వై దిస్ 371 డి?

      వై దిస్ కొలవరి డి? పాట అప్పట్లో దేశం మొత్తాన్నీ ఓ ఊపు ఊపించింది. ప్రస్తుతం విభజనవాదులు మాత్రం వై దిస్ 371 డి? అని విషాదగీతం పాడుకుంటున్నారు. ఇటాలియన్ సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా రాష్ట్రాన్ని కేక్ మాదిరిగా కోసేయాలన్న ప్రయత్నాలకు రాజ్యాంగంలోని 371-డి అధికరణం ప్రధాన అవరోధంగా మారింది. ఈ అధికారణాన్ని సవరించడమంటే అంత సులభంగా జరిగిపోయే పనికాదు. అందుకే ఈ అధికరణం జోలికి పోకుండానే రాష్ట్రాన్ని ముక్కలు చేసేయాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.   అయితే ఈ అధికరణ సంగతి తేల్చకుండా విభజనపై ముందుకెళ్ళే సీను లేదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు తేల్చి చెప్పడంతో విభజనవాదులు తల్లడిల్లిపోతున్నారు. డిసెంబర్ 20వ తేదీ లోపు విభజనకు పార్లమెంట్‌లో ఆమోదం లభించకపోతే ఆ తర్వాత తెలంగాణ దుకాణం సర్దేయక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఏం చేయాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. కొంతమంది అతివాద వేర్పాటువాదులు ఈ అధికారణాన్ని పట్టించుకోకుండా విభజన చేసేయాలని పట్టుపడుతున్నా వారి గోడు వినేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. విభజన తద్దినం త్వరగా పెట్టేసి తన కొడుకును గద్దె మీదకి ఎక్కించేయాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ కూడా ఈ 371 డి ఆర్టికల్‌ను చూసి పళ్ళు కొరుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ అర్టికల్‌ని పట్టించుకోకుండా ‘పదండి ముందుకు... పదండి దూసుకు’ అని అధికార యంత్రాంగానికి ఆమె సూచించిందట. దానికి అధికార యంత్రాంగం స్పందిస్తూ, 371 డి ఆర్టికల్‌ని పట్టించుకోకుండా ముందుకు దూసుకువెళ్తే ‘పోతాం పోతాం పైపైకి’ అని సోనియాగాంధీకి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విభజన బాధ్యతలను భుజాల మీదకి ఎత్తుకున్న వాళ్ళంతా సీమాంధ్రులకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనలు పక్కన పెట్టేసి 371 డి అధికరణం కన్నుకప్పి రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్న దానిమీదే తమ బుర్రల్ని పెట్టి ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది. వాళ్ళు కూడా వై దిస్ 371 డి అని పాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

నీ ‘గిల్లు’డు ఆపవయ్యో!

      పోలీసు పెద్దాయన కేపీఎస్ గిల్ తాజాగా నోటికొచ్చిన ఓ స్టేట్‌మెంట్ పారేశారు. గవర్నర్లు వయసుడిగిన వేశ్యలతో సమానం అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. కేపీఎస్ గిల్ ఫ్లాష్‌బ్యాక్ తెలియనివాళ్ళు అబ్బ ముసలాయన భలే కామెంట్ చేశాడే.. ఎంత సిన్సియరో అనుకుంటారు. అయితే గిల్లుగారి గిల్లుడు గురించి తెలిసినవారు మాత్రం నీ గిల్లుడు ఆపవయ్యో అని విసుక్కుంటారు. ఐపీఎస్ చదివి పోలీసు శాఖలో ఉన్నత స్థానాలను చేపట్టిన గిల్లు గారికి మొదటి నుంచి నోటికొచ్చింది మాట్లాడే అలవాటుంది. సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అలా మాట్లాడేవాడేమో అని అపోహపడకండి.. ఈయన అన్నిరకాలుగా గ్రంథసాంగుడే.   1996లో రూపన్ డియోల్ బజాజ్ అనే ఒక సీనియర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ని కేపీఎస్ గిల్లు గారు గిల్లారు. ఆమెని లైంగిక వేధింపులతో మానసికంగా హింసించాడు. ఐపీఎస్ అధికారులు జరుపుకున్న ఒకపార్టీలో గిల్లు గారు తప్పతాగి, అసభ్యకరంగా మాట్లాడుతూ డియోల్ బజాజ్‌ని లైంగికంగా వేధించాడు. దాంతో ఆమె గిల్ మీద కంప్లయింట్ చేసి న్యాయస్థానానికి ఈడ్చింది. న్యాయస్థానం ఇతగాడికి రెండు లక్షల రూపాయల జరిమానాతోపాటు మూడు నెలల జైలుశిక్ష కూడా విధించింది. అయితే కోర్టుని, డియోల్ బజాజ్‌ని బతిమాలుకుని బామాలుకుని జైలుశిక్ష నుంచి మాత్రం బయటపడ్డాడు. అంతేకాదు ఈయనగారు ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు భోంచేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంత గొప్ప వ్యక్తిని ఒకనాటి కేంద్ర మంత్రి రాజేష్ పైలెట్ మణిపూర్ గవర్నర్‌గా సేవలందించాలని ఆఫరిస్తే ఈయనగారు తిరస్కరించారట. ఈయన చెప్పినవాటిని ఖండించడానికి రాజేష్ పైలట్ బతికి లేడు కాబట్టి ఏవైనా చెప్పేయచ్చని గిల్ అనుకున్నట్టున్నాడు. మొత్తమ్మీద ఏమిటంటే, ప్రస్తుతం ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్న గిల్లు ఆ గోళ్ళు గిల్లుకునేదేదో గవర్నర్ కుర్చీలో కూర్చుని చేస్తే ఓ పనైపోతుంది కదా అని భావించినట్టున్నాడు. దానికోసం ప్రయత్నిస్తే గవర్నమెంట్ చాల్లే పోవయ్యో అన్నట్టుంది. అందుకే అందని ద్రాక్ష పులుపు అన్నట్టు తనకి దక్కకుండా పోయిన గవర్నర్ పదవిని పోల్చకూడని వృత్తితో పోల్చి తన అక్కసు తీర్చుకున్నాడు. నోటితోపాటు అన్ని రకాల దురదలూ ఎక్కువగా వున్న కేపీఎస్ గిల్‌కి గతంలో పద్మశ్రీ అవార్డు అనవసరంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని తిరిగి లాక్కుంటే గానీ ఈయనగారి తిక్క కుదరదు!  

అమ్మబాబోయ్ నమ్మరాదు!

      రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న తెలుగువారి నమ్మకం రోజురోజుకూ సడలిపోతోంది. ఈ నమ్మకం ఇలా సడలిపోవడానికి కారణం తెలుగువారు నమ్మకూడని వారిని నమ్మడమే! ముఖ్యంగా విభజన కారణంగా దారుణంగా మోసపోయే సీమాంధ్రులు ఎవర్ని నమ్మకూడదో వారినే నమ్మి ఇప్పుడు చింతిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాదంటూ సీమాంధ్రులను నమ్మించిన మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా బిజీగా వున్నారు.   కొత్త రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దు మొర్రో అని సీమాంధ్రులు మొత్తుకుంటున్నా వినని కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధుల భుజాల మీద ఎక్కి కూర్చుని ఈ ఆందోళన సాగరాన్ని దాటే ప్రయత్నం చేస్తోంది. దీనికితోడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ రాష్ట్ర విభజన జరగదంటూ సీమాంధ్రులను మభ్యపెట్టే విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీరందరూ కలసి సీమాంధ్రులను మరో నమ్మకంలో ముంచేశారు. ఆ నమ్మకం ఏమింటంటే, ‘‘తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల కంటే సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ బిల్లు అసెంబ్లీలో ఓడిపోతుంది. అప్పుడు రాష్ట్ర విభజన ఆగిపోతుంది’’. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమించకుండా భ్రమల్లో ఉంచడానికే సీమాంధ్ర కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులు ఇలాంటి నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే సీమాంధ్ర రాజకీయ నాయకులు సీమాంధ్రుల నమ్మకాలు ఎన్నింటినో నాశనం చేశారు.విభజనకు వ్యతిరేకంగా నిలబడతారని నమ్మినవారందరూ చివరికి ప్యాకేజీ ఇస్తే చాలంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ నమ్మకాన్ని కూడా వీళ్ళు నాశనం చేయరన్న నమ్మకం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విభజన బిల్లుకు అనుకూలంగా ఓటు వేయరన్న నమ్మకం ఏమిటన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నాయకులను నమ్మకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

అటు కాదు కిరణ్.. ఇటు!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య చాంపియన్ హోదా తప్ప మరేమీ పట్టనట్టుంది. ప్రజల సమస్యల కంటే రేపు రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి కూడా ముఖ్యమంత్రి పోస్టు వెలగబెట్టాలన్న ముచ్చట ఆయనలో కనిపిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా, ముక్కలై చిక్కిపోయిన చిన్న ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనతను సాధించడానికి ఆయన తంటాలు పడుతున్నట్టుంది.   ముఖ్యమంత్రి హోదాలో వున్న ఆయన సమైక్యం అని ఆయన కంఠ నాళాలు తెగిపోయేలా, అధిష్ఠానం కర్ణభేరులు పగిలిపోయేలా అరుస్తున్నప్పటికి పట్టించుకునేవారే లేకుండా పోయారు. సీఎం ఎంత కిందామీడా పడినా కేంద్రం లైట్‌గా తీసుకుని విభజనవైపు దూసుకుపోతోంది. అందుకే ఎలాగూ రాష్ట్రం ముక్కలయ్యేట్టుంది కాబట్టి సీమాంధ్రలో అయినా తన పట్టు నిలుపుకోవాలని కిరణ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే తనను తాను సమైక్య చాంపియన్‌గా సీమాంధ్ర ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో నిమగ్నం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన రాయలసీమ ప్రాంతంలో రచ్చబండ నిర్వహించనన్నారు. అయితే ఆయన ప్రస్తుతం వెళ్ళాల్సింది రాయలసీమకు కాదు.. హెలెన్ తుపాను ధాటికి కకావికలైపోయిన కోనసీమ, దివిసీమ ప్రాంతానికి! కోస్తాలోని ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న రచ్చబండకు వెళ్ళడం న్యాయమా? పోనీ కిరణ్ సార్ రచ్చబండకి వెళ్ళినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. జనం రచ్చబండలో సమైక్య నినాదాలు చేస్తూ  రచ్చరచ్చ చేస్తున్నారు.  రాయలసీమలో రచ్చబండకి వెళ్ళి జనం చేత తిట్లు తినేబదులు, తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళి బాధితుల చేత నమస్కారాలు అందుకోవచ్చు కదా..! ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనలు రావు.. ఎవరైనా చెప్పినా వినరు.. ఆయనతో ఇదే సమస్య!

లగడపాటీ.. నువ్ మంచిగుండాలె!

      లగడపాటి అన్నా.. మంచిగున్నవా? తబీయెత్ ఠీక్ వున్నదా? వ్యాపారాలు.. ఆమ్దానీ మంచిగున్నదా? నువ్వు మంచిగనే ఉంటవ్‌లే అన్నా. నువ్వు ఎప్పటిలెక్క మంచిగనే ఉండాలని ఆ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి దండాలు పెడతాండ అన్నా! గిందేంటా బై తెలంగాన వాల్లు నన్ను ఎప్పుడు చూసిన తిడ్తా వుంటరు గదా.. గిప్పుడేంటీ ఈ పోరడు మంచిగ అన్నా అంటుండని డౌటయితందా? నేను గిట్ల నిన్ను ప్యార్ సే అన్నా అని పిలుస్తున్ననో నీకు సంఝయ్యేట్టు చెప్త! చెప్పాలనుకుంది బరాబర్ చెప్త.   అన్నా.. గింతకుముందు నిన్ను మా విభజనవాదులందరూ మంచిగ తిట్టుకునేటోళ్ళం. రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాన ఇవ్వనికి నువ్వు ఒప్పకోవని, ఢిల్లీల పుల్లలు పెడ్తుంటవని నిన్ను అనెటోళ్ళం! తెలంగానకి నిన్ను శత్రువని చెప్పెటోళ్ళం. అయితే అప్పుడు నిన్ను గట్ల సమఝ్ చేసుకున్నందుకు మేం ఇప్పుడు చానా ఫీలవుతున్నం అన్నా. నువ్వు తెలంగాన బిడ్డలకి శత్రువువి కావన్నా.. నువ్వు మాకు మంచి దోస్తువన్నా. అది ఎట్లంటవా? గిప్పుడు తెలంగాన ఇంత ఈజీగా వచ్చుడుకు నువ్వు కూడా కారణమన్నా. మేం విభజన ఉద్యమం చేస్తున్నప్పుడు అటు పక్క సీమాంధ్ర వాల్లు కూడా సమైక్య ఉద్యమం చేస్తే వాళ్ళకి మంచిగ ఉండేటిది. ఇప్పుడు కొంప మునగకుండా ఉండేటిది. వాల్లు నిన్ను, నీలాంటోళ్ళని నమ్మి, మీరేదో ఊడపొడిచేస్తరని సప్పుడు జేయకుండా కూర్చున్నరు. తెలుగు తల్లి ఒడిలో ఆయుధం, స్టార్ బ్యాట్స్ మన్ అని ఏవేవో కబుర్లు చెప్పి నువ్వు సీమాంధ్ర వాళ్ళని కూల్ చేసినవ్. అందుకే వాల్లు ఇప్పుడు ఏడుస్తున్నరు. సమైక్య ఉద్యమం చల్లబడనికి నువ్వు కూడా మంచిగ కృషి చేసినవ్ లగడపాటి భయ్యా. సీమాంధ్రోల్లు నీ మాటలు నమ్మకుండా సొంతగా ఆలోచించి వుంటే ఇప్పుడు వీధుల్లో పడి ఏడవాల్సి వచ్చేటిది కాదు. వేర్పాటు వాదం ఈ రేంజ్‌కి వచ్చేటిదీ కాదు. అంద్కని ఇంతకాలం సీమాంధ్ర వాల్ల చెవులల్ల పూలు పెట్టినంద్కు మీకు మా విభజనవాదులందరి దిక్కుకెల్లి థాంక్స్ చెప్తన్ననన్నా!  నువ్వు ముందు ముందు కూడ గిట్లనే మా విభజనవాదులకి హెల్ప్ చేయన్నా. నువ్వు గిట్లనే మాకు హెల్ప్ చేస్తే మేం భీ నీకు హెల్ప్ చేస్తమన్నా. రేపు తెలంగాన వచ్చినంక హైదరాబాద్ల వున్న నీ ఆస్తుల జోలికి మేం రామన్నా. మనిద్దరిమధ్య ఈ ఒప్పందం కుదిరినట్టు ఎవలికీ చెప్పకన్నా.. ఇంకోపాలి థాంక్యూ లగడపాటి భయ్యా. ఇట్లు... -విభజనవాది

