దేవినేని నెహ్రూకి, దేవినేని ఉమకి ఎందుకు పడదు

తండ్రి కొడుకులయినా...అన్నాదమ్ములనైనా బద్ధ శత్రువులుగా చేసే శక్తి రాజకీయానికి ఉందంటారు..ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. ఆ కోవలోకే వస్తారు దేవినేని బ్రదర్స్. దేవినేని అనగానే గుర్తొచ్చే పేర్లు నెహ్రూ..ఉమా..ఇద్దరు అన్నదమ్ములే..కానీ ఒకరంటే ఒకరికి పడదు..ఎందుకు..? వీరి మధ్య ఇంతటి వైరానికి కారణం ఏంటి..? అంటే సవాలక్ష కారణాలు కనిపిస్తాయి.  కృష్ణాజిల్లా రాజకీయాల్లోనే కాదు..ఏపీ రాజకీయాల్లోనూ దేవినేని కుటుంబానిది కీలక పాత్ర..దశాబ్దాలుగా ఆ కుటుంబం ప్రజాసేవలోనే కొనసాగుతుంది. ముఖ్యంగా దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావ సభ్యుడు..ఆయన ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు ..ఎన్టీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నెహ్రూ వెన్నంటే ఆయన బాబాయి కుమారులు దేవినేని వెంకట రమణ, దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశంలో కీలక నేతలుగా ఎదిగారు.   అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో మనస్పర్థలు రావడంతో నెహ్రూ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ తన సత్తా చాటిన నెహ్రూ అక్కడా కీలకనేతగా ఎదిగారు. అయితే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయన్నట్లు, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్‌‌ నేతలకు రాజకీయ సమాధి కట్టింది. అలాంటి నేతల్లో నెహ్రూ కూడా ఒకరు. మరో పక్క నెహ్రూ సోదరుడు దేవినేని ఉమ టీడీపీలో చక్రం తిప్పుతూ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్నారు. అయితే పార్టీలు వేరైనా, ఎప్పుడూ అన్నదమ్ములిద్దరూ మాటా మాటా అనుకున్నది లేదు..కానీ పట్టిసీమ ప్రాజెక్ట్ వీరి మధ్య దూరాన్ని పెంచింది. తన ఇంటి పక్కన వెళుతున్న బుడమేరు కాలువలోకి భలేరావు చెరువులోని నీరు తీసుకువచ్చి అవి పట్టిసీమ నీరు అని ఉమా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెహ్రూ సెటైర్ వేశారు. పైగా తన ఇంటి పేరే ఉమకి ఉండటం తనకు అవమానంగా ఉందని ఘాటైన వ్యాఖ్య చేశారు.   ఈ వ్యాఖ్యలు ఉమకి ఆగ్రహం తెప్పించాయి. అన్న అని మర్యాద ఇస్తే ఆగడాలు ఎక్కువయ్యాయంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా తాను కాకుండా తన అనుచరులతో మాటల తూటాలు పేల్చారు. అయితే ఎంతలా కృష్ణాజిల్లాను శాసిస్తున్నా..మంత్రిగా అధికారాన్ని గుప్పెట పెట్టుకున్నా..నెహ్రూకి జనంలో ఉన్న ఛరిష్మా ఉమకు లేదూ అంటుంటారు..ముఖ్యంగా దేవినేని అంటే ముందుగా గుర్తొచ్చేది నెహ్రూనే..చాలా సందర్భాల్లో అన్నయ్యకి ఎదురువస్తే ఉమ పక్కకు తప్పుకునేవాడు కానీ..కనీసం తలెత్తి మాట్లాడేందుకు కూడా భయపడేవాడని టీడీపీ వర్గాల్లో టాక్. అంతటి ఛరిష్మా ఉంది గనుకనే చంద్రబాబు సైతం పాత గొడవలు పక్కనబెట్టి నెహ్రూని టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే నెహ్రూ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలోనూ ఆయన రాకను ఉమ అడ్డుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్నయ్య వస్తే కృష్ణాజిల్లాలో తన ప్రాధాన్యత తగ్గుతుందోనన్న భయం కావొచ్చు..మరేదైనా కానీ నెహ్రూని టీడీపీలోకి రానివ్వద్దంటూ అధినేతకు తేల్చి చెప్పాడని పసుపు కండువాలు గుసగుసలాడుకున్నాయి. అయినా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నెహ్రూని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు చంద్రబాబు.   ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారు అనుకున్న సమయంలో నెహ్రూ హఠాన్మరణం టీడీపీ కార్యకర్తలను కలచివేసింది. అటు ఉమా కూడా అన్నయ్య మరణవార్త వినగానే కుప్పకూలిపోయారు. నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. 

నెహ్రూ లైఫే ఒక థ్రిల్లర్‌ సినిమా... అందుకే కాసుల వర్షం

స్టూడెంట్‌ యూనియన్‌ గొడవలు మొదలు, రౌడీయిజం, గ్రూప్‌ వార్‌, కుల పోరు, హత్యలు, ఫ్యాక్షన్‌ పొలిటికల్‌ వార్‌... ఇలా ఒక సినిమాకి కావాల్సిన హంగులన్నీ దేవినేని నెహ్రూ జీవితంలో ఉన్నాయి. అందుకే రాంగోపాల్‌వర్మ మొదటి సినిమా శివ నుంచి లేటెస్ట్‌ సినిమా వంగవీటి వరకూ ఆయనే కథా వస్తువు. నెహ్రూ రియల్‌ లైఫ్‌లో అంత డెప్త్‌, సినిమాటిక్‌ లైఫ్‌, అనేక ఆసక్తికర మలుపులు ఉన్నాయి, అందుకే నెహ్రూ నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.    బెజవాడ పాలిటిక్స్‌కు క్రేజ్ ఏర్పడటంలో నెహ్రూ పాత్ర కీలకమైంది. ఎవర్నీ లెక్కచేయని తనం, గుండెధైర్యం, ఆత్మవిశ్వాసం కూడిన పొగరు... ఇవన్నీ దేవినేని నెహ్రూని హీరోని చేశాయి. అందుకే ఎన్నో సినిమాలకు నెహ్రూ కథా వస్తువుగా మారాడు. శివ, అలజడి, బెజవాడ, వంగవీటి సినిమాలన్నీ నెహ్రూ జీవితంలో నుంచి పుట్టుకొచ్చిన కథలే. అంతేకాదు బెజవాడ రాజకీయం, అక్కడి సామాజిక సమీకరణాలే పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టేలా చేశాయ్‌.   అసలు రౌడీయిజానికి పుట్టిల్లు బెజవాడ అంటారు. ఆ రౌడీయిజానికి పొలిటికల్‌ పవర్‌ తోడవడంతో బెజవాడ క్రైమ్‌ గురించి ప్రజలు కథకథలుగా చెప్పుకుంటారు. ముఖ్యంగా వంగవీటి-దేవినేని కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య పోరు, కొన్నాళ్లకు కుల పోరుగా మారడం, ఆ తర్వాత వాటికి రాజకీయాలు తోడవడంతో దశాబ్దన్నర క్రితం బెజవాడ అట్టుడుకిపోయింది. ఇవన్నీ దగ్గర్నుంచి చూసిన రాంగోపాల్‌వర్మ... బెజవాడ బేస్‌ మీద అనేక సినిమాలు హిట్ కొట్టారు.  

