కేసీఆర్ బాటలో ప్రజాప్రతినిధులు... వాస్తు పేరుతో అధికారుల ఆటలు
జాగ్రత్తలు తీసుకోవడంలో కేసీఆర్‌నే మించిపోతున్నారు తెలంగాణ అధికారులు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుంటున్నారో లేక వ్యక్తిగత జాగ్రత్తలో ఏమో తెలియదుగానీ, వాస్తు సరిగా లేకపోతే కొత్త బిల్డింగ్ అయినాసరే అడుగు కూడా పెట్టబోమంటున్నారు. ప్రజాసమస్యలను సైతం గాలికొదిలేసి, తమ పేర్ల వాస్తుకు తగినట్లుగా కార్యాలయాల్లో మార్పులు చేర్పులపై దృష్టిపెడుతున్నారు. మార్పులు చేర్పులతో వాస్తు కుదరపోతే, బిల్డింగులనే కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులే కాదు... ప్రజాప్రతినిధులు కూడా వాస్తుకు పెద్దపీట వేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు విషయంలో రాజీపడరు, సచివాలయమైనా, క్యాంపు ఆఫీసైనా, చివరికి సీఎంవో అయినా వాస్తుకు అనుకూలంగా లేకపోతే, క్షణాల్లో మారిపోవాల్సిందే, కోట్లు ఖర్చయినా సరే మార్పులు చేర్పులు జరిగితీరాలి, అందుకే పాత క్యాంపు ఆఫీస్ వాస్తు ప్రకారం లేదని, వందల కోట్ల రూపాయల ఖర్చుతో క్యాంపు ఆఫీస్‌ను నిర్మించుకున్నారు, అంతేకాదు వాస్తు దోషం ఉందని, సెక్రటేరియట్‌ను సైతం మార్చాలనుకున్న కేసీఆర్, అది కుదరకపోవడంతో ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చి, వాస్తుప్రకారం కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అది కూడా త్వరలోనే జరగనుంది. ఇదే బాటలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకెళ్తున్నారు. తమ పేరుకు తగ్గట్టు వాస్తు లేకపోతే, కొత్త బిల్డింగ్ అయినా సరే కాలు పెట్టేదే లేంటున్నారు. అందుకే ప్రజాసమస్యలను సైతం పక్కనబెట్టేసి, వాస్తు ప్రకారం మార్పులు చేర్పులపైనే దృష్టిపెడుతున్నారు. కొన్నిచోట్ల కొత్త బిల్డింగులను సైతం కూల్చేసి, మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇలాంటి వ్యవహారమే సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతోంది. వైఎస్ హయాంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన బిల్డింగ్‌లో అధికారులు వాస్తు దోషాలు వెతుకుతున్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి.... వచ్చీరాగానే ప్రజాసమస్యలపై కంటే ముందుగా కార్యాలయంలో వాస్తు దోషాలపై దృష్టిపెట్టారు. భారీ వ్యయంతో పలు నిర్మాణాలకు మార్పులు చేర్పులు చేయించారు. అంతేకాదు మెయిన్ గేటుకు తాళం వేయించి, వెనుక గేటును తెరిపించారు. ఇక కమిషనర్ గదితోపాటు అధికారుల గదుల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన అధికారుల్లో ఎక్కువ శాతం సస్పెన్షన్‌కు గురికావడం, లేదా ఏసీబీకి చిక్కడంతో... ఈ బిల్డింగ్‌కి వాస్తు దోషముందని భావిస్తూ, దోష నివారణ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఇవేమీ పైకి చెప్పకుండా, కార్యాలయానికి వాస్తు దోషం ఉందని, అన్నీ బాగుంటేనే కదా, అభివృద్ధికి అడుగులు పడేదని అంటున్నారు.
అయితే వాస్తు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మనిషి మనిషికి వాస్తు మారుతుందని, అలాంటప్పుడు అధికారి మారినప్పుడల్లా వాస్తు ప్రకారం కోట్లు ఖర్చుచేసి మార్పులు చేర్పులు చేయడం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతుంటారని, అధికారులైతే ఎప్పుడు బదిలీ అవుతారో తెలియదని, అలాంటప్పుడు అధికారి మారినప్పుడల్లా బిల్డింగులు కూల్చాల్సిందేనా? అంటున్నారు. అధికారులు మూఢనమ్మకాలు వీడి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని, వాస్తు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు.