మోదీ వ్యతిరేకులా... పాక్ ప్రేమికులా...
posted on Oct 4, 2016 @ 5:25PM
యాంటీ నేషనల్స్... అంటే దేశ వ్యతిరేకులు! ఇంకా ఘాటుగా చెప్పుకుంటే దేశ ద్రోహులు! ఇలాంటి వాళ్లు ఈ మధ్య దేశంలో ఎక్కువైపోయారు! లేదంటే, ముందు కూడా వున్నా... ఇప్పుడు మాత్రమే మోదీపై కసితో బయటపడుతున్నారనుకుంటా! ఇంతకీ మన తాజా యాంటీ నేషనల్ ఎవరు? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!
మోదీ ప్రధాని అయ్యాక దేశం అడ్డంగా, నిలువుగా చీలిపోయింది. ఒకవైపు మోదీ భక్తులు వుంటే మరో వైపు అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే మోదీ వ్యతిరేకులు తయారయ్యారు. ఇద్దరిదీ అతి ప్రవర్తనగానే కనిపిస్తుంటుంది. మరీ ముఖ్యంగా, తెగ నీతులు చెప్పే సో కాల్డ్ మేధావులు, లిబరల్స్ మరీ హద్దులు దాటుతున్నారు. ఎంతగా అంటే నరేంద్ర మోదీని టార్గెట్ చేసే క్రమంలో దేశాన్ని , దేశ క్షేమాన్ని కూడా వారు లెక్క చేయటం లేదు. అంతగా మోదీ వ్యతిరక రాజకీయం బుసలు కొడుతోంది.
ఓ సారి దాద్రిలో ఒక వ్యక్తి చనిపోయాడని అవార్డ్ లు వాపస్ ఇవ్వటం, ఆ తరువాత హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత స్కాలర్ ఆత్మహత్య గొడవ... ఇలా మన అంతర్గత రాజకీయాలు ఎప్పుడూ వుండేవే. కాని, తాజాగా దేశం యుద్ధ వాతావరణంలో వుండగా తమ నైజం ప్రదర్శిస్తున్నారు యాంటీ నేషనల్ యాంటీ మోదీ బ్యాచ్. అదే దుర్మార్గమైన ట్రెండ్.
భారత్ పాకిస్తాన్ పై దాడి చేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. భారతీయులంతా గర్వంగా, కాస్త రిలీఫ్ గా పీలయ్యారు. ఉగ్రవాదుల దాడికి సమాధానం చెప్పగలిగామని ఆనందించారు. కాని, అంతలోనే మోదీ బద్ధ వ్యతిరేకి అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగాడు. అటు పాకిస్తాన్ దాడి జరగలేదని అంతర్జాతీయ మీడియాని తీసుకొచ్చి నానా తంటాలు పడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత జవాన్లు రాలేదని బుకాయిస్తోంది. కాని, మన కేజ్రీ చాలా తెలివిగా మోదీకి జైకొడుతూ ఓ వీడియో విడుదల చేశాడు. దాంట్లో ప్రధానిని మెచ్చుకుంటూనే పాక్ చెబుతున్నట్టు దాడి జరిగిందో లేదో అనుమానాలు వున్నాయనీ.... అవ్వి లేకుండా చేయాలని కోరాడు! అంటే... ఢిల్లీ సీఎంకి ప్రూఫ్స్ కావాలన్నమాట! పాకిస్తాన్ అచ్చంగా ఇదే అడుగుతోంది!
