బీజేపీకి తెరాస గాలం!

      నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతానని ఊరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈమధ్యకాలంలో మనసు పూర్తిగా మార్చుకుంది. కాంగ్రెస్‌లో విలీనం అయి తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం అప్పగించేబదులు తానే అధికారం వెలగబెట్టాలన్న ఐడియాకి టీఆర్ఎస్ వచ్చేసింది. టీఆర్ఎస్ తనలో విలీనమైపోతుందని ఆశపడి తెలంగాణకి ఓకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త వ్యూహం చూసి నోరు తెరిచింది.   టీఆర్ఎస్‌ని తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్లాన్లు వేసినా టీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా తయారైంది. దాంతో టీఆర్‌ఎస్ తనలో విలీనం కాదని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్‌తో విలీనం మాటని అటకెక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నిటిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని టీఆర్ఎస్ పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగా తెరాస నాయకత్వం సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్‌ల దగ్గరకి రాయబారాన్ని పంపినట్టు తెలుస్తోంది. అయితే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే టైపు అయిన టీఆర్ఎస్‌ని నమ్మడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. పొత్తు సందర్భంగా భారీ స్థాయిలో సీట్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్నట్టు సమాచారం. తెరాసతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల తెరాసకే లాభం తప్ప తమకేమీ ఒరిగేది లేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కుదుర్చుకుంటే అది తెలుగుదేశంతో అయితేనే మంచిదన్న అభిప్రాయంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇటు తెలంగాణతో పాటు అటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ పుంజుకునే అవకాశం వుందని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది.

ఇక ఏడవండి!

      ఓ తెలుగోళ్ళారా.. ఇక ఏడవండి! ఏడవమంటే అలా చూస్తారేంటి? బాగా ఏడవండి! ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? నేను.. మీ కృష్ణవేణిని.. అర్థం కాలేదా? కృష్ణానదిని! ఎక్కడో పుట్టి.. ఎక్కడెక్కడో ప్రవహించి, తెలుగింటికి చేరే జీవనదిని! నాలో వున్న నీటిని వాడుకునే విషయంలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చిందిగా... నాలో వున్న మిగులు జలాల వాడకం విషయంలో మీకు అంత సీన్ లేదని డిసైడ్ చేసిందిగా! కర్నాటక, మహారాష్ట్రలు ఎక్కువ నీటిని వినియోగించుకునే విధంగా తీర్పు ఇచ్చేసిందిగా! ఇప్పుడు మీకు ఏడుపొస్తోంది కదూ.. ఏడవండి! మీ తెలుగోళ్ళు ఏడవటం మినహా ఏం చేయగలరు?   మీరు ఎప్పుడు చూసినా విడిపోదామా, కలిసుందామా, హైదరాబాద్ ఎవరిది, భద్రాచలం ఎవరిదని పోట్లాడుకుంటారే తప్ప.. మీరు పోట్లాడుకోవడం వల్ల ఎంత నష్టపోతారన్నది ఏనాడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి ఏమైందో! అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగిపోతుంది. మీ స్టేట్లోకి వచ్చే నా నీరు తగ్గిపోతుంది. మీలోమీరు కొట్టుకుంటూ సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళది పైచేయి అయింది. ఇప్పుడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఓకే చేసిందంటే 2050 వరకు మీ ఏరియా ఎడారే! బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటేను బంగారు పంటలే పండుతాయి అని తెలుగుతల్లి పాటని పాడటం కాదు.. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి.. కృష్ణవేణి.. మా ఇంటి అలివేణీ అని సినిమా పాటలు పాడుకోవడం కాదు..  నా నుంచి మీకు న్యాయంగా రావాల్సిన నీళ్ళ వాటాని పొందడానికి మీరు ఏం కృషి చేశారని ప్రశ్నిస్తున్నా! మీలో మీరు పోట్లాడుకుంటూ వుండటం వల్ల అందరికీ మీరు చులకనైపోయారు. 42 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడే మీ మాట పట్టించుకునేవాడు ఎవడూ లేకుండా పోయాడే! రేపు రాష్ట్రం రెండు ముక్కలైతే మీ మొహాలు చూసేవాడెవడైనా వుంటాడా? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రెండూ ఎండుతాయ్. ఖర్మకాలి రాష్ట్రం విడిపోతే నీళ్ళకోసం తెలుగోళ్ళే తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా విషయాల్లో ఎలాగైనా తన్నుకుని చావండిగానీ, నా నీళ్ళ విషయంలో మాత్రం కాస్త కలసికట్టుగా వుండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతారు. లేకపోతే మీ ఖర్మ! ఇట్లు.. -మీ కృష్ణానది

జగన్ కలలు!

      పదహారు నెలలపాటు జైల్లో గడిపి వచ్చిన జగన్ అక్కడ పనేమీ లేకపోవడంతో కలలు కనడం బాగా ప్రాక్టీసు చేసినట్టున్నాడు. అందుకే జైల్లోంచి జనాల్లోకి వచ్చాక కూడా కలలు కనడం కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ రాబోయే ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కల కంటున్నాడు. కల కంటే కన్నాడు.. ఆ కలని కనిపించిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి కలనీ బయటకి చెప్పాలనుకునే మానసిక వ్యాధి పేరేంటో మానసిక వైద్య నిపుణులే చెప్పాలి. ప్రస్తుతం జగన్ వరద బాధితులను పరామర్శించే నెపంతో సీమాంధ్రలో తిరుగుతున్నాడు. తుఫాను బాధితుల పరామర్శ కార్యక్రమంలోనే ఓదార్పు యాత్రని, సమైక్య సందేశాలని మిక్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మూడు దెబ్బలకు ఒకే పిట్ట అన్నట్టుగా మూడు కార్యక్రమాలను ఒకేదాంట్లో మిక్స్ చేసి ఓటరు పిట్టని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ వెళ్ళిన ప్రతిచోటా రైతులు తమ కష్టాలన్నీ వెళ్ళబోసుకుంటుంటే, జగన్ మాత్రం ప్రతి చోటా త్వరలో నా ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాడట. తుఫాను బాధితులకు న్యాయం చేయండంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఒక పద్ధతిగా వుంటుందిగానీ, నా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడమేంటని జనం విసుక్కుంటున్నారు. జగన్ చేస్తున్న యాత్ర ఎన్నిక ప్రచార యాత్రలా వుందే తప్ప తమను పరామర్శించడానికి వచ్చిన యాత్రలా లేదని జనం అంటున్నారు. పీడకలలాంటి తుఫానును ఎదుర్కొన్న తమ కన్నీళ్ళు తుడవడం మానేసి తాను కంటున్న కల గురించి చెప్పుకోవడమే ఎక్కువైపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

విభజన.. కేసీఆర్ భజన!

