ఇకనుండి వాట్సప్ లో పోలీస్ కంప్లైట్స్..

  రోజు రోజుకి వాట్సాప్ వాడకం బాగా పెరిపోతున్న సంగతి తెలిసిందే. ఏ సమాచారం కావాలన్నా.. ఏదైనా వాట్సప్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వాట్సాప్ సౌకర్యాన్ని విశాఖ వాసులు కూడా వాడుకోవాలని నిర్ణయించున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకనుండి పోలీస్ స్టేషన్లకు వెళ్లి కాగితం పై రాసి ఫిర్యాదులు చేసే అవసరం లేకుండా.. వాట్స‌ప్ ద్వారా కూడా పోలీసుల‌కి ఫిర్యాదులు పంపే సౌకర్యం అందుబాటులో తెచ్చారు.  డీఐజీ శ్రీకాంత్ విశాఖలో పోలీసులకు సంబంధించిన యాప్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు మరింత చేరువ‌గా త‌మ సేవ‌ల‌ను అందించేందుకు వాట్స‌ప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఏ స‌మ‌యంలోనైనా వాట్సప్‌ నెంబర్‌- 8142003339కి త‌మ ఫిర్యాదులు పంప‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు.

అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం... !

ఏపీ రాజధాని అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోంది.. అగ్రరాజ్యమైన అమెరికాపై ప్రయోగించడానికి హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రికి కూడా తెలియని ఈ విషయాలు.. ఎవరికి తెలుసనుకుంటున్నారా.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. పాక్ మీడియా.  ఓ టీవి ఛానల్ లో చర్చ సందర్భంగా.. ఆ దేశానికి సంబంధించి ఓ వ్యక్తి అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో న్యూక్లియర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అక్కడ అమెరికాపై ప్రయోగించేందుకు హైడ్రోజన్ బాంబులను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇక దీనికి వంతంగా పాక్ ప్రభుత్వం కూడా న్యూక్లియర్ సిటీ నిర్మాణంపై నిశిత పరిశీలన చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తాని పాక్ చేసిన ఈ వ్యాఖ్యలు వింటే చంద్రబాబు కూడా ఆశ్చర్యపోతారేమో..

మథుర అల్లర్లు.. బయటపడిన మరో కొత్త విషయం..

  మథుర అల్లర్లలో రోజుకో సరికొత్త విషయం బయటపడుతోంది. 'స్వాధీన్ భారత్ వైదిక్ సత్యాగ్రాహి' అనే సంస్థ మథురలోని 280 ఎకరాల భూమిని  ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. అయితే బయటకి అది ఆశ్రమంలా కనపడినా.. అక్కడ  ఆయుధాల తయారీతో పాటు తన కార్యకర్తలకు ఆయుధ శిక్షణను ఇస్తుందన్న విషయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు మరో విషయం బయటపడింది. జవహర్ బాగ్ లో సోదాలు చేస్తున్న బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ కు అమెరికాలో తయారైన ఓ రాకెట్ లాంచర్ దొరికింది. ఈ అత్యాధునిక యుద్ధ పరికరాన్ని ఈ సంస్థకు ఎవరు సరఫరా చేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విచారణలో మరింత సంచలనం రేకెత్తించే అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు అభ్రిపాయపడుతున్నారు.   కాగా మథుర అల్లర్లలో ఎస్పీ సహా 24 మంది పోలీసులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

తెలుగు విద్యార్ధులకు అమెరికా షాక్.. వెనక్కి వెళ్లిపోండి..

  అమెరికాలో తెలుగు విద్యార్దులకు కష్టలు తప్పేట్లు కనిపించడంలేదు. ఇప్పటికే అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యార్ధులను ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన సమాచారం అందించడంలేదంటూ పదుల సంఖ్యలో వారిని వెనక్కి పంపించేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది విద్యార్ధులకు అదే పరిస్థితి ఏర్పడింది. అయితే వీరు ఒక సెమిస్టర్ పూర్తి చేసిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అమెరికాలోని  వెస్టర్న్ కెంటరీ వర్సిటీలో.. ఇంటర్నేషనల్ రిక్రూటర్లతో కంప్యూటర్ సైన్స్ లో విద్యనభ్యసించేందుకు వెస్టర్న్ కెంటరీ వర్సిటీ 60 మంది తెలుగు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చింది. వర్సిటీ ప్రవేశాలు లభించడంతో తెలుగు విద్యార్థులంతా హుషారుగా అక్కడికి వెళ్లిపోయారు. ఇప్పటికే ఓ సెమిస్టర్ కూడా పూర్తైంది. అయితే ఏమైందో తెలియదు కానీ.. సరైన పత్రాలు లేవు.. తక్షణమే వర్శిటీని వదిలి వెళ్లాలని నోటీసులు జారీ అవ్వడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు. అంతేకాదు ఇప్పటి వరకూ బానే ఉన్న పత్రాలు.. ఇప్పుడు ఎందుకు సరిగా లేవని ప్రశ్నిస్తున్నారు.