దేవినేని నెహ్రూ మంచితనం, మరిచిపోలేని జాపకాలు

కృష్ణాజిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ చాలా మంచివారని ఆయన అనుచరులు చెబుతుంటారు. అందరినీ కలుపుకునిపోయే వ్యక్తని, తన సాయం కోరి వస్తే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా అండగా నిలబడతారని, అందుకోసం ఎంతకైనా తెగించి ముందుకెళ్తారని పేరు. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచీ నెహ్రూది ఇదే తత్వమని, నమ్మింది చేయడంలోనూ, అనుకున్నది సాధించడంలోనూ నెహ్రూ దృఢచిత్తగలవారని అంటుంటారు. స్టూడెంట్‌ పాలిటిక్స్‌ మొదలుకొని రాజకీయంగా బెజవాడ నగరాన్ని శాసించే స్థాయివరకూ ఎదిగిన నెహ్రూ...  తనను నమ్ముకున్న వాళ్లకోసం, తన వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తారని అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. వంగవీటి ఫ్యామిలీని సమర్ధంగా ఢీకొట్టడంతో నెహ్రూ ఓ వర్గంలో హీరో అయ్యారు. అదే ఆయనకు ప్లస్‌గానూ మారింది.    నెహ్రూ గుండె ధైర్మం గురించి ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటారు. నెహ్రూ గుండె ధైర్యాన్ని చూసే ప్రత్యర్ధులు వణికిపోయేవారని, ఆయన్ను చూస్తేనే సగం గుండె జారిపోయేదని, అందుకే నెహ్రూను ఢీకొట్టాలంటే భయపడేవారని చెబుతారు. అంతేకాదు ఒక్క బెజవాడలోనే కాకుండా, కృష్ణాజిల్లా అంతటా నెహ్రూకి అనుచరగణం ఉండేదని, ఆయన్ను ప్రజలు అభిమానించేవారని, అదే ఆయనకు ఆయుధంగా కవచంగా మారిందని అంటారు. ఇక దేవినేని నెహ్రూ ప్రతి ఒక్కరినీ మర్యాదగా పిలుస్తారని చెబుతారు. తన అనుచరులను కూడా చిన్నవాళ్లయితే తమ్ముడని, తన కంటే పెద్దవాళ్లయితే అన్నయ్య అంటూ పలకరించేవారు. అంతేకాదు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా, నచ్చని విషయమైనా హుందాగా వ్యవహరిస్తారని దేవినేని నెహ్రూకి పేరుంది.   వంగవీటి సినిమా సందర్భంగా దేవినేని నెహ్రూని పలుమార్లు కలిసిన డైరెక్టర్‌ రాంగోపాల్‌‌వర్మ....  ఆయన మంచితనాన్ని కొనియాడారు. నమ్మింది చేయడంలో, అనుకున్నది సాధించడంలో నెహ్రూ... చాలా కచ్చితంగా ఉండేవారని వర్మ ట్వీట్‌ చేశారు. తాను కలిసిన ప్రతీసారి తనను ఎంతో మర్యాదగా చూసుకునేవారని, ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేవారని వర్మ గుర్తుచేసుకున్నారు.

నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ... కేకవేస్తే కంకిపాడు దాసోహం

కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూది బలమైన ముద్ర. బెజవాడ రాజకీయాలనైతే ఆయన శాసించారు. ఒకవిధంగా చెప్పాలంటే నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ... కేకవేస్తే కంకిపాడు దాసోహమైపోయేవి. ప్రత్యర్ధుల్ని ఉలిక్కిపడేలా చేసేది. మూడున్నర దశాబ్దాలపాటు తన మాటలతో, చేతలతో బెజవాడ రాజకీయాలను శాసించారు. కొత్త తరం లీడర్లు పుట్టుకొచ్చినా, బెజవాడపై నెహ్రూ పట్టు మాత్రం తప్పలేదు. నెహ్రూను ఢీకొట్టాలంటే వెనుకంజ వేసేవారు. అంతలా బెజవాడపై పట్టుసాధించారు దేవినేని నెహ్రూ.   తెలుగునాట రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పుట్టుక సమయంలోనే దేవినేని నెహ్రూ పొలిటికల్‌ కెరీర్‌ కూడా మొదలైంది. యంగ్‌ ఏజ్‌లో ఉన్న దేవినేని నెహ్రూ... చాలా చురుగ్గా ఉండేవారు. స్టూడెంట్‌ యూనియన్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. దేవినేని గాంధీ, నెహ్రూ, బాజీ, మురళి కలిసి 1978-79ల్లో 100మంది కుర్రాళ్లతో ఏర్పాటుచేసిన యూనియన్ అనేక సంచలనాలకు కేంద్రమైంది.  అదే సమయంలో కొత్తగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి, అటు కృష్ణాజిల్లా రాజకీయాలను, ఇటు బెజవాడ పాలిటిక్స్‌ను ఏలారు నెహ్రూ.   మొదట్నుంచీ దూకుడుగా ఉండే దేవినేని నెహ్రూ... అదే దూకుడును రాజకీయాల్లోనూ కొనసాగించారు. పైగా నెహ్రూకి గుండెధైర్యం ఎక్కువ. ఎంతటి వితప్కర పరిస్థితినైనా తట్టుకుని నిలబడగల దమ్మూధైర్యం నెహ్రూకి ఉండేది. కళ్ల ముందే సోదరుడ్ని హత్య చేసినా తట్టుకుని దిగమింగుకునే గుండె ధైర్యం ఆయన సొంతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకుని, నిలబడగల సత్తా నెహ్రూది. యువకుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ముందుకెళ్లారో, వయసు పెరుగుతున్నకొద్దీ అంతే నిబ్బరంగా అడుగులేసుకుంటూ వెళ్లారు. అంతేకాదు నెహ్రూలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉండేది. అందుకే నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా బెజవాడ రాజకీయాలపై పట్టు మాత్రం సడలేది కాదు. అది దేవినేని నెహ్రూ సత్తా.

దేవినేని మరణం : బెజవాడ రక్త చరిత్రకి THE END!

దేవినేని రాజశేఖర్… ఉరఫ్ దేవినేని నెహ్రు…. గుండెపోటుతో మరణించారు. ఇది ఏపీ రాజకీయాలకి, మరీ ముఖ్యంగా, రాజధాని విజయవాడకి తీరని లోటే. ఆయన ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కి అధికారికంగా సెలవు ప్రకటించకున్నా కొడుకు అవినాష్ ను రంగంలోకి దింపి రెస్ట్ తీసుకోవాలనే అనుకున్నారు. కాని, కాలేజీ రోజుల్నుంచే అనూహ్య మలుపులు తిరుగుతూ వచ్చిన ఆయన జీవితం చివరి దశలో కూడా అనూహ్యంగానే అంతమైంది!   దేవినేని కేవలం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత, మంత్రిగా కూడా పని చేసిన నాయకుడు మాత్రమే కాదు. అంతే అయితే, ఆయన గురించి పెద్దగా చెప్పుకోటానికి ఏం వుండేది కాదు. దేవినేని సత్తా అంతా ఆయన రాజకీయం కన్నా విజయవాడ యుద్ధ భూమిలో నెట్టుకురావటంలోనే కనిపిస్తుంది మనకు! అసలు దేవినేని కుటుంబంలో నెహ్రులా సహజ మరణం పొందనే లేదు ఆయన అన్న, తమ్ముడూ …. ఇద్దరూ కూడా! దేవినేని నెహ్రు అన్నయ్య గాంధీని, మురళిని వంగవీటి వర్గం హత్య చేసింది. అలా సోదరులిద్దరూ అర్ధాంతరంగానే అసువులు బాసినా నెహ్రు దశాబ్దాల పాటూ పోరాటం చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు! అదే ఆయన అసలు విజయం…   కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని పదే పదే గెలవటం నిజంగా విశేషమేం కాదు. సహజమే. టీడీపీలో వున్నా, కాంగ్రెస్ లో వున్నా, ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వచ్చినా జనం ఆయన వెంట ఎప్పుడూ వున్నారు. అందుక్కారణం ఎప్పుడో కాలేజీ రోజుల్లో మొదలైన వర్గ పోరాటాన్ని ఎక్కడ ఆపకుండా చివరిదాకా నిర్భయంగా, తెలివిగా నడపటమే. వంగవీటి మోహన రంగ లాంటి విపరీతమైన ఫాలోయింగ్ వున్న ప్రమాదకర ప్రత్యర్థి వున్నా దేవినేని నెహ్రు ఒకవైపు రౌడీయిజాన్ని, మరో వైపు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. వంగవీటి వర్గం తన అన్నని, తమ్ముడ్ని చంపేసినా ఆయన ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చినా… జనం మాత్రం దేవినేని నెహ్రునే రంగ హత్యకి కారణమని నమ్ముతుంటారు!   రంగ హత్యకి నెహ్రు కారణం అయినా కాకున్నా విజయవాడ రక్త చరిత్రని రంగ హత్యతో ఆగిపోయేలా నెహ్రు చూశారు. తరువాతి కాలంలో వంగవీటి కుటుంబంపై దేవినేని కుటుంబం దాడులు చేయలేదు. వంగవీటి వర్గం కూడా రంగ హత్య తరువాత నెమ్మదించింది. ఇప్పుడు దేవినేని మరణంతో 1970లలో మొదలైన విజయవాడ వర్గ పోరాటం అధికారికంగా అంతమైనట్టే! వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ, దేవినేని కుటుంబం నుంచి అవినాష్ రాజకీయాల్లో వున్నా … రాజధానిగా మారిపోయిన ప్రస్తుత విజయవాడలో తిరిగి గతం తాలూకూ పరిస్థితులు రావటం అసాధ్యమే! కాబట్టి దేవినేని మరణం… ఒక రక్త చరిత్రకి సహజ సమాప్తం!

