మతఘర్షణల నుండి లబ్ది కోసం రాజకీయ పార్టీల ఆరాటం

  ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ మత ఘర్షణలలో అధికారిక లెక్కల ప్రకారం 45మంది ప్రజలు చనిపోగా దాదాపు 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సమాచారం. అయితే నిజానికి ఈ సంఖ్య ఇంత కంటే చాలా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మత ఘర్షణలు వలన ఇంత మంది అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులవుతుంటే, భాద్యతగా మెలగవలసిన ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ దురదృష్ట సంఘటనల నుండి లబ్దిపొందేందుకు చేస్తున్ననీచ రాజకీయాలను చూసి అక్కడి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు.   స్థానిక బీజేపీ నేత ఒకరు మత ఘర్షణలకు సంబందించి ఒక నకిలీ వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టడంతో అల్లర్లు మరింత పెరిగాయని అధికారిక సమాజ్ వాదీ ప్రభుత్వం ఆరోపించింది. త్వరలో ఐదు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.   ఈ అల్లర్లలోనష్టబోయిన హిందూ, ముస్లిం ప్రజలను ఓదార్చే మిషతో ఎలాగయినా ఆకట్టుకొని వారి ఓట్లకు గేలం వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఈ రోజు ముజఫర్ నగర్ పర్యటనకు బయలుదేరుతున్నారని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన కంటే ఒకరోజు ముందుగానే అంటే నిన్నఆదివారం నాడే ముజఫర్ నగర్ లో భాదిత కుటుంబాలను పరామర్శకు బయలుదేరారు. కానీ అక్కడి ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని ఆయనకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడంతో అఖిలేష్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని వెనుతిరగవలసి వచ్చింది.   ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతున్న మాజీ ముఖ్యమంత్రి మాయావతి మత ఘర్షణలను నివారించడంలో విఫలమయిన అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భారత రాజకీయాలపై పెను ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో పైచేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విషాదకరమయిన ఈ మత ఘర్షణలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

త్వరలో చంద్రబాబు తెలంగాణా యాత్ర

  సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట బస్సుచేసేందుకు సిద్దపడినప్పుడు, ఆయన రాకతో ప్రజలలో తమకు వ్యతిరేఖత ఏర్పడుతుందనే భయంతో స్వయంగా పార్టీ నేతలే వ్యతిరేఖించారు. ఆయనపై సమైక్యవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని వారు ఆయనని వారించే ప్రయత్నం చేసారు. కానీ వారు భయపడినట్లుగా ఆయన యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు, పైగా దానివల్లే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకొంది.   కానీ, ఈ యాత్ర తెలంగాణాలో తేదేపాకు వ్యతిరేఖ భావనలు ఏర్పడేందుకు కారణమయ్యింది. చంద్రబాబు తన యాత్రలో “తమ పార్టీ సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి హక్కులకోసం ఎంత పోరాటానికయినా సిద్దమని” గట్టిగా చెప్పడం వలన, తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని, పూర్తి సీమాంధ్ర పార్టీగా మారడం తధ్యమని అందరూ భావించారు. ఒకవేళ చంద్రబాబు కూడా తెలంగాణా విషయంలో ‘మడమ తిప్పినట్లయితే’ తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని పార్టీలోని తెలంగాణా నేతలు కూడా చాలా ఆందోళన చెందారు.   అయితే చంద్ర తన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి రాగానే వారికి ఉపశమనం కలిగిస్తూ తను తెలంగాణాలో కూడా పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేయమని చెప్పారు. తెదేపా టీ-ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, త్వరలో చంద్రబాబు తెలంగాణాలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేసారు.   తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల నడుమ సీమాంధ్రలో తను చేసిన బస్సు యాత్ర విజయవంతం అవడంతో, దాదాపు అటువంటి పరిస్థితులే నెలకొన్న తెలంగాణాలో కూడా ఇప్పుడు యాత్ర చేయడం సాధ్యమేనని ఆయనకు నమ్మకం కలిగినందునే ఇందుకు సిద్దపడుతుండవచ్చును. ఆయన తన ఆత్మగౌరవ యాత్ర ద్వారా సీమాంధ్రలో పార్టీ శ్రేణులకు ఏవిధంగా కొత్త ఉత్సాహం కలిగించగలిగారో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో కూడా పార్టీ శ్రేణులలో పార్టీపట్ల నమ్మకం నిలిపేందుకు యాత్ర చేసి తద్వారా అక్కడ కూడా పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం ద్వారా అక్కడ పాగా వేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, దానితో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్న తెరాసలు, తీవ్ర ప్రతికూలపరిస్థితులలో నెగ్గుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణాలో కూడా పర్యటించి మళ్ళీ పార్టీని బలపరచుకోబోతుంటే ఆయనతో ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.

ఏ దౌర్భాగ్యాలకీ మరణశాసనం

     ....సాయి లక్ష్మీ మద్దాల   ఢిల్లీ లో డిసెంబర్ 16 న అత్యాచారానికి గురికాబడిన నిర్భయ కేసులో ఢిల్లీ సాకేత్ కోర్ట్ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. అందరూ కోరుకున్నట్టు గానే నిందితులు నలుగురికి మరణ శిక్ష విధించారు. యావత్ భారత ప్రజానీకం ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అదే తరహాలో అన్ని అత్యాచార కేసులు పరిష్కరించబడితే భారత దేశంలో ఆడవాళ్ళకి కొంత మానసిక భరోసా దొరుకుతుంది. కానీ అది ఎప్పటికీ ఎండమావే. ఎందుకంటె తీర్పు వెలువడిన అనంతరం నిందితుల తరఫు న్యాయవాది ఇంతకముందు జరిగిన అన్ని రేప్ కేసుల్లోనూ ఇలాగే కోర్టులు వ్యవహరించాయ అని ప్రశ్నిస్తూ,రాబోయే 3 నెలలలో ఒక్క రేప్ కూడా జరగదా అని ప్రస్నిమ్చటం జరిగింది. ఆ న్యాయవాది భావాన్ని దేశ ప్రజలు యేమని అర్ధం చేసుకోవాలి. అన్నిటికి మించి చాలా అరుదైన నేరాలలోనే ఉరి శిక్షను విధించే భారత చట్టాలు ఏ భావజాల మార్పుకోసమని ఇంతటి కఠిన శిక్షను విధించారు. ఇప్పటివరకు భారత దేశంలో ఒక్క నిర్భయ మీద మాత్రమే అత్యాచారం జరుగలేదు. ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోని రేప్ కేసులు రెండున్నర లక్షలు ఉన్నాయి. మరి వాటి సంగతేమిటి. మళ్ళి యావత్భారత యువత రోడ్లమీదికి వచ్చి పోరాటాలు చేస్తేనే గానీ వాటి జోలికి ఈ న్యాయస్థానాలు వెళ్ళవా?ఇక్కడ పరిష్కారం కావలసిన దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. జస్టిస్ వర్మ గారు తన నివేదికలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. మనం నేడు చూస్తున్న చాలా వ్యస్థలలొ మార్పురావాలని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో,న్యాయవ్యవస్థలో,పోలీసు వ్యవస్థలో,తల్లిదండ్రులలో మార్పురావాలని ఆయన పేర్కొనటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీని ఈ సమాజం చూసే దృక్కోణంలో మార్పు రావాలన్నారు. అన్నిటితో బాటుగా మన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని కూడా ఆయన సూచించారు.                      నేటి భారతీయ విద్యావిధానం వ్యాపార కోణంలోనే సాగుతోంది కాని,సామాజిక చైతన్యాన్ని కల్పించే దిశలో కాని,సంస్కారహితంగా కానీ,మానవీయ విలువలను నేర్పించే విధంగా కానీ లేదు. దీనిని గురించి ఒక్కరోజైన చట్టసభలలో చర్చించ లేదు. అలాగే భారతదేశంలో ఆడవాళ్ళమీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏ ఒక్కరోజున కూడా ఈ చట్టసభలు చర్చించాలని అనుకోలేదు. అసెంబ్లీ లోనే స్వయంగా తమ సెల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూసే స్థాయికి శాసనసభ్యులు దిగజారుతుంటే ఇంక చర్చలు ఎలా జరుగుతాయి?. ఢిల్లీ లో రాత్రి 9 గంటల సమయంలోనే నడిరోడ్డు మీదే ఇంతటి ఘోరకలి జరిగే స్థితికి అక్కడి పోలీసు వ్యస్థను ఏమనాలి?ఢిల్లీ లో అత్యాచారాలు లెక్కలేనన్ని జరుగుతాయ్ ఇది మామూలే అనే ఆలోచనా సరళిని ఎవరు మార్చాలి?                       తల్లిదండ్రులలో మార్పు రావాలి అంటే .దాని అర్ధం మార్పు ఇంటి నుండే మొదలవ్వాలి అని. ఆడపిల్లను ఒకరకంగ,మగపిల్లవాడిని ఒకరకంగా పెంచే విధానంలో మార్పు రావాలి. మరీ ముఖ్యంగా నేటి సినిమాలు,టీవీలలో వచ్చే కార్యక్రమాలు,వ్యాపార ప్రకటనలు,వార్త పత్రికలు,ఇంటర్నెట్,ఇలాచెప్పుకుంటూ పోతే మన చుట్టూరా ఉన్న మన సభ్య సమాజంలోని చాలా వ్యవస్థల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది కానీ సినిమాలలోని అశ్లీల దృశ్యాలకు అడ్డుకట్ట ఉండదు. మరి వీటన్నిటి గురించి ఆలోచించ వలసిన భాద్యత చట్టాలకు,ప్రభుత్వాలకు లేదా?అధికారులను ప్రభావితం చేస్తున్న రాజకీయ వ్యవస్థ కారణంగా ఎంతమంది తమకు న్యాయం జరగలేదని అల్లడుతున్నారో సదరు నేతలకు తెలియదా?                       ఈనాడు ఇంతగా బ్రష్టు పట్టిన ఈ సమాజంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకూడదు అంటే కఠినమైన శిక్షలతో బాటుగా విలువలతో కూడిన విద్యావిధానం,సామాజిక చైతన్యం,సంస్కారయుతమైన కుటుంబ వాతావరణం,అన్నిటికి మించి ఏ పరివర్తన కోసం జైలు శిక్షలు విదిస్తున్నారో ఆ పరివర్తన తాలూకు విధానాల అమలు సరిగా జరగలేనినాడు ఎవరికి ఎటువంటి న్యాయమూ జరగదు. సమస్యకు మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా ఒక సమస్యకు ఒక కఠిన శిక్ష విధించి చేతులు దులిపెసుకుంటే నేరాలు ఎలా అరికట్టబడతాయి.                      ముఖ్యంగా యావత్ ప్రపంచం గుర్తించాల్సింది ఆడది ఒక విలాస వస్తువు కాదు. ఆడది రెండో వర్గం పౌరురాలు కాదు. ఆడది లేని ఈ సమాజాన్ని ఎవరైనా ఊహించగలరా?ఆడది  కేవలం ఒక భోగ వస్తువుగా చూపించబడుతున్నంత కాలం ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. మరి శిక్షలు ఎవరికి వేస్తారు?అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికా లేక వారిని అలా ప్రేరే పిస్తున్న వివిధ రకాలైన నియంత్రణ లేని వ్యవస్థలకా?

విభజనే అభివృద్దా?