పాక్ కు బాంబు పేల్చిన అమెరికా.. వారిని శిక్షించాల్సిందే..

ఈ మధ్య పాక్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దేశానికి మద్దతుగా ఉన్న చైనా పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కారణం పాకిస్థానీయులే అని తేల్చి చెప్పగా.. ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా పాక్ పై ఓ బాంబు పేల్చింది. పఠాన్ కోట్ పై జరిగిన దాడి సూత్రధారులను శిక్షించాల్సిందే అని ఓ ప్రకటన చేసింది. అంతేకాదు పాక్ భూభాగం మీద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డీ కంపెనీ’ పేరును కూడా ఆ ప్రకటన ప్రస్తావించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారులతో పాటు 2008 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించిన నిందితులను కూడా పాక్ శిక్షించాల్సిందేనని ఆ ప్రకటన డిమాండ్ చేసింది.   కాగా భారత ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ, ఒబామాతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఒబామా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

విరాట్‌ను ఆకాశానికెత్తిన ముత్తయ్య..

ప్రజంట్ సూపర్‌ఫాంలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ దిగ్గజాలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి శ్రీలంక దిగ్గజం, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ చేరాడు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రూపొందించిన విజన్ 2020 కార్యక్రమానికి హాజరైన మురళీ ఈ సందర్భంగా విరాట్‌కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. గత రెండు సంవత్సరాలుగా అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్ చాలాకాలం పాటు ఇదే ఊపును కొనసాగించే అవకాశం ఉందన్నాడు . తనదైన ముద్రతో దూసుకుపోతున్న విరాట్‌ను నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నాడు. ప్రస్తుతం విరాట్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో మధ్యలో మాత్రమే ఉన్నాడని, ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించి మరిన్ని రికార్డులు నెలకొల్పుతాడని ఆశిస్తున్నట్టు మురళీ తెలిపాడు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

  తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు. క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్లే వర్షాలు పడుతున్నాయని, తాజా వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న‌ 72 గంటల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్లో వడగళ్లతో వాన ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు. ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌వ‌చ్చ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

వరుస ఓటములు..అయినా ఆదాయంలో టాప్..!

సెరెనా విలియమ్స్..ఒకప్పుడు టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన ఈ నల్లకలువకు ప్రజంట్ లక్ కలిసి రావడం లేదు. వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ ఫైనల్‌కు చేరినా టైటిల్ వేటలో చతికిలబడింది. 2015లో వరుసగా మూడు గ్రాండ్ స్లామ్‌లు గెలవగా..ఈ ఏడాదికొచ్చేసరికి రెండు టైటిల్స్‌కు అడుగుదూరంలో నిలిచిపోయి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే ఆటలో వెనుకబాడినా..ఆదాయంలో మాత్రం సెరెనా అగ్రస్థానానికి ఎగబాకింది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన అత్యధిక క్రీడాకారిణుల లిస్ట్‌లో సెరెనా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రైజ్ మనీ, వాణిజ్య ప్రకటనల ద్వారా 28.9 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.192 కోట్లు)తో అగ్రస్థానాన్ని అక్రమించి అత్యథిక సంపాదన కలిగిన మహిళా అథ్లెట్‌గా నిలిచింది. దీంతో వరుసగా 11 సంవత్సరాల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యన్ భామ మరియా షరపోవా కిందకు దిగజారింది. డోపింగ్ టెస్ట్‌లో అడ్డంగా బుక్కవ్వడంతో షరపోవా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.

మా అమ్మ ఎంతో దయాగుణం కల్గింది.. రేణుకా చౌదరి కూతురు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వారు ఓ రెస్టారెంట్ కు వెళ్లగా.. వాళ్ల పనమ్మాయిని పక్కనే నిలబెట్టి భోజనం చేశారని.. దానికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో రాగా.. పలువురు విమర్శించారు. అయితే ఇప్పుడు దీనిపై రేణుకా చౌదరి కూతురు తేజశ్విని స్పందించి.. వాస్తవాలు తెలుసుకోకుండా, సగం ఫొటో చూసి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. పనమ్మాయిని తన కోసమే నియమించారని, ఆ పనిమనిషి బాలిక కాదని, ఆమె వయస్సు 26 ఏళ్లని, ఇద్దరు పిల్లలు కూడా ఆమెకు ఉన్నారని తేజశ్విని పేర్కొంది. తమతో పాటే ఆమె కూడా భోజనం చేసిందని చెప్పుకొచ్చింది. ఎంతో దయాగుణం కల్గిన తన అమ్మపై నిందలు వేయడం సబబు కాదని అన్నారు.