మొన్న బొజ్జల... నేడు శివప్రసాద్‌... బాబు స్నేహితులకు ఏమైంది?

  కథ క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తాడోపేడో తేల్చుకోవడానికే డిసైడయినట్లే కనిపిస్తున్నారు. పూర్తి తిరుగుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజున కాస్త సాఫ్ట్ గా విమర్శలు చేసిన శివప్రసాద్...మరింత ధిక్కార ధోరణి ప్రర్శించారు. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. దళితులు సాగు చేస్తున్న హథీరాం బాబా మఠం భూములు క్రమబద్ధీకరణ చేయమని అడగడం నేరమా అంటూ ప్రశ్నించారు. అసలు సంగతిని వదిలేసి తనపై బురదచల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు... శివప్రసాద్ మరో బాంబు కూడా పేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై టీడీపీ ఎంపీలంతా అసంతృప్తిగా ఉన్నారన్నారు.   ఫిరాయింపుదారులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపైనా శివప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలు మారి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు తనపై విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి అమర్నాథరెడ్డిపై మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, దివంగత సీఎం వైఎస్ ఎన్నోసార్లు పిలిచినా కనీసం కలవడానికి కూడా వెళ్లలేదని గుర్తుచేశారు   శివప్రసాద్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యక్తిగత అజెండాతో మాట్లాడినా, పార్టీ గీత దాటినా సహించేది లేదని హెచ్చరికలు పంపారు. మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు....శివప్రసాద్ వ్యవహారంపై చర్చించారు. హాథీరామ్ భూములను ఇవ్వాలని శివప్రసాద్‌ అడిగారని... తాను తిరస్కరించడంతోనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం వివరించారు.   మొత్తానికి మొన్నటివరకు కేబినెట్‌ విస్తరణ ప్రకంపనలు పుట్టిస్తే, ఇప్పుడు శివప్రసాద్‌ తిరుగుబాటు ఎపిసోడ్.. టీడీపీలో కలకలం రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ సెగలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయని అనుకుంటే... అంతలోనే చిత్తూరు ఎంపీ... తన అసంతృప్తి బయటపెట్టడంతో నేతలు కలవర పడుతున్నారు. మరి శివ ప్రసాద్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.

నేనేరా... కూలీ నెంబర్‌ వన్‌...

  రోజంతా  కూలి పని చేస్తే ఎంతిస్తారు? వందో...రెండొందలో... లేదంటే మూడొందలో ఇస్తారు... మహా అయితే ఐదారొందలు మంచిదు. కానీ తెలంగాణలో కొందరికి వచ్చే కూలీ లక్షల్లో ఉంటోంది. కూలీ లక్షల్లో ఉంది కదా అని వాళ్లేదే ప్రపంచంలో ఎవరికి చేతగాని పని చేస్తున్నారా అనుకోకండి, అంతేకాదు ఎక్కువ సమయం పనిచేసినందుకు లక్షల్లో కూలీ ఇస్తున్నారని అస్సలే అనుకోవద్దు, ఎందుకంటే వాళ్లంతా పావుగంటో లేక అరగంటో కూలి పనిచేసి...క్షణాల్లో లక్షలు సంపాదిస్తున్నారు. అవును మీరు వింటున్నదీ నిజం. ఇంతలా సంపాదిస్తున్నది ఎవరో కాదు టీఆర్‌ఎస్‌ నేతలే. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ కోసం కూలి పనిచేసి డబ్బు సంపాదించాలని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి క్షణాల్లో లక్షల్లో సంపాదించేస్తున్నారు.   టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అవసరమైన ఖర్చును కూలి పనుల ద్వారా సంపాదించాలని పార్టీ శ్రేణులకు గులాబీ బాస్‌ సూచించారు. అంతేకాదు ఈనెల  14 నుంచి 20 వరకు గులాబీ కూలి దినాలుగా ప్రకటించారు. కేసీఆర్‌ పిలుపుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చోటామోటా నేతలందరూ కూలీల అవతారమెత్తుతున్నారు. అలా మంత్రి కేటీఆర్‌ కూడా కూలీగా మారారు. ఓ అరగంటపాటు రెస్టారెంట్‌లో కూల్‌కూల్‌గా చేసి ఓ ఐస్‌క్రీమ్‌, ఓ జ్యూస్‌ తయారుచేశారు. ఇంతకీ ఆ ఐస్‌క్రీమ్‌ ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా? అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. అంతేకాదు కేటీఆర్‌ తయారుచేసిన జ్యూస్‌ లక్షా 30వేలకు అమ్ముడుపోయింది. ఆ విధంగా కేటీఆర్‌ మొత్తం 7లక్షల 30వేలు ఈజీగా సంపాదించారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డి ఫార్మా కంపెనీల్లో అట్టపెట్టెలు మోసినందుకు మూడు లక్షల రూపాయలు కూలీ దక్కింది.   ఇదే తరహాలో పలు జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చోటామోటా నేతలు....చెమట చుక్క రాలకుండా క్షణాల్లో వేలు, లక్షలు సంపాదిస్తూ, నేనేరా... నెంబర్‌ వన్‌ కూలీ అనిపించుకునేందుకు పోటీపడుతున్నారు.

అందరిని విమర్శించిన పవన్ చిరు ని ఎందుకు వదిలేసాడు?

వాళ్లు, వీళ్ళు, మిత్రులు, శత్రువులు... అని ఎవర్ని చూడకుండా లెఫ్ట్, రైట్ ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు ఎంపీల వ్యవహారం తనకు బాధ కలిగిందని, ఆంధ్ర ప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు సైలెంట్ గా ఉండడం లో పరమార్ధం ఏంటని ప్రశ్నించాడు. టీడీపీ, బీజేపీ ల కన్నా వైస్సార్సీపీ, తెలంగాణ ఎంపీలు చాలా నయం అని వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతా ఒకే కానీ, చిరంజీవి విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకపోవడానికి అర్ధం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.   రాజ్యసభలో అతి తక్కువ హాజరు ఉన్న వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. స్పెషల్ స్టేటస్ గురించి ఒకప్పుడు గొంతు ఎత్తి మాట్లాడిన చిరు, ఇప్పుడు అసలు మాట్లాడక పోవడం ఎవరికీ అర్ధం కానీ విషయంగా మిగిలి పోయింది. కనీసం ఆ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో తనవంతు బాధ్యతగా, సభకి వచ్చి తన అభిప్రాయం వ్యక్తపరిస్తే అది, స్పెషల్ స్టేటస్ కి ఉన్న డిమాండ్ ని బలపరిచే విధంగా ఉండేది. కానీ, స్వయానా, తెలుగు వారే అసలు సమయంలో సభకి అటెండ్ అవ్వకపోవడం ద్వారా, స్పెషల్ స్టేటస్ డిమాండ్ ని బలహీనపరిచిన అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. మరి, పవన్ తన అన్నని ఈ విషయంలో విమర్శించడం మరచిపోయారా? అన్నకు ఒక ధర్మం, వేరే వాళ్ళకి ఇంకో ధర్మమా అని విమర్శలు వస్తున్నాయి. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో.

కుల్భూషణ్ జాదవ్ రా ఏజెంటా? భారత గూఢచారుల గురించి 7ఆసక్తికర సత్యాలు!