‘కారు’కూతల కేటీఆర్!

      ‘కారు’ను తమ పార్టీ సింబల్‌గా పెట్టుకున్న టీఆర్ఎస్ నాయకులకి సీమాంధ్రుల మీద కారుకూతలు కూయడమంటే చాలా ఆస్తకి. సీమాంధ్రులకు మండేలాగా కారుకూతలు కూయడంలో కేసీఆర్ తర్వాతి స్థానం కోసం కేసీఆర్ కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు పోటీ పడుతూ వుంటారు. ఆ పోటీలో కేటీఆర్‌దే పైచేయి అవుతూ వుంటుంది. నిన్నగాక మొన్ననే అదనపు ఆదాయం వెతుక్కుంటూ అమెరికా నుంచి తెలంగాణ ఉద్యమంలోకి దూకిన కేటీఆర్ భారత రాజ్యాంగం మొత్తాన్నీ ఔపోసన పట్టేసినట్టు మాట్లాడుతూ వుంటాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు ఎంతమాత్రం జంకు, గొంకు కనబర్చని కేటీఆర్ని చూస్తుంటే ముచ్చటేస్తూ వుంటుంది. ఎంతయినా దొరబిడ్డ దొరబిడ్డే అనిపిస్తూ వుంటుంది.     తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా చేయడానికి కొంతమంది ‘రోగ్’లు అసెంబ్లీని ప్రొరోగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. సరే కేటీఆర్ ఇక్కడితే ఆగితే బాగుండేది.. కానీ అలా ఆగితే ఆయన కేటీఆర్ ఎందుకవుతాడు? అసెంబ్లీకి తీర్మానం వచ్చినా రాకపోయినా, అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినా పొందకపోయినా తెలంగాణ బిల్ పాస్ అయ్యేలా చేసే అధికారం రాష్ట్రపతికి వుందట. అంచేత తమకేం భయం లేదట. రాష్ట్రపతి చెప్పాల్సిన పాయింట్ కూడా చెప్పేస్తున్న కేటీఆర్ భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఏంటో! ఇంకా ఏంటంటే, భద్రాచలం విషయంలో సీమాంధ్రులు అనవసరంగా హడావిడి చేస్తున్నారట. ఆరు నూరైనా భద్రాచలం తెలంగాణలోనే వుంటుందట. ఇదిలా వుంటే, ఢిల్లీలో వున్న అమెరికా రాయబార కార్యాలయంలో పొలిటికల్ ఆఫీసర్లు మరియం సిమెంట్‌వాలా, ట్రావిస్ కోబర్లీ అనేవాళ్ళు, ఇంకా హైదరాబాద్‌లో వున్న అమెరికా రాయబార కార్యాలయ అధికారులు జాన్, శ్రీమాలి తెలంగాణ భవన్‌కి వెళ్ళి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్‌ని కలిశారట. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ గురించి వీళ్ళిద్దర్నీ అడిగి తెలుసుకున్నారట. సీమాంధ్రుల రక్షణ గురించి అడిగితే సీమాంధ్రులే అడగాలిగానీ, సీమాంధ్రులను భయపెట్టేవాళ్ళనే అడగటమేంటో! అమెరికా అధికారులు  ఆ అడిగేదేదో ప్రభుత్వ అధికారులను అడగాలిగానీ, కేటీఆర్, శ్రవణ్‌లని అడగటమేంటో!  అంతేలే, సీమాంధ్రవాళ్ళని బెదిరించేవాళ్ళనే అడగటం బెస్టని అమెరికావాళ్ళు అనుకున్నారేమో!

డీఎస్ ఆశ్చర్యం!

      వారానికోసారి వార్తల్లో కనిపించి తెలంగాణకి అనుకూలంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే డి.శ్రీనివాస్‌కి నిద్రపట్టేలా లేదు. తెలంగాణకి ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న చాలామంది సీమాంధ్ర వాళ్ళ మనసులు చివుక్కుమనేలా ఏదో ఒకటి మాట్లాడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి మూమెంట్లో తాను కూడా ఏదో ఒకటి మాట్లాడకపోతే ముఖ్యమంత్రి రేసులో వెనకబడిపోతానని అనుకుంటున్నారో ఏమో గానీ, డీఎస్ కూడా తనకు తోచింది మాట్లాడుతూ తానూ రంగంలో ఉన్నానని అనిపించుకుంటున్నారు.   తాజాగా ఆయన మాట్లాడిన పాయింట్లను గమనిస్తే, తాను మిగతా కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఫార్వర్డ్ అయిపోయినట్టు, అధిష్ఠానానికి చాలా దగ్గరగా వున్నట్టు బిల్డప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన మాట్లాడిన పాయింట్లేంటంటే, 10 జిల్లాలతో, హైదరాబాద్‌తో కూడిన హైదరాబాద్ వచ్చేస్తోందట. సీమాంధ్రులు ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసే స్థాయిలో ప్యాకేజ్ రాబోతోందట! అంచేత సీమాంధ్రులు సమైక్యం అంటూ హడావిడి చేయకుండా వచ్చే అద్భుతమైన ప్యాకేజీ తీసుకుని పండగ చేసుకోవాలట. బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో గప్‌చుప్‌గా బిల్లుకు ఆమోదం తెలిపి పంపేయాలట. అలా కాకుండా బిల్లును అడ్డుకోవడానికి ఏం చేసినా అది అసెంబ్లీ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసినట్టేనట! ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఎ పరిధి ఉంటుందని తాను అనుకోవట్లేదట. ఒకవేళ హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్నా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటలేరట.. ఎందుకంటే తమ ప్రాంతం కంటే హైదరాబాద్ దూరంగా వుంది కాబట్టి ఇంతదూరం రాలేక అక్కడే రాజధాని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారట. అలాగే రాయల తెలంగాణ డిమాండ్ చేసినవాళ్ళు  రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టేనట.. ఇవీ డీఎస్ గారు చెప్పిన విషయాలు! డీఎస్ ఇలా మాట్లాడ్డం సీమాంధ్రులకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సీమాంధ్రులని వెర్రోళ్ళని చేస్తూనే మాట్లాడతారు. రాష్ట్ర విభజన గురించి తనకు మాత్రమే అనేక విషయాలు తెలుసన్నట్టు మాట్లాడుతున్న డీఎస్, తెలంగాణ వస్తే తాను ముఖ్యమంత్రి అవుతారో లేదో మాత్రం చెప్పలేకపోవడం ఆశ్చర్యకరమేగా!    

