సుప్రీమ్ కోర్టు సుప్రిమెసీకి బీటలువారుతున్నాయా?
posted on Oct 2, 2016 @ 1:45PM
సుప్రీమ్ కోర్ట్... భారతీయులందరికీ దీనిపై ఇప్పటికీ చాలా విశ్వాసం, భయ, భక్తులు వున్నాయి. సుప్రీమ్ లో విషయం తేలిపోతే ఇక మరో దిక్కుండదని అంతా భావిస్తారు. ఆఖరుకు ఉరి శిక్ష అయినా సరే సుప్రీమ్ వరకూ ఒక్కో కోర్టులో ప్రశ్నిస్తూ వెళ్లవచ్చు. కాని, అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక ఎవ్వరైనా చేసేదేమీ వుండదు. క్షమాభిక్షలు పెట్టే అవకాశం రాష్ట్రపతికి వున్నా ఆయన కూడా సుప్రీమ్ కోర్టు మాటను తక్కువ చేస్తూ ఇష్టానుసారం క్షమాభిక్షలు పెట్టరు! అంతలా దేశంలోని ప్రతీ ఒక్కరూ అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తారు. అందుకు తగ్గట్టే చాలా సార్లు న్యాయం వైపు తీర్పులు ఇస్తూ మన సుప్రీమ్ చరిత్ర సృష్టించింది...
చిన్న చిన్న ఆస్తి గొడవలు మొదలు అయోధ్య రామ మందిర వివాదం వరకూ ఎన్నో కేసులు సుప్రీమ్ గడప తొక్కుతుంటాయి. అక్కడైతే న్యాయం దక్కుతుందన్న విశ్వాసం అందరిలోనూ వుంది. కాని, రాను రాను మన దేశంలో అన్ని వ్యవస్థల్లాగే సుప్రీమ్ కు కూడా ప్రమాదం పొంచి వున్నట్టు కనిపిస్తోంది! గత కొన్ని రోజుల్లో రెండు సార్లు సుప్రీమ్ కోర్టు ఆర్డర్స్ ధిక్కరణకు గురయ్యాయి. అదీ ఏ విదేశీ కంపెనీల వల్లనో, లేక ఉగ్రవాదుల వల్లనో కాదు.. మన దేశంలోని సంస్థలు, ప్రభుత్వాలే అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నాయి!
సుప్రీమ్ కోర్టుకు బీసీపీఐకి ఇప్పుడు ఇంచుమించూ వార్ నడుస్తోంది. వేల కోట్ల విలువైన బీసీసీఐ రాజకీయాల పుట్ట. ఇది అందరికీ తెలిసిందే. అందుకే, అందులో సంస్కరణలు రావాలని, నిజమైన క్రికెటింగ్ టాలెంట్ వెలుగు చూడాలని, ప్రపంచ క్రికెట్లో మన భారత టీం మరింత సమర్థంగా రాణించాలని చాలా మంది అంటుంటారు. మరీ ముఖ్యంగా బీసీపీఐ నిర్వహణ, నిధుల వినియోగం, టీమ్ సెలక్షన్స్, ఐపీఎల్ లాంటి అంశాల్లో ఈ మధ్య తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. గోల్ మాల్ ఎక్కువైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐని భారీగా సంస్కరించేందుకు లోథా కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు చాలా వరకూ బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. అవ్వి అంగీకరిస్తే తమ పప్పులు ఇక మీద ఉడకవని వారి భయం, బాధ. కాని, ఈ మొత్తం వ్యవహారంలోకి సుప్రీమ్ కోర్టు కూడా ఎంటర్ అయింది. బీసీసీఐని లోథా కమిటీ సిఫార్సులు అంగీకరించి పారదర్శకత పెంచమని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, విచిత్రంగా దేశపు అత్యున్నత న్యాయస్థానం చెప్పినా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ధిక్కరించేసింది. ఓ మీటింగ్ పెట్టుకుని లోథా కమిటీ సిఫార్సులు దాదాపుగా తిరస్కరిస్తున్నట్టు చెప్పేసింది! కోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసేసింది!
సుప్రీమ్ మాటని కాదని షాక్ ఇచ్చిన మరో వ్యవస్థ... కర్ణాటక ప్రభుత్వం. ఈ మధ్య తమిళనాడుకి కావేరీ నీళ్లు ఇవ్వమని పదే పదే న్యాయస్థానం సిద్దరామయ్య సర్కార్ కు చెబుతోంది. అయినా ససే మీరా అంటోంది అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్. తమ రాష్ట్రానికి నీళ్లు సరిపడా స్టోర్ అయ్యాకే తమినాడుకి వదులుతామని తేల్చి చెప్పేస్తున్నారు! ఏకంగా మాజీ ప్రధాని దేవేగౌడ నిరాహార దీక్షకు కూర్చుని కోర్టుని అవమానిస్తున్నారు! న్యాయం ఆధారంగా తీర్పునిచ్చే కోర్టును కూడా మన రాజకీయ నేతలు పట్టించుకోకుంటే... ఇక వివాదాలు తేలేది ఎలా?
బీసీసీఐ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీమ్ తీర్పుల్ని ధిక్కరించటం వెనుక బలమైన కారణాలే వుండొచ్చు. అవ్వి సరైనవా కాదా అనేది చర్చ కాదు. రీజన్స్ ఎన్ని వున్నా ఇలా ఎవరికి వారు మొండిగా అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తే... ఆ వ్యవస్థ వుండటం ఎందుకు? మామూలు జనం మాత్రం సుప్రీమ్ ని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు విశ్వాస్తారు? ఇప్పటికే కోర్టుల్లో తీర్పులు కొనుక్కోవచ్చని కొంత మంది ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడు వచ్చిన సరైన తీర్పుల్ని కూడా పాటించకపోతే.... న్యాయ స్థానాలకి వున్న ప్రతిష్ఠ పూర్తిగా పోతుంది. అది దేశంలో అరాచకానికి దారి తీసే ప్రమాదం వుంది. కాబట్టి సుప్రీమ్ కోర్టుని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే! ప్రవైట్ సంస్థ అయిన బీసీసీఐ అయినా... ప్రజలు ఎన్నుకున్న కర్ణాటక సర్కార్ అయినా...