కుల్భూషణ్ జాదవ్ …. ఇప్పుడు ఈ పేరు రెండు దేశాల్లో మార్మోగుతోంది! ఇటు ఇండియా జాదవ్ కు ఏం జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తోంటే… అటు పాకిస్తాన్ అతను రా ఏజెంట్ అనీ, తమ దేశంలోకి చొరబడ్డాడనీ, ఉగ్రవాదానికి కారణమని కబుర్లు చెబుతోంది! అసలు ఉరిశిక్షకి గురై ప్రస్తుతం చావుబతుకుల మద్య వున్న కుల్భూషణ్ నిజంగా అపరాధేనా? మన దృష్టిలో కాకున్నా పాకిస్తాన్ చట్టాల ప్రకారమైన అతను గూఢచారా? పాకిస్తాన్ భద్రతకు ముప్పా? కానే కాదంటున్నారు నిపుణులు! అందుకు ఏడు కారణాల్ని కూడా వారు చెబుతున్నారు! 1. కుల్భూషణ్ జాదవ్ భారత నిఘా సంస్థ రా పంపిన ఏజెంట్ కాదని చెప్పే మొదటి అంశం… అతను పాకిస్తాన్ సరిహద్దు వెంట వుండే భారతీయుడు కాకపోవటమే. పాక్ లోకి ఎవర్నైనా గూఢచర్యం కోసం పంపాలంటే రా ముందుగా వాళ్లని పాక్ సరిహద్దు గ్రామాల్లోంచే ఎంచుకుంటుంది. వారైతేనే పాకిస్తాన్ జనంతో రోజూ టచ్ లో వుంటూ వుంటారు. వారికి పాక్ ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు అన్నీ తెలిసి వుంటాయి. అలాంటి వారు పాక్ లోకి వెళితే ఈజీగా అక్కడ జనంలో కలిసిపోగలరు. జాదవ్ మహారాష్ట్ర కు చెందిన వాడు. ఆయనకు పాక్ జనజీవితం గురించి, సంస్కృతి  గురించి తెలిసే అవకాశమే లేదు!   2. చాలా అరుదుగా మాత్రమే …  పాక్ సరిహద్దు ప్రాంతాలకు చెందని వార్ని రా తన ఏజెంట్స్ గా పంపుతుంటుంది. అలాంటి వారు చాలా చాలా తెలివైన, చురుకైన వారై వుండాలి. పాక్ లోకి వెళ్లాక అక్కడ ఎవ్వరికీ అనుమానం కలగకుండా జనంలో అవలీలగా కలిసిపోవాలి. అయినా కూడా ఇలాంటి వార్ని రా ఎక్కువ కాలం పాక్ లో వుండనీయదు. కొన్ని రోజుల్లోనే మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చేయమని చెబుతుంది. జాదవ్ చాలా రోజులు పాక్ లో గడిపాడు.   3. రా ఏజెంట్లు పాకిస్తాన్ లో ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇండియన్ పాస్ పోర్ట్ కలిగి వుండరు. అలా పాస్ పోర్ట్ తో , అదీ వేరే ఒక దేశం గుండా రా తన ఏజెంట్స్ ని పంపదు. జాదవ్ ఇండియన్ పాస్ పోర్ట్ తో ఇరాన్ సరిహద్దు ద్వారా పాక్ లో ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఇది రా ఏజెంట్లు ప్రవర్తించే తీరు ఎంత మాత్రం కాదు!   4. రా వేరే దేశం ద్వారా తన ఏజెంట్ ని పాక్ లోకి పంపాలనుకుంటే పక్కాగా ప్లానింగ్ తో ముందుకు వెళుతుంది. ఏజెంట్ తనంత తానుగా బయలుదేరి వెళ్లిపోడు. విదేశంలోని సోర్స్ తో రా అధికారులు జాగ్రత్తగా చర్చలు జరిపి ఎలాంటి రిస్క్ లేకుండా ప్లాన్ చేశాకే… ఏజెంట్ కు బయలుదేరేందుకు అనుమతినిస్తారు. ఇరాన్ అలాంటి దేశం కాదు. రా ఇరాన్ గుండా మన ఏజెంట్లను పంపే అవకాశం లేదు!   5.ఇక పాకిస్తాన్ జాదవ్ కు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆయన రా జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గుప్తా తనని పాక్ పంపారని చెప్పాడు. అసలు అనిల్ కుమార్ గుప్తా అనే అధికారే రా లో లేడని తేలింది! అంతే కాదు, జాదవ్ చేత పాకిస్తాన్ అజిత్ దోవల్ పేరు కూడా పలికించింది! క్షేత్ర స్థాయిలో పని చేసే గూడచారులతో అజిత్ దోవల్ స్థాయిలోని చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మాట్లాడటం అసంభవం!   6. పాక్ విడుదల చేసిన వీడియోలోనే జాదవ్ ఒక చోట తాను 2001లో నేవీ నుంచి రిటైర్ అయ్యానని చెప్పాడు. మరో చోటా అతనే తాను ఇంకా సర్వీస్ లో వున్నానని, 2022లో రిటైర్ అవుతానని చెబుతాడు! ఇలా మాట్లాడుతున్నాడంటే అర్థం … పాకీలు జాదవ్ ను చిత్రహింసలకు గురి చేసి వుండాలి. లేదంటే, అతను ఏదైనా డ్రగ్ ప్రభావంతో అపస్మారక స్థితిలో మాట్లాడి వుండాలి.   7. ఫైనల్ గా… ఇరాన్ నుంచి పాక్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన కుల్భూషణ్ జాదవ్… ఒక చిన్న వ్యాపారస్థుడు. అతనికి బిజినెస్ ఇరాన్ లో వుంది. అలాంటి వ్యాపారస్థులు రా కోసం పని చేయటం అబద్ధం కాదు. కాని, జాదవ్ చేసుకునే వ్యాపారం చాలా చిన్నది. అతనితో రా వారికి పెద్దగా అనుబంధం వుండే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే, రా కోసం అప్పుడప్పుడూ లోకల్ బిజినెస్ మెన్ పని చేసినా వారంతా తమ తమ వ్యాపారాల్లో నష్టాల్ని ఎదుర్కుంటున్న వారై వుంటారు. వారు డబ్బు కోసమో, లేక మరేదైనా లాభం కోసమో రా ఏజెంట్లు గా సహకరిస్తుంటారు. జాదవ్ కు అలాంటి అవసరం కూడా వున్నట్టు కనిపించటం లేదు. అతని లాంటి నేపథ్యం వున్న ఎవరికీ రా సుదీర్ఘమైన మిషన్లు అప్పగించదు. చిన్న చితకా సమాచారాలే వారు చేరవేస్తుంటారు. పాక్ చెప్పినట్టుగా ఉగ్రవాదం రగల్చటం లాంటి పనులకు రా వ్యాపారస్థుల్ని అస్సలు ఉపయోగించదు!    కేవలం అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పేరు చెడగొట్టాలని ఆశిస్తోన్న పాక్ జాదవ్ ను అక్రమంగా ఉరితీసే ఆలోచనలో వుంది. అయితే, ఇండియా కూడా ధీటుగా బదులు ఇవ్వటంతో ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది. చూడాలి మరి… మన జాదవ్ ఎంత కాలానికి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడో! 

రాజకీయ నేతల ఇళ్ల గురించిన ఆరోపణల… ‘గృహ హింస’!