మరో కోణం..ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్‌బేడీ..!

దేశ తొలి మహిళా ఐపీఎస్‌గా అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు కిరణ్‌బేడీ. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ప్రశంసలు పొందిన ఈ ఉక్కుమహిళ తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చి రాగానే  కిరణ్ బేడీ తనదైన మార్క్ చూపిస్తున్నారు.   వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవ్వొద్దని ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అక్కడి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పుదుచ్చేరి వీధులను శుభ్రం చేశారు. తాజాగా ఆమెను కలిసేందుకు పుదుచ్చేరి ఎమ్మెల్యేలు వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవేణి..కిరణ్ బేడీకి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను కాళ్లుపట్టుకోవద్దని లేవదీసి ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని ఉపదేశించారు. అక్కడితో ఆగకుండా సదరు ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది.

నైజీరియన్లపై గోవా మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..

  గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ నైజీరియన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఢిల్లీలో నైజీరియన్లపై దాడి జరిగి వివాదం జరుగగా.. ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాలకు దారి తీసే విధంగా ఉన్నాయి. దేశంలోకి నైజీరియన్లను రానీయకుండా నిషేదించాలని.. నైజీరియ‌న్లను దేశంలోకే అనుమ‌తించవ‌ద్ద‌ని దేశంలోకి వారు ప్ర‌వేశిస్తుండ‌డంతో అనేక సమ‌స్య‌లు తలెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వారు డ్ర‌గ్స్ అమ్మేందుకు వ‌స్తున్నారా..? చ‌దువుకోవ‌డానికి వ‌స్తున్నారా..? అని రవి నాయక్ ప్ర‌శ్నించారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మరి దీనిపై ఎంత రగడ జరుగుతుందో చూడాలి.

కోదండరామ్‌కు కాంగ్రెస్ మద్ధతు

తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రోఫెసర్ కోదండరామ్‌ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేస్తుండటంతో ఆయనకు మద్ధతుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయమని ఎద్దేవా చేశారు. కోదండరామ్ వ్యాఖ్యలను ప్రభుత్వం సలహాగా స్వీకరించాలి గానీ ప్రతి విమర్శలకు దిగకూడదన్నారు. ఈ విమర్శలను చూస్తుంటే రాష్ట్రంలో పౌరహక్కులు ఉన్నాయా లేవా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ నేతల వైఖరి చూస్తుంటే..కేసీఆర్‌కు అనుకూలంగా జేఏసీ నడవాలన్నట్టుందన్నారు.

ఫోటో వివాదంలో.. రేణుకకు కూతురు సపోర్ట్..!

కుటుంబసభ్యులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. ఈ వివాదంలో రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు ఆమె కుమార్తె తేజశ్విని. వాస్తవాలు తెలుసుకోకుండా తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫోటోలో పనమ్మాయిని పక్కనబెట్టి మిగిలిన వారంతా భోజనం చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. మానవత్వం లేకుండా పనమ్మాయిని పక్కనబెట్టి భోజనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   దీనిపై స్పందించిన తేజశ్విని..ఆ పనమ్మాయిని అమ్మ నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు, ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. రెస్టారెంట్‌లో మాతో పాటే కలిసి భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టూ ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలకు సాయం చేసింది. ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. అమ్మ సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విట్టర్ ఖాతాలో లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టే కామెంట్స్ చేయవద్దని తేజశ్విని పేర్కొన్నారు.

ఏపీ వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్..

జూన్ 27 నాటికి హైదారాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఏపీకి రావాలని ఒకపక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే.. మరోవైపు ఉద్యోగులు మాత్రం ఏపీకి రావడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు దీనిపై ఎన్జీవో నాయకుడు అశోక్ బాబు కూడా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి వసతులు లేకుండా వెళ్లి ఏం చేయాలి అని అంటున్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్ఏ పై ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు అక్కడ అద్దెలు ఎక్కువున్నాయి.. వసతులు లేవు అని వంకలు చెబుతున్న ఉద్యోగులు ఇప్పుడైనా ఏపీకి వెళతారో లేదో చూడాలి.