పాకిస్తాన్ కు ఇక 'మోది'నట్టే!
posted on Sep 23, 2016 @ 1:00PM
పాకిస్తాన్ కు భారత్ ని కవ్వించటం ఇప్పుడు కొత్త కాదు. అసలు అది ఏర్పడ్డప్పటి నుంచే ఇండియాని టార్గెట్ చేసుకుని బతికేస్తోంది. 1947లో రెండూ స్వతంత్ర దేశాలుగా ఉనికిలోకి వస్తే అదే సంవత్సరం కాశ్మీర్ ఆక్రమణ కారణంగా పాక్ తో యద్ధం చేయాల్సి వచ్చింది భారత్. అప్పట్నుంచి మొదలైన పాక్ కవ్వింపులు మొన్నటి యూరి అమానుషం దాకా కొనసాగుతూనే వున్నాయి. కాని, ఇలాంటి కవ్వింపులు పాతవే అయినా... మోదీ మార్కు జవాబు పాకిస్తాన్ కు కొత్తగా వుంది. దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది నమో దండోపాయం!
పాక్ ఎప్పటిలాగే నలుగురు ఉగ్రవాదుల్ని పంపి మన జవాన్లు ఇరవై మందిని పొట్టన పెట్టుకుంటే కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుందని భావించింది. కాని, ఈ సారి ఇటు జనం , అటు ప్రభుత్వం రెండు వైపులా ఆగ్రహంతో వున్నారు. అందుకే, మోదీ మౌనంగా పాక్ ను అధః పాతాళానికి తొక్కే ప్రయత్నం మొదలు పెట్టాడు! అంతా భావించినట్టుగా ప్రత్యక్ష యుద్ధం జోలికి పోకుండా అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరిని చేసే కార్యక్రమం మొదలు పెట్టింది మోదీ సర్కార్. యూఎస్ మొదలు బంగ్లాదేశ్ వరకూ దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు పాక్ ని ఛీకొడుతున్నాయి. అమెరికా అయితే ఏకంగా పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ బిల్లు కూడా పాస్ చేసే ఆలోచనలో వుంది. మరో వైపు రష్యా పాకిస్తాన్ తో మిలటరీ విన్యాసాలు మానుకుంది. ఇలా అన్ని దేశాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది పాక్ కి.
పాకిస్తాన్ కి తాజాగా జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్లో కూడా దిమ్మ తిరిగిపోయింది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎప్పటిలాగే బూతు మాటలు మాట్లాడాడు తన స్పీచ్ లో. మరీ దిగజారిపోయి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ నాయకుడైన బుర్హాన్ వనీని కాశ్మీరీ ఉద్యమకారుడంటూ పేర్కొన్నాడు. ఒక దేశ ప్రధాని ఇలా నిస్సిగ్గుగా ఉగ్రవాదిని వెనకేసుకు రావటం పాక్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడిక పాకిస్తాన్ కు మిగిలిన ఏకైక మిత్ర దేశం చైనానే!
చైనా కూడా పాక్ తో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. యూఎన్ మీటింగ్ జరిగాక చైనా పీఎంతో భేటీ అయిన నవాజ్ షరీప్ చర్చలు ఫలప్రదం అయ్యాయంటే చైనీస్ వారు మాత్రం పాక్ తమకు మంచి మిత్రదేశం అని మాత్రమే కామెంట్ చేశారు. కాశ్మీర్ సమస్య గురించి, ఇండియా గురించి వారు ఎక్కడా మాట్లాడలేదు. అసలు కాశ్మీర్, ఉగ్రవాదాల విషయంలో చైనా కూడా పాక్ కు పూర్తి మద్దతు ఇస్తుందన్న భరోసా లేకుండా పోయింది ఇస్లామాబాద్ కి! ఇది ఖచ్చితంగా మోదీ మార్కు అంతర్జాతీయ దౌత్యమే అనాలి. ఆయన పదే పదే చేసిన ప్రపంచ పర్యటనల ఫలితం అనే చెప్పుకోవాలి!
పైకి స్పష్టంగా చెప్పకపోయినా ఆల్రెడీ మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించి అక్కడి ఉగ్రవాద క్యాంపులపై దాడి చేసిందని అంటున్నారు. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఏ దేశం కూడా తనంత ఒప్పుకోదు కాబట్టి నిజంగా జరిగిందా లేదా తెలియదు. కాని, ఇండియా ఏ క్షణంలో అయినా తన మీద దాడి చేస్తుందని పాక్ భయపడుతున్న మాట మాత్రం వాస్తవం. అందుకు తగ్గట్టే యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది ఆ దేశం!
ఒకవైపు దౌత్య, ఆర్మీ పరమైన ఒత్తిళ్లు పెంచుతూనే మోదీ ఉగ్రదేశం పాక్ పై ఇంకో రూట్ లోనూ ప్రెషర్ పెంచుతున్నారు. ఎప్పుడో నెహ్రు టైంలో పాక్ మనతో సింధు జలాల విషయమై ఒప్పందం చేసుకుంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీని కూడా పునః సమీక్షిస్తామని ప్రకటించారు ఇండియన్ అధికారులు! దీనర్థం భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే సింధు జలాలు ఇంత కాలం వంద శాతం వాడుకునేది పాక్. ఇకపై అలా జరగకుండా నీటిని అడ్డుకుంటాం అని అర్థం! ఇండియా ఈ పని చేస్తే పాక్ ఆకలితో నకనకలాడిపోవాల్సి వస్తుంది. సింధు నది పాకిస్తాన్ కి అతి పెద్ద జీవనాధారం. కాని, ఇప్పటి వరకూ మన ప్రభుత్వాలు ఆ నదిపై ఎలాంటి హక్కునూ కోరలేదు. మొత్తం నీరంతా పాక్ వాడేసుకుంటోంది. మోదీ ఇండస్ నదిపై చూపు పెట్టడంతో పాక్ గడగడలాడిపోతోంది..
పాకిస్తాన్ ఇండియా వచ్చి యుద్ధం చేస్తుందేమో అన్న భయంలో ఎంతగా వుందంటే.. అసలు ఎలాంటి ప్రకటనా మన వద్ద నుంచి ఇప్పటి వరకూ రాకుండానే ఆ దేశ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కుప్పకూలిపోయింది! అసలు పాక్ కు స్టాక్ ఎక్స్ ఛేంజ్ వుందా అంటారా? సోషల్ మీడియాలో చాలా మంది ఇదే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అసలు అత్యంత దారుణమైన ఆర్దిక స్థితిలో వున్న దాయాది దేశం ఇండియా ఆగ్రహాన్ని పదే పదే రెచ్చగొట్టి ఇంత కాలం తప్పు చేసింది. ఇప్పుడిక ఫైనల్ గా మోదీ శకంలో అంతిమ ఫలితం చవి చూడబోతోంది! చేసుకుంటూ వచ్చిన పాపాలకి మూల్యం చెల్లించబోతోంది!