  గతంలో ఒక నేత మీద మరోక నేత ఆరోపణలు చేసుకోవాలంటే పాలన పరమైన దోషాలు వెదికే వారు. తరువాతి కాలంలో అవినీతి కోణాల్ని దొరకబుచ్చుకుని ఇరుకున పెట్టేవారు. ఇప్పుడు అదంతా పోయింది. కొత్తగా పర్సనల్ ఎటాక్స్ ఎక్కువైపోయాయి! రాజకీయ నేత పబ్లిక్ లైఫ్ తో ఎలాంటి సంబంధం లేని విషయాల్ని పెద్ద రచ్చ చేసే ఎజెండా అమలవుతోంది. దీంట్లో ప్రతిపక్షం, పాలకపక్షం, మీడియా, సోషల్ మీడియా అన్నీ భాగం అవుతన్నాయి!   ఈ మధ్య కాలంలో చంద్రబాబు హైద్రాబాద్ నూతన నివాసం మీద పెద్ద రచ్చ జరిగింది. అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఇక్కడ ఎప్పట్నుంచో వుంటోన్న పాత ఇంటిని కూల్చి కొత్తగా కట్టుకున్నారు. ఆ విషయంపై వైసీపీ వారు అనవసర రాద్దాంతానికి తెర తీశారు. చంద్రబాబు ఇళ్లు కోట్లు విలువ చేసేలా కట్టారని, అంత దుబారా ఎందుకనీ ప్రశ్నించారు. చంద్రబాబు ఇల్లు కట్టింది ప్రజా ధనంతో కానప్పటికీ ఆయన సీఎంగా వున్నారు కాబట్టి ప్రతిపక్షం టార్గెట్ చేసింది. కాని, గతంలోనే లోటస్ పాండ్ అనే పేరుతో భారీ ఇంధ్ర భవనం నిర్మించిన జగన్ , ఆయన పార్టీ వారు చంద్రబాబును టార్గెట్ చేయటం కాస్త విడ్డూరమే!   కొందరు చెబుతన్న దాని ప్రకారం చంద్రబాబు ఇళ్లు కేవలం మూడు బెడ్ రూమ్ ల సముదాయం మాత్రమే. బెడ్ రూమ్స్ కాక ఒక హాల్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ లాంటివి వున్నాయట. బంజారా హిల్స్ , జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఇలాంటి కట్టడాలు మామూలే! కాని, చంద్రబాబు విలాసవంతమైన ఇల్లు కట్టాడని విమర్శిస్తున్న వైసీపీ నేతలు పట్టించుకోని విషయం లోటస్ పాండ్ సంగతే! అందులో ఏకంగా ముప్పై గదులు వున్నాయని, అవ్వి  కాకుండా ఇతరరత్రా ఏర్పాట్లన్నీ కలిపితే అరవై గదుల దాకా సంఖ్య చేరుతుందని అంటున్నారు. అలాగే, బ్యాడ్మింటన్ కోర్టులు, ఎస్కలేటర్లు, మీటింగ్ హాల్సు, స్వీమ్మింగ్ పూల్ లాంటి సౌకర్యాలు కూడా వున్నాయట! ఇవన్నీ ఖచ్చితంగా చెప్పటం ఎవరి వల్లా కాదు. కాకపోతే, జగన్ పై వున్న కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఆయన లోటస్ పాండ్ నివాసం కోట్లు పలుకుతుందనే అభిప్రాయపడింది!   ఇంతకీ… చంద్రబాబు, జగన్ ఇళ్లలో ఎవరిది ఎక్కువ ఖరీదైంది? లోటస్ పాండ్ విస్తరించి వున్న వైశాల్యం చాలు ఏ నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవసరమయ్యేది చెప్పటానికి! చంద్రబాబు నివాసానికి కంటే అది చాలా రెట్లు పెద్దది. కాబట్టి వైసీపీ నేతలు అనవసరంగా సీఎం వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకపోవటమే మంచిది. కారణం , ఇప్పుడున్న సోషల్ మీడియా జమానాలో చర్చంటూ ఒక్కసారి మొదలయ్యాక ఎదుటి వారు కూడా బలంగానే వాదన వినిపిస్తారు. అప్పుడు అన్ని విషయాలు బయటపడిపోతాయి! ఇంతా చేస్తే… జగన్, చంద్రబాబుల ఇళ్లపై చర్చ ఏ విధంగానైనా ఆంధ్ర ప్రజలకి మేలు చేస్తుందా అంటే… ఏమీ లేదు! అందుకే, డబ్బున్న వాళ్లు కట్టుకునే ఇళ్ల గొడవకన్నా ఇళ్లు లేని పేదల కష్టాల గురించి మాట్లాడుకుంటే బెటర్!

2019 ఎన్నికల సాగుకి… సిద్ధమైన కేసీఆర్ ఉచిత ఎరువు!

2014లో అటు మోదీ, ఇటు కేసీఆర్, చంద్రబాబు…. ముగ్గురూ ఒకేసారి ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు సరిగ్గా వాళ్ల టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ పూర్తైంది. సెకండ్ ఇన్నింగ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు! అయితే, అందరిలోకి కేసీఆర్ స్ట్రాటజీ కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ ఇంత కాలం నెట్టుకొచ్చారు. కాని, అనూహ్యంగా గత కొన్ని నెలలుగా కొత్త కొత్త సంక్షేమ పథకాలు జనం ముందుకు తీసుకొస్తున్నారు! తద్వారా కులాలు, మతాల కాంబినేషన్ జాగ్రత్తగా కాపాడుకుంటూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారు!   కేసీఆర్ అత్యంత తాజా ప్రకటన రైతులకి ఉచిత ఎరువు! నిజంగానే ఆయన చెప్పుకున్నట్టు ఇంత వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలాంటి పని చేయలేదు! పంపిణీ చేయలేదు! కేసీఆర్ ఒకే ఒక్క మాస్టర్ స్ట్రోక్ తో 55లక్షల మంది రైతుల దృష్టిని ఆకర్షించగలిగారు. పైగా రుణ మాఫీ కూడా వీలైనంత వరకూ బాగానే జరిగింది తెలంగాణలో. అయితే, ఉచితంగా ఎరువులు ఇవ్వమని సీఎంని అడిగింది ఎవరు? ఎవరూ అడగలేదు. అయినా ఎందుకని వేల కోట్ల భారం మోస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేస్తోంది? కారణం ఎన్నికలే!   ఎన్నికలు అంతకంతకూ దగ్గర పడుతుండటంతో కేసీఆర్ సంక్షేమం మీద దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పెద్ద ఎత్తున్న పార్టీలో చేర్చుకుని సంస్థాగతంగా బలం చేకూర్చున్నారు! అయితే, గడిచిన రెండు, రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ సామాన్య జనానికి మాత్రం స్పష్టంగా ఎలాంటి లబ్ధి చూపించలేకపోయారు. మంచి విద్యుత్ అందించటం లాంటివి పక్కన పెడితే ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయని నిరుద్యోగులు ఆశించారు! ఆ అంశంలో ఘోరంగా ఫెయిలైంది కేసీఆర్ సర్కార్. కోదండరామ్ సార్ రోడ్డు మీదకే వచ్చి గొడవ చేసేలా తయారైంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వ్యవహారం!   ఉద్యోగాలే కాదు కేజీ టూ పీజీ లాంటి ఇంకా బోలెడు ఎన్నికల హామీలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నెరవేర్చలేకపోయింది. ఇక ముందు కూడా వడివడిగా నెరవేర్చే సూచనలు కనిపించటం లేదు. ప్రతి పక్షాల నుంచి , ప్రజా సంఘాల నుంచీ రోజు రోజుకి ఒత్తిడి అధికమవుతోంది. ధర్నా చౌక్ ని కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్లకు దూరంగా మార్చేయాల్సిన అవసరం ఏర్పడింది! ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ఎరువులే కాదు గొర్రెల పంపిణీ లాంటి వినూత్నమైన పథకాలతో గులాబీ బాస్ జనాన్ని ఎంగేజ్ చేసే పనిలో పడ్డారు!   ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకి ముందు వున్న సమస్యలు ఇప్పటికీ అలానే వున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు మొదలు హైద్రాబాద్ రోడ్లు, పూర్తి కాని మెట్రో రైలు వరకూ అన్నీ అస్తవ్యస్తంగానే వున్నాయి. మరి ఇలాంటి స్థితిలో ఎరువులు, గొర్రెలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కి ఎంత వరకూ మేలు చేస్తాయో చూడాలి!

ఓడిన కేజ్రీకి, గెలిచిన దీదీకి… ఇద్దరికీ తప్పని బీజేపి టెన్షన్!