      తిలాపాపం తలా పిడికెడన్నట్టు రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకూ తలా పిడికెడు పంచితే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం నాలుగైదు పిడికిళ్ళు పంచాలి. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ఒకపక్క విభజన పర్వం నడుస్తుంటే మరోపక్క టీఆర్ఎస్‌లో కేసీఆర్ భజనపర్వం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నాయకులుగా తెరమీదకు వచ్చిన ఛోటామోటా లీడర్లందరూ కేసీఆర్‌ భజన చేయడంలో నిమగ్నం అయి వున్నారు.   టీఆర్ఎస్‌లో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్నారు. వాళ్ళలో ఎంతటి పచ్చి అబద్ధాన్నయినా నిజమని పెద్ద గొంతుతో వాదించగల శ్రవణ్ ఒకరు. పార్టీ నాయకత్వమే తన టాలెంట్‌ని గుర్తించి తనను ఏదైనా సీట్లో నిలబెట్టే ఆఫర్ ఇస్తుందేమోనని ఆయన ఎదురుచూశారు. చూసీ చూసీ కళ్ళు కాయలు కాసినయ్యే తప్ప అటుపక్క నుంచి ఎలాంటి సిగ్నల్ లేకపోవడంతో తానే కేసీఆర్‌ని పొగడటం ద్వారా తాను అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. అందుకే కేసీఆర్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడుతున్నారు. శ్రవణ్ మాటల ప్రకారం కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అట. దేశ స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ ఎలాంటివాడో తెలంగాణ స్వాతంత్ర్య పోరాటానికి కేసీఆర్ అంతటి నాయకుడట. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే 1969లో ఉద్యమం నడిపినవాళ్ళు, ఇప్పుడూ అప్పుడూ ఉద్యమంలో అమరులైనవాళ్ళు ఏమైపోయినట్టో! ఈ సందేహం వచ్చింది ఏ సీమాంధ్రుడికో, టీఆరెస్సేతర తెలంగాణవాదికో కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లోనే వున్న కేశవరావుకి.  తెలంగాణ టాపిక్ మీద జరిగిన ఓ మీటింగ్‌లో పాల్గొన్న కేకే.. శ్రవణ్ మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కథానాయకుడెవరూ లేరని..తెలంగాణ వస్తుందంటే దానికి కారణం అమరవీరుల త్యాగమేనని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కూడా శ్రవణ్ కామెంట్ల మీద సెటర్లు విసిరారు. తెలంగాణ బండికి కేసీఆర్ డ్రైవర్ కావొచ్చేమోగానీ ఓనర్ కాదని అనేశారు. అందర్నీ తిట్టడమే తప్ప పొగడ్డంలో ప్రాక్టీసు లేనిశ్రవణ్ పొగడక పొగడక పొగిడితే ఆ పొగడ్తకి పొగబెట్టేవాళ్ళు బయల్దేరారు.  

‘మర్రి’యాద రామన్న!

      ఇద్దరు పోట్లాడుకుంటూ వుంటే ఇద్దరి మధ్యలో చేరి న్యాయమైన తీర్పు చెప్పే వ్యక్తిని మర్యాద రామన్న అని అంటారు. అయితే తెలంగాణవాదులు, సీమాంధ్రులు రాష్ట్ర విభజన కావాలి.. వద్దూ అని గొడవ పడుతూ వుంటే, ఆ గొడవని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించే వ్యక్తిని మాత్రం ‘మర్రి’యాద రామన్న అని పిలవొచ్చు.   ఆ ‘మర్రి’యాద రామన్న మరెవరో కాదు.. రెండుసార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రిశశిధర్‌రెడ్డి. విపత్తుల నివారణ వ్యవహారాలను చూసే మర్రి శశిధర్‌రెడ్డి ప్రకృతి వైపరీత్యాల్లాంటి విపత్తుల దగ్గరే ఆగిపోకుండా రాష్ట్ర విభజన విపత్తులోకి కూడా ఎంటరయ్యారు. మొన్నటి వరకూ సమైక్యవాదిగా వున్న తెలంగాణ బిడ్డ మర్రి శశిధర్‌రెడ్డి రాష్ట్రం విడిపోకుండా చూస్తారేమోలే అనుకుంటే ఆయన తన అసలు స్వరూపం చూపించి భయ పెడుతున్నారు. ఇప్పుడాయన సమైక్యవాది రూపంలో కాకుండా... తెలంగాణ రావాలని, ఆ తెలంగాణకు తాను మొదటి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తిగా ముందుకు వచ్చారు. తన తండ్రి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తాను ఒక్కసారైనా సీఎం అవ్వాలని మర్రివారు కలలుకంటున్నట్టున్నారు. ముఖ్యమంత్రి పదవికి తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా శశిధర్‌రెడ్డి తెలంగాణలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని, లేకపోతే తెలంగాణలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతుందని జీఓఎం దగ్గర మొత్తుకున్నారు. దీనిమీద మంత్రుల బృందానికి ఓ నివేదిక కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన్ని ఎవరు పలకరించినా తెలంగాణలో నియోజకవర్గాల పెంపుదల గురించి వివరణలు, ఉదాహరణాలు, తార్కాణాలతో గంటలు గంటలు లెక్చర్లు ఇస్తున్నారట. 2014 ఎన్నికలలోపే నియోజకవర్గాల పునర్విభజన చేసేస్తే ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళపోతుందట. అలా చేయకపోతే రాజకీయ అస్థిరతతో తెలంగాణ మరో జార్ఖండ్‌లాగా దుంపనాశనం అయిపోతుందట. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చూరులో చుట్టకాలి ఇంకొకడు ఏడ్చాడంటారే... మర్రి శశిధర్‌రెడ్డి యవ్వారం కూడా అలాగే వుంది.

