర్క్' పేరిట కొత్త విభాగం మొదలైంది. ఇక మీరంతా ఓ గ్రూప్ గా ఏర్పడి నాకు సలహాలు, సూచనలు పంపొచ్చు. ఇతరులతో మీ ఐడియాలను పంచుకుని చర్చించవచ్చు" అని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోవైపు టిమ్‌కుక్‌ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు మరోసారి రావాలనుందంటూ టిమ్‌ ట్వీట్‌ చేశారు.  

ఏపీకి రావాల్సిందే.. త్యాగాలు తప్పవు.. చంద్రబాబు

  ఈ ఏడాది జూన్ కల్లా హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏపీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా రోజుల నుండి చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఏపీకి రావడానికి ఆసక్తి చూపించిన ఉద్యోగులు ఇప్పుడు అంత ఆసక్తి చూపించడంలేదు. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఏవో కుంటిసాకులు చెబుతూ తాము రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువు కూడా ఇమ్మని కోరారు. కానీ చంద్రబాబు మాత్రం రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. మరో నెల రోజుల్లోగా తాత్కాలిక సచివాలయం సిద్దమైపోతుందని..  హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగుల్లో కొద్దిమంది మినహా మిగతావారంతా రావాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు, కార్యాలయాలు ఒకచోట ఉంటేనే పరిపాలన సాధ్యమవుతుందని.. కావున కొన్ని త్యాగాలు చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాల్సిందేనని అన్నారు. రావాల్సిందేనని తెలిపారు.

మరోసారి బయటపడిన టీడీపీ నేతల విబేధాలు..

టీడీపీ నేతల మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లాలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత అయిన కరణం బలరాం వర్గీయులకు, ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవి వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది. సభలో గొట్టిపాటి రవి మాట్లాడుతుండగా.. బలరాం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు గొడవకి దిగారు. ఇంతలో అక్కడే వున్న పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరు వర్గాల మధ్యకు వెళ్లి వారించేందుకు ప్రయత్నించగా.. కరణం బలరాం ఆయనతో కూడా వాగ్వాదానికి దిగారు. "నీవల్లే రవి టీడీపీలోకి వచ్చాడు"అని బలరాం గట్టిగా అనడంతో, ఆయన వర్గీయులు బుచ్చయ్యపైనా దాడికి యత్నించారని సమాచారం. మరి ఈ రగడ ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి.

విజయ్ మాల్యా కి గ్యారంటీగా రైతు మన్మోహన్ సింగ్..!

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను తిరిగి దేశం రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా మాల్యా ఓ బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయకుండా.. తగిన భద్రత కల్పిస్తానని ప్రభుత్వం నుండి హామీ వస్తే తిరిగి ఇండియా వస్తానని.. రుణాలు చెల్లిస్తామని చెప్పాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తగిన హామీ ఇచ్చేందకు రెడీ అని చెప్పింది. అయితే ఇప్పుడు మాల్యా విషయంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. మాల్యాకు గ్యారంటీ ఇచ్చాడంటూ ఒక అమాయక రైతు ఖాతాను ఫ్రీజ్ చేశారు అధికారులు.   వివరాల ప్రకారం.. పిలిభిత్ సమీపంలోని ఖజూరియా నవిరామ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ అనే రైతు వ్యవసాయంపై ఆధాపడి జీవిస్తున్న వ్యక్తి. ఈయనకు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఖాతా ఉంది. అయితే ఈయన మాల్యాకు గ్యారంటీగా ఉన్నాడంటూ.. తక్షణం ఖాతా సీజ్ చేయాలని ముంబై హెడ్డాఫీసు నుంచి ఆదేశాలు రాగా స్పందించిన బ్యాంకు అధికారులు ఆయన ఖాతాలను స్తంభింపజేశారు. దీంతో రైతు లబోదిబోమంటూ ఆరోపిస్తున్నాడు. అసలు మాల్యా ఎవరో తనకు తెలియదంటూ.. బ్యాంకు ఖాతా ఎందుకు నిలిపివేశారో తెలియదంటూ వాపోతున్నాడు. దీనివల్ల బ్యాంకుల నుండి వచ్చే స్కీములు నాకు చేరడం లేదు. ఇల్లు గడిచేందుకు డబ్బు అవసరమై నా పంటనంతా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెబుతున్నాడు. మరోవైపు బ్యాంకు అధికారులు చేసిన ఈ పనికి అందరూ విమర్శిస్తున్నారు. డబ్బున్న వారిపై ఎలాంటి ప్రతాపం చూపించలేని అధికారులు.. ఇలాంటి వారిపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.