తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి.. కల నెరవేరెనా..!
posted on Sep 3, 2016 @ 11:24AM
తమిళనాడు గవర్నర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య పదవికాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలు తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులకు అప్పగించినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా తమిళనాడు గవర్నర్ పదవి మోత్కుపల్లిని విరస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీని కోరినట్టు వార్తలు వినిపించాయి. అయితే చాలా రోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సస్పెన్స్ లోనే ఉంది. కానీ ఇప్పుడు ఈ అనుమానాలన్నింటికి తెరపడింది ఇప్పుడు. తమిళనాడు గవర్నర్ పదవి మోత్కుపల్లికి ఇస్తూ మోడీ సర్కార్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వినాయకచవితి తర్వాత ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకావాలున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే పదవికి ఆనంది బెన్ పటేల్ కూడా పోటి పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు మోడీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనంది బెన్ పటేల్ ను నియమించే యోచనలో ఉన్నా.. ఆనందిబెన్ పటేల్ మాత్రం తనకు తమిళనాడు గవర్నర్ పదవే కావాలని పట్టుబడుతుంది. అంతేకాదు తెలుగు స్థానికతకు కాస్తంత దగ్గరగా ఉన్న తమిళనాడుకు గవర్నర్ గా వెళ్లేందుకు మోత్కుపల్లి ఆసక్తిగా ఉన్నారు. దీంతో బీజేపీ సర్కారు డైలమాలో పడింది. ఈ వ్యవహారంపై ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు గుజరాత్ లోనూ ఆసక్తికర చర్చకు తెర లేచింది. మరి ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. మోత్కుపల్లి కల నెరవేరుతుందా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.