      ఆంధ్ర తెలంగాణ అంటూ ఇరు ప్రాంత ప్రజలు గత 10సంత్సరాలుగా ఉద్యమాలతో ఊగిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి?తెలంగాణ ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందని,ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే వాదనతో కె.సి.ఆర్ ఆధ్వర్యంలో 13 సంత్సరాల క్రితం టి.ఆర్.ఎస్ పార్టీ పుట్టింది. కాని వాస్తవానికి అప్పటికే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అనేది కాదనలేని వాస్తవం.ఎన్.టి రామారావు పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం తెలంగాణలో,జరిగిన అభివృద్ధిని ఎవరైనా అంగీకరించవలసిందే. నిజానికి ఆ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది అక్కడి దొరలే. కేవలం దొర పెత్తనం కారణంగానే ఆ ప్రాంతంలో వెనుకబాటుతనం తాండవించింది. ఆనాడు ఆ వెనుకబాటు తనం నుండి ఆ ప్రాంతాన్ని బయటకు తీసుకురావాలని కాని,ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాని తెలంగాణ ప్రాంత నేతలెవరు ప్రయత్నించక పోవటం కడు బాధాకరం. కానీ ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎందుకు గమనించలేదు?గుర్తించలేదు?   ఇక సీమాంద్ర ప్రాంత విషయానికి వస్తే అక్కడ కూడా అభివృద్ధి అంటే కేవలం వ్యవసాయం మాత్రమే. పారిశ్రామిక అభివృద్ధి కేవలం ఒక్క వైజాగ్ లోనే జరిగింది. అది కేవలం ఒక్క స్టీల్ ప్లాంట్ ద్వారా మాత్రమే జరిగింది. మిగతా ప్రాంతాలలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి కాని, విద్యారంగ అభివృద్ధి కాని,వానిజ్యపరమైన అభివృద్ధి కాని వైద్య పరమైన అభివృద్ధి కాని జరుగలేదు.   దీనికి కారణం  ఎవరు?ప్రజలా?నేతలా?రాజకీయముసుగులో ఉన్న పెట్టుబడిదారులు అనేది జగమెరిగిన సత్యం. ఆ ఒక్క కారణం గానే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. మరి ఈనాటికి యావత్ ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అరకు నుండి ఆదిలాబాద్ వరకు చాలా గిరిజన ప్రాంతం ఉంది. వారు ఈనాటికి నాగరికతకు ఆమడదూరంలో ఉన్నారు. దీనికెవరు బాధ్యులు?చేతకాని ఈ రాజకీయ నేతలు కాదా?ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటే,ఒక ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి పరిష్కార మార్గం ఆ ప్రాంతాన్ని రెండుగా విభజించటమేనని ఏ శాస్త్రం చెబుతోంది? ఆయా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రజలు వద్దన్నారు వీళ్ళని?                        స్వాతంత్ర్యం వచ్చి 67 సంత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉండటానికి ఎవరు బాధ్యులు?ప్రజాసంక్షేమం అభివృద్ధి చెందవలిసిన చోట లంచగొండితనం,అవినీతి,అక్రమాలు అన్యాయాలు అభివృద్ధి చెందాయి. ఇది ఎవరి అసమర్ధతకు తార్కాణం అనిచెప్పాలి. కాంగ్రెస్ ఉన్నతికి భిక్ష పెట్టింది ఆంద్ర రాష్ట్రం. దేశానికి అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రం. దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఆంద్ర రాష్ట్రం ఒకటి. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం,ఆంధ్రరాష్ట్రం. అలాంటి సమైక్య జాతిని రెండుగా చీల్చి ఒకేజాతి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి ఈ కాంగ్రెస్ పార్టీ సాధించేదేమిటి?                           ఒకనాడు ఒకరాజకీయ నేత రాజకీయ లబ్ధి కోసం పురుడుపోసుకున్న వాదం నేడు తెలుగుజాతిని విచ్చిన్నం చేసే దిశగా వెళ్తోంది. విభజన తర్వాత జరిగే అభివృద్ధి ఏమిటి?నేడు ఉన్న అభివృద్ధి కూడా నిలబడదు. ఆంద్ర రాష్ట్రం అంటే నిత్యం రావణకాష్టం అనే అభిప్రాయం యావత్ ప్రపంచానికి తెలిసింది. తద్వారా ఆంద్ర రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు,ఉపాధి అవకాశాలు వెనక్కు మళ్ళిపోతున్నాయ్. భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారనున్న ఈ తరుణంలో ప్రజలు చాలా తెలివిగా ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు మొదలైన ఈ విద్వేషాలు ఇక్కడితో ఆగే పరిస్థితి ఎంత మాత్రం లేదు. విభజన కనుక ఖచ్చితంగా జరిగితే నీటి విషయంలో ఇరు ప్రాంత ప్రజల మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. రాజధాని విషయంలో సీమాంద్ర ప్రాంత వాసులు నిత్యం కొట్టుకు చావాల్సిందే. దీనికి ఎవరు భాద్యులు?                            ఈరోజున్న కాంగ్రెస్ కాని,తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బి.జె.పి కాని రాబోయే భవిష్యత్తులో ఆంద్ర రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయాలో,అసలు న్యాయం అంటే ఎలా చేయాలో ఖచ్చితంగా తెలియదు. మరి ఏ అభివృద్ధి కోసం,ఏ న్యాయం కోసం ప్రజలు పోరాడాలి?అను నిత్యం ఇలా కొట్టుకు చావాలి. ఇప్పటికైనా ఈ నేతలు బుద్ధితెచ్చుకుని  అభివృద్ధి అంటే విభజన కాదు అని తెలుసుకుంటారా?  

ఒబామా ఒకసారి కమిట్ అయితే

  రసాయనిక ఆయుధాలను ఉపయోగించి అమాయకులయిన 1500 సిరియా ప్రజల ప్రాణాలు బలిగొన్న సిరియా అధ్యక్షుడు అసాద్ ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బాంబుల వర్షం కురిపిద్దామాని తెగ ఆత్రపడుతున్న అమెరికాకు రష్యా దేశం మోకాలు అడ్డుతోంది. ఇక నేడో రేపో మీట నొక్కడం తరువాయి అనుకొంటున్న తరుణంలో, రష్యా అధ్యక్షుడు వాల్దిమిన్ పుతిన్ జోక్యం చేసుకొని, సిరియా తన రసాయన ఆయుధాలను అప్పగించేందుకు ఒప్పించగలిగారు. దానితో యుద్ధానికి ఉరకలు వేస్తున్నఅమెరికా అధ్యక్షుడు ఒబామా కొంత వెనక్కు తగ్గవలసి వచ్చినప్పటికీ, ఇంగ్లాండ్ లేవనెత్తిన ధర్మ సందేహంతో యుద్దానికి మళ్ళీ కారణం, అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నారు. సిరియా తన రసాయన ఆయుధాలను అప్పగించినంత మాత్రాన్న అసాద్ చేసిన ఘోర కృత్యాలను క్షమార్హం ఎలా అవుతాయని ఇంగ్లాండ్ ప్రశ్న. అది కాక, ఆయుధాల అప్పగింతతో అమెరికా వెనక్కి తగ్గుతోందని తెలియగానే అసాద్ తన యుద్ద విమానాలతో స్వదేశంలో శత్రు శిభిరాలపై బాంబుల వర్షం కురిపించడంతో, అది అమెరికాకు మరో అవకాశం కలిగించింది. ఇక ఆరు నూరయిన సిరియాపై ‘సున్నితంగా’ పరిమిత ప్రదేశాలలోబాంబుల వర్షం కురిపిస్తానని ఒబామా ప్రకటించారు. అంటే సిరియా ప్రజలను అమెరికా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడని నిర్ధారణ అయినట్లే. ఒబామాగారికి మన దేశం మీద కూడా కోపం రాకూడదని ఆ దేవుడిని కాదు...కాదు... ఆ ఒబామానే ప్రార్ధిద్దాము.

రాజకీయ నాయకులకు, ఎన్జీవోల "సమైక్యాంధ్ర'' సభ గుణపాఠాలు!

      - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     బొంకరా గురవా అంటే, ఇదే అదననుకున్న సన్నాసి ఒకడు "ఆ గురజాల దోమలు గురిగింజలంత ఉంటాయిరా'' అని కోసేశాడట! భాషాప్రయుక్త ప్రతిపాదికపైన ఒకేజాతి, ఒకేభాషా సంస్కృతుల కుదుళ్ళపైన ఏర్పడిన విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చడం ద్వారానే పార్లమెంటులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ల తర్వాత అధికసంఖ్యలో [42 స్థానాలు] సభ్యుల బలంతో నెహ్రూ కుటుంబ వారసుడుగా ఈ తరం ప్రతినిథి అయిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం సాధ్యమని యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలైన సోనియాగాంధీ తలపోయడంతో తెలుగు రాష్ట్రం విచ్చిత్తికి బీజాలు నాటింది. అందుకోసం "బోడితలకూ మోకాలికి ముడి''పెట్టి, కుదరని ఆ ప్రక్రియకు కారకులు ఆంధ్రప్రదేశ్ లోని అవకాశవాద రాజకీయ పార్టీల మీదికి తెలివిగా నెట్టి కూర్చుంది. ముందుగా రాష్ట్రవిభజన సమస్యపైన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలాగా నీళ్ళు నమలకుండా కేంద్రంలో ఒక పాలకశక్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గ నేత్రిగా స్పష్టాతి స్పష్టంగా విభజన అనర్థమని సోనియా చెప్పలేకపోయింది!     రేపు కొడుకు రాహుల్ ని [ఆ శక్తి ఉన్నా లేకపోయినా] దేశప్రధానిగా గద్దెనెక్కించే తొందరలో తాడూ బొంగరం లేని ఒక ప్రాంతపు స్థానిక పార్టీని స్థాపించుకున్న రాజకీయ నిరుద్యోగ నాయకుడి బెదిరింపులకు లొంగిపోయి కాంగ్రెస్ భవిష్యత్తుకే చేటుతెచ్చి తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును అయోమయ పరిస్థితుల్లోకి నెట్టింది; వలస సామ్రాజ్యపాలనా వ్యవస్థపై తిరగబడిన జాతీయ స్వాతంత్ర్య సమరంతో బొత్తిగా పరిచయంలేని, అవగాహనలేని సోనియాను పార్టీకి అధినేత్రిగా నెత్తికెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోని "డూడూ బసవన్నలు'' కేవలం కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిపదవులను విడిచిపెట్టలేక, తెలుగుజాతిని చీల్చుతున్న అధినేత్రికి ఈ క్షణంలో కూడా కొమ్ముకాయడం తెలుగుజాతికే అవమానకరం.  ప్రపంచబ్యాంకి ప్రజావ్యతిరేక 'సంస్కరణల' చాటున దాగి దేశరాజకీయ, ఆర్థికవ్యవస్థా ప్రయోజనాలకే చేటుతెచ్చి, దేశాన్నే తాకట్టుపెట్టడానికి వెరవని కాంగ్రెస్ అధిష్ఠానం సుమారు 3000 సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగుజాతి సమైక్యతను కూడా పదవీప్రయోజనాల కోసం బలిపెట్టడానికి జంకదు!   తాజావార్తలను బట్టి [08-09-2013] చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రధానమంత్రి ప్రజావ్యతిరేక సంస్కరణలకు పురోహితుడైన డాక్టర్ మన్ మోహన్ సింగ్ ను తప్పించి రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోపెట్టే వైపుగా పావులు కదులుతున్నాయి. ఇందుకు సాక్ష్యం - ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేని మన్మోహన్ సింగ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే గాక, తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోగల స్థితిలో లేకపోవటం. అందుకు తగినట్టుగానే తన ఉత్తరాధికారిగా రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్షను దాచుకోలేకుండా బయటపెట్టడం - మధ్యయుగాల నాటి రాజరికపు సంస్కృతికే నిదర్శనం.   ఈ పూర్వరంగంలో, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి కేవలం నాయకత్వస్థాయిలోనూ, అదికూడా మూడు, నాలుగు "జక్కాయి బుక్కాయి'' రాజకీయపక్షాల క్యాడర్ కు ప్రధానంగా పరిమితమై "వేర్పాటువాద'' ఉద్యమాన్ని సాగలాగుతున్న ఆ పక్షాల తాలూకు రాజకీయ నాయకుల వల్ల సాధ్యంకాని లక్షలాదిమంది ప్రజాసమీకరణ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏ పార్టీల తోడ్పాటు లేకుండా, విభజనవల్ల మూడు ప్రాంతాలలోని ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.లు హైదరాబాద్ లో తలపెట్టిన "సమైక్యాంధ్ర'' మహాసభ (07-09-2013) ఘనంగా విజయవంతమయింది. సంకుచిత మనస్సుతో తెలుగుజాతి ప్రయోజనాలకు హానికల్గించే స్వార్థపూరిత లక్ష్యంతో కొందరు "ప్రత్యేకరాష్ట్ర'' వాదంతో నడుపుతున్న ఉద్యమకారులనుంచి వచ్చిన బెదిరింపులకు లోనుగాకుండా ఎ.పి.ఎన్.జి.వో.ల సమన్వయ సంఘం జరిపిన సదస్సు ఎంత ప్రశాంతంగా, ఎంతటి క్రమశిక్షణతో, ఎవరికీ ఇబ్బంది కల్గించని రీతిలో, ఉద్రేకాలకు లోనుగాకుండా, ప్రజల్ని కించించే తప్పుడు నినాదాలు లేకుండా ఆంధ్ర (తెలుగు)జాతి విడిపోరాదని, విడిపోతే చెడిపోతామన్న స్ఫూర్తితో రాష్ట్రరాజధాని నడిబొడ్డులో అత్యంత జయప్రదంగా ముగిసినసభ - కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులందరికీ పెద్ద కనువిప్పు కావాలి; గుణపాఠం కావాలి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా తెలుగుజాతి భవిష్యత్తుకోసం జాతి వికాసం కోసం, కేవలం జాతి మౌలిక ప్రయోజనాల రక్షణ కోసం ఉద్యోగులు బహుళసంఖ్యలో తలపెట్టిన మొట్టమొదటి సభ యిది. తెలంగాణాలో ఇంకా సజీవులుగా ఉన్న ఒకనాటి తెలంగాణా సాయుధ పోరాటయోధులు సహితం స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాత్రమే యిలా ఐచ్చికంగా వివిధ వర్గాల ప్రజలు ఎవరికి వారుగా చొరవతో ఇనుమడించిన దేశభక్తితో యిలా పాల్గొన్నారని వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగుజాతిని చీల్చడం కోసం రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వమూ ఉపసంహరించుకునే దాకా - ఎన్నిమాసాలు పట్టినా సరే, జాతికోసం "సమైక్యాంద్ర'' ఉద్యమం విశ్రమించబోదని ఇది జీతాలకోసం కాదు, జాతి జీవితాలకోసం జరుగుతున్న పోరాటమనీ ఉద్యోగులు, సభావారూ ప్రతినబూనటం యావత్తు తెలుగుజాతిలోనూ విశ్వాస సూర్యోదయాలు నింపింది!   ప్రజలతో నిమిత్తం లేకుండా, వివిధ ప్రాంతాల్లోని యావత్తు తెలుగుజాతి అభిప్రాయాలు తెలుసుకోడానికి జనవాక్య సేకరణ జరపకుండానే, ఏ పార్టీకి ఆపార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోటాపోటీలమీద తెలుగుజాతిని విభజించే 'నెగెటివ్' ప్రక్రియలో పడిపోయి, ముందుగా ఎలాంటి సొంత ప్రతిపాదన ప్రాతిపదికగా తానుగా కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ప్రకటించని దశలో  జాతి విధ్వంసకులుగానూ, ప్రజాబాహుళ్యానికి విశ్వసనీయ నాయకత్వం అందించలేని వాజమ్మలుగానూ ప్రధాన ప్రతిపక్షాలు అవతరించడం ఘోరం! మంచి పాలనా శాస్త్రానికి సంబంధించిన "పొలిటికల్ సైన్స్'' పదవికే ఈ ప్రతిపక్షాలు చెడు అర్థాలు, నెగెటివ్ నినాదాలూ, 'నిఘంటువు'ల కెక్కించడానికి తాపత్రయపడ్డాయి!   'సమైక్యాంధ్ర' రక్షణనే సభలో ప్రసంగించిన ఉద్యోగానాయకులు పదేపదే కోరుకున్నారుగాని సోదర తెలంగాణా తెలుగుబిడ్డల ప్రయోజనాలు పట్టని కొందరు రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా తెలుగువారు తెలుగుప్రాంతంలో తిరగడానికి 'వీసాలు'' పొందాలని కోరలేదు; 'తెలుగువాళ్ళు విడిపోతే చెడిపోతాం'' అన్నారేగాని కొందరిలా "కాళ్ళు విరగ్గొడతాం'' అనలేదు. "అందరం కలిసుందాం, కలిసి ఎదుగుదాం'' అన్నారేగాని "విడిపోతేనే వికాసం'' అనలేదు' ఉభయత్రా ఎదురయ్యే సమస్యలను "చర్చలద్వారా కలిసి పరిష్కరించుకుందాం'' అన్నారేగాని "నోరెత్తితే నాలుకలు కోసేస్తాం'' అనలేదు; రాజధాని హైదరాబాద్ ను "మూడుప్రాంతాల ప్రజల కష్టార్జితమ''న్నారేగాని ఉమ్మడి శ్రమఫలితంగా నిర్మించుకున్న "తెలుగువారి రాజధాని నుంచి తెలుగువారే వెళ్ళిపోవాల''ని ఉద్యోగ వక్తలు కోరుకోలేదు;   వీటన్నింటికిమించి, సమైక్యాంధ్ర మహాసభకు సీమాంధ్రనుంచి, హైదరాబాద్ చుట్టుపట్లనుంచి సమైక్యతాంధ్రను చెదరగొట్టరాదనీ భావించి బారీగా బస్సులలో, ఇతరవాహనాలలో తరలివస్తున్నప్పుడూ, సభను శాంతంగా, జయప్రదంగా ముగించుకుని తిరిగి తమతమ ప్రాంతాలకు వెడుతున్నప్పుడూ, పలుచోట్ల "ముసుగువీరులు'' కొందరిని ప్రేరేపించి ధైర్యంచాలక ఉద్యోగుల వాహనాలపైన రాళ్ళూరప్పలూ వేయించి గాయపరిచినా, సదస్యులు ఎదురుదాడి చేసి 'సీన్లు' సృష్టించలేదు; నిజాంకళాశాలలోని కొందరు విద్యార్థుల్ని సభకు వస్తున్న వారిపై రాళ్ళు రువ్వెందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు అజ్ఞాతంగా ప్రోద్భలపరిచినా, సభకు వచ్చిన ప్రతినిధులు గణనీయమైన సంఖ్యలో ఉన్నా సంయమనం పాటించారన్న ఇటీవల వెలసిన ఒకే ఒక స్థానిక పత్రికతప్ప ఆంగ్లపత్రికలు సహా మిగతా పత్రికలన్నీ పేర్కొన్నాయి! అన్నింటికన్నా విచిత్రమూ, సిగ్గుచేటైన విషయమూ - సభకు వస్తున్న సీమాంధ్ర ప్రతినిధులపైన రాళ్ళు విసురుతూ నిజాంకళాశాల భవనం మీదనుంచి ఒక విద్యార్థి జారిపడిపోయి క్షతగాత్రుడుకాగా, ఆ విద్యార్థిని భవనం మీదనుంచి పోలీసులు కిందకి తోసేశారని ఒక్క స్థానిక పత్రిక తప్ప మరే పత్రిక రాయకపోవటం. మిగతా పత్రికలన్నీ "రాళ్ళు విసిరే హడావుడిలో అతడే జరిపడ్డాడని రాశాయి!   అన్ని పత్రికలూ ఎ.పి.ఎన్.జీ.వో.ల "సమైక్యాంధ్ర మహాసభ'' ఘనంగా విజయవంతమైందని పతాకశీర్శికలు వార్త ప్రచురించగా సభనే ఒక "దండయాత్ర''గానూ, "సీమాంధ్రుల దాడిలో గాయపడిన తెలంగాణా'' అని తెలుగుప్రజల మధ్య రాజకీయ నిరుద్యోగులు మరింత విద్వేషాన్ని రగుల్కొల్పారు. మరో విచిత్రమైన అబద్ధం - సమైక్యతను కోరేవారి "గొంతుకలు కోస్తానని'' చాకు చూపించే ఒక వ్యక్తిది మార్ఫింగ్ చేసి ఒక స్థానిక ఛానెల్ చూపడం! ఈ విద్వేష ప్రచారం చాటున ఆ "గుప్పెడు'' రాజకీయ నిరుద్యోగులయిన దొరలు, భూస్వాములయిన పాత జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల సంతతీ మళ్ళీ తెలంగాణా ప్రజలపైన స్వారీ చేయడానికి, బడుగు బలహీనవర్గాల  బొమికలలో మిగిలిన 'మూల్గుల''ను కూడా పీల్చుకు తినడానికీ అధికారం చేజిక్కించుకోడానికే బలవంతంగా తెలుగుజాతిని చీల్చడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని తెలుగువారంతా గమనించాలి. ఈ సందర్భంగా, ఇంతకుముందు రాష్ట్రవిభజన విషయంలో కొంత 'పిడివాదం'లోకి జారుకున్నట్టు కన్పించిన మావోయిస్టు సోదరుల ధోరణిలో కూడా తాజాగా కొంత మార్పు కన్పిస్తోంది. "కోస్తాంధ్ర, రాయలసీమ మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఒక ప్రకటనను [ 06-09-2013] పత్రికలకు విడుదల చేసింది. రాష్ట్రవిభజన ప్రతిపాదనపైన స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అభిప్రాయాన్ని వెల్లడించకపోయినా భారతమావోయిస్టు పార్టీ కేంద్రీయ, ప్రాంతీయ మండలి తెలుగు "ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరమ''ని చాటి చెబుతోంది! ఆ ప్రకటనలో యింకా యిలా ఉంది : "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటువల్ల తలెత్తే స్సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోడానికి ప్రజాసంఘాలు, ఉద్యమసంస్థలు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కలిసి చర్చించుకుని ముందుకుపోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి పాలకవర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఆ వలలో (ట్రాప్)పడకుండా సమస్యలను సామరస్యంగా, న్యాయంగా పరిష్కారం చేసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ల పట్ల మూడుప్రాంతాల ప్రజలూ చైతన్యయుతంగా మెలగాలి''!   అంతేగాదు, ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన తదితర "సమస్త ప్రజానీకానికి'' మావోయిస్టుపార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శి హోదాలో 'ఆనంద్' పేరిట విడుదలయిన ఈ ప్రకటనలో మూడు ప్రాంతాల ప్రజలమధ్య "ఐక్యత, సంయమనం చాలా అవసరమ''ని మావోయిస్టు పార్టీ ఎందుకు భావిస్తోందో కూడా యిలా పేర్కొంది : "తెలంగాణా ఏర్పాటు విషయంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల దళారీ (కాంప్రచార్), నిరంకుశాధికార బడాపెట్టుబడిదారీ,భూస్వామ్యవర్గాలు సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కయి దోచుకోవడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా అణచివేస్తున్న ఈ తరుణంలో ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరం''!   సహృదయంతో మావోయిస్టు పార్టీ చేసిన ఈ ప్రకటనలో - ఈ మాత్రపు అవసరాన్ని కూడా ముందుగా గుర్తించకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన స్వార్థపూరిత వేర్పాటు ఉద్యమాన్ని పరోక్షంగా కూడా ఎందుకు ఆ పార్టీ ఎందుకని ఖండించలేకపోయింది? పత్రికావార్తలను బట్టి చూస్తే ఆ పార్టీ పరోక్షంగా కూడా రాజకీయ నిరుద్యోగులు కొందరు బూతులతో, అబద్ధపుప్రచారాలతో, ఇరుప్రాంతాల ప్రజలమధ్య పూడ్చుకోలేనంత విద్వేషా, విషపూరితంగా ఎక్కిస్తున్న దశలో మావోయిస్టుపార్టీ ఈ ఐక్యతా సందేశాన్ని యిచ్చి ఉంటే ప్రజల్ని బాగా ప్రభావితం చేసి ఉండేది! ఒక బడా వేర్పాటు వలసవాద 'దొర' ప్రారంభించిన స్వార్థపూరిత, కేవలం నాయక ప్రయోజన కేంద్రంగా అల్లిన కృత్రిమ ఉద్యమం ఆ నాయకుడుగాని, "మల్టీనేషనల్ కంపెనీ'' స్థాయిలో పెరిగిన అతడి కుటుంబం నుంచి ఎలాంటి త్యాగమూ చేయకుండా బడుగు, బలహీనవర్గాలకు చెందిన తెలుగుబిడ్డల్ని భ్రమలతో ఆత్మహత్యలవైపు నెట్టేశారు!   ఈ పరిణామదశలోనే కొన్నాళ్ళక్రితం నేను "సమాచార హక్కు చట్టం'' కింద ఆత్మహత్యల పాలైన బిడ్డల, కుటుంబాలకు చెందిన వివరాలను తెలుగువారి తెలంగాణాలోని పదిజిల్లాల నుంచి తెప్పించుకున్నాను. జిల్లాల పోలీసు ఉన్నతాధికారులనుంచి ఈ నివేదికలు అందాయి. నేనూ, తెలంగాణా మిత్రులు కొందరం వాటిని పరిశీలించడం జరిగింది. మొత్తం నివేదికల్ని పరిశీలించగా తేలిన సత్యం ఏమిటి? ఈ ఆత్మహత్యల్లో నూటికి 90 మందికిపైగా ఎస్.సి., ఎస్.టి., బి.సి. బలహీనవర్గాలకు చెందిన ముద్దుబిడ్డలవేనని రుజువైంది! అన్ని వేళలా, అన్నిత్యాగాలూ వృధా అయినవిగా భావించకూడదు. కాని కొందరు స్వార్థపూరిత లక్ష్యంతో ప్రారంభించే ఉద్యమంలో తప్ప ప్రాంతాల నిజమైన పురోగతి కోసం, సామ్యాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి, విమోచన పోరాటాలలోకి, పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాల దోపిడీకి నిరసనగా జరిగే ఉద్యమాలలోకి దూకే వీరకిశోరాల త్యాగాలు మాత్రమే బేషరతు త్యాగాలవుతాయి, విలువైన త్యాగాలవుతాయి, కనుకనే అలాంటి త్యాగాల కోసం "అడ్వాన్స్ గ్యారంటీల''తో ఎవరూ ప్రవేశించరు! అలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించరు. కాని తెలుగుజాతిని చీల్చడం కోసం కొందరు రాజకీయ నిరుద్యోగులు జరుపుతూవచ్చిన విభజనోద్యమానికి నాయకుల పదవీస్వార్థం మినహా మరొక లక్ష్యం లేదు. కనుకనే నిజమైన ప్రజాతంత్ర ఉద్యమానికి చుక్కాని పట్టగలిగిన శక్తులు వేరు. అలాటివాళ్ళను వేరుచేసి ముందుగా "శిలువ వేసో, షూట్ చేసో, విషమిచ్చో ధనికవర్గ శక్తులు చంపేస్తాయి. ఈ విషయాలు తెలిసిన మావోయిస్టు పార్టీ ఆలస్యంగానైనా తాజాగా విభజనోద్యమం వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయో, సమైక్యాంధ్ర విశాలాంధ్రగా రూపొంది, పెట్టుబడిదారీ చట్రం అనుమతించిన పరిధుల్లోనే పరిమితుల్లోనే, అంతకుముందు రెండు రకాల పరాయిపాలనలలో (బ్రిటిష్, నిజాముల హయాముల్లో) ఎన్నడూ నోచుకోనంత అభివృద్ధిని సాపేక్షంగా మాత్రమే నమోదు చేస్తున్న సమయంలో ఆ పార్టీ కేంద్రీకరణ, ఈ పరిమిత ప్రగతిని పునాది చేసుకుంటూనే మరిన్ని "జాంబవంతుడి అంగల''తో సమున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించగల సామాజిక సమూల పరివర్తనా శకాన్ని ఆవిష్కరించే దిశగా శక్తియుక్తుల్ని వొడ్డవలసి ఉంటుంది!   పెట్టుబడిదారీ, అర్థ భూస్వామ్య సమాజవ్యవస్థలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ జిల్లాల మధ్య అనివార్యమయ్యే అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, దోపిడీవ్యవస్థకు కాపలాదార్లుగా మాత్రమే 'రాణించ'గల రాజకీయ నిరుద్యోగ నాయకులు స్వార్థప్రయోజనాలతో అధికార లాలసతో తలపెట్టే ఉద్యమాలను నిర్ద్వింద్వంగా సకాలంలో ఖండించి, బలంగా నిరసించాల్సిన బాధ్యత పురోగామి శక్తులయిన మిలిటెంట్ శక్తులదే కావాలి. ఇందుకు చిన్న ఉదాహరణ టాంక్ బండ్ పై నెలకొన్న మూడుప్రాంతాలవారి తెలుగు తేజోమూర్తులయిన సంస్కృతీపరుల విగ్రహాలను విధ్వంసం చేసిన తరువాత అందులో పాల్గొన్నవారిని ఆ విధ్వంసకాండకు బాధ్యత వహించిన కొన్ని పార్టీలు ఎవరికివారు ఎదుటివారి మీదకు నెట్టేశారు. అలా నెట్టిన వారిలో "మార్కిస్టు-లెనినిస్టు'' ముద్రలతో చెలామణీ అవుతున్న "సెక్షన్లు'' కూడా ఉన్నాయని గమనించాలి! ఇప్పుడు కూడా "సమైక్యాంధ్ర మహాసభ'' ద్వారా క్రమశిక్షణతో, వేలెత్తి చూపడానికి వీలులేని సంయమనంతో సర్వత్రా శాంతియుతంగా వ్యవహరించిన ఎ.పి.ఎన్.జీ.వో.లను "సీమగూండాలుగా, రౌడీలు''గా ముద్రవేయడానికి కొందరు వేర్పాటువాదులు ప్రయత్నించడాన్ని యిప్పటికైనా మావోయిస్టుమిత్రులు పరిగణనలోకి తీసుకోవాలి!   "ఎదురుబొంకు'' సామెతను గుర్తుంచుకోవాలి! అటు సీమాంధ్రను, ఇటు దక్కన్ లోని హైదరాబాద్ సంస్థానాన్ని 300-400 సంవత్సరాలపాటు వలసలుగా మార్చుకుని ఏలిన బ్రిటిష్ సామ్యాజ్యవాదులు, నిజాంపాలకులూ పరస్పరం దొంగచాటు ఒప్పందాల ద్వారా అటు కోస్తాంధ్రను, ఇటు తెలంగాణాను, అటు రాయలసీమనూ ప్రజల సంపదనూ దోచుకుని పొందిన అపారమైన ధనరాశులతో ఇరుపక్షాల రాజ్యాలు కాపాడుకున్నారని మరవరాదు; ఈ పాలకుల మధ్య ఈనాటి మాదిరిగానే ఆనాడూ బ్రిటిష్ వాళ్ళకు ఉత్తరాంధ్రను, మధ్యాంధ్రను, రాయలసీమనూ నిజాం నవాబులు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్న సంపదతోనూ, తెలంగాణా ప్రజలను దోచుకున్న సంపదతోనూ హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అందుకే హైదరాబాద్ యావత్తు తెలుగుజాతికేగాక, అనేక బాధలకు గురైన సామాన్య ముస్లిం ప్రజాబాహుళ్యానికి కూడా రాజధానిగా రూపుదిద్దుకుంది. ఈ వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించి, వ్యూహాన్ని తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణ కోసం ముందడుగు వేయక తప్పదు! ఒక్కసారి తెలంగాణా సాయుధపోరాట యోధుడైన దేవులపల్లి వెంకటేశ్వర్రావు అన్న మాటల్ని మావోయిస్టులు గుర్తుచేసుకోవడం మంచిదికాదా? దేవులపల్లి మాటల్లో "ఒకే భాషా సంస్కృతులకు పునాదిగా ఏర్పరచుకున్న రాష్ట్రంలో యావత్తు తెలుగుజాతికి మాత్రమే స్వయంనిర్ణయహక్కు ఉంటుందిగాని, జాతిలో ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు!

