మైకు మైకం గుసగుసలు నిజమేనా?
posted on Oct 2, 2016 @ 1:53PM
చంద్రబాబు బలం, బలహీనత రెండూ అదే! ఏంటది అంటారా? టెక్నాలజీ! అవును, ఆయన టెక్ బాబు అన్నది అందరికీ తెలిసిందే! కాని, చంద్రబాబు టెక్నాలజీ ప్రేమ ఒక్కోసారి మంచి పేరు తెచ్చిపెడితే.. ఒక్కోసారి బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూంటూంది! ఇప్పుడు రెండోది జరుగుతోందంటున్నారు కొందరు పార్టీ, ప్రభుత్వ వర్గాలు!
చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి సీఎంగా వున్నప్పుడు సాఫ్ట్ వేర్ విప్లవం జరిగింది. అందుకే ఆయన గర్వంగా హైద్రాబాద్ ను నేనే డెవలప్ చేశాను అంటుంటారు. దీనిపై ఎవరి అభిప్రాయం ఎలా వున్నా అందులో నిజం లేకపోలేదు. ఆయన నేతృత్వంలో హైద్రాబాద్ సైబరాబాద్ గా ఎదిగింది. అందుకు కారణం ఆధునిక టెక్నాలజీపై సీబీఎన్ కు వున్న ఇష్టమే! ఆయన అప్పట్లోనే పాలనలో సాంకేతికత చొప్పించి కొత్త ఒరవడి సృష్టించారు! దశాద్దమున్నర కిందటే టెలి కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి అధికారుల్ని అలర్ట్ గా వుండేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ యంత్రాగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు!
టీడీపీ అధికారం కోల్పోయాక ప్రతి పక్షంలో వుండగా అనేక విశ్లేషణలు బయలుదేరాయి. సాఫ్ట్ వేర్, టెక్నాలజీలను పట్టించుకున్నంత వ్యవసాయం వంటి వాట్ని పట్టించుకోలేదన్నది అందులో ప్రధానం. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పదే పదే పర్యటనలు చేస్తూ జనానికి దగ్గరయ్యారు. తాను మారానని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. నిజంగా మారారు కూడా! ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగిపోయి ఆయన మళ్లీ సీఎం అయ్యారు. కాని, కార్యక్షేత్రం ఈ సారి హైద్రాబాద్ నుంచి అమరావతికి మారింది!
హైద్రాబాద్ లో సీఎంగా వున్న చంద్రబాబు, అమరావతిలోని ముఖ్యమంత్రి బాబు... బాగా మారారని అంతా అనుకున్నారు. కాని, తాజా గుసగుసల ప్రకారం ఆయన మళ్లీ టెక్నాలజీ బలహీనతకి లొంగుతున్నారని అంటున్నారు. ఉదయం ఏడు గంటలకే చంద్రబాబు టెలి కాన్ఫరెన్సులు, వీడియో చాట్ లు మొదలు పెట్టేస్తున్నారట! మైక్ పట్టుకుని అధికారుల్ని దడదడలాడిస్తున్నారట! సీఎంగారికి ఈ మైక్ మైకమేంటని వాళ్లు లోలోపల క్రుంగిపోతున్నారు. పొద్దు పొద్దున్నే మీటింగ్ లు అంటూ హడావిడి చేసి పది అయ్యే సరికల్లా సీఎం ఇతర పనుల్లో బిజీ అవుతున్నారట. సాధారణంగా పది గంటలకి తమ పనులు మొదలు పెట్టాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ కాన్ఫరెన్స్ ల గోలతో తెల్లవారు ఝామునే మార్నింగ్ వాక్ లు కూడా మానుకుని ఆఫీస్ లకు వచ్చేస్తున్నారు!
చంద్రబాబు తెల్లవారగానే పని మొదలు పెట్టి అధికారుల్ని హడివిడి చేయటం తప్పేం కాకపోయినా మాడన్ టెక్నాలజీ సాయంతో నడుస్తోన్న ఈ రెగ్యులర్ మీటింగ్లు ఎలాంటి కొత్తదనం లేక సమయం వృథా చేస్తున్నాయట! పైకి ఎవ్వరూ చెప్పకపోయినా చాలా మంది ఉన్నతాధికారులు లోలోన సీఎం, కొందరు మంత్రుల శైలికి తిట్టుకుంటున్నారని వినికిడి! చంద్రబాబు బాగా నమ్మే మంత్రుల్లో ఒకరైన దేవినేని ఉమా కూడా బాస్ లాగే కాన్ఫరెన్స్ లు పెట్టి జలవనరుల శాఖలోని అధికారుల్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా అనేక జిల్లాల్లోని ఆఫీసర్స్ అంతా అలెర్ట్ గా అన్ని పనులూ పక్కన పెట్టి హాజరవుతుంటారు. తీరా చూస్తే పరిస్థితి అడిగి తెలుసుకోవటం తప్ప పెద్దగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఏవీ రావటం లేదట! చంద్రబాబు వివిధ శాఖలతో చేసే కాన్ఫరెన్సులు కూడా ఇదే చందంగా వుంటున్నాయని వాపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు..
కంప్యూటర్లు, జీపీఎస్ సాయంతో కాన్ఫరెన్స్ లు పెట్టుకుని... లైవ్ లో అధికారుల్ని పలకరించటం అస్సలు తప్పు కాదు. పైగా చాలా మంచిది కూడా! కాని, అదే పనిగా ఈ మీటింగ్ లు పెట్టి మైక్ పట్టుకుని మైకంతో ఉపన్యాసాలు ఇస్తూంటే.. అదంతా సమయం వృథా ప్రహసనమే తప్ప మరొకటి కాదు. అంతకు మించి ముఖ్యమంత్రి, మంత్రులపై అధికారులకి, ఉద్యోగులకి అనవసర వ్యతిరేకత కలిగే ప్రమాదం వుంది. మరి కొత్త రాష్ట్రంగా ఏర్పడి బోలెడంత అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరమున్న ఈ తరుణంలో చంద్రబాబు , ఆయన టీమ్ ఓ సారి పునరాలోచించుకుంటే మంచిది! అంతిమంగా ప్రజలకి మేలు జరగటమే అందరూ కోరుకునేది!