ఏదో సామెత చెప్పినట్టు...!

      వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలుగుజాతిని విడదీయడానికి తెలుగు సామెతలనే అనుసరిస్తోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా సీమాంధ్ర, తెలంగాణ పిట్టల పోరులోకి కేంద్ర ప్రభుత్వం పిల్లిలా దూరి రెండు పిట్టల్నీ స్వాహా చేయాలని చూస్తోంది. తనది కాకపోతే ఊరంతా దేకమన్నట్టు, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు రెండు ప్రాంతాలకూ ఇబ్బంది కలిగే ప్రతిపాదనల్ని రోజుకొకటి బయటపెడుతోంది. అత్తలేని కోడలు ఉత్తమురాలన్నట్టు సోనియాగాంధీ తన అత్త ఇందిరాగాంధీ చెప్పినమాట వినకుండా రాష్ట్ర విభజనకు ప్రయత్నిస్తోంది.   కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విభజన తేనెతుట్టె కదిలించి ముందుకు పోతే గొయ్యి వెనకకి పోతే నుయ్యి అనే పరిస్థితికొచ్చింది. అయినా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు అడ్డగోలు విభజనకు ఆత్రంగా ప్రయత్నిస్తోంది. ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ వచ్చేసినట్టు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, రాహుల్ గాంధీ ప్రధాని అయిపోయినట్టు కలలు కంటోంది. తాంబూలాలిచ్చేశాం తన్నుకుచావండన్నట్టు ప్రస్తుతం మేం రాష్ట్రాన్ని విభజించేస్తాం. ఆ తర్వాత సమస్యలన్నీ మీరూ మీరూ కూర్చుని పరిష్కరించుకోండని అంటోంది. రాష్ట్రాన్ని విభజించొద్దు మహాప్రభో అని సమైక్యవాదులు ఎంత మొత్తుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అవుతోంది. ఆరే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు, చేతకానమ్మకి చేష్టలెక్కువన్నట్టు అవసానదశలో వున్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు తహతహలాడుతోంది. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాష్ట్ర విభజన చేస్తుంటే సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు, ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోరునష్టం పొందులాభం అనే సామెతని మరచిపోయిన విభజనవాదులు నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళన్నట్టు వ్యవహరిస్తున్నారు. అగడ్తలో పడ్డ పిల్లి అదే వైకుంఠమన్నట్టు మాట్లాడుతున్నారు. దూరపుకొండలు నునుపని భ్రమపడుతున్నారు. ఏది ఏమైనా చెడపకురా చెడేవు అనే సామెతకి అర్థం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలుసుకుంటుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు తెలుగుజాతి యూపీఏ ప్రభుత్వాన్ని చెప్పుదెబ్బ కొట్టేరోజులు దగ్గర్లోనే వున్నాయి.  

షిండే తాతయ్యా.. హెల్త్ జాగ్రత్త!

      సుశీల్ కుమార్ షిండే తాతయ్యకి ఆంధ్రప్రదేశ్ బాలబాలికల నమస్కారం. మేం ఇక్కడ ఎంతమాత్రం క్షేమంగా, మనశ్శాంతిగా లేము. మీరు మాత్రం ఢిల్లీలో క్షేమంగా, మనశ్శాంతిగా వుండాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే పనిలో మీరు చాలా బిజీగా వున్నారని తెలుసు. ఈ లెటర్ చదివేంత తీరిక మీకు వుండదని కూడా తెలుసు. అయినా మనసు ఉండబట్టుకోలేక రాస్తున్నాను.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అసాధ్యమని తెలిసినా మీరు చాలా కష్టపడుతున్నారు. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెడుతున్నారు. మీరు పెట్టే మీటింగుల్లో ఏ విషయమూ తేలక టెన్షన్ పడుతున్నారు. ఆ విషయం మంత్రుల బృందం మీటింగ్స్ ముగిశాక మీరు మీడియాతో మాట్లాడే పద్ధతి చెప్పకనే చెబుతోంది. బుధవారం జరిగిన జీవోఎం సమావేశం చాలా కీలకమైందని వార్తలు రావడంతో యావత్ తెలుగు ప్రజలు, మీడియా ఉత్కంఠని చవిచూశారు. సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత వున్న మీడియా మీరు సమావేశ మందిరం నుంచి బయటకి రాగానే లోపలేం జరిగిందని అడిగింది. లోపలేం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత వున్న మీరు మీడియా మీద చిరాకుపడ్డట్టు మాట్లాడారు. బుధవారం నాటి మీటింగ్ జీఓఎం చివరి మీటింగ్ అని గతంలో మీరే ఒకసారి చెప్పారు. మళ్ళీ మీరే మరికొన్ని మీటింగ్స్ వుంటాయని చెప్పారు. మీరు సృష్టించిన కన్ఫ్యూజన్ తొలగించే ఉద్దేశంతో మీడియా మిమ్మల్ని ఇంకా మీటింగ్స్ వుంటాయా అని అడిగింది. మీరు ఉంటాయనో, ఉండవనో చెబితే సరిపోయేది. అలా కాకుండా చాలా అసహనంగా ‘‘ఇంకా పది మీటింగ్స్ వుంటాయి. ఇప్పుడు సంతోషమేనా?’’ అన్నారు. మీడియా అడిగిన ఏ ప్రశ్నకీ సరైన సమాధానం ఇవ్వకుండా చిరాకుగా మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే మాకు ఏమర్థమైందంటే, వయసు పైబడిన మీకు బీపీ బాగా పెరిగిపోయింది. దాన్ని అర్జెంటుగా కంట్రోల్ చేయాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విభజన లాంటి అసాధ్యమైన పనిని సోనియాగాంధీ మీ నెత్తిన పెట్టింది. పాపం మీకు బీపీ పెరగకుండా ఎలా వుంటుంది? రాష్ట్ర విభజన అవుతుందో, అవదో తర్వాతి సంగతి... ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేసుకోండి షిండే తాతయ్యా! ఇట్లు.. -ఆంధ్రప్రదేశ్ బాలబాలికలు                                                                                                               

Why Ashok Babu wants to start agitation after Dec.20th?

