రైలు ప్రమాద బాధితులకు రద్దయిన నోట్లు పంపిణీ..

పాట్నా నుంచి ఇండోర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పట్టాలు తప్పి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. నిన్న ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. గాయపడిన వారి సంఖ్య అయితే చెప్పలేం. వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌కు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ర‌ద్దయిన 500 నోట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 5వేలు చొప్పున నోట్లను పంపిణీ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసుల అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని విచారించగా..  రైల్వే శాఖ వారే ఈ డ‌బ్బు ఇచ్చిన‌ట్లు ఆ వ్య‌క్తులు చెప్పారు. ఆ సందర్బంగా కంజ్‌పూర్ జోన్ క‌మిష‌న‌ర్ ఇఫ్తిక‌రుద్దీన్ మాట్లాడుతూ.. దీనిపై విచార‌ణ జ‌ర‌పాల్సిందిగా ఆసుప‌త్రి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. రైల్వే అధికారులే ఈ డ‌బ్బు ఇచ్చార‌న్న విష‌యంపైనా విచార‌ణ జ‌ర‌ప‌నున్నామన్నారు.

పెద్ద నోట్ల రద్దుపై పవన్ ఫైర్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పెద్ద నోట్ల ప్రకటనపై రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. కొందరు ప్రధాని నిర్ణయాన్ని సమర్థిస్తుండగా..మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. కొత్త కరెన్సీ ఎంతమేరకు అందుబాటులో ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణాల్లోని మార్కెట్ల పట్లా..నోట్ల మార్పిడికి వచ్చే వృద్ధు ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తాజా పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా హడావిడిగా ముందుకెళ్లినట్లు అనిపిస్తోందన్నారు. ముందు చూపులేకుండా..రాబోయే పరిణామాలను సరిగా అంచనా వేయలేదని తప్పుబట్టారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తన మిత్రుడు సాయిమాధవ్ రాసిన కవితను ప్రజలతో పంచుకున్నారు.  

మరో విక్టరీ కొట్టిన పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేసిన భారత బ్యాడ్మింటన్ స్లార్ పీవీ సింధు మరో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో చైనా క్రీడాకారిణి ప్రపంచ పదకొండో ర్యాంకర్ సన్ యూపై 21-11, 17-21, 21-11 తేడాతో సింధు విజయం సాధించింది. అరవై తొమ్మిది నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింధు విజయం సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచన సింధు..రెండో గేమ్‌ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. ఇక్కడ సింధు-సున్ యు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఈ పోరులో సింధుని విజయం వరించింది.  

ఢిల్లీలో.. రైల్లో మరో నిర్భయ

దేశ రాజధాని మహిళలపై అత్యాచారాలకు కూడా రాజధాని అయ్యింది. రోడ్లు, బస్సులే కాదు ఆఖరికి రైళ్లలోనూ ఆడవారి మానాలకు రక్షణ లేదని చెప్పడానికి తాజా ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఢిల్లీలో కదిలే రైల్లో మహిళల బోగీలో ఓ మహిళ దోపిడీకి, అత్యాచారానికి గురైంది. బిహార్‌కు చెందిన మహిళ ఢిల్లీలో తన బంధువల ఇంట్లో ఒక శుభాకార్యానికి హాజరయ్యేందుకు రైలులో బయలుదేరింది. ఆమె రైలులో ఎక్కిన సమయంలో ఆ బోగీలో నలుగురు మహిళలు ఉండగా కొంత దూరం వెళ్లాక వారు దిగిపోయారు. షాహదారా స్టేషన్‌కు చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు మహిళల బోగీలోకి ఎక్కి ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న పర్సు, నగలు లాక్కొని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత ఢిల్లీలో ఈ విషయం గమనించిన రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

యూపీలో ఘోర రైలు ప్రమాదం..63 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాట్నా నుంచి ఇండోర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ యూపీలోని కాన్‌పూర్ దేహత్ జిల్లా పుఖ్రాయన్ వద్ద తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 63 మంది మరణించగా..150 మంది వరకు గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ క్రేన్ల సాయంతో బోగీలను తొలగించి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అందులో మాత్రం మనమే టాప్..

ప్రస్తుతం సెల్ఫీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడ ఉన్నా.. ఎం చేస్తున్నా.. కాస్త భిన్నంగా ఏం కనిపించినా వెంటనే క్లిక్ చేయడం... సెల్ఫీ తీసుకోవడం.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. అయితే ఈ సెల్ఫీల వల్ల చనిపోయిన వారు కూడా ఉన్నారనుకోండి. మరి ఇప్పుడు ఈ సెల్పీలు తీసుకోని మరణించిన వారి సంఖ్యలో ఎవరు ముందున్నారో తెలుసా.. ఇంకెవరూ మనమే. సెల్ఫీ మరణాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే పొరుగుదేశమైన పాకిస్థాన్ రెండో స్థానం ఆక్రమించింది. అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్‌ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫీ మరణాలపై అధ్యయనం చేశాయి. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు 127 మంది సెల్ఫీ మరణాలు సంభవించాయని గుర్తించారు. భారత్‌లో సెల్ఫీ తీసుకుంటూ 76 మంది మరణించారు. పాకిస్థాన్లో తొమ్మిదిమంది, అమెరికాలో ఎనిమిదిమంది, రష్యాలో ఆరుగురు ఇలాగే చనిపోయారు. మొత్తానికి ఈ విషయంలో కూడా పాక్ భారత్ తో పోటీ పడుతుంది.