కిషన్‌రెడ్డి కితకితలు!

      బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే కితకితలు పెట్టినట్టు నవ్వొస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో పక్షపాత ధోరణితో తెలంగాణకే పూర్తి మద్దతు ప్రకటించి సీమాంధ్రలో పార్టీని గల్లంతు చేసినందుకు బీజేపీ అగ్రనాయకత్వం కిషన్‌రెడ్డికి అక్షింతలు వేసింది. అప్పటి నుంచి ఆచితూచి మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి అప్పుడప్పుడు అదుపుతప్పి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు.     బీజేపీ సీమాంధ్ర నాయకులెవరైనా ‘సమైక్యం’ అనే మాట మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కిషన్‌రెడ్డి సారు తాజాగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని విభజించాలని ఉద్యమాలైతే చేయొచ్చుగానీ, ఆల్రెడీ వున్న ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేయొద్దనడం మాత్రం నేరమట!  ఇప్పటికే కిషన్‌రెడ్డి వ్యవహారశైలి మీద గుర్రుగా వున్న సీమాంధ్ర నాయకులకు ఈ వ్యాఖ్యలు పుండుమీద కారంలా మారాయి. బీజేపీ కేంద్ర నాయకత్వమే తెలంగాణ మీద పునరాలోచించుకుంటున్న సమయంలో కిషన్‌రెడ్డి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం న్యాయం కాదని వారంటున్నారు.   సమైక్యం అంటే సీమాంధ్ర నాయకులను సస్పెండ్ చేస్తానని ప్రకటించిన కిషన్‌రెడ్డి ఇంకా ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం వందలాదిమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ ‌గాంధీ కోసం తెలంగాణ విభజనను చేపట్టిందని చెప్పారు. అంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుందని తెలిసీ బీజేపీ అందుకు మద్దతు ఇస్తోందని అర్థమా? కిషన్‌రెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. బీజేపీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించలేదని అన్నారు.   కిషన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ విన్న తర్వాత ఆయన తెలంగాణకు అనుకూలంగా వున్నారా.. వ్యతిరేకంగా వున్నారా అనే విషయం సామాన్యులకు  అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. కిషన్‌రెడ్డి ఈతరహా కితకితలు ఆపి క్లారిటీతో మాట్లాడితే బెటరంటున్నారు. తన సొంత ఎజెండాలో క్లారిటీ లేకపోతే బుద్ధిగా కేంద్ర నాయకత్వం చెప్పినట్టు వింటే మంచిదని సూచిస్తున్నారు.

డొక్కశుద్ధి లేనట్టుంది!

      ఎవరి నోట్లోంచి అయినా నలుగురికీ ఉపయోగపడే మాటలు రావాలంటే వాళ్ళకి కాస్తంత అయినా డొక్కశుద్ధి వుండాలి. రాష్ట్ర మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి పేరులో ‘డొక్క’ వుందిగానీ, మనిషిలో డొక్కశుద్ధి వున్నట్టు లేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి అయి వుండి కూడా ఆయన ఎప్పుడూ రాష్ట్రం సమైక్యంగా వుండాలని గట్టిగా వాదించిన పాపాన పోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన చేసిన కృషి కూడా లేమీ లేదు. అయ్యగారి నోటి వెంట ఎప్పుడు ఏ మాట వచ్చినా రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వుంటుంది.   తనకు తన పదవి తప్ప ఏదీ పట్టదన్నట్టుగా ఆయన వ్యవహారశైలి వుంటుంది. ఇటు విభజన ఉద్యమంతోగానీ, అటు సమైక్య ఉద్యమంతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ వుంటారు. ఎవరైనా సమైక్య ఉద్యమకారులు ఎక్కడైనా నిలదీస్తే మాత్రం ‘రాష్ట్రం సమైక్యంగా వుండాలనే నేను కోరుకుంటున్నా. కాకపోతే రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితి లేదు’ అని చెప్పి తప్పించుకుంటూ వుంటారు. సీఎం ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనడం డొక్కా మాణిక్య వరప్రసాద్‌కి ఈమధ్య బాగా అలవాటైపోయినట్టుంది. అందుకే సీఎం సమైక్యం అంటున్నాడు కాబట్టి ఆ సమైక్యాన్ని నేనెందుకు పట్టించుకోవాలని ఊరుకుంటున్నట్టున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలన్న డిస్కషన్ అంతటా జరుగుతోంది. మన డొక్కా గారికి కూడా సీమాంధ్ర రాజధాని గురించి మంచి మంచి ఐడియాస్ వచ్చినట్టున్నాయి. వాటిని వెంటనే బయటపెట్టేశారు. కొండవీడు ప్రాంతానికి సంబంధించిన ఒక సీడీ విడుదల కార్యక్రమానికి వెళ్ళిన మంత్రిగారికి సీమాంధ్ర రాజధాని గురించి అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే కొండవీడు, అమరావతి ప్రాంతాలను సీమాంధ్ర రాజధానిగా చేస్తే అద్భుతంగా వుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేశారు. అసలే రాష్ట్రం విడిపోతోందన్న బాధలో వున్న సమైక్యవాదులను డొక్కా గారి విచిత్ర ప్రతిపాదనలు మరింత బాధపెడతాయే తప్ప వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా డొక్కా గారు కాస్తంత డొక్కశుద్ధి చూపించి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది.

జగన్ మమతానురాగం!

