వైకాపాతో స్నేహానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ

 

మొన్న దిగ్విజయ్ సింగ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గురించి రెండు మంచి ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత, అధిష్టానం మనసులో ఆలోచనలను పసిగట్టేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అందివచ్చిన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలని ఎంతో భక్తిశ్రద్దలతో చాలా ఘనంగా నిర్వహించేసారు. నిన్న మొన్నటి వరకు వారిలో చాల మంది ఏదో విధంగా ఆయనని తప్పుపట్టినవారే. కానీ డిల్లీ నుండి ప్రసారమవుతున్న సిగ్నల్స్ కి అనుగుణంగా తమ మైండ్ సెట్ కూడా వెన్వెంటనే మార్చేసుకొని, కొందరు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గొప్పదనం గురించి లెక్చర్లు ఇవ్వగా, మరి కొందరు అన్నదాన, రక్తదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

 

కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా మళ్ళీ ఆయనపై ఇంత అభిమానం ఎందుకు పుట్టుకు వచ్చిందంటే దానికి కారణం ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. ఒకప్పుడు ‘రాజశేఖర్ రెడ్డి మా స్వంతం కానీ అతని కొడుకు మాత్రం మాకు శత్రువేనని’ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ కొడుకుది కూడా మా డీ.యన్.ఏ.నని చెప్పుకోవడం ఎందుకంటే, రానున్నఎన్నికలలోఅతనితో పొత్తులకోసమేనని చెప్పవచ్చును. రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణా అంశము, మరో వైపు జగన్, తెదేపాలు ఉన్నందున, రాష్ట్రంలో తాము మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలపక తప్పదనే చేదు నిజం గ్రహించిన్నందునే ఇప్పుడీ అవ్యాజమయిన ప్రేమ పుట్టుకొచ్చింది.

 

అయితే రాత్రికి రాత్రే పొత్తులు కుదుర్చుకోవడం వీలుపడదు గనుక, ఇప్పటి నుండే దానికి తగిన వాతావరణం కల్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ హైదరాబాదులో రెండు మంచిముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన దిగ్విజయ్ సింగ్, మళ్ళీ డిల్లీలో దిగిన తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుల గురించి మీడియాతో మరోసారి మాట్లాడారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలోని నేతృత్వంలోని సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని ఖరారు చేస్తుందని, అందులో భాగంగానే వైకాపా అంశాన్నీ పరిశీలించే అవకాశాలున్నాయని, అయితే తుది నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీయే తీసుకొంటారని ఆయన అన్నారు. ఈ విధంగా తరచూ జగన్ మోహన్ రెడ్డి పార్టీతో పొత్తుల గురించి మాట్లాడుతూ, ప్రజలు కూడా దానికి మానసికంగా అలవాటుపడిన తరువాత అప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తులో లేక విలీనం గురుంచో ఒక అవగాహనకు రావచ్చును.

 

అంటే అప్పటి నుండి ఇక ఒకరి తప్పులు మరొకరికి ఇంకా కనబడవన్నమాట. అయితే అంతవరకు షర్మిల, విజయమ్మ తదితర వైకాపా నేతలు కాంగ్రెస్ పార్టీని తిడుతూనే ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డిని తిడుతూనే ఉంటారు.