తెరాస ఉనికిని కాపాడుకొనేందుకే విద్వేష ప్రచారం

  తెరాస నేతలు తాము బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఊహించినదాని కంటే చాలా విజయవంతంగా ముగియడంతో సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు.   సభ సందర్భంగా వేలాది మంది తరలి వస్తున్నపుడు బయట జరిగిన చిన్నచిన్నసంఘటనలను, సభలో పోలీస్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీశైలంలపై జరిగిన దాడి, సభలో జరిగిన అవకతవకలను, నేతల ప్రసంగాల వంటివి వాటిని తెరాస నేతలు భూతద్దంలో ఎత్తి చూపుతూ, ఆవేశంతో ఉన్నతెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తెరాస నేతలు ప్రజాగ్రహాన్నితమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా జరిగిన యావత్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నపటికీ, ఈ విషయంలో వారందరూ చాలా సంయమనంతో మాట్లాడటం గమనార్హం. అందుకు వారిని మెచ్చుకోక తప్పదు.   కాంగ్రెస్ తీసుకొన్నవిభజన నిర్ణయంతో తెరాస ఉనికి ప్రశ్నార్ధకమవగా, తెలంగాణాలో టీ-కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ దుగ్ధతోనే తెరాస నేతలు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ వారి ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని తిప్పలు పడుతున్నారు.   హైదరాబాదులో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించడం నిజంగానే బల ప్రదర్శన అని ఒప్పుకోక తప్పదు. బల ప్రదర్శనకు వచ్చిన వారు, అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్ప నాలుగు శాంతి ప్రవచనాలు చెప్పుకొని ‘మమ’ అనుకోని వెళ్లిపోరనేది తెరాస నేతలకు కూడా తెలుసు. ఈ సందర్భంగా తెరాస నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విగ్రహాల విద్వంసం ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటే మంచిది. ఒకవేళ ఆ రోజు వారికి ఎవరయినా సమైక్యవాది ఎదురుపడి ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించి ఉండి ఉంటే, అతనికీ సభలో పోలీస్ కానిస్టేబుల్ కి పట్టిన గతే పట్టేదనేది కాదనలేని సత్యం.   తెరాస నేత హరీష్ రావు సభకు వచ్చినవారికి ఆహారం, పాలు, పళ్ళు, పూలు ఇచ్చి గౌరవించాలని చెపితే, ఏపీఎన్జీవోలు తిరిగి వెళుతున్నపుడు వారి బస్సులపై కొందరు రాళ్ళతో దాడి చేసినపుడు కొంత మందికి గాయాలయ్యాయి. సమైక్యవాదులు తెలంగాణా విద్యార్ధులపై దాడి చేసారని ఆరోపిస్తున్నతెరాస నేతలు, ఈ దాడిని ఖండించలేదు, గాయపడినవారి పట్ల సానుభూతి చూపలేదు, కనీసం ఆ దాడిని ప్రస్తావించలేదు కూడా.   ఉద్రేకంగా ఉన్న రెండు సమూహాలు ఎదురయితే ఇటువంటి ఘర్షణలు తప్పవనే సంగతి తెలిసినప్పటికీ, తెరాస నేతలు ప్రజల మధ్య మరింత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకున్నతెలివిడి తెరాస నేతలకి లేక కాదు. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకే వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారు.   ఒకసారి కేసీఆర్ , మరొకసారి ఈటెల, ఇంకోసారి హరీష్ రావు ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణా వేడిని కొనసాగిస్తుంటారు. ఈ నేతలందరూ మళ్ళీ అదే నోటితో ఆంధ్రా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుతామని పలకడం చూస్తుంటే నోటితో నీతులు పలుకుతూ, నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది.

కేసీఆర్ రెచ్చగొట్టినందునే సభ జరుగుతోందా?

  తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ నిర్ణయం ప్రకటించిన తరువాత, హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడి, వారిలో లేని భయాందోళనలను కలిగించడం వలననే, నేడు ఏపీయన్జీవోలు హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.   మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ అసలు కేసీఆర్ కి 2014ఎన్నికల వరకు తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేనందునే ఆవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తెలంగాణా ప్రక్రియ జాప్యం జరిగేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ డిల్లీలో కూర్చొని ఏమి చేస్తున్నాడని ఆయన ప్రశించారు. తెలంగాణా ఏర్పాటయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నాడని ప్రశ్నించారు.   వారిరువురూ ఎపీయన్జీవోలను కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. హైదరాబాదులో సభను నిర్వహిస్తూ వారు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.   తెదేపా నేతలిరువురు చెప్పిన మాటలలో వాస్తవం ఉంది. నిజానికి కేసీఆర్ “ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందే. వారికి వేరే ఆప్షన్ ఉండవు” అని చెప్పిన తరువాత నుండే వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. నాటి నుండే ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభాజను వ్యతిరేఖిస్తూ నిరసన దీక్షలు మొదలుపెట్టారు. అది తెలంగాణా ఉద్యోగులకు కోపం కలిగించడం సహజమే గనుక వారు కూడా ఆంధ్ర ఉద్యోగులతో పోటాపోటీగా దీక్షలు మొదలుపెట్టారు. తత్ఫలితంగా నేడు రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యం అయిపోయాయి. నిన్న హైకోర్టులో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలు వాటికి పరాకాష్టగా నిలిచాయి. ఈ భయాందోళనలే నేడు వారిచే సభ నిర్వహింపజేస్తున్నాయి. తెదేపా నేతలు అదే మాట చెప్పారిప్పుడు.   నిజానికి కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర విభజన తరువాత చట్ట ప్రకారం జరుగవలసిన తంతు అంతా జరిగినప్పుడు, ఉద్యోగులలో బదిలీల మీద ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోయి ఉండేవారు. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నవారికి బదిలీలపై ఊర్లు మారడం తప్పదని వారికి తెలియకపోదు. కానీ కేసీఆర్ అన్నమాటలతో వారి భవిష్యత్ పట్ల అకస్మాత్తుగా అంతవరకు లేని భయాందోళనలు మొదలయ్యాయి. దానికి తోడూ తెరాసలో అతని కుటుంబ సభ్యులు కూడా వారిలో ఆ భయాందోళనలు మరింత పెరిగే విధంగా మాట్లాడేరు.   తెరాస నేతలు ఆంద్ర-తెలంగాణా ఉద్యోగుల మద్య జరుగుతున్న గొడవలలో తలదూర్చుతూ వారి మధ్య విద్వేషాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. సీమంధ్ర నేతలు కూడా అదేపని చేస్తున్నారంటే వారు తెలంగాణాను వ్యతిరేఖిస్తునందునే ఆపని చేస్తున్నట్లు అర్ధంఅవుతుంది. కానీ తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న తెరాస కూడా అదే పనిచేయడం చూస్తే నిజంగానే వారికి తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేదని భావించాలేమో! దీనిని బట్టి తెరాస నేతలెవరికీ కూడా ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పడటం ఇష్టం లేదని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు నిజమేననిపిస్తోంది.