      మొన్నీమధ్యనే జైల్లోంచి బయటకి వచ్చిన జగన్ ‘ముఖ్యమంత్రి కుర్చీ’ అనే తన కోర్కెను తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రత్యేక అనుమతులు తీసుకుని దేశమంతా తిరుగుతున్నాడు. మొన్నీమధ్యనే ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకుల మద్దతు సంపాదించుకోవాలని ప్రయత్నించిన జగన్‌కి అక్కడేమీ వర్కవుట్ కాలేదు. ఏదో సాధించాలని ఢిల్లీ యాత్ర చేసిన జగన్‌ని బీజేపీతో సహా అన్ని పార్టీల వరకూ ఖాళీ చేతులతో వెనక్కి పంపారు.     కు౦భకోణాల్లో ఇరుక్కుపోయిన వున్న జగన్‌తో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. జాతీయ పార్టీల దగ్గర పప్పులు ఉడకని జగన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద కన్నేశాడు. మొదటగా కోల్‌కతా వెళ్ళిన జగన్ కోల్‌కతా కాళి మమతా బెనర్జీని కలిశాడు. మమతను అందరూ ‘దీదీ’ (అక్క) అంటారు. జగన్ కూడా సోనియాని ‘అమ్మా’ అని ఎంత ప్రేమగా పిలుస్తాడో మమతని ‘అక్కా’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆమె మద్దతు పొందే ప్రయత్నం చేశాడు. ఆమె దగ్గర ఏ మమతానురాగాలు ఒలకబోశాడో గానీ, మమత జగన్ తమ్ముడికి బాగానే రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే 2014  ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యే రేసులో వున్న మమతా బెనర్జీ ఇప్పుడు అందర్నీ కలుపుకుపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు జగన్‌తో భవిష్యత్తులో రాజకీయంగా ఏ అవసరం పడుతుందోనని ఆమె జగన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి గంటలు గంటలు డిస్కషన్ చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చెల్లిని దూరం చేసుకున్న జగన్ ఇప్పుడు ఒక అక్కని సంపాదించుకున్నాడన్నమాట.  తాను జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపించిన షర్మిల చెల్లమ్మకే జెల్ల కొట్టిన జగనన్న భవిష్యత్తులో మమత అక్కకి ఎన్కి జలక్కులు ఇస్తాడో వేచి చూడాలి. పాపం బెంగాలీ అక్కకి జగన్ మమతానురాగాల గురించి పూర్తిగా తెలుసో తెలియదో!  

దేవతలారా దీవించండి!

      టీ కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీని ఏనాడో దేవతని చేసేశారు. తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత ఆ భావన మరింత పెరిగిపోయింది. ఆ దేవతకి అర్జెంటుగా గుడులో గోపురాలో కట్టించేసి కృతజ్ఞతలు తీర్చుకోవాలన్న ఆకాంక్ష ప్రతి టీ కాంగ్రెస్ నాయకుడిలో భారీ స్థాయిలో ఏర్పడింది. తెలంగాణ ఇచ్చేసి దీవించిన సోనియా దేవత మీద టీ కాంగీయులకు ఆమాత్రం భక్తి వుండటం న్యాయమే! మరి రాష్ట్ర విభజన పావులు చకచకా కదులుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రులు ఏ దేవతని నమ్ముకోవాలి.. ఏ దేవత తమను దీవించి కాపాడుతుందని ఎదురుచూడాలి? ఈ ప్రశ్నకు సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇస్తున్నారు.     సోనియా దేవత తెలంగాణకు ఇచ్చిన వరాన్ని తిప్పికొట్టే శక్తి వున్న దేవతల గురించి కిరణ్ ఎంతో భక్తిగా చెప్పారు. చిత్తూరు జిల్లాలో వున్న బిడికి అనే గ్రామంలో వున్న ఐదుగురు దేవతలు తెలంగాణ రాకుండా చేసే శక్తి కలిగి వున్నవారని ఆయన చెబుతున్నారు. ఆ గ్రామంలో ఐదుగురు గ్రామ దేవతల దేవాలయం వుందట. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఎవరు ఏమి కోరుకున్నా జరిగిపోతుందట. అందుకోసమే కిరణ్ కుమార్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్ళారు. రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉంచాలని సదరు ఐదుగురు దేవతను మనసారా కోరుకున్నారు. ఆ దేవతలు తన ప్రార్థన విన్నారని, వాళ్ళు తప్పకుండా రాష్ట్రం విడిపోకుండా చూస్తారని కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర విభజన కోసం కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్నా, సీమాంధ్రులకు చల్లటి మాటలు చెబుతూ కిరణ్ శాంతపరుస్తున్నారని, రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోవడానికి సోనియా చెబుతున్నట్టు ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ ఎక్కడో చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు గ్రామ దేవతలు రాష్ట్ర విభజనను ఆపుతారని కిరణ్ ప్రకటించడం చాలా కామెడీగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వున్న ఐదుగురు దేవతలకంటే సోనియా దేవతే చాలా పవర్ ఫుల్‌గా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ ఇలాంటి ‘ఆధ్యాత్మిక’ కబుర్లు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటున్నారు. కిరణ్ తన మాటల ద్వారా రాష్ట్ర విభజన జరిగిపోవడం ఖాయం.. ఇక మీకు ఆ దేవతలే దిక్కు అని సీమాంధ్రులకు అన్యాపదేశంగా చెబుతున్నారా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ ప్రోరోగం?

