పునర్‌వినియోగ వాహక నౌక పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక ( ఆర్‌ఎల్వీ)ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 7 గంటలకు ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదిరెట్లు తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వాహకనౌకలకు ఆ సామర్ధ్యం లేకపోవడంతో అంతరిక్ష ప్రయోగ వ్యయం ఎక్కువవుతోంది.

థాయ్‌ల్యాండ్‌లో అగ్నిప్రమాదం..17 మంది బాలికలు సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని పేద బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్టల్‌లో ఈ ప్రమాదం జరిగింది. చూస్తుండగానే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ కారణంగా చాలా మంది బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హాస్టల్‌లో 38 మంది ఉన్నారు. వీరిలో 17 మంది సజీవదహనమవ్వగా..మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే మరి కొందరి ఆచూకీ లభించాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

సినీనటి రూపా గంగూలీపై తృణమూల్ కార్యకర్తల దాడి

పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకురాలు, సినీనటి రూపా గంగూలీపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్‌డ్విప్‌‌లో తృణమూల్ కాంగ్రెస్ మద్ధతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈశ్వరిపూర్ గ్రామం వద్ద కొంతమంది ఆమె కారును అడ్డుకున్నారు. కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై చేయి చేసుకున్నారు . ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. స్థానిక టీఎంసీ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని, అందుకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

కిరణ్‌బేడికి బీజేపీ గిఫ్ట్..పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బేడి

మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్‌బేడికి బీజేపీ గిఫ్ట్ ఇచ్చింది. ఆమెను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడి పుదుచ్చేరికి 24వ లెఫ్టినెంట్ గవర్నర్. 1971 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన బేడి దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్. 35 ఏళ్లపాటు ఆమె సేవలందించి అనంతరం సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనంతరం 2015లో బీజేపీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘోర పరాజయం పొందారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటించారు. అయితే ప్రజా సేవ మాత్రం చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది

ఒంగోలు "మినీ మహానాడు" ఘటనపై సీఎం ఆగ్రహం

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న జరిగిన మినీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీ నేత కరణం బలరాం, కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు రావెల కిశోర్‌బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ పరిశీలకుడు బుచ్చయ్య చౌదరి సమక్షంలోనే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మనస్పర్థలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి తప్ప..బహిరంగంగా పార్టీ పరువు తీయోద్దన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాఖండ్‌ సీఎంకు మరో షాక్..

నిన్న మొన్నటి వరకు సంక్షోభాలు..బలనిరూపణలు ఇలా తలబొప్పి కట్టిపోయి ఎట్టకేలకు సీఎం పీఠం ఎక్కిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు మరో షాక్ తగిలింది. రాజకీయ సంక్షోభం సమయంలో సంచలనం సృష్టించిన స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించి సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు హరీశ్ డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా కలకలం రేపింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ..తమ ఎదుట హాజరుకావాలంటూ ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి ఆయన స్పందించకపోవడంతో మరోసారి సమన్లు జారీ చేసింది.

సోనియా లేకపోతే కాంగ్రెస్‌ ఏనాడో నాశనమయ్యేది -వెంకయ్య

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీని నియమించే విషయమై జరుగుతున్న చర్చ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. నాయకత్వం అనేది వారి వ్యక్తిగత వ్యవహారం. కాని కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచే శక్తి సోనియా మాత్రమేనని, ఆమె లేకపోతే కాంగ్రెస్ ఏనాడో విచ్చిన్నమయ్యేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శలతో దాడి చేసే వెంకయ్య ఏకంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాని ప్రశంసించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాను చావడానికి వచ్చి..సింహాలను చంపించాడు..!

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి రెండు సింహాల మృతికి కారణమయ్యాడు. చిలీ రాజధాని శాన్టిగోలోని మెట్రోపాలిటిన్ జూలో జరిగింది ఈ ఘటన. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు జూ ను వేదికగా చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే జూ వద్దకు చేరుకుని ఎన్‌క్లోజర్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీనిని జూ అధికారులు పసిగట్టారు. వారు వచ్చే లోపు అతను బోనులో దూకేశాడు. వెంటనే రెండు సింహాలు అతనిపై దాడి చేసి పడేశాయి. వాటిని అడ్డుకునేందుకు మత్తు బాణాలతో ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కాల్చి చంపారు. తీవ్రగాయాలపాలైన అతన్ని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఫ్రాంకో లూయిస్‌గా గుర్తించారు. అధికారులు అతని జేబులోని సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు.