  ప్రతిపక్షాల గుండెల్లో కమలం కలకలం రేగుతూనే వుంది. 2014లో మోదీ ప్రధాని అవ్వటంతో మొదలైన ప్రభంజనం ఇంకా నడుస్తోంది. మొన్నటికి మొన్న యూపీ, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ వశపరుచుకున్న బీజేపి ఇవాళ్ల ఉప ఎన్నికల్లో కూడా ఉత్సాహం ప్రదర్శించింది. అయితే, సాధారణంగా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికార పార్టీ హంగామా వుండటం మామూలే! కాని, ఇవాళ్ల కౌంటింగ్ జరిగిన వివిధ రాష్ట్రాల్లోని తొమ్మది స్థానాల్లో బీజేపి అత్యధిక సీట్లు గెలుచుకుని విమర్శకులకి ఒక విధంగా ఫ్యూచర్ చూపించేసింది!   బై ఎలక్షన్స్ పెద్దగా ట్రెండ్ ని గాని, భవిష్యత్ లో జరగబోయే పరిణామాల్ని పట్టిచూపలేవని రాజకీయ పండితులు అంటూ వుంటారు. అందుక్కారణం చాలా చోట్ల ఏ పార్టీ సీటు ఖాళీ చేస్తే అదే పార్టీ మళ్లీ గెలవటం. కాని, ఇవాళ్ల ఎన్నికల ఫలితాల్లో అలా జరిగింది కేవలం కర్ణాటకలోనే! అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కాంగ్రెస్సే గెలిచింది! దీని కారణంగా మరికొన్ని నెలల్లో అక్కడ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అద్బుతం చేస్తుందంటే మాత్రం ఎక్స్ పర్ట్స్ ఒప్పుకోవటం లేదు!   ఇక మధ్యప్రదేశ్, అసోమ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపి అవలీలగా తన స్థానాలన్నీ తిరిగి కైవసం చేసుకుంది. మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ అమిత్ షా సైన్యం ఆల్రెడీ వున్న సీటు కోల్పోలేదు. అయితే, ఆశ్చర్యకరంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాషాయ దళం కాక పుట్టించింది. రాజౌరి గార్డెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపి విజయ దుందుభి మోగించింది! ఈ స్థానం ఇంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోనిది! కాని, బై పోల్స్ లో ఆప్ తన స్థానాన్ని నిలబెట్టుకోటం మాట అటుంచీ … అసలు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది! రెండో స్థానం కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ కి కట్టబెట్టారు!   ఢిల్లీ తరువాత ఈ రోజు ఉప ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా సాగిన పరిణామాలు బెంగాల్లో చూడొచ్చు! ఇక్కడ బీజేపికి విజయం దక్కలేదు. కాని, కాంతి దక్షిణ్ అనే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీఎంసీ బలమైన మెజార్జీతో గెలుచుకుంది. అయితే, రెండో స్థానంలో కమలదళం నిలవటం… దీదీకి టెన్షన్ పుట్టించే విషయం! ఒకప్పుడు ఈ నియోజకవర్గం సీపీఐ కంచుకోట! కాని, ప్రస్తుతం టీఎంసీ చేతిలోకి వెళ్లింది. కాని, రాష్ట్ర వ్యాప్తంగా అంతటా జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా బీజేపి వేగంగా ఎదుగుతోంది. ఈ ఉప ఎన్నికలతో మమతా బెనర్జీ రాబోయే ఎలక్షన్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది! కమ్యూనిస్టుల కన్నా కాషాయదళమే మమత గండంగా మారుతోంది!   బెంగాల్ లో బీజేపి యువనేత ఈ మధ్యే మమతా బెనర్జీ తలకు పదకొండు లక్షల వెలకట్టాడు! అంతకు ముందు కూడా శ్రీరామనవమి, సరస్వతీ పూజ వంటి వాటి విషయంలో బీజీపీ, టీఎంసీలకే గొడవ జరుగుతూ వస్తోంది! సీపీఎం, సీపీఐ లాంటి కమ్యూనిస్టు పార్టీలు అంతకంతకూ గేమ్ లో లేకుండా పోతున్నాయి! ఈ ఉప ఎన్నికల్లో బీజేపి రెండో్ స్థానానికి ఎగబాకటం ఎర్ర పార్టీల వారికి డేంజర్ సైరనే! వారి సంగతేమోగాని.. బెంగాల్లో కమలం రేపనున్న కలకలాన్ని బెనర్జీ మాత్రం  గుర్తించేసింది!

డబ్బు కోసం భార్యతో గడిపిన వీడియో లైవ్ టెలికాస్ట్

డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు..తల్లిదండ్రులనైనా, తోబుట్టువులనైనా, సన్నిహితులనైనా, చివరికి కట్టుకున్న వారినైనా వంచించడానికి వెనుకాడరు. ప్రతి నిత్యం మన చుట్టూ ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం..ఇంకా చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా టార్గెట్ మాత్రం డబ్బే. వీటన్నింటికి భిన్నంగా భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు ఒక పైశాచిక భర్త. పోలీసుల్నే ఖంగు తినిపించిన ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌కు చెందిన వివాహిత నగ్న దృశ్యాలు గతేడాది నవంబర్‌లో ఆన్‌లైన్‌లో కనిపించాయి. వాటిని ఆమె సన్నిహితులు చూసి బాధితురాలికి చెప్పడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.   దర్యాప్తు చేసిన పోలీసులకు ఆమె భర్తే నిందితుడని తేలడంతో కళ్లు బైర్లు కమ్మాయి. జీడిమెట్ల చింతల్ ప్రాంతానికి చెందిన శాడిస్టు భర్త నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇతనికి ఆన్‌లైన్‌లో అశ్లీల దృశ్యాలు చూడటం అలవాటు.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనకు తోడు, ఆర్థిక సమస్యల్ని తొలగించుకునేందుకు మగ వ్యభిచారిగా మారి తన మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం భార్యకు తెలియడంతో బుద్ధిగా ఉంటానని చెప్పాడు..ఈ క్రమంలో తన భార్య ద్వారానే డబ్బు సంపాదించాలని ప్లాన్ గీసి..పడక గదిలో భార్యకు తెలియకుండా ల్యాప్‌టాప్‌లో వెబ్‌క్యామ్ ఆన్ చేసి లైవ్ స్ట్రీమ్ వీడియో చాటింగ్ పోర్న్‌సైట్‌కు అనుసంధానం చేశాడు.   ఆ సైట్‌లో సుమారు 3 వేల మంది సభ్యులున్నారు. ఆ వీడియోకి వచ్చే వ్యూస్‌ని బట్టి టోకెన్లు కొనుగోలు చేయాలి. ఆ టోకెన్ల సొమ్మును వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తికి నిర్వాహకులు పంపిస్తుంటారు. అయితే లైవ్ స్ట్రీమ్ వీడియో చాటింగ్‌లో మెంబరైన ఒక వ్యక్తి బాధితురాలి వీడియోని డౌన్‌లోడ్ చేసి దానిని వేరే పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు..సదరు వీడియోని చూసిన ఆమె స్నేహితుల సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం డొంక కదిలింది. సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో డబ్బు కోసం ఇలాంటి వాటికి తెగించే ఎంతో మంది మన చుట్టూనే ఉంటారు బీ కేర్ ఫుల్.

