నయీం కంటే నట్టికుమార్ బాధితులే ఎక్కువ
posted on Aug 26, 2016 @ 10:12AM
గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నయీంతో సంబంధాలున్నాయంటూ నిర్మాత నట్టికుమార్ ప్రస్తావించిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే మీడియా సాక్షిగా వివరణ ఇవ్వగా..తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో నిర్మాత సి.కళ్యాణ్ చేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ తెర ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నట్టికుమార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబర్ ఇస్తే..నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు. కుమార్ జీవితమంతా బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలమయమని ఆరోపించారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలను నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తారన్నారు. సినీ పరిశ్రమలో చాలామంది నట్టికుమార్ బాధితులు ఉన్నారని, ఎవరూ కూడా పోనీలే అని మీడియా ముందుకు రావడం లేదన్నారు. అతని గురించి త్వరలో మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.