తమిళనాడు అసెంబ్లీ.. పేరు కోసం రచ్చ..
posted on Jul 26, 2016 @ 12:19PM
తమిళనాడు అసెంబ్లీలో ఓ విషయంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సాధారణంగా అసెంబ్లీలో ఏ రాజకీయ పరమైన అంశమో లేక.. ఏదైనా కుంభ కోణానికి సంబంధించిన విషయం గురించో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు బడ్జెట్ గురించిన సమావేశాలు కాబట్టి దాని గురించి చర్చ జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అవి కాకుండా ఇంకా ఏ విషయంపై చర్చ జరిగిందబ్బా అనుకుంటున్నారా..? అదేంటంటే.. సీఎంను ఎలా పిలవాలి అనే అంశంపై. దీనిపై సభలో పెద్ద దూమారమే రేగింది. సీఎం జయలలితను పేరు పెట్టి పిలవవద్దని.. మాజీ సీఎం అయితే ఓకే.. పిలవచ్చు అని స్పీకర్ తేల్చి చెప్పారు.
ఇంతకీ అసలు సంగతేంటంటే.. చర్చలో భాగంగా అన్నాడీఎంకే నేత నరసింహన్ మాట్లాడుతూ కరుణానిధి అని సంబోధించాడు. అంతే దీనిపై డీఎంకేనేతలు ఒక్కసారిగా లేచి ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పెద్దాయనను ఇలా పేరు పెట్టి పిలవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలుస్తామని.. మీరు చూస్తూ ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో స్పీకర్ కల్పించుకొని శాసనసభ్యుడి పేరును గౌరవ సూచకంగా సంబోధించవచ్చు కానీ ముఖ్యమంత్రిని అలా పిలవకూడదని, ఇది తన ఆదేశమని అన్నారు. దీనికి డీఎంకే నేతలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. సభ నుండి వాకౌట్ చేశారు. మొత్తానికి పేరులో ఏముంది అని అనుకుంటాం కానీ.. ఆ పేరులోనే అంతా ఉందన్న విషయం దీనిద్వారా అర్ధమైంది.