సచిన్ ఇచ్చిన బీఎండబ్ల్యూ... నాకు వద్దంటోంది!
posted on Oct 12, 2016 @ 3:16PM
భారతదేశం విచిత్రాలకు, విడ్డూరాలకు పెట్టింది పేరు! ఇక్కడ తాజ్ మహల్ వుంటుంది. పూరి గుడిసెలు కూడా కోట్లలో వుంటాయి. ఆకాశంలో విమానాలు ఎగురుతుంటాయి. అదే ఆకాశం కింద ఇళ్లు లేకుండా ఫుట్ పాత్ లపై వుండేవాళ్లు కూడా వుంటారు! ఒక్క మాటలో చెప్పాలంటే, అంబానీలు వుంటారు... అడుక్కుతినే వారు కూడా వుంటారు! ఇండియాలో అన్నీ వుంటాయి. అందరూ కనిపిస్తారు. అదే బలం, అదే బలహీనత!
ఆ మధ్య రియో ఒలంపిక్స్ ముగిశాక దేశంలో నానా హడావిడి జరిగింది. గుర్తుంది కదా! మరీ ముఖ్యంగా, మన తెలుగు రాష్ట్రాలు ఒలంపిక్ ఫీవర్ తో వణికిపోయాయి. సింధు సిల్వర్ తేవటంతో కొన్ని రోజుల పాటూ కలకలం రేగింది. కాని, అదే సమయంలో 125కోట్ల మంది జనానికి రెండే మెడల్సా అంటూ నీరసించిపోయిన వారు కూడా వున్నారు. వాళ్లు చెప్పింది నిజమే కూడా! మొత్తం దేశానికి కలిపి రెండే రెండు మెడల్సా? అదీ ఒక్కటి కూడా గోల్డ్ కాదా? ఇండియాలో సమస్య అదే... ప్రపంచంలో మరెక్కడా జనం వద్ద లేనంత బంగారం ఇండియన్స్ వద్ద వుంటుంది! ఒలంపిక్స్ లో మాత్రం ఒక్క బంగారు పతకం కూడా గెలుచుకోలేం...
పతకాల గోల పక్కన పెడితే సింధు, సాక్షి మలిక్, దీపా కర్మకర్ సన్మానాల కోలాహలం కూడా మన దేశంలో జరిగే విన్యాసాలకి చక్కటి సంకేతం! వాళ్లని సన్మానించుకోని ప్రభుత్వం లేదు. బహుమతులు ఇవ్వని సంస్థా లేదు. ఆ క్రమంలో ఏకంగా సచిన్ వచ్చి బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చాడు ముగ్గురు ఒలంపిక్ ఛాంపియన్స్ కి. అంతే కాదు, సింధు, సాక్షి, దీపా కర్మాకర్ లకు బీఎండబ్ల్యూలు ఇస్తోంది సచినేనని కూడా ప్రచారం జరిగింది. కాని, నిజంగా మాస్టర్ బ్లాస్టర్ అవ్వి కొనివ్వలేదు! ఇచ్చింది చాముండేశ్వరినాథ్. హైద్రాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఆయన దేశానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు అమ్మాయిలకు అత్యంత ఖరీదైన కార్లు అసొసియేషన్ తరుఫున గిఫ్ట్ గా ఇచ్చాడు...
బిఎండబ్ల్యూ కార్లు తీసుకున్న సింధు, సాక్షి బాగానే తమ తమ పనుల్లో పడిపోయారు కాని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒలంపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన ఆమె తనకిచ్చిన బీఎండబ్ల్యూ రిటర్న్ చేసేయాలని అనుకుంటోంది! ఆమె ఇంట్లో వాళ్లు, కోచ్ కలిసి తీసుకున్న నిర్ణయమట! ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా? కారణం... దీపా వుండే ఆగర్తలా నగర రోడ్లు!
ఒలంపిక్స్ లో పాల్గొని దేశానికి పేరు తెచ్చిన దీపా త్రిపుర రాష్ట్రంలోని అగర్తల నగరానికి చెందిన అమ్మాయి. అయితే, అక్కడ రోడ్లు ఎంత గొప్పగా వుంటాయటా అంటే... బీఎండబ్ల్యూ లాంటి సూపర్ కాస్ట్ లీ కారు తిరగటమే కుదరదట! అంత చిన్నగా, అంత దారుణంగా వుంటాయట! ఇక చేసేదేం ఏం లేక దీపా తన కార్ తిరిగి హైద్రాబాద్ బ్యాడ్మింటన్ అసొసియేషన్ కి ఇచ్చేయాలనుకుంటోంది. అయితే, అంతకు సమానంగా అమౌంట్ దీపాకు ఇవ్వాలని ఆమె కోచ్, ఫ్యామిలి కోరుకుంటున్నారు. వాటితో ఆమె ముందు ముందు మరింత ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్స్ లో పాల్గొంటుందని వారి ఆలోచన! ఒకవేళ అలా కుదరకపోతే ఎంత ఇచ్చినా తమకు ఫర్వాలేదని కూడా దీపా ఫ్యామిలీ చెప్పేసింది. కాని, బీఎండబ్ల్యూ లాంటి కోట్లాది రూపాయాల కార్ తమ వద్ద మాత్రం వుంచొద్దని తేల్చేసింది...
దీపా కర్మాకర్ ఈ బీఎండబ్ల్యూ ఉదంతం మనకు మన దేశం గురించి కొన్ని సత్యాలు బోధిస్తుంది. ఒకటి ఒలంపిక్స్ విజేత స్థాయి కర్మాకర్ ... తనకు గిప్ట్ గా వచ్చిన బీఎండబ్ల్యూ కార్ మెయింటైన్ కూడా చేయగలిగే ఆర్దిక స్థితిలో లేదంటే ... క్రీడలకు దక్కుతున్న ప్రొత్సాహం ఇట్టే అర్థమవుతుంది! మరో వైపు , ఆగర్తాల లాంటి ఒక రాజధాని నగరం... బీఎండబ్ల్యూ కార్ కి కూడా సరితూగటం లేదంటే... ఎలాంటి స్థితిలో వుందో అర్థం చేసుకోవచ్చు!
దీపా కర్మాకర్ కార్ కు బదులు డబ్బులు ఇస్తారా? ఇస్తే ఎంత ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పడే సమాధానాలైతే లేవు. కాని, మన దేశంలో క్రీడాకారుల జీవితాలు, ఆ క్రీడాకారులుండే రాష్ట్రాలు, నగరాలు ఎంతో బాగుపడాల్సి వుంది. బీఎండబ్ల్యూ పెద్ద ప్రధానమైన విషయమేం కాదు గాని... దాన్ని దీపా తిరిగి ఇచ్చేయటం, అందుకు ఒక కారణం, ఆమె వుండే అగర్తల కావటం...ఇవీ విషాదకర విషయాలు!