దెయ్యం దెబ్బకు ఇల్లు ఖాళీ చేసిన ముఖ్యమంత్రి

దెయ్యం..తరాలు మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ మాట చెబితే చాలు ఎవరైనా వణకాల్సిందే. నిరాక్ష్యరాస్యులైనా..ఉన్నత విద్యావంతులైనా దీనికి అతీతం కాదు..ఇప్పుడు ఈ జాబితాలోకి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేరిపోయారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సీఎం దెయ్యానికి భయపడటమేంటి అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ దెయ్యాలున్నాయన్న కారణంతో అధికారిక నివాసాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చేశారు. మొదట దీనిని ఎవ్వరూ నమ్మలేదు. అయితే భవనాన్ని శుద్ధి చేయడానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను గత వారాంతంలో పిలిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.   రాజధాని ఈటానగర్‌లోని ఎత్తైన కొండపై 2009లో రూ.60 కోట్ల వ్యయంతో కొండమీద ఈ బంగ్లాను కట్టారు. ఈ భవంతిని కట్టిన తర్వాత ఏడుగురు ముఖ్యమంత్రులు మారగా..వారిలో దోర్జీ ఖండూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించగా, జార్బోమ్ గామ్లిన్ అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత నబమ్ టుకీ సీఎం కావడం జరిగింది. బంగ్లా నిర్మాణంలో లోపం ఉందని గ్రహించిన ఆయన ఒక వాస్తు పండితుడిని సంప్రదించి సరిచేయించుకున్నారట. ఆయనప్పటికీ నబమ్ పదవి పోయి..కలిఖో పుల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం..సుప్రీం జోక్యంతో నబమ్ తిరిగి సీఎం కావడం జరిగింది..అయితే ఆశ్చర్యకరంగా తీర్పు వచ్చిన కొద్ది రోజులకే కలిఖో ఫుల్ మృతదేహం బంగ్లాలోని ఫ్యాన్‌కే వేలాడుతూ కనిపించింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత బంగ్లా సిబ్బందిలో ఒకరు కూడా ఆ పక్క గదిలోనే ఫ్యాన్‌కే వేలాడుతూ కనిపించారు.   టుకీ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేదు. ఆయన తర్వాత పెమా ఖండూ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బంగ్లాలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న ఖండూ బంగ్లాలోకి వెళ్లలేదు. దీంతో ఆ భవంతిని గెస్ట్‌హౌస్‌గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసమే శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు పూజారులు, రుషులు, చర్చి ఫాదర్లు, దర్గా పెద్దలు అందరూ ప్రార్ధనలు జరిపి, భవనంలోని ప్రతి గదికి ఆశీర్వచనాలు ఇచ్చి గెస్ట్‌హౌస్‌ను తెరిచారు. అయితే ఇంత జరిగిన తర్వాత ఆ బంగ్లాలోకి వెళ్లడానికి ఎవ్వరైనా సాహసిస్తారా..?

ఢిల్లీ వీధుల్లో తమిళ రైతు… జయలలిత బతికుంటే ఇలా జరిగేదా?

రాజు లేని రాజ్యం అరాచకానికి నెలవు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకుంటోన్నది కాదు. రామాయణ కాలంలో కూడా దశరథుడు మరణిస్తే… రాముడు అరణ్యంలో వుంటే… భరతుడికి పెద్దలు అదే మాట చెబుతారు. రాజు లేని రాజ్యం అతలాకుతలం అవుతుందని! అయితే, కేవలం రాజుంటే సరిపోదు. సమర్థుడైన రాజు కూడా వుండాలి. ఇప్పుడు అదే విషయం నిరూపిస్తోంది తమిళనాడు!   తమిళనాడులో జయ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే బోలెడు హడావిడి జరిగింది. తరువాత ఆమె మరణం కూడా బ్రేకింగ్ న్యూస్ ల పరంపరకు దారి తీసింది. ఇక ఆ తరవాత శశికళ వ్యవహారం, ఆమె సీఎం అవ్వలేకపోవటం, జైలుకెళ్లటం … ఇవన్నీ అయితే నానా గందరగోళానికి దారి తీశాయి. దేశం మొత్తం అదే చర్చ జరిగింది! కాని, విచిత్రంగా ఇప్పుడు అదే తమిళనాడుకు సంబంధించిన నిజమైన సమస్య ఎక్కడా చర్చకు రావటం లేదు. వచ్చిన మీడియాలో బ్రేకింగ్ న్యూస్ ల స్థాయికి రావటం లేదు. అక్కడా, ఇక్కడా అప్పుడూ ఇప్పుడు మాత్రమే కథనాలు వస్తున్నాయి! ఢిల్లీ వీధుల్లో తమిళ రైతులు అంటున్నారే తప్ప… జయలలిత, శశికళ గురించి ఊదరగొట్టినంతగా ఎవరూ మాట్లాడటం లేదు!   అసలు తమిళ రైతులకి ఏమైంది? వారు ఢిల్లీలో ఎందుకు నిరసనలకి దిగారు? ఈ ప్రశ్నలకి సమాధానం చాలా మందికి క్లియర్ గా తెలియదు. వారు రుణామాఫీ కోసం రోడ్డెక్కలేదు. వారి డిమాండ్లలో అది కూడా ఒకటైనా అసలు సమస్య కరువు! గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని వికృతమైన కరువు ఈసారి తమిళనాడుని తాకింది. జయ బ్రతికి వుండగానే తుఫాన్ వచ్చి చెన్నై మునిగినా… చాలా ప్రాంతాలు మాత్రం కరువుకి చిక్కాయి. పంటలు పండలేదు. రైతులు నిండా మునిగిపోయారు. బ్యాంక్ లకు ఋణాలు చెల్లించలేక విలవిలలాడుతున్నారు! అందుకే, ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు!   తమిళనాడు రైతులు రాజధానికి వచ్చి నగ్నంగా కూడా నిరసనలు తెలుపుతుంటే మోదీ సర్కార్ పట్టించుకోకపోవటం నిజంగా విషాదమే! ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్ కి భారీ రైతు ఋణమాఫీ ప్రకటించి ఇంకో వైపు తమిళ రైతుల్ని మాత్రం ఎర్రటి ఎండకి నిర్ధాక్షిణ్యంగా వదిలేయటం దుర్మార్గం. కాని, ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నప్పుడు కేంద్రం తప్పుతో పాటూ మనం తమిళనాడు రాష్ట్రంలో జరుగుతోన్నది కూడా చర్చించాలి! జయలలిత మరణం తరువాత అక్కడ స్థిరమైన ప్రభుత్వమే లేదు. పన్నీర్ సెల్వం నుంచి పళని స్వామీ దాకా జరిగిన పరిణామాల్లో నానా రచ్చ జరిగిపోయింది. ఈ క్రమంలో రైతుల్ని పట్టించుకున్న నాథుడే లేడు చెన్నైలో! అదే ఢిల్లీ చేరిన తమిళ రైతుల పాలిట శాపంగా మారింది!   ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కోట్లు పంచి పెట్టి చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ని గెలిపించుకునే పనిలో వున్న సీఎం బక్కచిక్కిన రైతుల్ని పట్టించుకునే ఉద్దేశ్యంలో లేడు! అసలు ఆయన వారి తరుఫున కేంద్ర ప్రభుత్వంతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు ఇప్పటి వరకూ. ఇలాంటి పరిస్థితి జయలలిత బతికి వుంటే మనం ఊహించగలమా? ఇక్కడే అసలు సమస్యంతా వుంది. తమిళనాడుకి సీఎం అయితే వున్నాడు కాని... అతడికి రైతుల్ని పట్టించుకునేంత తీరిక, స్వేచ్ఛా, పెద్ద మనసు… ఏవీ లేవు! అందుకే, తమిళ అన్నదాత ఢిల్లీ వీధుల్లో మలమల మాడిపోతున్నాడు! జయలలిత నిష్క్రమణతో ఏర్పడ్డ ఈ దారుణమైన పరిపాలనా కరువు… తమిళులకి ఎప్పుడు తీరుతుందో ఏమో!

ఆ సైనికుడితో కాశ్మీరీ ఉన్మాదులు ప్రవర్తించిన తీరు చూస్తే… గుండె రగలిపోతుంది!

