మొదటిసారి మోడీని పొగిడిన రాహుల్.. కలవాలని ఉంది
posted on Sep 30, 2016 @ 4:05PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొట్టమొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. భారత్ పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు నిర్వహించి ముష్కరులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపునే భారతసైన్యం చాలా వేగంగా పని చక్కబెట్టి తిరిగి దేశానికి వచ్చింది. అయితే భారత సైన్యం చేసిన ఈ పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాదు అగ్రరాజ్యాలు సైతం దేశం చేసిన పనిని మెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాందీ కూడా మోడీని ప్రశంసించారు. మోడీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్లు అవుతుందని.. ఈరెండున్నరేళ్ల కాలంలో మోడీ చేసిన మంచి పని ఇదేనని.. రాహుల్ గాంధీ మోదీకి అభినందనలు తెలిపారు. మోదీతో మాట్లాడాలని ఉందని దానికి గల కారణం రెండున్నరేళ్ల పాలనలో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిలా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకుంటున్న చర్యలకు తాము పూర్తి మద్దతిస్తామని ప్రకటించారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, దేశమంతా మోదీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.