బెజవాడలో పరువు హత్య..కూతురిని హత్య చేసిన తల్లి
posted on Jul 7, 2016 @ 3:12PM
విజయవాడలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేకుండా వేరే మతస్థుడిని ప్రేమించిందన్న సాకుతో కన్నతల్లే కూతురిని హత్య చేసింది. కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన బీబీజాన్‌కు ఇద్దరు కుమార్తెలు, చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుటుంబాన్ని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు మార్చింది. అయినా కూతురు వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ మూడు నెలల కిందట విజయవాడలోని వాంబేకాలనీకి మకాం మార్చింది.
అక్కడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఆ అబ్బాయిని మరచిపోవాలని పలుమార్లు చెప్పి చూసింది అయినా నజ్మా వినలేదు. దీంతో బీబీలో ఆవేశం కట్టలు తెంచుకుంది. మంగళవారం రాత్రి నిద్రపోతున్న కుమార్తె ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. నిన్న ఉదయం విషయం బయటకు తెలియడంతో కడుపునొప్పితో కూతురు చనిపోయిందని అందరినీ నమ్మించింది. అయితే నజ్మాను ప్రేమించిన దీపక్ అనే యువకుడికి ఈ విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీబీని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించి కుటుంబం పరువు తీస్తుందన్న కోపంతోనే తాను నజ్మాను చంపినట్టు ఆమె అంగీకరించింది.