విజయ్‌కాంత్‌ ఓటమిని తట్టుకోలేక అభిమాని ఆత్యహత్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీనటుడు విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే పార్టీ ఘోర పరాజయం పాలవ్వడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా అన్నాగ్రామం సమీపంలోని కొంగరాయనూర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి డీఎండీకే ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసీటు కూడా సాధించలేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. ఈ క్రమంలో సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుబ్రమణి ఆత్మహత్య తనను కలచివేసిందని, కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండాలని ఆయన సూచించారు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్..

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. జగ్మోహన్‌ దాల్మియా అనంతరం బీసీసీఐ పగ్గాలు చేపట్టిన శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయడానికి నిబంధనలు అడ్డొస్తుండటంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనుకున్నట్లుగానే ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. దీని కోసం ఇవాళ ముంబైలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఠాకూర్‌కు మద్దతు తెలిపారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా ఠాకూర్ చరిత్ర సృష్టించారు. 41 ఏళ్ట ఠాకూర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇంకా అధికారంలోనే బంజారాహిల్స్..

నిన్న కురిసిన భారీ వర్ష బీభత్సం నుంచి భాగ్యనగరం ఇంకా తేరుకోలేదు. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి దెబ్బకు ఎక్కడి చెట్లు అక్కడే కూలిపోయాయి. కరెంట్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విరిగిపడ్డ చెట్లను, కొమ్మలను తొలగించడంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమ శక్తి కొలది తొలగిస్తున్నా ఇంకా చాలా చోట్ల చెట్లు అలాగే ఉండిపోయాయి. అవి తీస్తే గాని విద్యుత్ శాఖ సిబ్బందికి కరెంటు పునరుద్దరించడం సాధ్యంకాదు. గాలివాన దెబ్బ బలంగా పడిన బంజారాహిల్స్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏపీకి రైల్వేజోన్ కూడా రానట్టేనా..!

  ఒక పక్క ఏపీకి రైల్వే జోన్ కావాలని నేతలు పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అమర్ నాథ్ అనే వ్యక్తి దీక్ష చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీలో రైల్వో జోన్ పై రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుకు పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రైల్వే జోన్‌ రావాల్సి ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల రైల్వే శాఖ వివక్ష చూపడం లేదని, గత బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలకు నిధులు గణనీయంగా పెంచినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుపై సాధ్యాసాధ్యలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరి ఏపీకి రైల్వే జోన్ కూడా వచ్చే అవకాశాలు లేనట్టు కనిపిస్తోంది.

మేరికోమ్‌ "రియో" ఛాన్స్ మిస్

భారత స్టార్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ ఆశలు ఆవిరయ్యాయి. రియో ఒలింపిక్స్‌ బెర్తే లక్ష్యంగా వరల్డ్ ఛాంపియన్ షిప్‌‌ రెండో రౌండ్‌లో ఇవాళ జరిగిన 51 కేజీల విభాగంలో జర్మనీ క్రీడాకారిణి అజిజ్ నిమానీ చేతిలో మేరీకోమ్ ఓటమి చవిచూసింది. తొలి రౌండ్‌లో తన పంచ్‌లతో ఆధిక్యాన్ని చూపే ప్రయత్నం చేసినా, నిమానీ వాటిని తిప్పికొట్టింది. ఆ తర్వాత రౌండ్‌లో మేరీ దూకుడును కొనసాగించినా, అజిజ్ ముందు మేరీ ఆటలు సాగలేదు. దీంతో  0-2 తేడాతో ఓటమి తప్పలేదు. సెమీ ఫైనల్ చేరితే బెర్త్ కన్ఫామ్ అనుకున్న దశలో మేరీకోమ్ ఇంటి ముఖం పట్టడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.