  వెయ్యెకరాల పచ్చని మాగాణి పోతే పోయింది గానీ ‘లా’ క్షుణ్ణంగా తెలిసి వచ్చిందన్నట్లు జగన్ మూలంగా ఇప్పుడు సామాన్య ప్రజలకి కూడా సీబీఐ, కోర్టులు, కేసులు, బెయిలు, పిటిషన్లు, అనుమతులు వగైరా అంశాల గురించి చక్కటి అవగాహన ఏర్పడింది.   అదేవిధంగా రాష్ట్రవిభజన వ్యవహారంలో ఉత్తుతి కమిటీలు, కోర్ కమిటీలు, ఉత్తుత్తి రాజీనామాలు, జీఓయం, చట్టంలో ఉన్న వివిధ ఆర్టికల్స్, విభజన సాంప్రదాయాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా అర్ధం అయింది. నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెండు అంశాలలో పీ.హెచ్.డీ. పొందడానికి అన్నివిధాల అర్హులని ఒప్పుకోక తప్పదు. అయితే ఈ ప్రక్రియలో శాసనసభ, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందవలసి ఉంది గనుక, ఈ లోగా ప్రజలకి మరికొంత జ్ఞాన సముపార్జన చేసుకొనే సౌలభ్యం ఉంది.   గత రెండు రోజుల నుండి ‘ప్రోరోగ్’ అనే మాట అందరి నోట వినిపిస్తోంది. అంటే అదేదో వైద్య పరిభాషకు చెందిన ఏ అంటూ రోగమో అని కొందరు కాదు రోగ్ అంటే ప్రజాప్రతినిధులు ఒకరినొకరు తిట్టుకొనే 'తిట్టు' అని మరి కొందరు వాడులాడుకొంటున్నారు. అయితే దానర్ధం ఏమిటంటే మళ్ళీ ప్రభుత్వం కోరేవరకు శాసనసభని నిరవదికంగా వాయిదా వేయడమన్నమాట. ఇది శాసనసభ సమావేశాలు ముగిసిన తరువాత జరిగే సాధారణ తంతుగా చెప్పుకోవచ్చును.   ఈ ఏడాది జూన్ 23వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వం నుండి సభను ప్రోరోగ్ చేయమంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి ఎటువంటి అభ్యర్ధన రాలేదు. కానీ, ఇక నేడో రేపో శాసనసభను సమావేశపరిచి తెలంగాణా బిల్లుపై చర్చ చెప్పట్టవలసిన తరుణంలో సభని ప్రోరోగ్ చేయమని కోరుతూ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నుండి లేఖ వచ్చిందని మీడియాలో పైలిన్ తుఫాను కంటే భీభత్సంగా చర్చలు జరుగుతున్నాయి.   మీడియాలో ఇంత హంగామా జరుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఇద్దరు వేరే ఏదో గ్రహాంతర ప్రయాణంలో ఉండి ఇది గమనించలేకపోయినట్లు ఇద్దరూ ఇంతవరకు నోరు మెదపట్లేదు. ఇదే అదునుగా రాజకీయ నేతలు, పార్టీలు, వాటి మీడియాలు ఈ ప్రోరోగం గురించి తీవ్రంగా చర్చిస్తూ, ప్రజలకి కూడా దాని పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి.   అధికారికంగా ఈ ప్రోరోగం గురించి ఎటువంటి వివరణ లేనందున మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు కాసింత చొరవ తీసుకొని “అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోతే దానిని మళ్ళీ ఎప్పుడు సమావేశపరచాలన్నది స్పీకర్ పరిధిలో ఉంటుందని, ప్రొరోగ్ అయితేనే అప్పుడు ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుందని” ఆయన తెలిపారు.   అంటే ఇప్పుడు సభను ప్రోరోగ్ చేయమని ముఖ్యమంత్రి నుండి విజ్ఞప్తి లేదా ఆదేశాన్ని స్పీకర్ అమలు చేయనవసరంలేదని అర్ధం అవుతోంది. స్పీకర్ కి కూడా చాలా ముందుగానే డిల్లీకి పిలిచి చెప్పవలసినదంతా చెప్పడం అయిపోయింది గనుక ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా స్పీకర్ శాసనసభ సమావేశాలు నిర్వహించడం ఖాయం.   సభను ప్రోరోగ్ చేసినంత మాత్రాన్న తెలంగాణా బిల్లూ ఆగదు, ఏర్పాటూ ఆగదని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా బాగానే తెలుసు గనుక, ఆయన ‘నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదనే’ భ్రమలో ఉండే ఆవకాశం లేదు. ఇటువంటి ప్రోరోగోపాయలు కేవలం అధిష్టానాన్ని కొంచెం అల్లరి పెట్టేందుకు, టెన్షన్ పెట్టేందుకే తప్ప బిల్లుని ఆపలేవు.   ముఖ్యమంత్రి శాసనసభలో జరిగే చివరి రాద్ధాంతంలో పాల్గొని మీడియా లైవ్ కవరేజ్ ఇస్తుంటే ధాటిగా ప్రసంగించి రాజీనామా చేసి సమైక్య ఛాంపియన్ ట్రోఫీ పట్టుకొని బయటపడవచ్చును. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వల్ల ప్రజలకి ‘ప్రోరోగం’ అంటే అంటు వ్యాధి, తిట్టు కానేకాదనే మరో కొత్త విషయం తెలుసుకొనే అవకాశం కలిగితే, మీడియాకు మూడు నాలుగు రోజులకు సరిపడే మేత దొరికిందని చెప్పవచ్చును.

బలపడుతోన్న బంధం!

      కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి ప్రభంజనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న పార్టీ భారతీయ జనతాపార్టీ. ఒకే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రెండు శక్తులు ఒకటయితే ఎలా వుంటుంది? ఒక ఉన్నత లక్ష్యం మరింత సులభంగా చేరుకోవడానికి వీలవుతుంది. అందుకే భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహబంధం బలపడుతోంది.     రాబోయే ఎన్నికలలో కలసి కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనే విధంగా రంగం సిద్ధమవుతోంది. దీనికోసం విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు.. బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు. గత కొంతకాలంగా కేంద్ర రాజకీయాల మీదే దృష్టిని కేంద్రీకరించిన వెంకయ్య నాయుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు. ఇంతకాలం రాష్ట్ర బీజేపీలో కిషన్‌రెడ్డి చెప్పిందే వేదంలా నడిచింది. ఆయన జై తెలంగాణ అంటే కేంద్ర నాయకత్వం కూడా జై తెలంగాణ అంది. అయితే తెలంగాణ విషయంలో కిషన్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం రాష్ట్రంలో పార్టీకి ఎంత నష్టం చేసిందో బీజేపీ నాయకత్వం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో బీజేపీ తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడం వెంకయ్య నాయుడికి ఇష్టం లేకపోయినా, పార్టీ విధానాన్ని గౌరవించి ఆయన ఇంతకాలం మౌనంగా వున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదకి వచ్చాక తెలంగాణ విషయంలో బీజేపీ స్వరం మెల్లమెల్లగా మారుతోంది. రాష్ట్రంలో ఇతర పార్టీలో ఇంతవరకూ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మొదటి అడుగే తెలుగుదేశం పార్టీతో స్నేహం పెంచుకోవడం. బీజేపీ-టీడీపీ దోస్తీని కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆయన మాట చెల్లకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కిషన్ రెడ్డి ఎంత వ్యతిరేకించినా బీజేపీ-టీడీపి బంధాన్ని బలపరచడానికి వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా కేంద్ర నాయకత్వం నుంచి కిషన్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.  జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే త్వరలోనే టీడీపీ-బీజేపీ జట్టు కట్టడం ఖాయమనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Y టర్న్ & నాలుగుకాళ్ళ సిద్ధాంతం!

      తెలుగుజాతి మొత్తం క్షేమంగా వుండాలని, తెలంగాణ-సీమాంధ్ర తనకు రెండు కళ్ళలాంటివని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నప్పడు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ‘రెండుకళ్ళ సిద్ధాంతం’ అంటూ వెక్కిరింతగా మాట్లాడాయి. ఎవరు ఎంతగా విమర్శించినా చంద్రబాబు తెలుగుజాతి మొత్తం బాగుండాలి. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చినా సమన్యాయం పాటించాలని చెబుతూ వచ్చారు. అన్నదమ్ములు విడిపోతే ఎవరూ నష్టపోకూడదని అంటూ వచ్చారు. టీడీపీ మాటలకు పెడర్ధాలు తీస్తూ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెరైటీ సిద్ధాంతాల్లోకి మళ్ళాయి.   కాంగ్రెస్ పార్టీ నాలుగు కాళ్ళ సిద్ధాంతంతో నడుస్తుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో “Y” టర్న్ తీసుకుంది. అదెలాగంటే, నిన్నగాక మొన్న జరిగిన కేంద్ర మంత్రుల బృందం సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జీఓఎం ముందు నాలుగు కాళ్ళ సిద్ధాంతం ప్రదర్శించింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించాలని అంటే, మరికొంతమంది రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిందేనన్నారు. ఇంకొందరు కాంగ్రెస్ నాయకులు రాయల తెలంగాణ అంటే, ఇంకొంతమంది మాత్రం విభజనకు ఒప్పుకోం.. ఒకవేళ విభజిస్తే మా ప్రాంతానికి న్యాయం చేయండంటూ వెరైటీ ప్రపోజల్ పెట్టారు. మొత్తానికి ఒకే విషయం మీద నాలుగు రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీది నాలుగు కాళ్ళ సిద్ధాంతం కాక మరేమవుతుంది? ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న “Y” టర్న్ దగ్గరికొస్తే, మొదట విభజనవాదాన్ని భుజాన వేసుకుని ఆ మార్గంలో ప్రయాణించిన ఆ పార్టీ ఇప్పుడు పైకి సమైక్యం అంటూ, లోపల విభజన మంత్రం జపిస్తూ రెండు దారుల “Y” జంక్షన్‌లో నిలబడి వుంది. ఇలాంటి విధానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు.  