  It appears APNGOs’ President P.Ashok Babu has honestly told about his interest in joining active politics. His plan to launch aggressive Samaikyandhra agitations after December 20th instead from the day, when T-Bill is introduced in state Assembly indicates the same.   Speaking to Simhapuri University students at Nellore on Wednesday, he said “Seemandhra MPs and Union Ministers have agreed to divide the state as they are lured with minister posts and packages. They are confirming the division of the state even before the Assembly and Parliament pass the Telangana bill. Hence, I request you all to be prepared for intensive agitations that may begin any time after December 20th. It will be conducted in a massive scale, in which both private and public organizations may participate.”   If, he is sure about the timing of his agitations, then, then he is also might be providing sufficient time for Telangana bill approval in the Parliament, the way CM Kiran Kumar Reddy is co-operating with his high command by waiting for the bill to come to state Assembly.   Once, the state is officially divided, everyone knows that there is no use of conducting agitations at any scale, except for gaining political mileage from them. The way TRS has emerged as strongest party with its agitations and sentiment, it appears Ashok babu also would like to apply the same principle for his political growth.   If he is sure about this December 20th muhurath, then it may not only facilitate himself but also CM Kiran Kumar Reddy as well. If reports are to be believed, CM Kiran is going to launch in a new political party to continue his fight for Samaikyandhra.   After seeing Ashok Babu’s timing for starting second phase of Samaikyandhra agitations, it looks like they both are going to join hands and launch a new political party. If so, it is very hurting to see them build their political future playing on people’s sentiments and putting their lives at stake.

రేణుక శవరాజకీయం!

      రేణుకా చౌదరి శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వేరే ఎవరి శవాన్నో కాకుండా తన శవాన్నే ఉపయోగించుకుంటున్నారు. భద్రాచలం తెలంగాణలోనే వుండాలని, భద్రాచలాన్ని ఎవరైనా తీసుకెళ్ళాలని అనుకుంటే తన శవం మీద నుంచి తీసుకెళ్ళాలని రేణుక సంచలన వ్యాఖ్యలు చేశారు.   భద్రాచలం జోలికి ఎవరైనా వస్తే తన తడాఖా ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పుట్టి పెరగకపోయినా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ ‘భద్రాచలాన్ని సీమాంధ్రకి ఇచ్చే సవ్వాలే లేదు’ అని నొక్కి వక్కాణించారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం ఏమైనా చేస్తారు.. దేనినైనా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేణుకా చౌదరి ఈ వర్గానికి చెందిన నాయకురాలేమోనన్న సందేహాలు ఆమె మాటల్ని వింటే కలుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం చేసిన పాపాన పోని రేణుక ఇప్పుడింత సడెన్‌గా భద్రాచలం విషయంలో ‘శవం’ వరకూ వెళ్ళడానికి గల కారణాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే రేణుక ఇలాంటి పవర్‌ఫుల్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తెలంగాణ ఆడపడుచు కాని రేణుకా చౌదరి గతంలో ఎన్నడూ తెలంగాణ అనుకూల ఉద్యమంలో పాల్గొనలేదు. గతంలో ఖమ్మం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రేణుక ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా వున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేయని రేణుకా చౌదరిని ఖమ్మం స్థానం నుంచి దూరం చేయాలని కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం నుంచి రేణుక పోటీ చేయాలంటే రేణుక తన బర్త్ సర్టిఫికెట్ చూపించాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతమాత్రం పాలు పంచుకోని రేణుకకు ఖమ్మం సీటు ఇవ్వరాదన్న డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా తెలంగాణ వాదినేనని కలరింగ్ ఇచ్చుకోవడం కోసం, తెలంగాణ ప్రజల్లో మంచి మార్కులు సంపాదించడం కోసమే రేణుక భద్రాచలం తెలంగాణదే అంటూ నినదిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారికి చెక్ పెట్టడం కోసమే రేణుకా చౌదరి ‘శవం’ స్థాయిలో వ్యాఖ్యానించారని అంటున్నారు.

అంత ఎటకారం వద్దు!