తెదేపా కూడా తెలంగాణాను వదులుకొబోతోందా

  కాంగ్రెస్ ప్రయోగించిన విభజనాస్త్రానికి మొదట వైకాపా తెలంగాణా వదిలిపెట్టి పారిపోగా, ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్న తీరు చూస్తే, త్వరలో తెదేపా కూడా తెలంగాణా నుండి మూట ముల్లె సర్ధుకొనే పరిస్థితి కనబడుతోంది. సీమంద్రాలో పార్టీని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనకపోయిన్నపటికీ, ఆయన బొత్తిగా తెలంగాణా సంగతి మరిచిపోయినట్లుగా సీమంధ్ర తరపున వఖల్తా పుచ్చుకొని మాట్లాడటం చూస్తుంటే తెదేపా కూడా తెలంగాణాను వదిలిపెట్టేయబోతోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.   రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన కొత్తలో ఆయన సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కేంద్రం నాలుగయిదు లక్షల కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అంటే ఆయన రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లేనని వైకాపా ప్రచారం మొదలుపెట్టడంతో ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. ఆయన ఆత్మగౌరవ యాత్రలో మాట్లాడుతున్నమాటలు సమైక్యవాదాన్ని సమర్దిస్తూ ఉండటంతో, ఇప్పుడు కాంగ్రెస్, తెరాసలు కూడా తెలంగాణపై ఆయన వైఖరిని స్పష్టం చేయమని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇక పార్టీలోని తెలంగాణా నేతలయితే ఒకవేళ చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటే అప్పుడు తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలో చేస్తున్న ప్రసంగాలను వారు నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఆయన ఇదే ధోరణి కొనసాగిస్తే పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా తెలంగాణా నేతలందరూ ఒకరొకరుగా పార్టీని వీడే అవకాశముంది. అందువల్ల ముందుగా చంద్రబాబు ఇంటిని చక్కబెట్టుకొని ఆ తరువాత రాష్ట్రాన్ని, దేశాన్ని చక్కబెట్టే ఆలోచన చేస్తే మేలేమో! లేకుంటే ఆయన యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేసరికి తెలంగాణా నేతలెవరూ పార్టీలో కనబడరు.

అగాధంలో రూపాయి

  నేడు భారత దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీనికి కారణాలు అనేకం. అన్నీ ప్రభుత్వ విధానాలతో కూడుకున్న కారణాలు. నేటి యు.పి.ఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రధాన కారణం. నేటి ప్రభుత్వానికి ఓట్ల మీదున్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదు. అందుకు ఉదాహరణగానే రోజుకొకటి పుట్టుకొస్తున్న ప్రజాకర్షక పధకాలు. నేటి రూపాయి పతనం డాలరుతో పోలిస్తే 68 రూపాయిలు దాటుతోంది. దీనితో భారత ఆర్ధిక పరిస్థితి 1990-91 నాటి పరిస్థితికి దిగజారిందా అన్నంత ఆందోళన కలిగిస్తుంది.   నేటి దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటానికి అప్పటి ప్రధాని,ఆర్ధిక మంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ఎన్నో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. వాటిలో భాగంగా పారిశ్రామిక సరళీకరణ,సబ్సిడీలను తగ్గించటం,ఎన్నో పొదుపు చర్యలను చేపట్టటం లాంటి విధానాలను అనుసరించి దేశం ఆర్ధిక ప్రగతి వైపు పయనిస్తుందనే నమ్మకం పెట్టుబడిదారులలో కలిగించి,దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటం జరిగింది. కాని అప్పటి ఆర్ధిక మంత్రిగా పనిచేసిన నేటి ప్రధాని హయాంలో,మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తున్నప్పటికి అప్పటి భిన్నమైన పరిస్థితులను కలుగచేసి పెట్టుబదిదారులలో అపనమ్మకాన్ని కలిగించటంమే నేటి ఈ రూపాయి పతనానికి కారణమయ్యింది.   పెట్టుబడిదారీ వ్యవస్థలు వ్యతిరేకించే సబ్సిడీలని పెంచుతూ,సంక్షేమ పధకాలను మరింత పెంచుతూ పెట్టుబడులను వెనుకకు వెళ్ళే పరిస్థితిని సృష్టించారు. గ్యాస్ మీద సబ్సిడీ ఇంతకు ముందు నుండి ఇస్తున్నప్పటికీ దానిని నగదు బదిలీ పధకం కింద మార్చి అదొక కొత్త సంక్షేమ పదకంగా చూపించటం ఒక కారణం కాగా లక్ష కోట్లు దాటిన ఆహారభద్రత అనే మరొక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఈ యు.పి.ఎ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా రాజ్యంగా మారుస్తున్నామనే సంకేతం పంపటం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరిగి రూపాయి మరింత పతనం దిశగా పయనిచింది. ఇక పొదుపు చర్యలనేవి ఎక్కడా కానరావటం లేదు. ఓట్లు మరియు సీట్లు తప్ప దేశ ఆర్ధిక ప్రగతితో మాకు సంబంధం లేదు అనేటట్లు నేటి ప్రభుత్వం ప్రవర్తించటం పేద,ధనిక లేదా మధ్య తరగతి అనే భేదం లేకుండా ప్రజలంతా మూల్యం చేలిచుకోవలసి వస్తోంది.   నేడు సామాన్య ప్రజలతో పాటు MLA,MP లు మరియు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు కూడా ఈ రూపాయి పతనం వలన కలిగే నష్టాలను గుర్తిస్తున్నట్లు లేరు. ఎగుమతులు,దిగుమతుల వ్యత్యాసం కూడా బాగా పెరిగిపోవటం కూడా నేటి ఈ దుస్థితికి కారణం. ఈ ఎగుమతులు దిగుమతులు డాలరు కరెన్సీలో జరుగుతున్నపుడు దిగుమతుల విలువ ఎంత ఉంటుందో ఎగుమతుల విలువ కూడా అంతే ఉండాలి. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో డాలరుకు డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. ఎగుమతులను పెంచటానికి దిగుమతులను తగ్గించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామ మాత్రంగా ఉన్నాయి.   ఈ రూపాయి పతనం వలన ప్రజల పై ఉండే ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 1. 70%పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం వలన పెట్రోల్,డీసెల్ ధరలు విపరీతంగా పెరిగి,దీని ద్వారా రవాణా చార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది. 2. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు , డీసెల్ లాంటివి విద్యుత్త్ ఉత్పత్తికి ఉపయోగించటం వలన విద్యుత్త్ చార్జీలు విపరీతంగా పెరిగి ప్రజల పై మరింత భారం పడుతుంది. 3. రైలు,బస్సు,ఆటో లాంటి చార్జీలు కూడా పెరిగి ప్రజల పై ప్రయాణ చార్జీల భారం కూడా పడుతుంది. 4. నేటి నిత్యావసర వస్తువులలో చాలావాటిని దిగుమతి చేసుకోవటం వలన దాదాపుగా అన్నిటి ధరలు అంటే సబ్బులు,సర్ఫ్ లు,సెంట్లు,పేస్ట్ లు,సెల్ ఫోన్లు,పళ్ళు,కూరగాయలు ,ఉల్లి ,వెల్లుల్లి,కళ్ళజోళ్ళు,కాలిజోళ్ళు,తలకు రాసుకునే నూనెలు,పౌడర్లు,ఒక్కటేమిటి అన్నిటిని దిగుమతి చేసుకోవటానికి మనం అలవాటుపడ్డాము,తదనుగుణంగానే వాటన్నిటి ధరలు పెరిగి,భారం కానున్నాయి. 5. నేడు టి.వి,సెల్ ఫోన్ కార్ లాంటివి ప్రజలకు విలాసంగా కాక నిత్యావసరంగ మారటం గమనించ దగ్గ విషయం. వీటిలో వాడే విడి భాగాలనో లేదా మొత్తంగానో దిగుమతి చేసుకోవటం వలన వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 6. నేడు ప్రపంచమంత ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న తరుణంలో చాలామంది విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ డాలరు విలువ పెరగటంతో విదేశీ ప్రయాణం మరింత భారం కానుంది. 7. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఆ చదువుల ఫీజులు మోయలేనంత భారం కానున్నాయి. 8. ఈ భారం ఔషధ పరిశ్రమల మీద పడి మందుల ధరలు అధికమవటం కారణంగా వైద్య సేవలు ఇహ ముందు అందుబాటులో లేనివిధంగా ఖరీదు కానున్నాయి. 9. ఎరువులు,విత్తనాలు దిగుమతి చేసుకోవటం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు,పొగాకు,పత్తి,మొదలైనవన్నీ ప్రియం కానున్నాయి.   నేడు అధికార పక్షం కాని,ప్రతిపక్షం కాని వోట్ బ్యాంకు రాజకీయాలను వదిలి దేశ ఆర్ధిక ప్రగతి గురించి,దేశ భద్రత గురించి ఆలోచించ వలసిన సమయం ఆసన్న మయింది. అలా కాకుంటే మనదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. సమర్దవంత మైన పరిపాలన ద్వారా వోట్లు పెంచుకోవాలని చూడాలే కానీ,ప్రజాకర్షక పధకాల ద్వారానో,విభజనల ద్వారానో వోట్లు పెంచుకోవాలని చూడడం నీచ రాజకీయానికి పరాకాష్ట.   - సాయి లక్ష్మి

ఆ జాదూ అందుకే పనిచేయలేదా

  రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను తెలంగాణా వాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేఖించేవారు. ఇంకా రాష్ట్ర విభజన జరుగక ముందే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణం, రాజకీయ పార్టీల కప్పగంతులు తదితర అంశాలన్నీఆజాద్ భయాలు నిజమని ఋజువు చేస్తున్నాయి.   రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు ఎదురయిన అనుభవాలు, ఆజాద్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని, వాటిపై కూలంకుషంగా చర్చించిన తరువాతనే విభజన ప్రకటన చేసామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలకు జవాబు చెప్పలేకపోతోంది. అంతే గాక మళ్ళీ వెనకడుగు వేయక తప్పడం లేదు.   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రవిభజన చేయాలని ఆరేడు నెలల క్రితమే నిర్ణయించుకొన్నట్లు వచ్చిన వార్తలు గమనిస్తే, అంత సమయం ఉంచుకొని కూడా క్లిష్టమయిన అంశాలకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రకటన చేసినట్లు అర్ధం అవుతోంది. కనీసం ప్రకటన మరికొంత కాలం జాప్యం చేసి ముందుగా ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదేమో.   అయితే, తెరాస నుండి తానెత్తుకు వచ్చిన తెలంగాణా అంశాన్ని, హైదరాబాద్ పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోడీ ఎక్కడ ఎగురేసుకు పోతాడో అనే భయంతోనో లేక మరో కారణంతోనో కాంగ్రెస్ చాలా హాడావుడిగా రాష్ట్ర విభజన ప్రకటన చేసేసి తన గొయ్యి తానే తవ్వుకొంది.   క్లిష్టమయిన రాష్ట్ర విభజన సమస్యను తలకెత్తుకోవడం ఎందుకనే ఆలోచనతోనే బహుశః గులాం నబీ ఆజాద్ దానిని నాన్చుతూ కాలక్షేపం చేసి ఉండవచ్చును. అయితే ఆయన ధోరణి నచ్చకనో లేక రాష్ట్ర విభజన చేసిన ఘనత దక్కించుకోవాలనే ఆలోచనతోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తప్పించి ఆయన స్థానంలో స్థానంలో దిగ్విజయ్ సింగ్ ను నియమించింది. రాహుల్ గాంధీకి చెక్కభజన చేసే దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు చెప్పటిన నెలరోజుల లోగానే, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పావులు కదిపి రాష్ట్ర విభజన ప్రకటన చేసేసారు. గులాం నభీ ఆజాద్ చేయలేని ఘనకార్యం దిగ్విజయ్ సింగ్ చేసినప్పటికీ, అది సమస్యను పరిష్కరించక పోగా కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. మరి దీనిని ఆజాదూ మాయం చేస్తాడో లేక మన సింగ్ బాబే దిగ్విజయంగా పూర్తిచేస్తాడో చూడాలి.

