రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు
రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు కాంగ్రెస్ పార్టీ చర్చల పేరిట మళ్ళీ మరో మారు తెలంగాణా ప్రజలను మోసం చేయకపోతే రేపు జరగనున్న కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, వచ్చే ఎన్నికలలోగా విభజన ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల తరువాత మిగిలిన కార్యక్రమాన్ని తాపీగా పూర్తి చేయవచ్చును. అంటే, రేపు కాంగ్రెస్ గనుక తెలంగాణా అంశంపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసినట్లయితే, అన్ని రాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే సమాయత్తం కావలసి ఉంటుంది.
కేవలం తెలంగాణకే పరిమితమయిన తెరాస ఎన్నికలకి ఎప్పటి నుండో సిద్దంగానే ఉంది. అయితే, తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు మాత్రం రెండు రాష్ట్రాలలో పోటీ చేసేందుకు వీలుగా వ్యూహ రచన చేసుకోవడం కత్తి మీద సాము అవుతుంది. ముఖ్యంగా నాలుగు ప్రధాన పార్టీలకి మరింత తల నొప్పులు తప్పవు. రెండు ప్రాంతాలలో వాటికి బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, ఇప్పుడు వేర్వేరుగా ముఖ్యమంత్రి అభ్యర్ధులను నిర్ణయించుకోవడం, పార్టీ విధానాలు రూపొందించుకోవడం, రెంటి మద్య సరయిన సమన్వయం ఏర్పరుచుకోవడం వంటివి అనేక అంశాలు పార్టీలకు కొత్త సమస్యలు సృష్టించబోతున్నాయి.
రాష్ట్రం విడిపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డజన్ల కొద్దీ ఉన్న ముఖ్య మంత్రుల అభ్యర్ధుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని వారిలోంచి తగిన వారిని ఎంపిక చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం చాలా తల నొప్పులు భరించవలసి ఉంటుంది. ఇక తెదేపా విషయానికి వస్తే, సీమంధ్ర ప్రాంతానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావిస్తే, తెలంగాణా ప్రాంతానికి మరో అభ్యర్ధిని ఎంచుకోవడానికి కొంత శ్రమ పడకతప్పదు. వైకాపాకు కూడా ఇంచు మించు ఇదే సూత్రం వర్తిస్తుంది. బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు రెండు ప్రాంతాలలో కూడా ఆధిపత్యం సాధించడం అసాద్యం గనుక వాటికి ఇంత శ్రమ ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకి కూడా రెండు ప్రాంతాలలో తమ పార్టీలు, వాటి నేతలు తమ అధిష్టానానికి కట్టుబడి ఉండేలా చూసుకోవడం కూడా పెద్ద సవాలుగా మారవచ్చును.
వివిధ రాష్ట్రాలలో అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీకి ఈవిషయంలో కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోయినా తెదేపా, వైకాపాలకి ఇదొక కొత్త అనుభవమే అవుతుంది. ఇక రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్టీ విధి విధానాలు, మానిఫెస్టోలు, రాష్ట్ర నిర్మాణానికి తగిన ప్రణాళికలు వగైరా రచించుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే.
అయితే, ఏపార్టీకయినా రెండు ప్రాంతాలలో ఘన విజయం సాదించి అధికారం కైవసం చేసుకొంటే రెండు రాష్ట్రాల శాఖల మధ్య సమన్వయము చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ, కేవలం ఒక ప్రాంతంలో నెగ్గి మరొక ప్రాంతంలో ఓడిపోయినట్లయితే, పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు ప్రాంతాలలో ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు.
తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటే, సీమంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపా, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ తప్పదు. అయితే, కాంగ్రెస్ అటు తెరాసతో, ఇటు వైకాపాతో గనుక విలీనాలు లేదా ఎన్నికల పొత్తులు చేసుకోగలిగితే, తేదేపాకు గడ్డు సమస్యే అవుతుంది.