టీ కాంగ్రెస్ ‘పేరాశ’!

      ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వస్తుందో రాదో తెలియని తెలంగాణ రాష్ట్రానికి పేర్లు డిసైడ్ చేసేస్తున్నారు. జైపాల్‌రెడ్డి నాయకత్వంలో కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరి విడత నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో తమ గొంతెమ్మ కోర్కెల చిట్టాని పొందుపరచడంతోపాటు రాష్ట్రం రెండు ముక్కలైపోయిన తర్వాత రెండు ముక్కలకూ ఏయే పేర్లు పెట్టాలో కూడా సూచించేశారు. తెలంగాణ ప్రాంత ముక్కకి ‘తెలంగాణ’ అని పేరు పెట్టాలట. ఇందులో వెరైటీ ఏముందని అనుకుంటున్నారా? వుంది..   అదేంటంటే, మాకు ‘రాయల తెలంగాణ’ వద్దు.. కేవలం ‘తెలంగాణ’ మాత్రమే కావాలని మంత్రుల బృందానికి చెప్పకనే చెప్పారన్నమాట. సరే, వాళ్ళ ప్రాంతం వాళ్ళిష్టం అని ఊరుకుందామనుకుంటే, వాళ్ళకి సంబంధంలేని మిగతా ముక్కకి కూడా పేరు వాళ్ళే సూచించారు. మరో ముక్కకి ‘సీమాంధ్ర’ అని పేరు పెట్టాలట. అంటే టోటల్‌గా ‘ఆంధ్రప్రదేశ్’ అనే మాటకే టెండర్ పెట్టేశారన్నమాట! సీమాంధ్ర ప్రాంతానికి ‘ఆంధ్రప్రదేశ్’ అనే పేరు కంటిన్యూ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్’ అనే పదానికి ఇప్పటి వరకూ ఉన్న గుర్తింపు సీమాంధ్రులకు సొంతం అయిపోతుంది. దాన్ని కూడా తట్టుకోలేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘సీమాంధ్ర’ అనే పేరు సూచించారు. ఈరకంగా కూడా సీమాంధ్రులకు గుండుకొట్టాలని చూస్తున్నారు. ఇంతకంటే కుళ్ళుమోతుతనం ఇంకోటి వుంటుందా? రాష్ట్రాల పేర్ల విషయంలో వీళ్ళ ‘పేరాశ’ నలుగురూ నవ్వుకునేలా వుంది! ఇక వీళ్ళ సంగతి ఇలా వుంటే, సోనియా గాంధీకి గుడి కట్టేస్తానని తెగ హడావిడి చేస్తున్న శంకర్రావు కూడా కొత్తగా ఏర్పడుతుందని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్రానికి పేరు డిసైడ్ చేసేశాడు. కొత్త రాష్ట్రానికి శంకరన్న గారు సూచిస్తున్న అమూల్యమైన పేరు ‘సోనియా తెలంగాణ’!  భవిష్యత్తులో పొరపాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఇలాంటి విభజనవాదుల నుంచి తెలంగాణ ప్రజలను ఆ దేవుడే రక్షించాలి.  

11 ప్రశ్నల పరిస్థితేంటి?

      రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం రాష్ట్ర విభజనను ఒక చిన్నపిల్లల ఆటగా భావిస్తున్నట్టుంది. ఈ ప్రక్రియను ఏదో ఆషామషీగా నిర్వహిస్తూ విభజన వైపు దూసుకు వెళ్తోంది. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా ఒకళ్ళో ఇద్దరో మంత్రులు సమావేశానికి డుమ్మా కొడుతున్నారు.   రాష్ట్ర విభజన అంశం కంటే వీళ్ళకి అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయో అర్థం కాని విషయం. సరే, ఆ విషయం అలా వుంచితే, రాష్ట్ర విభజనకు సంబంధించి మంత్రుల బృందం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు స్కూలు పిల్లలకు ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చినట్టుగా 11 ప్రశ్నలు ఇచ్చింది. వేలికి వేస్తే కాలికి వేసినట్టుగా, కాలికి వేస్తే వేలికి వేసినట్టుగా వుండే ఆ 11 ప్రశ్నలకు పార్టీలు సమాధానాలు ఇవ్వాలని మంత్రుల బృందం కోరింది. ఆ ప్రశ్నల్లో దేనికి సమాధానం ఇచ్చినా రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపినట్టు వుండేలా చాలా తెలివిగా ఆ ప్రశ్నలను రూపొందించింది. అయితే జీఓఎం ముందుకు వెళ్ళిన ఏ పార్టీ కూడా సదరు 11 ప్రశ్నలకు సరైన విధంగా సమాధానం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే పార్టీలు ఎలాగూ సమాధానం ఇవ్వలేదు కాబట్టి సరిపెట్టుకోవచ్చు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్న పార్టీలు కూడా ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అంతెందుకు.. రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నల ఫార్మాట్‌కి సమాధానాలు ఇచ్చినట్టు లేదు. ఈ విషయంలో మంత్రుల బృందం కూడా పెద్దగా పట్టింపు లేనట్టు కనిపిస్తోంది. తాను ఇచ్చిన క్వశ్చన్ పేపర్‌కి ఏయే పార్టీలు సరైన సమాధానాలిచ్చాయన్నది వెల్లడించడం లేదు. తాను ఇచ్చిన ప్రశ్నల సమాధానాల విషయంలో పట్టింపులేని జీఓఎం ఆ అమూల్యమైన 11 ప్రశ్నల్ని సంధించడమెందుకు.. జనాన్ని టెన్షన్ పెట్టడమెందుకు?  

కాంగ్రెస్‌కి ముస్లింల టాటా!