అరవింద్ కేజ్రీవాల్ సాక్ష్యాలు కావాలనటంతో పాక్ మీడియాకి కూడా కొండంత అండ దొరికింది. ఢిల్లీ సీఎమ్మే ఆధారాలు అడుగుతున్నాడు అంటూ ప్రచారం మొదలుపెట్టింది! ఇలా పాక్ కు సాయపడటం అరవింద్ కేజ్రీవాల్ ఏ రకమైన రాజకీయం అనుకుంటున్నాడో... ఆయనకే తెలియాలి! ఇక కేజ్రీ ఇచ్చిన కిక్కుతో కాంగ్రెస్ కూడా తన ప్రతాపం చూపించటానికి రెడీ అయిపోయింది. ఏకంగా మాజీ హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రూఫ్స్ చూపించమని అడిగేశాడు. అంతే కాదు, పనిలో పనిగా తమ పార్టీ ఖాతాలో కాస్త క్రెడిట్ వేసుకున్నాడు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయట. కాని, వాటి గురించి కావాలనే సీక్రెట్ గా వుంచేశారట! కాని, ఇప్పుడు మాత్రం చిదంబరం వారికి ఆపరేషన్ జరిపిన వీడియోలు, ఫోటోలు అన్నీ కావాలట!
ఒక వైపు మోదీపై కోపంతో పాక్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న బ్యాచ్ ఒకటైతే... మరోవైపు పాకిస్తానీ కళాకారుల కోసం కళ్ల నిండా నీళ్లు పెట్టుకుంటున్న పిచ్చోళ్లు మరో వైపు. మహేష్ భట్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఉగ్రవాదాన్ని ఆపండి... చర్చల్ని కాదు అంటూ మెంటల్ స్లోగన్స్ ఇస్తున్నాడు. మన సైనికులు పాక్ చేతిలో చచ్చిపోతుంటే ఆయనకి చర్చలు చేయమని చెప్పటానికి మనసెలా ఒప్పి వుంటుంది? సల్మాన్ చెప్పే సొల్లు సంగతైతే మాట్లాడుకోవటమే దండగా! అంతగా పాక్ కళాకారుల గురించి తపించిపోతాడు! ఇక కరణ్ జోహర్ అయితే ఫవాద్ ఖాన్ అనే పాకీ హీరో తిరిగి వెళ్లిపోయినందుకు విరహ వేదనతో తల్లడిల్లిపోయాడు. పాకిస్తాన్ యాక్టర్స్ వెళ్లిపోతే ఉగ్రవాదం ఆగిపోతుందా అంటూ ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నాడు! అసలు సరిహద్దు వద్ద పోరాడుతున్న సైనికుల ప్రాణాల మీద ఈ బాలీవుడ్ బరితెగించిన సెలబ్రిటీలకు ఏమైనా లెక్క వుందా? వాళ్లు బతికినా , చచ్చినా వీళ్ల బాక్సాఫీస్ బాధ వీళ్లదే!
బాలీవుడ్ లోంచి బరితెగించి మాట్లాడటం మొదలుపెట్టిన మరో మహానుభావుడు ఓంపురి! ఈయనైతే పాక్ కళకారుల్ని వెనకేసుకొచ్చే తాపత్రయంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల్నే అవమానించాడు. వాళ్లని ఎవరు సైన్యంలో చేరమన్నారని పైత్యం చూపాడు. ఆర్మీలో చేరిన వార్ని మేం చేరమన్నామా? మేం చావమన్నామా? అన్నాడు ఓంపురి! ఇంతకంటే ఘోరంగా దేశ ద్రోహానికి ఎవరైనా పాల్పడగలరా?
రాజకీయ నేతలకి మోదీ వ్యతిరేకత, బాలీవుడ్ వాళ్లకి పాక్ పై ప్రేమ, మేధావులకి జాతీయ భద్రత, జాతీయ భావం అంటే కూడా ఏంటో తెలియకపోవటం... అన్నీ కలిసి కొంపలు ముంచుతున్నాయి. ప్రపంచం ముందు ఇండియా పరువు తీస్తున్నాయి. ఇలా శత్రువుకి తోడ్పడే ఇంటి దొంగల్ని ప్రభుత్వం, జనం గట్టిగా ఓ చూపు చూడాలి. అప్పుడే మరి కొందరు భావప్రకటనా వీరులు బయలుదేరకుండా వుంటారు!