రాష్ట్ర విభజనలో హైదరాబాద్ పంచాయితీ

 

రాష్ట్ర విభజనలో వేరే ఏ ఇతర అంశాల దగ్గరయినా పట్టు విడుపులు చూపుతున్న రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ అంశం వచ్చేసరికి అది తమకే చెందాలని బిగుసుకుపోతున్నారు. అందుకు కారణం హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధికరాజధానిగా నిలవడమే. హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం లేకపోతే రెండు ప్రాంతాలు కూడా మనుగడ సాగించడం కష్టం. భారీ పరిశ్రమలు, మెట్రో రైల్, విద్య వైద్య, సినీ, వ్యాపార సంస్థలు అన్నీకూడా హైదరాబాద్ లోనే నెలకొని ఉండటంతో రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అక్కడి నుండే వస్తోంది. అటువంటి హైదరాబాద్ ను వదులుకొంటే అటు తెలంగాణా అయినా, ఇటు సీమంధ్ర ప్రాంతమయిన ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు పుచ్చుకొన్నపటికీ మళ్ళీ ఆ స్థితికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టడం ఖాయం. ఒకవేళ దైర్యంచేసి ప్యాకేజీకి ఒప్పుకొన్నాఅవినీతికి ఆలవాలమయిన నేటి రాజకీయ వ్యవస్థలో అది సక్రమంగా వినియోగించబడుతుందనే నమ్మకం ప్రజలకి లేదు. అందుకే, రెండు ప్రాంతాల నేతలు హైదరాబాద్ కోసం అంతగా పట్టుబడుతున్నారు.

 

ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఏపార్టీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టినా రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్ ని అభివృద్ది చేయడమేనని అపోహలోఉంటూ, కేవలం హైదరాబాద్ అభివృద్దిపైనే దృష్టి పెడుతూ, మిగిలిన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకి అతీతంగా తమ తమ ప్రాంతాలను సర్వతోముఖాభివృద్ధికి నిబద్దతగా కృషిచేసి ఉంటే నేడు హైదరాబాద్ గురించి ఈ గొడవలు ఉండేవే కావు.

 

అందువల్ల హైదరాబాద్ కోసం పట్టుబడుతున్న తెలంగాణా లేదా సీమంద్రా ఉద్యమకారులనో ఇందుకు నిందించవలసిన పని లేదు. తమ ప్రాంతాలను అబివృద్ధి చేసుకోవాలనే తపన లేని ప్రజాప్రతినిధుల వలననే నేడు ఈ సంకట పరిస్థితి ఏర్పడింది గనుక దానికి వారినే తప్పుపట్టవలసి ఉంటుంది.