      కాంగ్రెస్ పార్టీకి కాలం తీరినట్టుంది. ఓటర్లకు చేరువవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసి కొడుతున్నాయి. తాళ్ళే పాములుగా మారి కాంగ్రెస్ పార్టీని కాటేస్తున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనస్థితి బయటపడుతోంది.కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్ళాలని అనుకున్నా ఎదుర్రాళ్ళు తగులుతున్నాయి. ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసి ఓట్లు దండుకోవాలని రాహుల్ ‌గాంధీ చేస్తున్న ప్రయత్నాలు, ప్రసంగాలు బెడిసికొడుతున్నాయి.   ఆమధ్య ముజఫర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో ప్రసంగాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ ప్రసంగం అటు తిరిగి ఇటు తిరిగి ముస్లిం యువకులకు తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు ధ్వనించే మాటలు మాట్లాడే వరకూ వెళ్ళింది. రాహుల్ ప్రసంగం ముస్లింలను ఆకట్టుకునే మాట అటుంచి ఆల్రెడీ కాంగ్రెస్‌కి ఓటుబ్యాంకుగా వున్న ముస్లిం ఓటర్లు కూడా ఖల్లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం వుంటుందా? నోరు జారిన తర్వాత నాలుక్కరుచుకుంటే లాభం వుంటుందా? ప్రస్తుతం ముస్లిం ఓటర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాహుల్ గాంధీ పరిస్థితి అలాగే తయారైంది. రాబోయే రోజుల సంగతి ఏమోగానీ, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ముస్లింల విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం మొదలుపెట్టింది. కాకలు తిరిగిన మంత్రి కపిల్ సిబాల్‌ని రంగంలోకి దించింది. కపిల్ సిబల్ నాటకీయంగా రంగంలోకి దిగి, ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని, కాబట్టి రాహుల్ వెంటనే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. రేపో ఎల్లుండో రాహుల్ ముస్లింలకు సారీ చెప్పేస్తే ముస్లింలు చల్లబడిపోయి కాంగ్రెస్‌కి ఓటేసేస్తారని కాంగ్రెస్ పెద్దల దింపుడుకళ్ళం ఆశావాదం.

నాయకులు @ నాలుకలు!

      ఎవరికైనా కొత్తకొత్త హింసాత్మక పద్ధతులు తెలుసుకోవాలని వుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులను సంప్రదించవచ్చు. మొన్నటి వరకూ సీమాంధ్రుల నాలుకలు కోయడం మీద తెలంగాణ వాదులు ఇంట్రస్ట్ చూపించేవారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీమాంధ్రుల నాలుకలు కోయడంతోపాటు సరికొత్తగా హింసిస్తామని చెబుతున్నారు. ఆ సరికొత్త హింసాత్మక కార్యక్రమం ఎలా వుంటుందంటే, సీమాంధ్రుల నాలుకలకి ఉప్పు, పసుపు రాస్తారట. దాంతో సదరు నాలుకలు పల్చగా అయిపోతాయట! ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రతిపాదిస్తున్న నూతన హింసావళి!     ఇంతకీ ఈ కొత్త విధానాన్ని ఎవరి మీద ప్రయోగించాలని అనుకుంటున్నారంటే, తెలుగుదేశం సీమాంధ్ర నాయకుల మీద! తెలుగుదేశం పార్టీలో వున్న సీఎం రమేష్ లాంటి సీమాంధ్ర నాయకులు తెలంగాణ నాయకుడైన ఎర్రబెల్లి దయాకరరావుని నానామాటలూ అంటున్నారంట. అది చూసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య ఎంతమాత్రం తట్టుకోలేకపోతున్నారట. ఎర్రబెల్లిని ఎవరైనా ఏమైనా అంటే నాలుకలు కోయడంతోపాటు నాలుకలకి ఉప్పు, పసుపు రాసి పలుచగా చేస్తారట! తెలుగుదేశంలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుకి, అదే పార్టీలో వున్న సీఎం రమేష్‌కి మధ్య వాగ్వాదం జరిగితే, కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు మూర్తులకి కోపమెందుకో! అయినా  చంద్రబాబు జోక్యంతో తెలుగుదేశంలో వివాదం సర్దుమణిగిన తర్వాత వీళ్ళు హడావిడి చేయడం ఎందుకో! ఎందుకనేది టీ కాంగ్రెస్ నాయకులు చెప్పకుండానే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో అవమానాలను గురి అవుతున్న తెలంగాణ నాయకులు ఇంకా ఆ పార్టీలో వుండటం వేస్టట! అర్జెంటుగా బయటకి వచ్చేయాలట! అదండీ విషయం.. తెలుగుదేశం పార్టీలో వున్న తెలంగాణ నాయకుల మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడంలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మొసలి కన్నీరు కార్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకుల మీద ఎంత ‘ఆకర్ష’  ప్రయోగించినా అది ‘వికర్ష’ కావడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.

బీజేపీకి జగన్ ఎర!

      తనమీద వున్న అవినీతి కేసులన్నీ తొలగిపోవాలి. కుదిరితే పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కుదరకపోతే చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రైపోవాలి.. ఇది జగన్ ముందు కనిపిస్తున్న లక్ష్యాలు. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో తనకు అడ్డు వచ్చిన ప్రతిదాన్నీ తొలగించుకుని వెళ్ళిపోవడమే జగన్ అనుసరిస్తున్న విధానం. సామ, దాన, భేద, దండోపాయాలను సమయానుకూలంగా ప్రయోగించడంలో సిద్ధహస్తుడైన జగన్ ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం మీద దాన, భేదోపాయాలను ప్రయోగించాడు.     సమైక్యాంధ్ర నినాదాన్ని ఢిల్లీలో వినిపిస్తానంటూ హస్తినకు వెళ్ళిన జగన్ అక్కడ పలు పార్టీల పెద్దలను కలిశాడు. మీడియా ముందు ఒక విధానాన్ని, ఆంతరంగిక సమావేశాల్లో మరో విధానాన్ని ప్రకటించి తన రాజకీయ చతురతను చాటుకున్నాడు. ఈమధ్యకాలంలో భారతీయ జనతాపార్టీ తన విభజన విధానంలో మార్పులు చేసుకుంటోంది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చేరువ  అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం పొత్తు విషయంలో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైపోయింది. అదే ఖాయమైతే, రాష్ట్ర అడ్డగోలు విభజనకు అడ్డు పడుతుంది. అంతేకాదు జగన్ కంటున్న కలలన్నీ కల్లలైపోతాయి. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు తన దగ్గరున్న దాన, భేదోపాయాలను బయటకు తీశాడు. బీజేపీ నేతలతో ఆంతరంగికంగా జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తన సంపూర్ణ మద్దతు బీజేపీకి ఇస్తానని దానోపాయాన్ని, అలాగే బీజేపీని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి భేదోపాయాన్ని ప్రదర్శించాడని తెలుస్తోంది. అయితే జగన్ పెట్టిన ప్రపోజల్‌ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దగా స్పందించలేదని, చూద్దాం.. చేద్దాం అన్నట్టుగా పొడిపొడిగా స్పందించి పంపించేసిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఎన్ని ఉపాయాలు ప్రదర్శించినా భవిష్యత్తులో ఆయనను చుట్టుముట్టబోయే అపాయాలు ఆగుతాయా?