యుద్ధంలో... వాళ్లు సైనికులు కాని సైనికులు!
posted on Oct 2, 2016 @ 1:11PM
మొన్న ఉడీ ఉగ్రదాడి. తరువాత అనూహ్యంగా భారత్ మెరుపు దాడి. మొత్తంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం! ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలూ ట్రిగ్గర్లపై వేలు పెట్టి నొక్కటానికి సిద్ధంగా వున్నాయి. ఇక మన దేశంలో అయితే యుద్దం చేయాల్సిందేనన్న నినాదాలు మార్మోగిపోతున్నాయి. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ తో మన ఆర్మీ సత్తా చాటడంతో పాక్ పని పట్టాల్సిందేనంటున్నారు 125కోట్ల జనం! కాని, ఈ సమయంలో మనమందరం పట్టించుకోని అసలు సిసలైన ఆయుధాలు పట్టని జవాన్లు కొందరున్నారు! వారెవరో మీకు తెలుసా?
యుద్ధం జరిగితే అటు పాక్ మిలటరీ మోహరిస్తుంది. ఇటు భారత్ సైన్యం సర్వసన్నద్ధంగా వుంటుంది. భారీగా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ పోరాటం చేస్తారు. కాని, వీరి మధ్యలోనే ఆయుధాలు లేకుండా యుద్ధం చేసే లక్షల మంది జవాన్లు వున్నారు! వాళ్లే సరిహద్దు గ్రామాల ప్రజలు! మరీ ముఖ్యంగా, కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లోని వందల గ్రామాల జనం ఇప్పుడు యుద్ధంలో భాగమైపోతున్నారు. మనందరిలా వీళ్లు టీవీల్లో దాడుల దృశ్యాలు చూసి ఆవేశపడిపోరు! ప్రత్యక్షంగా కాల్పుల్ని చూస్తారు! పేలుళ్ల శబ్దాలు వింటూ హడలిపోతుంటారు! తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు నానా యాతన పడుతుంటారు! అయినా, దేశ సరిహద్దుల్లో వున్న లక్షల మంది సామాన్య జనం మనందరిలాగే పాక్ పై కాలుదువ్వుతున్నారు! తమకు ఎంత ఇబ్బంది కలిగినా సమరం సాగాల్సిందే అంటున్నారు. పక్క దేశం నక్క జిత్తులు శాశ్వతంగా నశించాలని కోరుకుంటున్నారు...
పంజాబ్, కాశ్మీర్లలో పాక్ సరిహద్దు వెంట వుండే అనేక గ్రామాలకు రోజూ ఆర్మీ కవాతులు, పేలుళ్ల చప్పుడూ మామూలే. కాని, ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో మరింత ఉద్రిక్తంగా పరిస్థితుల్లో మారిపోయాయి. కొన్ని చోట్ల అయితే మన రైతులకి పొలం సరిహద్దుకి అటు వేపు కొంచెం, ఇటు వేపు కొంచెం వుంటుంది! ఆ రైతులు ఇటు భారత సైనికులకి, అటు పాకిస్తాన్ సైనికులకి తమ ఐడెంటిటి కార్డులు చూపించి పొలంలోకి వెళ్లాల్సి వస్తుంది! యుద్ధం మన మీద కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే . వాళ్లకు ప్రత్యక్ష సంక్షోభం!
పాక్ మన సైనిక చర్య తరువాత లోలోపల ఉడికిపోతోంది. ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అందుకే, మన ఆర్మీ పంజాబ్ రాష్ట్రంలోని వందల గ్రామాల్ని ఖాళీ చేయిస్తోంది. బార్డర్ కి దూరంగా సురక్షిత ప్రాంతాల్లో శిబిరాలు వేసి అక్కడ వుంచుతోంది! ఇందుకోసం స్వంత గ్రామాల్ని వదిలి అక్కడి సామాన్య జనం కట్టుబట్టలతో వళ్లిపోతున్నారు. భార్య, బిడ్డల్ని పట్టుకుని పని, పాటా వదిలేసి బిక్కుబిక్కుమంటూ మరోచోట వుండాల్సి వస్తోంది వారు! అందుకే, వాళ్లు యుద్ధంలో పాలు పంచుకున్నట్టే! జవాన్ల మాదిరిగా దేశం కోసం నిద్దుర లేని రాత్రులు గడుపుతున్నట్టే! అలాంటి బ్రేవ్ కామన్ ఇండియన్స్ కి జై కోట్టాల్సిందే!
జై హింద్... భారత్ మాతాకీ జై!