మోదీ 'సర్జికల్ స్ట్రైక్స్'కి విపక్షాలు విలవిల!
posted on Oct 7, 2016 @ 6:34PM
సర్జికల్ స్ట్రైక్స్... ఈ పదం వినగానే మనమేదో పాకిస్తాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనుకోకండి! మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది మన వాళ్ల గురించే! ముఖ్యంగా, ప్రతి పక్షాల గురించి! ఇంతకీ విషయం ఏంటంటే... సర్జికల్ స్ట్రైక్స్ ఆర్మీ ఎవరి మీద జరిపింది? ఉగ్రవాదుల మీద కదా... కాని, పరిస్థితి చూస్తుంటే మన విపక్షాల మీద మెరుపు దాడి జరిగినట్టు అనిపిస్తోంది!
అసలు ఎప్పటిలాగే కొన్నాళ్ల కింద పక్క దేశపు ఉగ్రవాదులు మన జవాన్లను యూరీలో బలితీసుకున్నారు. తరువాత ఖండనల పరంపర మొదలైంది. బీజేపీ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు, ఆప్ వాళ్లు, మిగతా పార్టీల వాళ్లు అందరూ జై జవాన్ అంటూ నినదించారు. సోషల్ మీడియా కోపంతో ఊగిపోయింది. మామూలుగా అయితే ఇక్కడితో స్టోరీ క్లోజ్. మళ్లీ ఉగ్రవాదులు తెగబడే దాకా మనం క్రికెట్, బాలీవుడ్, పండుగలు, పబ్బాలు అంటూ గడిపేసే వాళ్లం! కాని, ఈసారి విచిత్రం జరిగింది! సరిగ్గా పది రోజులు కూడా తిరగకుండానే ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది! పాకిస్తాన్ని, ఉగ్రవాదుల్నే కాదు... ఇండియన్స్ ని కూడా షాక్ కి గురి చేసింది! మనం మరో దేశంపై రాత్రికి రాత్రి దండెత్తటమా? ఉగ్రవాదుల్ని కాల్చి పారేయటమా? ఎవ్వరూ నమ్మలేకపోయారు...
సర్జికల్ స్ట్రైక్స్ అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా జరిగిపోవటంతో అందరికి మైండ్స్ బ్లాంక్ అయ్యాయి. మోదీ భక్తులు, దేశభక్తులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నా పాకిస్తాన్ , మన విపక్షాలు అస్సలు జీర్ణించుకోలేకపోయాయి. మొదట్లో మోదీని ప్రపంచ దేశాలతో సహా అందరూ పొగుడుతుంటే ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితిలో కిమ్మనకుండా వుండిపోయినా మెల్లగా అదును చూసి నోరు విప్పారు! పాకిస్తాన్... ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని, ఇంటర్నేషనల్ మీడియాను నమ్మించే ప్రయత్నం చేయటంతో... కేజ్రీవాల్ ది గ్రేట్ రంగంలోకి దిగారు! తన స్వతః సిద్ధమైన రాజకీయ చాతుర్యంతో సాక్ష్యాలు కావాలన్నాడు! అసలు మన ఆర్మీ దాడులు చేసిందంటే అమెరికా , జర్మనీ లాంటి దేశాలు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. అటువంటిది దేశ రాజధాని డిల్లీ ముఖ్యమంత్రి మాత్రం ప్రూఫ్స్ కావాలన్నాడు. వెంటనే పాకిస్తాన్ మీడియా కేజ్రీవాల్ ని హీరోని చేసి కథనాలు ప్రసారం చేసింది. ట్విట్టర్ లో పాక్ స్టాండ్స్ విత్ కేజ్రీవాల్ అంటూ ట్రెండ్ సృష్టించారు!
సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ అంతా మోదీకి, తద్వారా బీజేపికి వస్తుండటంతో మన విపక్షాలకి ఎసిడిటీ మొదలైంది. దానికి తొలి సంకేతమే కేజ్రీవాల్ పిచ్చి పిచ్చి మాటలు. మోదీని కార్నర్ చేయాలన్న తపనతో ఆయన ఆర్మీనే శంకించాడు. పాకిస్తాన్ లాగే ఆర్మీ దాడులు చేసిందనే దానికి సాక్ష్యం కావాలన్నాడు. ఇక అరవింద్ బీజేపి వ్యతిరేక ఓట్లు దంచుకుంటున్నాడని అనుమానం రాగానే కాంగ్రెస్ కూడా తన స్పీకర్లు ఆన్ చేసింది. సంజయ్ నిరుపమ్ అనే ట్రేడ్ మార్క్ కాంగ్రెస్ నేత ఇష్టానుసారం మాట్లాడేశాడు. కేజ్రీవాల్ ఇన్ డైరెక్ట్ గా ఆర్మీని అనుమానిస్తే సంజయ్ నిరుపమ్ నేరుగానే దాడులు జరగలేదని చెప్పేశాడు! ఆర్మీనే అబద్ధం చెబుతోంది సిగ్గుమాలిన కామెంట్లు చేశాడు!
ఆప్, కాంగ్రెస్ లు బీజేపిని, మోదీని టార్గెట్ చేసి కాసులు బాగానే ఏరుకుంటున్నాయని అర్తం కాగానే సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది లాంటి ఇతర ఉత్తరాది పార్టీలు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. దాడులు కేవలం ఆర్మీ గొప్పతనమేనట! మోదీకి అందులో క్రెడిట్ ఏం లేదట! సర్జికల్ స్ట్రైక్స్ ను కాషాయదళమే రాజకీయంగా వాడుకుంటోందట!
అందరూ చకచకా సర్జికల్ స్ట్రైక్స్ ను వాడేసుకోవటంతో మన రాహుల్ బాబా కూడా ఆవేశపడ్డాడు. ఆయన తన ర్యాలీలో మోదీని ఖూన్ కీ దలాల్ అన్నాడు. అంటే... ప్రధాని జవాన్ల రక్తంతో లబ్ధి పొందుతున్నాడని ఆయన ఫీలింగ్. అది నిజమే కావొచ్చేమోగాని... దలాల్ లాంటి పదం వాడటం ఎంత వరకూ సమంజసం? అంత ఆలోచించే సీన్ యువరాజా వారికి లేనేలేదు...
అరవింద్ కేజ్రీవాల్ మొదలు రాహుల్ వరకూ అందరూ సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడటం ఎందుకు? లాజిక్ చాలా సింపుల్. త్వరలో ఆప్ కు పంజాబ్ లో ఎన్నికలు వున్నాయి. కాంగ్రెస్ కు ఉత్తర్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ వున్నాయి. అక్కడ ఈ సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిటంతా ఎక్కడ మోదీకి దక్కేస్తుందో అన్నదే వీరందరి బాధ. ఆయనకు ఓట్లు పడకూడదు అనుకోవటం తప్పు కాదు. కాని, అందుకోసం భారత ఆర్మీని కూడా శంకించి బాద్యత రహితమైన కామెంట్స్ చేయటం ఎంత వరకు నైతికం? కేజ్రీ, రాహుల్ లాంటి యువ కిశోరాలకే తెలియాలి!
ఇక్కడే ఇంకో విషయం మోదీ వ్యతిరేక లీడర్లు అందరూ గుర్తు పెట్టుకోవాలి. దాద్రి లాంటి దారుణమో, గురుదాస్ పూర్, పఠాన్ కోట్ లాంటి వైఫల్యాలో వస్తే ఎవరు బాధ్యలు? మోదీనే! మరప్పుడు 70ఏళ్లలో ఏ ప్రధాని కూడా చేయని రిస్క్ చేసి నరేంద్ర మోదీ దాడులు చేయిస్తే... దానికి క్రెడిట్ ఎవరికి? ఖచ్చితంగా నమోకే దక్కుతుంది! జనం మరీ అంత ఇంగితం లేని వారు కాదు కదా...