హరికృష్ణకి గాలం వేస్తున్న వైకాపా

  వైకాపా తన బద్ధ శత్రువయిన తెదేపాను, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని చాలా కాలంగా వ్యూహాలు రచిస్తోంది. ఫ్లెక్సీ బ్యానర్స్ వ్యూహంతో హరికృష్ణ, అతని కుమారుడు జూ.యన్టీఆర్-చంద్రబాబు, బాలకృష్ణలకు మధ్య ఆ పార్టీ పెట్టిన చిచ్చుఅందుకు ఒక చక్కటి ఉదాహరణ. సమైక్యనినాదం అందుకొన్న వైకాపా, హరికృష్ణను కూడా మెల్లగా ఆ ముగ్గులోకి లాగి, చంద్రబాబుకి తెలియకుండా చాలా కధ నడిపినట్లు తెలుస్తోంది.   చంద్రబాబు, బాలక్రిష్ణలపై కోపంతో రగిలిపోతున్నహరికృష్ణను ఆయుధంగా చేసుకొని తేదేపాపై గురిపెట్టేందుకు వైకాపా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేవరకు చంద్రబాబుకి కూడా తెలియదు. రాజీనామా చేసిన తరువాత తను కూడా సమైక్యాంధ్ర కోరుతూ బస్సు యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడం కూడా వైకాపా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. తద్వారా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నహరికృష్ణను పార్టీ నుండి బహిష్కరించినట్లయితే ఆయనని వైకాపా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అప్పుడు ఆయనతో బాటు ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ కూడా వైకాపాకు బోనస్ గా దొరుకుతాడు. అంతే గాక, తెదేపా సమైక్యాంధ్రకు వ్యతిరేఖమనే భావన కూడా ప్రజలలో కలిగిన్చావచ్చును.   ఒకవేళ బహిష్కరించకపోయినట్లయితే, హరికృష్ణ చేస్తున్నసమైక్యవాదంతో తేదేపాకు తెలంగాణాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో తనకు, తేదేపాకు మధ్య చిచ్చుపెట్టింది వైకాపాయేనని హరికృష్ణకు తెలిసినప్పటికీ, ఆయన ఆ పార్టీ ఉచ్చులోనే చిక్కుకోబోతున్నట్లు కనబడుతున్నారు.   చంద్రబాబు మీద ద్వేషంతో ఒకవేళ ఆయన వైకాపాలో జేరినట్లయితే ఆయన ఆ పార్టీలో ఎంతో కాలం ఇమడలేరు. ఎందుకంటే, ఆయనవంటి ఆవేశపరుడు జగన్ మోహన్ రెడ్డి వంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తితో ఎంతో కాలం సర్దుకుపోలేరు. మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే వైకాపా ఆయనను చంద్రబాబు, తెదేపాలపై ఆయుధంగా వాడుకోవాలని, జూ.యన్టీఆర్ స్టార్ ఇమాజ్ ని వాడుకోవాలనే ఆలోచనతోనే పార్టీలోకి ఆహ్వానించవచ్చుతప్ప ఆయనేదో గొప్పవాడని, గొప్ప ప్రజాకర్షణగల నేతని కాదు.   ఒకవేళ హరికృష్ణ వైకాపాలో జేరినట్లయితే, ఆయన తన జీవిత కాలంలో జూ.యన్టీఆర్ ను ఉన్నత పదవిలో చూసే అవకాశం లేదు. ఎందుకంటే వైకాపాలో ఆ అవకాశం కేవలం జగన్ మోహన్ రెడ్డికే రిజర్వ్ చేయబడి ఉంది. ఈ విషయం గ్రహిస్తే హరికృష్ణ తెదేపా వీడే సాహసం ఎన్నడూ చేయరు.

రాజ్యస‌భ‌లో ఉల్లి లొల్లి

  మ‌న రాష్ట్రంలో ప్రజ‌ల‌ను భ‌య‌పెడుతున్న నిత్యవ‌స‌ర వ‌స్తువుల మంట రాజ్యస‌భ‌ను తాకింది. సోమ‌వారం స‌భ ప్రారంభం కాగానే మ‌న రాష్ట్రంలో మండిపోతున్న ఉల్లిధ‌ర పై స‌భ‌లో గంద‌ళ‌గోలం నెల‌కొంది. దాంతో స‌భ రెండు సార్లు వాయిదా ప‌డింది. స‌భ తిరిగి ప్రారంభం కాగానే మాజీ రాజ్య సభ్యులు దిలీప్ సింగ్ జుదేవ్, ఎస్ ఎం లాల్ జాన్ బాషాల మృతి, ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో మ‌ర‌ణించిన నౌకా సిబ్బంది మృతి పట్ల చైర్మన్ హమీద్ అన్సారీ సంతాపం తెలిపారు. త‌రువాత మ‌రోసారి రాజ్యస‌భ‌లో నిర‌స‌లు మొద‌ల‌య్యాయి. వామపక్షాల సభ్యులు లేచి, ఉల్లిపాయల ధరలు మండి పోతున్నాయ‌ని ప్రభుత్వం చొర‌వ తీసుకొని ధ‌ర‌ల‌ను నియంత్రించాల‌ని కోరారు. స‌భాప‌తి ఎన్నిసార్లు వారించిన స‌భ్యులు విన‌క‌పోవ‌టంతో స‌భ‌ను మ‌రోసారి వాయిదా వేశారు. ఆ త‌రువాత కూడా స‌భ‌లో పరిస్థితి ఏ మాత్రం మార‌క‌పోవ‌టంతో మ‌రోసారి వాయిదా వేశారు.

పటేల్ సమైక్యతా సందేశాన్ని గాలికి వదిలేసిన మోడీ!

