ప్రతీకారం మొదలైంది...
posted on Sep 29, 2016 @ 4:49PM
సెప్టెంబర్ 28... భగత్ సింగ్ జయంతి! అదే రోజు రాత్రి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాలుమోపింది! దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ అమరవీరుడికి నివాళి అన్నట్టు నిప్పుల వర్షం కురిపించింది. దేశం కోసం భారతీయులు ఎంతకైనా తెగిస్తారని చరిత్రకి మరోసారి ఋజువు చేసింది!
ఇంతకాలం ఉగ్రవాదంతో భారత్ ను గిల్లుతూ వచ్చిన పాక్ కు ఎట్టకేలకు ప్రతి దాడి రుచి ఎలా వుంటుందో తెలిసొచ్చింది. స్వయంగా భారత్ ఆర్మీ అంగీకరించిన దాని ప్రకారం మన సైనికులు పీఓకేలోకి చొచ్చుకుపోయి ఉగ్ర స్థావరాలపై దాడులు చేశారు. ఈ వేటలో దాదాపు 40మంది టెర్రరిస్టులు హతమైనట్టు ప్రాథమిక అంచన. మన వైపు ఎలాంటి నష్టం జరగనప్పటికీ పాక్ సైనికులు ఇద్దరు కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇండియన్ ఆర్మీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ చెప్పి మరీ చేసింది. పాక్ ఆర్మీకి సమాచారం ఇచ్చాకే తాము ఉగ్రవాదులపై విరుచుకుప్డడామని భారత ఆర్మీ అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ మాత్రం భారత్ భీకర దాడితో టోటల్ కన్ ఫ్యూజన్ లో పడినట్టు కనిపిస్తోంది! ఒకవైపు ప్రధాని నవాజ్ షరీఫ్ దాడుల్ని ఖండిస్తున్నామని అంటే పాక్ మిలటరీ అసలు దాడుల్లాంటివేం జరగలేదని చెబుతోంది! ఐఎస్ఐ తన వద్ద ఎలాంటి సమాచారమే లేదని అంటోంది! ఇలా పాకిస్తాన్ గందరగోళంలో వున్నట్టు స్పష్టమైపోతోంది...
మోదీ సర్కార్ నిజంగా దాడులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అందరూ పాక్ పై ఆవేశంతో యుద్ధం చే్ద్దామని అన్నా లోలోన ఇండియా అందుకు సిద్ధపడదని భావించారు. కొందరు మేధావులు, అభ్యుదయవాదులు తమదైన రీతిలో ఎప్పటిలాగే యుద్ధం వద్దని శాంతి వచనలు చెప్పారు. కాని, మోదీ, పారికర్, అజిత్ ధోవల్ త్రయం అర్థ రాత్రి పూట అందర్నీ ఆశ్చర్యపరిచింది. శత్రుదేశం స్వాధీనంలో వున్న ఉగ్ర నేలపైకి చొచ్చుకుపోయి మన వారు సత్తా చాటారు! దీనికి పాక్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కూడా మెండుగానే వున్నాయి. కాని, అలా పాకిస్తాన్ ప్రతి దాడులకి దిగితే మరింత భీకర యు్ద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం వుంది. దాని వల్ల మనకు నష్టం. పాక్ కు మరీ ఎక్కువ నష్టం...
కొన్ని రోజులుగా సింధూ జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ కు వున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాపై పునరాలోచన లాంటి మాటలు బలంగా వినిపించాయి. దానికి తోడు పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాన్ని భారత్ తన పలుకబడితో రద్దు చేయగలిగింది. ఇండియా పాకిస్తాన్ లో జరిగే సార్క్ సమావేశానికి వచ్చేది లేదనటంతో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, భూటాన్ లు కూడా నో చెప్పాయి. ఈ కారణంగా సార్క్ సమావేశమే రద్దైంది. ఇది పాక్ కు నిజంగా పెద్ద ఎదురుదెబ్బ. ఇక అటు రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా స్పస్టంగా భారత్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నాయి. పాక్ ను ఉగ్రవాదంపై నిజమైన పోరాటం చేయమని గట్టిగా హెచ్చరిస్తున్నాయి.
పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చైనా కూడా పదే పదే కాశ్మీర్ అంశంపై స్పస్టత ఇస్తోంది. అది ఇండియా, పాక్ తేల్చుకోవాలని , దాంట్లో చైనా ప్రమేయం వుండదని కుండ బద్దలు కొడుతోంది! పైగా ఇప్పుడు చైనా భారత్ పై వాణిజ్యపరంగా చాలా ఎక్కువ ఆధారపడుతుండటంతో పాక్ ను ఏకపక్షంగా సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఒకవేళ మాట వరసకు మద్దతు తెలిపినా యుద్ధంలో పాక్ తరుఫున నిలిచే సాహసం చైనా చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ కారణాలతోనే పాక్ ఏకాకి అయిపోయింది. ఇండియా పూర్తిస్తాయిలో విరుచుకుపడితే దాన్ని ఆదుకునే శక్తంటూ కనిపించటం లేదు! అఖరుకు మొన్న ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోలేదు. యూరోపియన్ యూనియన్ అయితే బలూచిస్తాన్ విషయంలో ఆ దేశంపై సీరియస్ గా వుంది. ఆర్దిక ఆంక్షలు విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది!
ఉరీ మారణకాండ సృష్టించి ఎప్పటిలాగే తప్పించుకుందామనుకున్న పాక్ కు అది కాస్తా ఇప్పుడు ఉరి తాడులా మారింది. ముందు ముందు మోదీ గవర్నమెంట్ ఇంకే స్థాయిలో దాడులు చేస్తుందో చూడాలి. పాక్ లోని ఉగ్రవాదుల్ని ఊడ్చిపెట్టేసే క్రమంతో ఆ దేశ ఆర్మీతో కూడా మనం తలపడాల్సి రావచ్చు. అదే జరిగితే అపార నష్టం ఖాయం. కాని, పాక్ లాంటి ఉన్మాద దేశానికి దానికి అర్థమయ్యే భాసలోనే ఏదో ఒక సమయంలో జవాబు ఇవ్వాల్సి వుంటుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టే కనిపిస్తోంది!