ట్రంప్ కు మోడీ కితాబు..
posted on Nov 15, 2016 @ 10:16AM
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందితే అమెరికా సర్వనాశనం అవుతుందని..ముఖ్యంగా ట్రంప్ గెలిస్తే అన్ని దేశాల సంగతేమో కానీ.. భారత్ కు మాత్రం తీవ్ర నష్టమే అని పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఊహించనట్టుగానే ట్రంప్ గెలిచారు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ పై మాట్లాడిన ప్రధాని మోడీ ఆయనకు మంచి కితాబే ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన విందుకు హాజరైన మోదీ అక్కడ ట్రంప్ పై కొద్ది సేపు నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ట్రంప్ తనకు మిత్రుడేనని.. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధంలో ఏ విధమైన మార్పులూ జరగబోమని, ట్రంప్ హయాంలో ఈ బంధం మరింతగా బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం భారత్ పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నారని, గతంలో అమెరికాను రిపబ్లికన్లు పాలించిన సమయంలోనూ దృఢమైన స్నేహబంధం కొనసాగిందని గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ మంచివారేనని, ఆయన హయాంలో ఇండియాకు మేలు కలుగుతుందని భావిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు. మరి మోడీ ఆశించినట్టు ట్రంప్ భారత్ విషయంలో మంచిగానే వ్యవహరిస్తారో.. లేక ఆయనకు నచ్చినట్టు వ్యవహరిస్తారో చూడాలి. కాగా ఎన్నిక్లలో గెలుపొందిన ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన 45 వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.