     - డా. ఎబికె ప్రసాద్   [సీనియర్ సంపాదకులు]   పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుందా? కాదు కనుకనే, దానికి 'మేకవన్నె పులి' అని పేరు పెట్టాల్సివచ్చింది! మేడిపండు చూపులకు మేలిమిగా కనిపిస్తే చాలా? దాని పొట్ట విప్పితే చాలు, అన్నీ పురుగులేనని ప్రజలకు తెలుగు! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవస్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలనావ్యవస్థనూ కొండేళ్ళుగా మభ్యపెడుతూ కేసులనుంచి తప్పించుకుని తిరుగుతూ వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన 'కంట్లో దూలాల్ని' చూసుకోకుండా ఎదుటివారి కళ్ళల్లో నలుసుల్ని వెతకచూడ్డంలో ఆరితేరిన వాడు! అశేష త్యాగాల ద్వారా భారత ప్రజాబాహుళ్యం అరవై అయిదేళ్ళనాడు సాధించుకున్న స్వాతంత్యాన్నీ, సెక్యులర్ (మతాతీత, లౌకిక)వ్యవస్థా స్థాపనను ప్రజలకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరుదశాబ్దాలలో అటు కాంగ్రెస్ పాలకులూ, ఇటు రాజేకీయ ముసుగులో పాలనా శక్తిగా 'హిందుత్వ'పేరిట అవతరించిన భారతీయ జనతా పార్టీ నేడు 'మోడీత్వ'రంగులో క్రమంగా నాయకులు బయటపడ్డారు! కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్య వలస పాలకుల మాదిరిగానే విభజించి-పాలించే దుర్నీతికి బి.జె.పి. మతరాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''కూ, విదేశీ బహుళజాతి కంపెనీల, దేశీయ గుత్తపెట్టుబడి వర్గాల ప్రయోజనాలకూ తమ తమ పదవీప్రయోజనాల కోసం గొడుగు పట్టడంలో కాంగ్రెసూ, బి.జె.పీ. నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్ర్యోద్యమం గుర్తించి ఏకభాషా, సంస్కృతులు పునాదిగా భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని బలవంతంగా తిప్పికొట్టేందుకు ఈ రెండు మత రాజకీయశక్తులూ తమ ఉనికికోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టి ప్రజలమధ్య ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడడం లేదు. ప్రజల వకాలిక సమస్యలయిన తిండి, బట్ట, వసతి, ఉపాథి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పతకాలను అమలు జరిపే బాధ్యతనుంచి ఈ రెండు పార్టీలు రోజురోజుకీ ప్రజలనుంచి దూరమవుతూ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజమైన 'చిట్కా'ను - విభజించి-పాలించే నీటిని ఆశ్రయించి ప్రజలమధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి పదవీ ప్రయోజన కాంక్ష దేశ విభజనతోనే ప్రారంభమయి కొనసాగుతోంది!   ప్రజలమధ్య, రాష్ట్రాలమధ్య తగవులు, తంపులు పెట్టే 'సంస్కృతి' ఆధారంగానే స్వాతంత్ర్యానంతర కాంగ్రెస్ అధిష్ఠానమూ, అనంతర దశలో బిజెపి నాయకులూ పంజాబ్ ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా)దగ్గరనుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లను ఛత్తీస్ గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లుగా ముక్కలుగా బద్దలుకొట్టడం వరకూ కీలకమైన పాత్రవహించాయి. ఈ 'విభజన' రాజకీయ కుట్రలో ప్రధాన సమర్థన "విడిపోవటం వికాసం'' కోసమేననీ, "విడిపోయి కలిసి ఉందా''మనీ చేసే విషప్రచారం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయపక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థప్రయోజనాల కోసం, అందరూ ఆమోదించిన భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెడగొట్టి, సమైక్యంగా మెలగుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురు చేయడానికి సంకల్పించాయి; ఈ విచ్చిన్నకర విధానం పైననే ఈ రెండు పక్షాలూ ఆధారపడి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే యత్నంలో ఉన్నాయి! తమ మత, కుహనా లోకిక రాజకీయాలు ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు సమాజంలోని అట్టడుగు వర్గాల, బడుగుబలహీన వర్గాల ప్రయోజనాలను 'రక్షించ'డానికే తాము ఉన్నట్టుగా 'సినీ'పరిభాషలో 'బిల్డప్' యిచ్చుకుంటున్నాయి.   ఉదాహరణకు బిజెపి-ఎన్.డి.ఎ. హయాము కృత్రిమంగా ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పరచడానికి చెప్పిన 'సాకు' ఏమిటి? ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించామని! కాని ఆ లక్ష్యం నెరవేర లేదు సరికదా, ఎ మూడు రాష్ట్రాల నుంచి వీటిని ఎ ఉద్దేశ్యంతో 'చీల్చామ'ని చెప్పాలో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాథిరంగాలలో చట్టబండలు చేశారు; ఐక్యరాజ్యసమితి, దేశీయ సాధికార సంస్థలూ అజ్రిపిన సర్వేక్షణల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు సరికదా, అక్కడి మైనింగ్ వ్యాపారాలు సాగించడం కోసం గిరిజనుల భూముల్ని మల్టీనేషనల్, దేశీయ బడా కంపెనీలు స్వాధీనం చేసుకుని వందలాది కోట్ల రూపాయల్ని దోచుకుతింటున్నాయి. ఆమాటకొస్తే అసలు ఈ ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసింది - తిలాపాపం తలా పిడికెడూ పంచుకుని, అమాయక ఆదీవాసీ జనాలను, బడుగువర్గాలనూ పస్తుల్లోకి నెట్టడం! ఈ రెండు రాజకీయపక్షాలూ పోటాపోటీలతో పెంచిన ముఖ్యమంత్రులు పరమ అవినీతిపరులు కావటమూ, ఈ భారం దుర్భరమైనప్పుడు వారిని జైళ్ళపాలుచేయక తప్పని పరిస్థితులకు 'తాళి'కట్టడమూ!   ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇటీవల హైదరాబాద్ లో సభ తీర్చిన బిజెపి 2014 ఎన్నికల సమన్వయ సంఘానికి సీనియర్ నాయకుడైన అద్వానీని పక్కకునెట్టి నరేంద్ర మోడీని రథసారథి చేశారు! ఉద్దేశ్యం - మతరాజకీయాల ద్వారా తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన బిజెపి గత అయిదేళ్ళక్రితం వరకూ కర్నాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణభారతంలో కాలు మోపలేని బిజెపి మొదటిసారిగా కర్నాటకలో పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అక్కడినుంచి స్థానికంగా కర్నాటకలో ఎన్నిరకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈనాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కోలిపోయి, ప్రస్తుతం పాలనాశక్తిగాబిజెపి పాలన కేవలం నాలుగురాష్ట్రాలకు కుదించుకుపోయింది! పైగా ఈ నాల్గింటిలోనూ రెండు రాష్ట్రాలు [గోవా, మోడీవారి గుజరాత్] రాజకీయంగా ప్రాధాన్యతలేని కేవల సత్తరగాయాలుగా మిగిలిపోయాయి! చివరికి దక్షిణాదిన చేజిక్కించుకున్న ఆ 'ఒక్కాయికొక్కు' కర్నాటక సహితం ఈ ఏడాది (2013) మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా అవమానకరంగా బిజెపి చేజారిపోయింది! అంతకుముందు జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది; ఇక 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని జనతాదళ్ తో పొత్తువల్ల బిజెపి ఘనంగా ఎన్నికైనట్టు కనపడింది. కాని నరేంద్రమోడీ పార్టీ కేంద్ర రాజకీయాల్లో చోటుచేసు కావటంతో లోక్ దళ్ తో పొత్తు చిత్తు కావలసివచ్చింది! కాగా 2009 లోక్ సభ ఎన్నికల్లో ఈ "పొత్తు'' 40 లోక్ సభ స్థానాల్లో 32 స్థానాలను గెలుచుకుంది. కాని 1999 ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న బిజెపి 2009లో సొంతంగా ఆ స్థానాలను మాత్రమే నిలుపుకోగల్గింది. కాని 2013 మోడీ బిజెపి అధిష్ఠానంలోకి రావటంతో బీహాల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుజరాతీ మోడీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కారణం? మోడీతో జోడీవల్ల జనతాదళ్ కు అంతకుముందు తనకు దగ్గరయిన బీహార్ లోని 17 శాతం ముస్లీం మైనారిటీల తాను మద్ధతు కోల్పోవలసి వస్తుందని భావించాడు! ఇక జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు 2013 జనవరిలో బిజెపి ప్రభుత్వాన్ని కూలగొట్టాయి, ఫలితంగా రాష్ట్రపతి పాలన వచ్చింది! ఇక 2012లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది! ఇక దేశంలోనే అతిపెద్ద జనాభా గల ఉత్తరప్రదేశ్ లో, ఎన్నికల వ్యూహంలో, సీట్ల సంఖ్యలో అత్యంతగా పార్లమెంటులో బలాబలాల్ని ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ లో 2012 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో కేవలం 47 స్థానాలనే బిజెపి గెలుచుకోగలిగింది. మూడవ పార్టీగా మాత్రమే పరువు నిల్పుకున్నది. 2007లో కూడా కేవలం 51 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది; అంటే 2002 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడైన రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండికూడా బిజెపి 88 సీట్లతోనే సరిపెట్టుకోవలసివచ్చింది. అంటే 2002 నుంచీ ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బి.ఎస్.పి. పార్టీలు వంతులవారీగా ప్రభుత్వాలు నిర్వహిస్తూ అనేక వైఫల్యాలకు కారణమవుతున్నాగాని ఆ వైఫల్యాలను తనకు అనుకూలంగా బిజెపి మార్చుకోలేక పోవటానికి ప్రధాన కారణం - దాని హిందుత్వ, మోడీత్వ, ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ మత రాజకీయాలే! ఇలా ఉత్తరప్రదేశ్ లో రానురానూ బిజెపి పతనమవుతూ వచ్చింది. 1996 తర్వాత జరిగిన 4 అసెంబ్లీ ఎన్నికల్లోనో ఆ రాష్ట్రలో ఈ పార్టీ మొత్తం (425 అసెంబ్లీ స్థానాల్లో) వోట్లలోనూ, సీట్ల సంఖ్యలోనూ కూడా క్రమంగా పతనమవుతూవుతూ వచ్చింది. సరిగ్గా ఇందువల్లనే అది 2000-2001 లో కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో ఉన్నప్పుడే బిజెపి ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ ను ఏర్పాటు చేస్తేనైనా కేంద్రంలో తన ప్రభుత్వం నిలుస్తుందేమోనని చీల్చడానికి సాహసించింది! అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారాన్ని సహించలేనప్పుడు దాన్ని ముక్కలు చేసి ఛత్తీస్ గడ్ ను, బీహార్ లో తన పాలనలేదని జార్ఖండ్ నూ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది! ఇంతకూ అన్నింటికన్నా ఉత్తరప్రదేశ్ అంతటి పెద్ద రాష్ట్రాన్ని చీలగొట్టాలన్న తలంపు బిజెపికి రావడానికి కారణం పార్లమెంటు సభ్యులలో గణనీయమైన సంఖ్యా అక్కడినుంచే ఎన్నిక అవుతూండటం. అందుకే "యు.పి. అంటే ఇండియా, ఇండియా అంటే యు.పి.'' అన్న వ్యంగ్యవర్ణన జనంలో పాకిపోయింది! నెహ్రూ-ఇందిర పాలనలనుంచి నేటి సోనియా-రాహుల్ కాంగ్రెస్ వరకూ ఈ టప్పుడు సమీకరణే రాజ్యమేలుతోంది. అందుకే 'సుపరిపాలన'. 'అభివృద్ధి' మంత్రాలను తన ఆర్థిక దోపిడీకి ఆకర్షణీయ సూత్రాలుగా ప్రకటించిన వరల్డ్ బ్యాంకు అటు కాంగ్రెస్ పాలకులకు, ఇటు బిజెపి పాలకులకూ సమాన 'ఆరాధ్య'దైవమయింది! ఎవరికివారు తమ పాలనలను "వెలిగిపోతున్న ఇండియా'' అని తమకు తామే నినాదాలు ఎన్నికల సమయంలో సృష్టించుకుని ప్రజలను భ్రమల్లోకి నెట్టి కూర్చున్నారు. ఒడ్డు చేరుకునే వరకూ బోటు మల్లయ్యను మర్యాదగా పిలిచి, దాటింతర్వాత "బోడి''మల్లయ్య అన్నట్టు మోసగించడానికి అలవాటు పడ్డారు. అదే పద్ధతిలో హైదరాబాద్ సభలో నరేంద్రమోడీ స్థానంలేని ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని నిలపడంకోసం "వికాస''పురుషుని వేషంలో తెలుగుజాతిని విడగొట్టేందుకు, ఐక్య ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసేందుకు రాజకీయ కుట్రలో భాగస్వామి అవుతున్నాడు!   కాని వందలాదిమంది రైతాంగ ఆత్మహత్యలకు, పోష్టకాహారానికి దూరమైపోయిన వేలాదిమంది బాలబాలికల, శిశువుల అకాలమరణాలకు నిలయమైన [ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం] గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతం తనను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని చాలాకాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన [జామ్ నగర్, సురేంద్రనగర్, రాజ్ కోట, అమ్రేలి, భావనగర్, పోర్ బందర్, జూనాఘడ్] సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్యమం అక్కడ ఉదృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగుజాతిని రెండుగా చీల్చడం ద్వారా, వేర్పాటు ఉద్యమానికి ఊతంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని పెంచాలని కలలుగంటున్నారు. గుజరాత్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బిజెపికి నాలుగు సీట్లు పెంచుకోవాలి, తద్వారా ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలి, అదీ రంధి! అందుకోస్సం నెహ్రూకు పోటీగా సర్థార్ వల్లభాయ్ పటేల్ కు నిలువెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించారట! కాని పటేల్ నిలబడింది - భారతదేశ సమైక్యతకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాస్ష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా స్వార్థపూరితమైన విభజన ద్వారా తన 'వికాసం' కోసం కాదు!   ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పునర్విభజన కోసం నియమించిన మొదటి ఫజత్ ఆలీ కమీషనూ, నిన్నమొన్నటి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని - ఏకీకృత సమైక్యాంధ్రకే, విశాలాంధ్రకే స్పష్టంగా పేర్కొన్నాయని మరచిపోరాదు. శ్రీకృష్ణ కమీషన్ ఆరు ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యతను, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపులాగా సమైక్యరాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీనని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్రమోడీగాని, అతడిలాంటి బిజెపి నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952 జులైలో పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని బట్టీపట్టకపోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ లేదా ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్థార్ పటేల్ ముఖం వాచేలా యిలా హెచ్చరించారు:   "ఉత్తరబెంగాల్ లోని గూర్ఖాలాండ్ లేదా గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తమైన, అసహజమైన, జాతీయప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారతప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రారంభించే ఎలాంటి ఉద్యమానికి ఎలాంటి అవకాశం యివ్వరాదని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది' ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్రప్రభుత్వం సహించబోదు''! ఈ విషయంలో పటేల్ ఏకభాషా సంస్కృతులు ఆధారంగా సహేతుకమైన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహజమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ స్పష్టం చేశారని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది!

జగన్, విజయమ్మల రాజీనామాతో కొత్తగా ఒరిగేదేమిటి

  ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.   తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోయింది. వైకాపా తెలంగాణాలో తన దుఖాణం బంద్ చేసుకొన్న తరువాత కూడా, ఇప్పటికీ దైర్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి తాము వ్యతిరేఖమని చెప్పకపోవడం చూస్తే, మళ్ళీ ఎప్పటికయినా ఆ ప్రాంతంలో తమ పార్టీ బ్రతికిబట్ట కట్టకపోతుందా అనే ఒక చిన్న ఆశ వారిలో ఇంకా మిగిలి ఉన్నట్లు అర్ధం అవుతోంది.   ఇక వారు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించి, తమ చేతిలోంచి జారిపోయిన ఉద్యమంపై పట్టు సాధించడానికే. తాము మొదలుపెట్టిన సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు హైజాక్ చేసుకుపోయి, తెలంగాణా నేతలతో తీవ్ర వాగ్వాదాలు చేస్తూ మంచి ఆసక్తికరమయిన డ్రామా నడిపిస్తు, సమైక్యాంధ్ర కోసం తామే చాలా కష్టపడుతున్నట్లు ప్రజలందరిని నమ్మించ గలుగుతున్నారు.ప్రజలు కూడా కాంగ్రెస్ ఆడుతున్న ఈ డ్రామా పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.    ముఖ్యమంత్రి మొదలుకొని ఉండవల్లి, లగడపాటి, కావూరి, ఘంటా, టీజీ, శైలజానాథ్ ఇలా చెప్పుకొంటూ పోతే సీమంధ్రకోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలలిస్టు చేంతాడంత ఉంది. కానీ వైకాపా నేతల పేర్లు ఎక్కడా వినబడవు. అందువల్ల ప్రజలందరి దృష్టి కూడా కాంగ్రెస్ మీదనే ఉంది. ఇక సీమంధ్ర ప్రజలు, ప్రభుత్వ సంస్థలు కూడా ఎవరి దారిన వారు స్వతంత్రంగా ఉద్యమాలు చేసుకు పోతుండటంతో ఇప్పుడు వైకాపా పని పులుసులో కరివేపాకులా తయారయింది. ఒక్క కాంగ్రెస్, తెదేపా నేతలు, సాక్షి మీడియా తప్ప వైకాపా ఊసెత్తేవారే లేరిప్పుడు.   తెలంగాణాలో తమ పార్టీని బలిపెట్టుకొని మరీ మొదలుపెట్టిన సమైక్య ఉద్యమంలో తమకు ఇటువంటి పరిస్థితి రావడాన్నివారు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ప్రజల దృష్టిని తమవైపు ఆకర్షించాలంటే ఇటువంటి మంచి కార్డులు వేయవలసిందే. అందుకే జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మలు రాజీనామాలు చేసి గేమ్ లో ‘షో’ చెప్పేశారు.   అయితే నిజానికి అది షో కాదు ‘డ్రాప్’ అని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ రాజకీయ చదరంగంలో వారు తెలంగాణాలో గేమ్ ఓడిపోయిన తరువాత మళ్ళీ సీమంద్రాలో కూడా మరో మారు ఓడిపోయారు.

