Read more!

ఢిల్లీ సాక్షిగా ఆంధ్ర పరువు గంగ పాలు

...సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

ఉత్తరాఖండ్ వరదలు రాజకీయ నేతలు కావలసినంత రాజకీయం చేసుకోవటానికి ఆటవస్తువుగా వినియోగించుకుంటున్నారు. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడి విపత్తు సంభవించిన తక్షణం స్పందించిన తీరు,దేశ ప్రజలందరిని అబ్బుర పరచింది. దానికి సదరు కాంగ్రెస్ నేతలు మోడీ హెలికాఫ్టర్లో తీసుకెళ్తున్నది వరద బాధితులను కాదు,ఓటర్లను అని విమర్శలు గుప్పించారు,వారు తమ భాద్యత విస్మరించారు. ఏదో ఇహ అవకాశం దొరికినపుడు దానినెందుకు జారవిడుచుకోవాలని భావించిన చంద్రబాబు ఢిల్లీ ఎ.పి భవన్ లో ధర్నాలని, ప్రత్యేక విమానమని ,ఎన్.టి.ఆర్ ట్రస్ట్ భవన్ నుండి డాక్టర్లని, వరద బాధితులకు రూ॥ 10,000/- పరిహారమని, మళ్లి ఇక్కడ హైదరాబాదు నుండి వారి వారి స్వస్థలాలకు కొడుకు లోకేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులని ఏవో ఆయన తంటాలు ఆయన పడుతున్నారు.


ఇదంతా ఒక ఎత్తు,సరే బాబుని చూసి బుద్ధి తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలు తమ వంతు బాధ్యత తాము బుద్ధిగా నిర్వహించకుండా నిన్న ఎ.పి భవన్ లో బాహాబాహికి దిగిన తీరు చూస్తే,వరద బాధితులు సహితం అసహ్యించుకుంటున్నారు. అసలే తెలుగు వారిని ఉత్తరాది వారు చాలా చులకనగా చూశారని యాత్రికులు ఒక పక్కన వాపోతుంటే మళ్ళి డిల్లీలో  ఏ. పి  భవన్ సాక్షిగా ఈ ముష్టి యుద్ధాలు,బూతు పురాణాలు,శవ రాజకీయాలు ఏమిటి?


నేడు చంద్రబాబు ఉత్తరాఖండ్  వరద బాధితులైన తెలుగువారి విషయంలో చేసిన సహకారం కొని యాడ దగినదే,అయితే గత 9సం॥ లు గా ఆయన ప్రతిపక్షనేత గా ఉన్నపుడు ఐల తుఫాన్,లైలా తుఫాన్ అని చాలా రకాల ప్రకృతి వైపరీత్యాలు ఆంధ్ర ప్రదేశ్ లో ను సంభవించాయి. అపుడు కూడా చాలా మంది నిరాశ్రయులైనారు. ఇదేవిధంగా చంద్రబాబు వారికి కూడా తన వంతు సహాయాన్ని,సహకారాన్ని అందించి నట్లైతే చాలా బాగుండేది. పాదయాత్ర మానుకుని మరీ ఒకసారి వెళ్లి సదరు బాధితుల్ని మొక్కుబడిగా పేపర్లో ఫోటోల కోసం పరామర్శించి వచ్చేశారు గాని,వారికి కావలసిన తక్షణ సహాయాన్ని ఏనాడు అందించలేదు,ఇపుడు డిల్లీలో చేస్తున్న మాదిరిగా. అలాగే సదరు టి.డి.పి  ఎం.పి  లు కూడా చంద్రబాబు అమెరికా నుండి వచ్చేవరకు బాధితులను పట్టించుకోకుండా ఏమిచేస్తున్నారో తెలియలేదు.


అంతేకాదు నేడు రాష్ట్రం లో చాలా సమస్యలు గత 9సం॥ లు గా రాజ్యమేలుతున్నాయి. వాటి మీద కూడా తగు రీతిలో శాసనసభలో పోరాటం చేసి ఉంటే బాగుండేది. అసలు సభకే హాజరవ్వకుండా అమెరికా యాత్ర ఒక సారి,పాద యాత్ర ఒకసారి.ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. ఇంకా వాటిని డిల్లి సాక్షిగా ఉత్తర భారతదేశం వారికి కూడా వాసన చూపించటం దేనికి?ఏది ఏమైనా ఈ రెండు పార్టీల పుణ్యమా అని నేడు డిల్లి సాక్షిగా గంగలో కలిసిన పరువుని ఎవరు బయటకు తీస్తారు?