      తెలంగాణ రాజకీయ నాయకులకు సీమాంధ్ర ప్రజలంటే మరీ చులకనగా వున్నట్టుంది. అందుకే సీమాంధ్రులతో ఎటకారాలు పోతున్నారు. ఆ ఎటకారాలు కూడా అట్టాంటిట్టాంటి ఎటకారాలు కావు.. కడుపులో మండిపోయే ఎటకారాలు! అసలే అన్యాయంగా, ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసేస్తున్నారని రగిలిపోతున్న సీమాంధ్రుల మీద తెలంగాణ నాయకులు తమ మాటల పెట్రోలు పోస్తూ మరింతగా రగిలిపోయేలా చేస్తున్నారు.   నాలుకలు కోస్తాం, తరిమికొడతాం అంటూ బెదిరించే వెటకారాలు కొన్ని అయితే, శాంతియుతంగా మాట్లాడినట్టు కనిపించే సుతిమెత్తని ఎటకారాలు కొన్ని! ఇప్పుడు సీమాంధ్రులు హైదరాబాద్‌లో అడ్డంగా ఇరుక్కుపోయారు కాబట్టి మనమేం మాట్లాడినా చచ్చినట్టు ఊరుకుంటారన్న నిర్లక్ష్యం తెలంగాణ రాజకీయ నాయకులలో కనిపిస్తోంది. కేంద్రమంత్రి బలరాం నాయక్ తాజాగా చేసిన కామెంట్లు ఈ కోవకు చెందినవే. ఇంతకీ ఘనత వహించిన బలరాం నాయక్ గారు ఏమన్నారంటే, ప్రస్తుతానికి సీమాంధ్రులు తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఒప్పేసుకోవాలట. తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను ఎంతమాత్రం వ్యతిరేకించకుండా రాష్ట్ర విభజనకు సహకరించాలట.  తెలంగాణ వచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత అవసరమనుకుంటే సీమాంధ్ర, తెలంగాణ మళ్ళీ కలసిపోవాలట. ఇలాంటి పనికిమాలిన ప్రపోజల్ పెట్టడానికి బలరాం నాయక్ గారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. తెలంగాణ నాయకులకు తమ తెలివితేటలు ప్రదర్శించడానికి, ఏ మాట పడితే ఆ మాట అనడానికి సీమాంధ్రులు తేరగా దొరికినట్టున్నారు. సీమాంధ్రుల దగ్గర మరీ అంత ఎటకారాలొద్దు మినిస్టర్ గారూ!

సర్వే రిపోర్ట్: టీడీపీ-బీజేపీ మిత్రలాభం!

      ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఏ క్షణంలో అయినా వచ్చేట్టున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకుడొకరు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చనే అంశం మీద సర్వే జరిపించినట్టు తెలిసింది. ఈ సర్వే భారతీయ జనతాపార్టీ పరంగా కాకుండా ఆ నాయకుడు వ్యక్తిగత ఆసక్తితో జరిపించారని తెలిసింది. విశ్వసనీయ సంస్థలతో జరిపించిన ఆ సర్వేలో దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ పుంజుకుందన్న విషయం స్పష్టమైంది.   అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్‌సభ స్థానాల విషయంలో ఆసక్తికరమైన అంశాలను సర్వే బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, రాష్ట్రంలో పార్టీలన్ని ఎలాంటి పొత్తులూ లేకుండా విడివిడిగా పోటీ చేస్తే తెలుగుదేశం-17, వైఎస్సార్సీపీ-11, టీఆర్ఎస్-7, బీజేపీ-3, కాంగ్రెస్-3, ఎం.ఐ.ఎం.-1 స్థానాలలో విజయం సాధించే అవకాశం వుందని తేలింది. కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఒక్క లోక్‌సభ స్థానం కూడా దక్కదన్న విషయం స్పష్టమైంది. తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ మంచి ఆదరణ లభించనుందని ఈ సర్వే స్పష్టం చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పటికీ ఆ ప్రాంతంలో టీడీపీకి 4 నుంచి 5 లోక్‌సభ సీట్లు రానున్నాయి. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ బలంగా వుండటానికి గల కారణాలను కూడా ఆ సర్వే విశ్లేషించింది. తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి బలమైన కేడర్ వుండటం, 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సెటిలర్స్ ప్రభావం బాగా వుండటం, అలాగే 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలంగాణ ఉద్యమం లేకపోవడం వల్ల ఆ ప్రభావం టీడీపీకి లభించే లోక్‌సభ సీట్ల సంఖ్యపై కనిపించనుంది. ఈ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే పక్షంలో రెండు పార్టీలకూ కలిపి ఇప్పుడు గెలిచే స్థానాలకంటే మరో ఆరు స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశం వుందని ఆ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసిన పక్షంలో కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశం వుందని, అందువల్ల భావసారూప్యం వున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి మేలు జరగడంతోపాటు హంగ్ లాంటి ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చని ఆ సర్వే పేర్కొంది. బీజేపీ అగ్ర నాయకుడు చేయించిన ఈ సర్వే నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. యువతరంలో బీజేపీకి భారీ మద్దతు వుందని సర్వేలో తేలింది. రాష్ట్రంలో కూడా యువతరం నుంచి మంచి మద్దతు పొందుతున్న పార్టీగా టీడీపీ నిలిచింది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెరాసలో సీఎం లొల్లి!

      వస్తుందో రాదో తెలియని తెలంగాణకి ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ కాంగ్రెస్‌లో దాదాపు ఇరవై మంది నాయకులు తెలంగాణ సీఎం తానేనని కలలు కంటున్నారు. టీ కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ అంశం ముదురు పాకానపడింది. తెలంగాణకి మా అన్న సీఎం అంటే మా అన్న సీఎం అని హరీష్ రావు, కేటీఆర్ వర్గాల మధ్య అంతర్యుద్ధం మొదలైంది.   తాజాగా కొంతమంది పార్టీ నాయకులు తెలంగాణకి హరీషే సీఎం అని బాహాటంగా ప్రకటించడంతో ఈ రెండు వర్గాల మధ్య లొల్లి ముదిరింది. తెలంగాణ సీఎం పదవి మీద మొదటి నుంచి హరీష్ రావు, కేటీఆర్‌లకు కన్నుంది. ఒకరి లక్ష్యానికి మరొకరు అడ్డుగా వున్నారు కాబట్టి ఈ బావాబామ్మర్దులిద్దరికీ మొదటి నుంచీ ఒకరంటే మరొకరికి పడదు. ఒకరి ప్రస్తావన మరొకరు తేరు. ఒకరిమీద వచ్చిన అవినీతి ఆరోపణలను మరొకరు ఖండించరు. ఇద్దరూ ఒకే సందర్భంలో చాలా అరుదుగా కనిపిస్తారు. రాష్ట్రాన్ని చీల్చాలని ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ ఈరకంగా ఏనాడో చీలిపోయింది. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని కేసీఆర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దర్లో ఎవర్ని జాగో అనాలో ఎవర్ని భాగో అనాలో అర్థంకాక, ఫామ్‌హౌస్‌లో తపస్సు చేసినా పరిష్కారం లభించక ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి నలిగిపోతున్నారు. కేసీఆర్‌లోని తండ్రి మనసు కొడుకు వైపే మొగ్గుచూపుతున్నా, దాన్ని బయటపెట్టలేక బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి హరీష్‌రావేనని ఆయన వర్గీయులు బాహాటంగా ప్రకటిస్తూ వుండటం టీఆర్ఎస్‌లో వున్న ఆల్రెడీ వున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. హరీష్ వర్గం దూకుడు కేటీఆర్ వర్గానికి ఎంతమాత్రం నచ్చడం లేదు. ఈ దూకుడుకు కళ్ళెం వేయాలని భావిస్తున్నారు. తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్ ప్రకటిస్తే, ఆయన కొడుకు, మేనల్లుడు మాత్రం సీఎం నేనంటే నేనంటూ లొల్లి చేస్తున్నారు. తెలంగాణ రాకముందే, వస్తుందో లేదో కూడా తెలియక ముందే పరిస్థితి ఇలా వుందంటే,  పొరపాటున తెలంగాణ వచ్చేస్తే పరిస్థితి ఇంకెలా వుంటుందో!  