రాజకీయ చదరంగంలో పావుగా మారిన ఐఏయస్ ఆఫీసర్

  ఉత్తరప్రదేశ్ కి చెందిన దుర్గా నాగ్ పాల్ అనే 27ఏళ్ల ఐఏయస్ ఆఫీసర్ అధికార సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ పార్టీల మద్య జరుగుతున్నవికృత రాజకీయ క్రీడలో పావుగా మారిపోయింది. ఆమె నొయిడా జిల్లాలో గల కడల్పూర్ అనే గ్రామంలో అక్రమ నిర్మాణం చేస్తున్న ఒక మసీదు గోడని కూల్చి వేసి, మతఘర్షణలు చెలరేగేందుకు కారణమయ్యారని సమాజ్ వాది ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే, ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు, ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ సమయంలో మశీదు గోడను కూల్చివేసినట్లు స్థానికులు, వక్ఫ్ బోర్డు సభ్యులే చెపుతున్నారు.   కొందరు సమాజ్ వాది నేతల అండతో సాగుతున్నఇసుక మాఫియాను ఆమె  డ్డీ కొనడంతో, వారే ఆమెను తమకు అడ్డు తప్పించేందుకు ఇదంతా చేసినట్లు బయట పడటంతో దుర్గా నాగ్ పాల్ కు ఉత్తరప్రదేశ్ మీడియా తోబాటు జాతీయ మీడియా కూడా మద్దతుగా నిలిచింది.   అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమయిన ఉపకధ కూడా ఉంది. మసీదు గోడ కూల్చిన సంగతి తెలియగానే, స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యుడు టాకూర్ దీరేంద్ర సింగ్ తన అనుచరులను వెంటబెట్టుకొని వెంటనే కడల్పూర్ గ్రామానికి వెళ్లి స్థానిక ముస్లిములను కలిసి వివరాలను సేకరించి పీసీసీకి, కాంగ్రెస్ (27వ తేదీన) అధిష్టానానికి చేరవేసాడు.   ఆ మరునాడు ఆ గ్రామంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు లక్నోమరియు డిల్లీ నుండి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వస్తున్నట్లు తెలుసుకొన్నసమాజ్ వాదీ ప్రభుత్వం, వారు దీనిని రాజకీయం చేసి తన ముస్లిం వోటు బ్యాంకును గండి కొట్టేందుకు వస్తున్నారని గ్రహించిన వెంటనే, ఇదంతా తన మెడకు చుట్టుకోకూడదనే ఆలోచనతో, సంబందిత ప్రభుత్వాదికారులను పరగులు తీయించి 27వ తేదీ అర్ధరాత్రిపూట డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యాలయం తెరిచి, అక్కడి నుండి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు స్థానిక మాజిస్ట్రేట్ కు ఫాక్స్ మెసేజ్ పంపారు.   కానీ, ఆ మరునాడు కాంగ్రెస్ నేతలెవరూ అక్కడికి రాకపోవడంతో అఖిలేష్ ప్రభుత్వం తాము తొందరపడి దుర్గాను సస్పెండ్ చేసినట్లు గ్రహించింది.   ఈ విషయమంతా మీడియాకి పొక్కడంతో, ఇక ప్రభుత్వం కూడా తన తప్పును సమర్దించుకోక తప్పలేదు. ఒకవైపు మీడియా అఖిలేష్ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అకిలేష్ యాదవ్ ఆ విమర్శలకు ధీటుగా స్పందించినప్పటికీ, ఈ వ్యవహారం మరింత ముదిరితే ప్రమాదమని భావించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దుర్గా నాగ్ పాల్ తో రాజీయత్నాలు మొదలుపెట్టింది.   మశీదు గోడ కూల్చేందుకు తానే ఆదేశాలు జారీ చేసానని అంగీకరిస్తూ క్షమాపణ పత్రం వ్రాసి ఇచ్చినట్లయితే, సస్పెన్షన్ ఆర్డర్స్ వెనక్కు తీసుకొంటామని ఆమెకు కబురు పంపింది. అయితే, ఏ తప్పు చేయని తాను క్షమాపణ కోరే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడంతో ప్రభుత్వం కంగు తింది. ప్రస్తుతం ఈ కధ సుప్రీం కోర్టుకి చేరుకోంది. ఈ నెల 22న సుప్రీం కోర్టు ఈ కేసు విచారణ చేపట్టబోతోంది.   ఈ కధలో కొసమెరుపు ఏమిటంటే, ఆమెను అవినీతిపై పోరాడే దుర్గామాతగా మీడియా వర్ణించడం జీర్ణించుకోలేని రాష్ట్రమంత్రి అజాం ఖాన్, ఆమె పేరులో కేవలం దుర్గా అనే పేరు ఉన్నందునే మీడియా ఆమెకు అంత అనవసరమయిన ప్రాదాన్యం ఇస్తోందని, లేకుంటే అసలు ఆమెను పట్టించుకొనే వారే ఉండరని అన్నారు.

తెరాస మరో కొత్త నాటకం షురూ

  ఈ రోజు తెరాస మరో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. “కేసీఆర్ ని హతమార్చడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని, అందుకు సుపారీ కూడా ఇచ్చినట్లు తమకు తెలుసని, ఆ కుట్రలు ఎవరు ఎందుకు పన్నుతున్నారో కూడా తమకు బాగా తెలుసునని, కానీ సమయం వచ్చినప్పుడు అది బయటపెడతామని, కేసీఆర్ పై ఈగ వాలినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని ” ఆయన మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కు ప్రభుత్వం వెంటనే జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేసారు.   కాంగ్రెస్ తెరాసను, కేసీఆర్ ను పక్కనబెట్టి తెలంగాణా ప్రకటించేసినప్పటి నుండి ఆయన పరిస్థితి, ఆ పార్టీ పరిస్థితి కూడా కుడితిలో పడిన ఎలుకవలే ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు కాంగ్రెస్ తెలంగాణా సెంటిమెంట్ ఎత్తుకుపోవడమే కాకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. తెరాస బెట్టు చేస్తుంటే, మరో వైపు ఆ పార్టీ నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు. విలీనం చేస్తే అసలు తన ఉనికినే కోల్పోయే ప్రమాదం. చేయకపోతే పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం.   ఇటువంటి పరిస్థితుల్లో ఏదో విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తమ రాజకీయ మనుగడ ఉండదని వారు భావిస్తున్నారు. అందుకే మొన్న ఆంధ్రా ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవలసిందే అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాని పరిణామాలు రోజూ అందరూ చూస్తూనే ఉన్నారు.ఈ రోజు “కేసీఆర్ హత్యకి కుట్ర’ అంటూ ఆ అగ్నికి మరింత ఆజ్యం జోడించారు. దీని విపరీత పరిణామాలు రేపటి నుండి బయటపడినా ఆశ్చర్యంలేదు. ఈవిధంగా విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం వలన అంతిమంగా నష్టపోయేది వారే తప్ప వేరేవరూ కాదు. అయితే ఈవిధంగా ఎంత కాలం నెట్టుకు రాగలమని వారే ఆలోచించాలి.   కేసీఆర్ హత్యకు నిజంగా ఎవరో కుట్ర పన్నుతున్నారని తెలిస్తే ముందుగా ఆయనకి ఏ ప్రమాదం జరుగకుండా మరింత భద్రత పెంచి జాగ్రత్త పడాలి. ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో కూడా వారికి తెలిసినపుడు ముందుగా ఆ విషయం మీడియాకు కాకుండా పోలీసులకి చెప్పి రక్షణ కోరి ఉండాలి. ఆయన హత్యకు కుట్ర జరుగుతున్నసంగతి తెలిసినప్పటికీ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాని ఏదో శుభకార్యం జరగబోతున్నటు మీడియాలో ప్రకటించుకోవడం నీచ రాజకీయమే.   ఆయన హత్యకు ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలుసినపుడు సదరు కుట్రదారులపై పోలీసులకి పిర్యాదు చేయాలి. కానీ అలాచేయకుండా సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయట పెడతామని చెప్పడం చూస్తే దానివెనుక దాగిన వారి చవకబారు ఆలోచనలకి కనపడుతాయి. తమ రాజకీయ మనుగడకోసం ఇటువంటి కపట ఆలోచనలు, ఎత్తులు వేస్తే అది బెడిసికొట్టడం ఖాయం. అబద్దాల పునాదుల మీద పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తే అది వారికే నష్టం.   అసలు ముందు కేసిఆర్ కి ఆయన స్వంత పార్టీ నేతల నుండే ఏమయినా ప్రమాదం పొంచి ఉందేమో పోలీసులు విచారించాలి.

హరికృష్ణ రాజీనామా! ఎందుకో

  కేంద్రం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసేవరకు మౌనం పాటించిన సీమంధ్ర నేతలు ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అసలు తమ రాజీనామాలతో వారు ఏమి సాధిద్దామనుకొంటున్నారో, అసలు దానివల్ల కేంద్రం మనసు మార్చుకొంటుందని వారు నిజంగా నమ్ముతున్నారో లేదో, లేక సీమంధ్ర ప్రాంతంలో తాము మిగిలిన వారికంటే వెనుకబడిపోతామని భయపడి రాజీనామాలు చేస్తున్నారో గానీ మొత్తం మీద ఒకరిని చూసి మరొకరు పోటీలుపడి మరీ రాజీనామాలు చేస్తున్నారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కూడా వారం వర్జ్యం, ముహూర్తం అన్ని సరి చూసుకొని ఆదివారం ఉదయం 8.30 గంటలకు యన్టీఆర్ ఘాట్ వద్ద నాటకీయంగా రాజీనామా చేసారు.   అయితే, ఆయన రాజ్యసభ సభ్యుడుగా ప్రజలకు ఏమి మేలు చేసారో తెలియదు కానీ, కనీసం రాజ్యసభకు నామినేట్ చేసిన తెదేపా కోసం కూడా ఆయన చేసిందేమీ లేదు. తెదేపా సభలు సమావేశాలు జరిగిన ప్రతీసారి వచ్చి అలకలు, చిరాకు ప్రదర్శించడమే తప్ప ఆయన పార్టీకి ఒరగబెట్టిందేమి లేదు. ఇక పార్టీ (చంద్రబాబు) తనకు చాలా అన్యాయం చేసిందంటూ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకి కూడా దూరంగా ఉంటున్న ఆయన గత కొద్ది రోజులుగా మళ్ళీ పార్టీ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. బహుశః వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు.   నందమూరి కుమారుడుగా ఆయన పార్టీ టికెట్ ఆశిస్తే ఆశించవచ్చు తప్ప, లేకుంటే ఆయన ఏవిధంగాను అందుకు అర్హులు కారని చెప్పవచ్చును. ఆయన ఏనాడు బాధ్యతగల పార్టీ సభ్యుడిగా వ్యవహరించలేదు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు ఏమి చేసారో ఆయనే చెప్పాలి. అటు పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏవిధంగాను అక్కరకు రాని ఆయన, తనకు తీరికున్నపుడు వచ్చి ఒకసారి పార్టీకి, ప్రజలకి మొహం చూపించి మాయమయిపోతుంటారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగినపోయిన తరువాత వారం వర్జ్యం ముహూర్తం అన్ని చూసుకొని నాటకీయంగా రాజీనామా ఇవ్వడమెందుకు?   ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఆ తేడా ఎన్నడూ కనబడలేదు. అందువల్ల ఆయన రాజీనామా చేయడం వలన ఆయనకే వ్యక్తిగతంగా కొంత నష్టం జరుగుతుంది తప్ప ప్రజలకి కానీ, పార్టీ గానీ మాత్రం ఎటువంటి మేలు జరుగదు. ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఇవ్వచును కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే అందుకు ప్రతిగా ప్రజలు వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటేస్తారని హామీ ఏమీ లేదనే సంగతి ఆయన తెలుసుకొంటే మంచిదేమో.

హైదరాబాద్ పై మొదలయిన చిచ్చు

  హైదరాబాద్ పై రెండు ప్రాంతాలవారి పట్టుదలలు గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉన్నపటికీ, దానిపై సరయిన వివరణ ఈయకుండా, హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లుప్తంగా చెప్పి రాష్ట్ర విభజన ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం హైదరాబాద్ పై స్పష్టత ఈయకపోవడంతో దానిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు, వాదనలు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. కొంత మంది నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంటే, మరికొందరు దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మరో సరికొత్త రాజధానులు ఏర్పరచాలని వాదిస్తున్నారు.   చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న మంత్రి సి.రామచంద్రయ్య హైదరాబాద్ ను శాశ్వితంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మరో సరికొత్త ప్రతిపాదన చేసారు. అయితే, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి మధ్య తెలంగాణా ప్రాంతాలు ఉండటం వలన హైదరాబాదును శాశ్విత ప్రాతిపాదికన రాజధానిగా చేయడం అసాదయం. అయినప్పటికీ, అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నిన్న కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపివచ్చిన చిరంజీవి కూడా హైదరాబాద్ ను శాశ్విత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని కోరడం గమనిస్తే బహుశః కేంద్రం కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇటువంటి ప్రతిపాదనలు చేసినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదు.   రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే, ముందుగా రాజధాని హైదరాబాద్ పై రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న భయాలు, అపోహలు, అనుమానాలను తొలగించవలసి ఉంటుంది. హైదరాబాద్ మరియు ఇతర అంశాలను అధ్యయనంచేసి ఇరు ప్రాంతాల వారికి ఆమోధయోగ్యమయిన తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు నిన్ననే ప్రకటించింది.   అయితే, కేసీఆర్ వంటి అతివాదులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తుండటం వల్ల, అక్కడ స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల భయాందోళనలు మరింత పెరిగాయి. అనేక సంవత్సరాలుగా ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగులలో ఇటువంటివి చిచ్చు పెట్టి వారి మధ్య ఉద్రిక్తతలకు పెంచడం ఖాయం. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించడం ఖాయం. అందువల్ల కేంద్రం హైదరాబాద్ ను ముందు తన అధీనంలోకి తీసుకొని ప్రజల అపోహలు దూరం చేయడం మంచిది. లేకుంటే రెండు ప్రాంతాల అతివాదుల వాద ప్రతివాదాల కారణంగా ప్రజల మధ్య ఘర్షణ చెలరేగితే మరో కొత్త సమస్య మొదలవుతుంది. చేతులు కాలిన తరువాతనే ఆకులు పట్టుకొనే అలవాటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇకనయినా ఆ అలవాటు మానుకొని ముందుగానే మేల్కొంటే మంచిది.