చైనాకు చెమటలు పట్టిస్తున్న ఇండియా, అమెరికా!
పాకిస్తాన్ తో అంటకాగుతు ఇండియాని ఇబ్బందిపెట్టాలని చూస్తోన్న చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అటు కాశ్మీర్ మొదలు ఇటు అరుణాచల్ ప్రదేశ్ దాకా భారత భూ భాగంలో ఎక్కడపడితే అక్కడ చొరబడుతూ , కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వే చైనా ఇప్పుడు కాస్త ఇబ్బందిపడటం మొదలు పెట్టింది. అందుక్కారణం... అమెరికా, ఇండియా సరికొత్త స్నేహమే!
గత కొన్ని ఏళ్లుగా అమెరికా, భారత్ అంతకంతకూ దగ్గరవుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా, మోదీ ప్రధాని అయ్యాక ఆయన చాలా సార్లు యూఎస్ వెళ్లి వచ్చారు. భారత ప్రధాని అగ్ర రాజ్యం సందర్శించినప్పుడల్లా రెండు దేశాల మీడియా పూనకంతో ఊగిపోతోంది. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా కూడా ఇండియా వచ్చి వెళ్లారు. అదీ గ్రాండ్ సక్సస్ అయింది!
మన ప్రధాని, వాళ్ల అధ్యక్షుడి స్థాయిలోనే కాదు... ఇండియా, అమెరికా వివిధ స్థాయుల్లో మీటింగ్ లు, ఒప్పందాలతో అలజడి చేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ మీద ప్రేమతో అమెరికా ఇండియాని అంతగా నమ్మేది కాదు. అలాగే, చైనా మీది భయంతో మన గత ప్రభుత్వాలు అమెరికాను పూర్తి స్థాయిలో ఆహ్వానించలేదు. కాని, మోదీ వచ్చాక అన్ని హద్దులు చెరిగిపోయాయి. ఇటు బిజినెస్ అటు డిఫెన్స్ రెండు అంశాల్లోనూ అమెరికా రిజెక్ట్ చేయలేని ఆఫర్స్ ఇండియా ఇస్తోంది. అందుకే, అన్ని విధాల దివాలా తీసిన పాక్ ను పక్కకు పెట్టి అమెరికా ఇండియాతో స్నేహానికి సై అంటోంది!
ప్రస్తుతం భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రక్షణ అంశాలపై కీలక ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్ తో ఇండియా, అమెరికా ఒకరి డిఫెన్స్ లాజిస్టిక్స్ మరొకరు వాడుకోగలుగుతారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న అమెరికన్ ఎయిర్ బేస్ లు లాంటివి ఇక ఇండియా వాడుకునే ఛాన్స్ వుంటుందన్నమాట. అదే సమయంలో అమెరికా కూడా మన లాజిస్టిక్స్ వాడుకుంటుంది. కాని, ఎక్కువగా లాభపడేది ఇండియానే. అమెరికా ప్రపంచంలోని ఏ స్థానం నుంచైనా యుద్ధం చేయగలదు. ఆ ఏర్పాట్లన్నీ మనకు ఇప్పుడు అందుబాటులో వుంటాయన్నమాట. అమెరికా ఇండియాకి ఎక్కువగా లాభపడే ఈ ఒప్పందం ఎందుకు కుదుర్చుకుంది? రీజన్ చైనానే!
డ్రాగన్ ను ఎలాగైనా అడ్డుకోవాలని ట్రై చేస్తోన్న అమెరికా దక్షిణా చైనాలో ఇండియా ద్వారా బీజీంగ్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకే, అమెరికా ఇండియాతో కలిసి నడిచేందుకు సిద్ధపడింది! ఇలా అమెరికా, ఇండియా ఒప్పందం ఇద్దరికీ మేలు చేసేదే!
ఎప్పటిలాగే మన అపొజిషన్ పార్టీలు ఒకట్రెండు విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, అమెరికాతో స్నేహం వల్ల వచ్చేలాభం, దాని అవసరంతో పోలిస్తే నష్టాలు అంత సీరియస్ కావు. కాబట్టి ఇటు పాక్, అటు చైనా రెండు మనతో జాగ్రత్తగా వుండాలంటే... ఇండియాఅమెరికాకు దగ్గరగా వుండటం అనివార్యం!