ఏంటీ బెదిరింపులు?

      తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యోగుల మీద వుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసే కామెంట్లు తెలంగాణ ఉద్యోగులకు తలవంపులుగా మారే ప్రమాదం వుంది. శ్రీనివాస్‌గౌడ్, విఠల్ లాంటి వారు ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో ఎలాంటి కామెంట్లు పడితే అలాంటి కామెంట్లు చేస్తున్నారు.   తెలంగాణ ఉద్యోగుల తరఫున ఉద్యమం చేస్తున్నామంటూ సొంత ఎజెండాలతో ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్న శ్రీనివాస్ గౌడ్ సీమాంధ్రులను కించపరుస్తూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. తాము కోరుకున్న తెలంగాణ రాకపోతే ఏదేదో జరిగిపోతుందంటూ తెలంగాణలో వున్న సీమాంధ్రులను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. రెండు రోజులకోసారి  శ్రీనివాస్ గౌడ్ తన బెదిరింపు కామెంట్లు చేస్తూనే వున్నారు. ఈయన సహచరుడు విఠల్ కూడా మాటల తూటాలు వదలడంలో తాను కూడా ఎంతమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు.  ఏపీ ఎన్జీవోలు ఏవైనా సమ్మెలు, నిరసనలు లాంటివి చేయదలుచుకుంటే సీమాంధ్రలోనే చేసుకోవాలట. హైదరాబాద్‌లో చేయకూడదట. అసలు ఏపీ ఎన్జీవోలకు తెలంగాణలో సమ్మె చేసే హక్కే లేదట. సమ్మె చేయాలనుకోవడం చిల్లర ప్రయత్నమట. ఒకవేళ అలా సమ్మె చేస్తే తెలంగాణలో వున్న సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత వుండదట. అంటే సమ్మె చేస్తే ఏదో జరిగిపోతుందన్న బెదిరింపులు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ఇలాంటి బెదిరింపులకు దిగడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు బెదిరిపోతే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరనీ, తాము చేయదలుచుకున్నది చేసి తీరతామని తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుల నోళ్ళకు తాళం వేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యోగుల మీద వుందని గుర్తు చేస్తున్నారు.

వెంకయ్య ఐక్యతారాగం!

      అచ్చ తెలుగువాడు.. పదహారణాల ఆంధ్రుడు, బీజేపీ కేంద్ర నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న ఆయన రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు మొత్తాన్నీ కిషన్ రెడ్డి చేతుల్లోనే ఉంచారు. అయితే పేనుకు పెత్తనం ఇచ్చినట్టుగా కిషన్ రెడ్డి తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చారు. కిషన్ రెడ్డిని ఇంకా అలాగే వదిలేస్తే పద్ధతిగా వుండదని అర్థం చేసుకున్న వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. కిషన్ రెడ్డి చేసిన డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నంలో వున్నారు. సీమాంధ్రులు ప్రస్తుతం బీజేపీని శత్రువుగా భావిస్తున్నారు. మొదట ఆ అభిప్రాయాన్ని తొలగించే పనిలో వెంకయ్య వున్నారు. కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఇప్పటికే ఆదేశాలు అందటంతో ఆయన అంతకుముందులా దూకుడుగా కాకుండా కాస్తంత ఆచి తూచి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలకు తలవంచి ఇంతకాలం మౌనంగా వున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు సమైక్యతా రాగం ఆలపిస్తున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లో ‘ఐక్యతా చిహ్నం’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. సర్దార్ పటేల్ దేశం ఐక్యంగా వుండాలని ఎంతో కోరుకున్నారని, ఆయన ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని చెబుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల్ని విభజించే పనిలో వుందని విమర్శించారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమే గానీ, ఇష్టమొచ్చినట్టు  రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించడానికి మాత్రం వ్యతిరేకమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మాత్రమే కాకుండా తెలుగు ప్రజలను కూడా విభజిస్తోందని ఆయన కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ మద్దతు వుంటుందిగానీ, ప్రజల్ని విభజిస్తామంటే తమ మద్దతు వుండబోదని స్పష్టంగా చెప్పారు. ఐక్యత అనేది ఎంతో బలమైనదని ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వెంకయ్య నాయుడు ఐక్యతా ఉపన్యాసం విన్నవారికి, చదివినవారికి రాష్ట్రం ఐక్యంగా వుంటుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.

విభజనుల గుండెల్లో రాయి!