ఆధిక్యంలో భారత్.. 298 పరుగులు

విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇండియా 455 పరుగులు తీయగా.. అతి కష్టం మీద 255 పరుగులు తీసి ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 200 పరుగులు ఆధిక్యం సాధించింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా పేలవమైన ప్రదర్శన ప్రదర్శిస్తుంది. ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (56), అజింక్యా రహానే (22) క్రీజులో కుదురుకున్నారు. దీంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి 34 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేయడం ద్వారా ఇంగ్లండ్ పై 298 పరుగుల ఆధిక్యం సాధించింది.

సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇవ్వడానికి రెడీ...

  ప్రస్తుతం సుష్మా స్వరాజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఎయిమ్స్ లో చికిత్స పొందుతుంది.  అయితే ఇప్పుడు ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. ఫాహిం అన్సారీ అనే ఓ ఇంజినీర్ కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాను ఆపదలో ఉన్నపుడు ఆదుకునున్నారని..  మాల్దీవుల్లో తాను ఉన్నపుడు తనపై డ్రగ్స్ కేసు నమోదు చేశారని, తాను నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో తనకు సుష్మా స్వరాజ్ సాయం చేసి రక్షించారని.. తన కుటుంబ సభ్యులు స్థానిక ఎంపీతో కలిసి సుష్మాను కలిశారని అపుడు తాను కేసు నుంచి బయటపడేందుకు సాయం లభించిందని సుష్మా సహకరించారని కృతజ్ఞతా పూర్వకంగా తెలిపారు. కొత్త జీవితాన్ని ప్రసాదించిన సుష్మా స్వరాజ్‌కు తన కిడ్నీ అవసరమైతే దానం చేస్తానని ప్రకటించాడు.

ఇంగ్లాండ్‌ 255 ఆలౌట్‌..

  భారత్-ఇంగ్లడ్ జట్ల మధ్య విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 455 పరుగలకు ఆలౌట్ అయ్యి భారీ లక్ష్యాన్నే ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ముందునుండి తడబాటుగానే ఆట ప్రారంభించింది. 103/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు లంచ్‌ విరామానికి ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి  110పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది.  లంచ్ త‌ర్వాత కూడా స్టోక్స్‌, ర‌షీద్ క్రీజులో నిల‌దొక్కుకున్నా ఈ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు 35 ప‌రుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు 255పరుగులు మాత్రమే చేసింది. భార‌త్‌కు 200 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. కాగా అశ్విన్‌ ఐదు వికెట్లు తీయగా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, జడేజా, జయంత్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

కేసుల నుండి తప్పించుకోవడాని ట్రంప్ భారీ ఆఫర్...

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన యూనివర్శిటీపై ఉన్న కేసుల సెటిల్ మెంట్ల కోసం కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ యూనివర్శిటీపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుల విముక్తి కోసం ఆయన భారీ మొత్తంలోనే ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. మూడు కేసుల సెటిల్ మెంట్ కోసం ఆయన 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 170 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించారట. అయితే రెండు కేసుల్లో మాత్రమే రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షినైడర్ మ్యాన్ తెలిపారు. మూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసులో వాది, ప్రతివాదుల మధ్య డీల్ కుదిరిందని వెల్లడించారు.   అయితే నిర్మాణ రంగంలో నిష్ణాతులను చేస్తామని చెబుతూ, ఒక్కొక్కరి నుంచి 35 వేల డాలర్లను కట్టించుకున్న యూనివర్శిటీ సరిగ్గా పాఠాలు చెప్పలేదని, ఈ స్టడీ ప్రోగ్రామ్ తమను తప్పుదారి పట్టించిందని విద్యార్థులు కోర్టు కెక్కారు. ఈ కేసులో ట్రంప్ వర్శిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు ఉండటం, విద్యార్థులు నెగ్గితే, అధ్యక్ష హోదాలో పరువు పోతుందని భావించడంతోనే ఆయన భారీగా డబ్బు చెల్లించి కేసుల నుంచి బయటపడాలని భావించినట్టు తెలుస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.

ఒబామా చివరి టూర్...

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూ పర్యటనలో ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఆఖరి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా.. బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన పెరూకి చెరుకున్నారు. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు. అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు.   కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.

ఇందిరా గాంధీతో రాహుల్ గాంధీ... చిన్ననాటి ఫొటో..

  నేడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కావడంతో దేశ వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్లో తన చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్ చేశాడు. అందులో చిన్నతనంలో తన నానమ్మ అయిన ఇందిరాగాంధీకి రాహుల్ గాంధీ తేనీరు అందిస్తున్నారు. ‘‘ఇందిరాజీని స్మరించుకుంటున్నా, ఓ పోరాట యోధురాలు, విప్లవకారిణి, దృఢ నిశ్చయమున్న మహిళ, కారుణ్యం, త్యాగశీలి కలగలిసిన నా నానమ్మ నా స్నేహితురాలు, నాకు అనునిత్యమూ మార్గనిర్దేశం చేసే వెలుగు’’ అని ట్వీట్ చేశారు.