      రాష్ట్ర విభజనుల గుండెల్లో రాయి పడింది. ఆ రాయిపేరు ‘రాయల తెలంగాణ’. కేంద్ర ప్రభుత్వం దర్శకత్వంలో రూపొందిన అట్టర్ ఫ్లాప్ మూవీ ‘విభజన’లో సరికొత్త ట్విస్ట్ లేటెస్టుగా తెరమీదకి వచ్చింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మీద కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అది కూడా రాయలసీమ మొత్తాన్నీ తెలంగాణలో కలపకుండా కర్నూలు, అనంతపురం జిల్లాలనే తెలంగాణలో కలిపే ఎందుకూ పనికిరాని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుంది.     తనకు వచ్చిన చెత్త ఐడియా గురించి రాష్ట్రంలోని విభజనవాదుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. కొంతమందికి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల చేత ఫోన్లు చేయించి రాయల తెలంగాణ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగించింది. సహజంగానే విభజనులందరూ రాయల తెలంగాణ అనగానే మరో లభిప్రాయం లేకుండా నో చెప్పేశారు. నో అని అయితే చెప్పారుగానీ, ఆ తర్వాత నుంచి విభజనుల గుండెల్లో రాయి పడింది. కంటికి కునుకు దూరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రాయల తెలంగాణ వైపు పూర్తిగా మొగ్గి టోటల్‌గా తెలంగాణ ఆశలను వమ్ము చేస్తుందోనని భయం పట్టుకుంది. టీఆర్ఎస్ నాయకులయితే రాయల తెలంగాణ అనే మాట గుర్తొచ్చినా ఉలిక్కిపడుతున్నారు.   నిజంగా రాయల తెలంగాణ అనేది కార్యరూపంలోకి వస్తే తెలంగాణలో తమ పార్టీ బలం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. కరడుగట్టిన విభజనవాదులు బోలెడన్ని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ అనే నినాదాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఎవరెంతగా వక్కాణించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం రాయల తెలంగాణ మీద మోజును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో జోరుగా మంతనాలు సాగిస్తోంది. అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే విభజన ప్రక్రియను మరింత ఆలస్యం చేసి తర్వాత చేతులు ఎత్తేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న అనుమానాలు తెలంగాణ వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని పది జిల్లాల తెలంగాణ కాకుండా ఇంకోరకం తెలంగాణ ఇస్తామంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని బెదిరింపులు మొదలుపెట్టారు.

అంటే.. కిరణ్ ఉద్దేశమేంటి?

      రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి తన ఆనందాన్ని అణుచుకోలేని పరిస్థితిని చవిచూశారు. ప్రమాణ స్వీకారం చేసిన నెలా పదిహేను రోజుల నుంచే ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న వార్తలు వచ్చిన పరిస్థితి నుంచి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఇది రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.   కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవి  దక్కడమే ఒక బోనస్ అయితే, ఆ బోనస్ మూడేళ్ళపాటు లాకౌట్ కాకుండా వుండటం విశేషమే. దానికితోడు ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదని అని అధిష్ఠానానికి వ్యతిరేకంగా గళమెత్తినా పదవి పోలేదంటే అంతకంటే ఆనందం మరొకటి వుంటుందా? ఆ ఆనందంలో తానేం మాట్లాడుతున్నాడో కూడా మరచిపోయి ముఖ్యమంత్రి మాట్లాడేశారు. మూడేళ్ళ ముచ్చట ముగిసిన రోజున ఆయన రాయచోటిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగితే అసలు గొడవే వుండేది కాదు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా వుందని, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందు వరకూ కూడా పథకాలు సక్రమంగా అమలు కాక ఎన్నో బకాయిలు వుండిపోయాయని, అలాంటి ఘోరమైన పరిస్థితులన్నీ తాను రాగానే చక్కదిద్దానని ఆయన చెప్పుకున్నారు. ఇది పైకి చాలా సింపుల్ విషయంలా కనిపించినా, కాంగ్రెస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ లాంటి విషయం. కిరణ్ చెప్పిన మాటల ప్రకారం, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, రోశయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరమ అధ్వాన్నంగా వున్నట్టు! డబ్బులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన గుడ్డ వేసుకుని కూర్చున్నట్టు! కిరణ్ గారు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు!! ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ గత ప్రభుత్వం నాసిరకం ప్రభుత్వం.. మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కిరణ్ కుమార్ మాత్రం తన కాంగ్రెస్ ప్రభుత్వాలనే తిట్టిపోశారు. ఈ విషయాన్ని ఎలా రాజకీయం చేద్దామా అని ముఖ్యమంత్రి వ్యతిరేకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

మూడేళ్ళ ముచ్చట!

      మూడేళ్ళ క్రితం స్పీకర్‌గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చాప కిందకి నీరులా ప్రవేశించి, ఆయన్ని తమిళనాడు గవర్నర్‌గా పంపించి తాను ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ముచ్చట తీరి మూడు సంవత్సరాలు అవుతోంది. రాష్ట్రంలో పరిపాలనను కుంటుపడేలా చేసిన విభజన ఉద్యమాన్ని గాడిలో పెడతానని, పరిస్థితులు మొత్తం చక్కదిద్దుతానని అధిష్ఠానానికి పెద్ద స్క్రీన్ ప్లే ఇచ్చి కిరణ్ ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చున్నారు.   అయితే ఈ మూడేళ్ళ కాలంలో ఆయన ఏరకంగా అయినా సాధించిందేమైనా వుందా అని ప్రశ్నిస్తే ఫలానా వుందని చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఆయన తెలుగు ప్రజలకు మూడు నామాలు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి మూడేలా చేయడం మినహా సాధించిందేమీ లేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టినవాడు కాబట్టి తాను కూడా తెలంగాణ వాడినేనని, తనకున్న హైదరాబాద్ పవర్‌తో విభజనవాదులను కంట్రోల్ చేస్తానని అధిష్ఠానం దగ్గర చెప్పుకున్న కిరణ్ విభజనవాదుల్ని ఎంతమాత్రం అదుపులో పెట్టలేకపోయారు. బయటివారి సంగతి సరే, తన మంత్రివర్గ సహచరులను కూడా అదుపు చేయలేకపోయారు. అటు తెలంగాణ మంత్రులతోపాటు ఇటు సీమాంధ్ర మంత్రలు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకం అయిపోయారు. ఇదిలా వుంటే, పరిపాలన పరంగా ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. పాత పథకాలకే కొత్త పాలీష్ కొట్టి అవేవో తన సొంత పథకాలన్నట్టు బిల్డప్ అయితే ఇచ్చుకున్నారు. అయితే ఆ పథకాలేవీ సక్రమంగా అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎలా పరిపాలిస్తేనేం కిరణ్ కుమార్ రెడ్డి తాను కలలు కన్న ముఖ్యమంత్రి సీటు సాధించారు. మూడేళ్ళ ముచ్చట తీర్చుకున్నారు. కిరణ్‌కి ముఖ్యమంత్రి పదవిలో ఇంకా మూడునాళ్ళ ముచ్చట మిగిలి వుంది. ఆయన్ని త్వరలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పదవి నుంచి తప్పించకపోయినా నాలుగైదు నెలలలో అసెంబ్లీయే రద్దవుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోనున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు.  

శ్రీధర్‌బాబు ఏం చేస్తారో!?

      శాసనసభను ప్రొరోగ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంతకం చేశారు. ఆ ఫైలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దగ్గరకి చేరింది. శ్రీధర్‌బాబు ఆ ఫైల్‌ని ఓకే చేసి ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన దాన్ని గవర్నర్‌కి పంపిస్తారు. అప్పుడు శాసనసభ ప్రొరోగ్ అవుతుంది. శాసనసభ ప్రొరోగ్ అయితే తెలంగాణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ పెరిగే అవకాశం వుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్‌బాబు ఇప్పుడు తనదగ్గర వున్న ప్రొరోగ్ ఫైల్‌ని ముఖ్యమంత్రి దగ్గరకు పంపుతారా లేదా అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది.   విభజనవాదులు శ్రీధర్‌బాబు సదరు ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపరని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతోపాటు రేపు తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వున్న వ్యక్తి కావడం వల్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీ ప్రొరోగ్ కాకుండా చూసే అవకాశం వుందని అంటున్నారు. అయితే సమైక్యవాదులు మరోరకంగా చెబుతున్నారు. స్పీకర్ నుంచి వచ్చిన ఫైల్‌ని ముఖ్యమంత్రికి పంపడం మినహా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల తనకు ఇష్టం వున్నా లేకపోయినా శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపి తీరాల్సిందేనని అంటున్నారు. అదేవిధంగా నలుగురితోపాటు నారాయణ అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నారే తప్ప శ్రీధర్‌బాబుకు వ్యక్తిగతంగా రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెబుతున్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, మాజీ స్పీకర్, మృదుస్వభావి అయిన దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టులు గతంలో అన్యాయంగా హతమార్చారు. తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టులు సమర్థిస్తూ వుండటం, తెలంగాణ ఏర్పడితో తెలంగాణ మావోయిస్టుల అధికారిక నివాసంగా మారిపోయే సూచనలు కనిపిస్తూ వుండటంతో శ్రీధర్‌బాబుకు తెలంగాణ ఏర్పడటం ఇష్టం లేదన్నట్టు తెలుస్తోంది. అందువల్ల శ్రీధర్‌బాబు ప్రొరోగ్ ఫైల్ విషయంలో సంప్రదాయబద్ధంగా వ్యవహరించి ముఖ్యమంత్రికి పంపే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జానా ఆశలు ఆవిరి!

      రాష్ట్ర రాజకీయాలలో జానారెడ్డికి మించిన అదృష్టవంతుడు మరొకడు లేదని ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు అనిపిస్తూ వుంటుంది. జానారెడ్డి గారు మాట్లాడుతూ వుంటే, ఆయన ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది. ఆయన మాట్లాడిన మాటలన్నిటిని ఒకచోట చేర్చి అతికించుకుంటే తప్ప ఆయన ఏం మాట్లాడారన్నది అర్థం కాదు.   జనాన్ని అంతగా గొప్పగా ‘ఇంప్రెస్’ చేయగల వక్త అయిన జానారెడ్డి రాజకీయాలలో ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. ఆయన్ని రాజకీయాలలో అదృష్టమే అందలం ఎక్కించిందని అనిపిస్తూ వుంటుంది. ఆ అదృష్టమే తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తుందని ఆశించిన ఆయన నిరాశపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి కాకపోతే పోయె తెలంగాణకి అయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడి విభజన ఉద్యమ మంటల్లో తనవంతు పెట్రోల్ పోశారు. కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీకి తనవంతు అభూత కల్పనల నివేదికలు అందించి, రాష్ట్రం విడిపోవడానికి ఎంతో శ్రమించి రాచమార్గం వేశారు. అయితే తాను వేసిన రాచమార్గంలో ఎవరెవరో ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి పీఠం కోసం ముందుకు దూసుకువెళ్తూ వుండటం చూసి జానా బాధపడిపోతున్నారు. ఇంతకాలం రాజకీయాల్లో ఆయన్ని అందలం ఎక్కించిన అదృష్టదేవత కీలక సమయంలో ముఖం చాటేసింది. తాజాగా రంగంలోకి వచ్చిన జైపాల్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎగరేసుకుపోయే అవకాశాలు బలంగా వుండటంతో జానా ఆశలు ఆవిరైపోయాయి. మొన్నటి వరకూ తెలంగాణ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నాయకులలో అగ్రస్థానంలో వున్న తాను ఇప్పుడు తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్న వారందరిలో ఒకడిగా, ఏమాత్రం ప్రాధాన్యం లేని స్థానానికి చేరుకోవడం ఆయనకు బాధను కలిగిస్తోంది. ఏదో ఆశించి ఏదో చేస్తే ఇప్పుడిలా అయ్యిందేమిటి భగవంతుడా అని ఆయన మథనపడుతున్నట్టు తెలుస్తోంది.