కాశ్మీర్ అంటే ఇక్కడ ఎండాకాలంలో చెమటలు కక్కే మనకు చల్లటి హిమలోకం! వీలైతే సమ్మర్ వెకేషన్ కి వెళ్లిరావాల్సిన డెస్టినీ కూడా! కాని, నిజంగా కాశ్మీర్ ఇప్పడు ఎలా వుందో తెలుసా? ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఒక వీడియో చూస్తే తెలిసిపోతుంది! అక్కడ జరుగుతున్న వేర్పాటువాద అరాచకం, దాని ఫలితంగా మన భద్రతా దళాలు ఎదుర్కొంటోన్న సమస్యలు అన్నీ కళ్లకు కట్టినట్టు తెలిసిపోతాయి!   కాశ్మీర్ లో గత కొన్ని నెలలుగా వేర్పాటువాదం వేయి పడగలు విప్పి కాటేస్తోంది. అక్కడి తెలివి లేని యువత పాక్ ప్రేరేపిత శక్తులతో కలిసి హింసకు పాల్పడుతోంది. ముఖ్యంగా, రాళ్లు రువ్వటం అక్కడ మామూలైపోయింది. సైనికుల మీద రాళ్లు రువ్వినందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి నెలవారి జీతాలే ఇస్తోందన్నది బహిరంగ రహస్యం! అయినా మన ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోని బీజేపీ పార్టీనే సర్కార్ లో భాగంగా వున్నా అల్లరి మూకల్ని నియంత్రించే విషయంలో విఫలం అవుతూనే వుంది. ఆ ఎఫెక్ట్ కాశ్మీర్ నేల మీద డ్యూటీ చేస్తోన్న జవాన్లపై తీవ్రంగా పడుతోంది!   మీడియా తాజాగా బయటపెట్టిన ఒక వీడియోలో కాశ్మీర్ అల్లరి మూకలు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ను వెంటపడి గేలి చేశాయి. బూతులు తిడితూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాశ్మీరీ యువకులు. అయినా కూడా వీడియోలోని యువ జవాన్ సంమయనం పాటించి అన్నీ ఓర్చుకున్నాడు. అందుక్కారణం, చేతిలో అత్యాధునిక గన్ వున్నా ఆ సీఆర్ఫీఎఫ్ జవాన్ల బృందం ఎన్నికల తరువాత ఈవీఎం మెషిన్లు సంరక్షిస్తూ తరలిస్తున్నారు. అటువంటి సమయంలో కాశ్మీర్ ఉన్మాద యువత వాళ్లని టార్గెట్ చేసింది. ముందు నడుస్తున్న ఒక యువ జవాన్ని నోటికొచ్చినట్టు తిట్టిపోసిన యువకులు… అంతలోనే తన్నారు కూడా!   మాటలతో దాడి చేయటం కాకుండా తనపైన భౌతిక దాడికి దిగిన కాశ్మీరీ యువకుడ్ని భారత్ జవాన్ తిట్టిలేదు. బెదిరించలేదు. దాడి చేయలేదు. సహనంతో ఊరుకున్నాడు. తనని కాలెత్తి తన్నినా కూడా మౌనంగా ముందుకు సాగిపోయాడు! ఇలాంటి అవమానాలు మన జవాన్లకు వేర్పాటువాద దెయ్యం పట్టిన కాశ్మీర్లో రోజూ అలవాటే!   సైన్యం ప్రతి చర్యకి పూనుకుని కాల్పులు మొదలు పెడితే రాళ్లు రువ్వే ఉన్మాద యువత అనవసరంగా చచ్చిపోతుంది. అందుకే, చాలా వరకూ భారత జవాన్లు సంయమనం పాటిస్తూ వుంటారు. అయినా కూడా పాక్ పంపే డబ్బుకు అలవాటు పడ్డ కాశ్మీరీ యువకులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే ఒక ఉగ్రవాది ఇంట్లో నక్కితే వాడ్ని రక్షించేందుకు ఆర్మీపై రాళ్లు రువ్వారు లోకల్ యువకులు . అప్పుడు కాల్పుల్లో కొందరు చచ్చిపోయారు. ఇలా జరిగితే రాజకీయ పబ్బం కోసం కాశ్మీరీ ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు, నిరసనలకి దిగుతుంటాయి. మీడియా కూడా తనకు చేతనైనంత ప్రభుత్వ వ్యతిరేక, ఆర్మీ వ్యతిరేక కథనాలు అందిస్తూ వుంటుంది. కాని, ఒక జవాన్ మీద అల్లరి మూకలు దాడి చేస్తే మాత్రం పెద్దగా గొంతులు పెకలకపోవటం విషాదం!   పాక్ పడేసే బిస్కెట్ల కోసం భారత ఆర్మీ మీద మొరిగే కొందరు కాశ్మీరీ యువకులు మళ్లీ తుఫాన్లు, మంచు తుఫాన్లు వస్తే మాత్రం మన సైనికుల సహకారమే తీసుకుంటారు. వార్ని కాపాడి, తిండి, నీళ్లు ఇచ్చేది మన వారే! అయినా ఈ వేర్పాటు వాద జీవుల తోకలు మాత్రం సరిగ్గా అవ్వటం లేదు. ఇక మీదటనైనా ఇలాంటి ఉన్మాదుల్ని భారత ప్రభుత్వం, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచాలి. ఎందుకంటే, వారికి కావాల్సింది స్వేఛ్చో, స్వాతంత్ర్యమో కాదు. పాక్ పడేసే కరెన్సీ నోట్లు కావాలి. అందుకే, అరాచకం సృష్టిస్తూ వుంటారు. అరాచకుల్ని వారికి అర్థమయ్యే భాషలోనే ఎదుర్కోవాలి.

పెట్రోల్ రేట్ పెంచినా! జనానికి నిరసన తెలిపే ఛాన్స్ లేదు

మనకు స్వతంత్రం రాక ముందు ప్రతీ రోజూ నిరసనలు, ధర్నాలు, హర్తాళ్లూ జరిగేవి. స్వాతంత్ర్యం వచ్చాక బాగా తగ్గిపోయాయి. అయినా అనేక అంశాలపై జనం రోజూ రోడ్డు మీదకి ఎక్కుతునే వుంటారు! అలాంటి సమస్యాత్మక అంశాల్లో తప్పకుండా చేరేది పెట్రోల్ రేట్లు! అవును… పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం పెట్రోల్ నిరసనలు, ధర్నాలు, నినాదాలు కామన్! ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినందుకు జనం ప్రభుత్వాలపై ఆగ్రహం ప్రకటిస్తూనే వుంటారు! మరీ ముఖ్యంగా లెఫ్టు పార్టీలు , వాటి కార్యకర్తలు దశాబ్దాలుగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వీధి పోరాటం చేస్తూనే వున్నారు. వాళ్ల ఒత్తిడికి తలొగ్గి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం దాదాపు ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. అయినా రూపాయి, రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ పార్టీలు రచ్చ చేస్తూనే వుంటాయి! కాని, ఇక ఇదంతా చరిత్ర….   మీకు పెట్రోల్ రేట్ పెరిగిందనే నిరసనలు కనిపించాయి గాని … ఎప్పుడైనా బియ్యం ధర పెరిగిందని జనం రోడ్డెక్కటం చూశారా? దేశంలోని దాదాపు అన్ని ఉత్పత్తుల ధరలు పెరుగుతూ, తరుగుతూ వుంటాయి. వాటి విషయంలో జరగని రచ్చ ఇంతకాలం పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో జరిగేది! ఇక ఇప్పుడు అలా జరిగే అవకాశాలు లేకుండాపోనున్నాయి! మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ గా కొత్త విధానాన్ని వైజాగ్ లో స్టార్ట్ చేయనున్నారు. అదీ లేబర్ డే అయిన మే ఒకటవ తేదీన!   మన వైజాగ్ తో పాటూ పుదుచ్చేరి, ఛండీఘర్, ఉదయ్ పూర్, జంషెడ్పూర్ లలో రోజువారి రేటింగ్ విధానం మే ఒకటి నుంచీ అమల్లోకి రానుంది! దీని ప్రకారం పెట్రోల్ , డీజిల్ ధరలు ప్రతీ రాత్రీ మారిపోతాయి. తెల్లవారే సరికల్లా నిన్నటి కంటే కొన్ని పైసలు ఎక్కువో, తక్కువో అవుతాయి! అంటే, వంద, యాభై రూపాయల చొప్పున పెట్రోల్ కొట్టించే సామాన్య జనానికి రేట్ ఎంత మారింది, ఇంధనం ఎంత ఎక్కువ, తక్కువలు వస్తోంది స్పష్టంగా తెలిసే అవకాశం లేదన్నమాట! పర్సులోంచి వంద నోటు బయటకి వెళితే పెట్రోల్ ట్యాంక్ లోకి ఎన్ని మిల్లీ లీటర్లు వచ్చింది జాగ్రత్తగా లెక్కపెట్టుకుని , రోజువారిగా పోల్చుకుంటే తప్ప రేటు పైన అవగాహన రాదు!   మే ఫస్ట్ న వైజాగ్ లో ప్రారంభించి తరువాత తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ రేట్ల రోజువారి మార్పుని క్రమంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం పదిహేను రోజులకి ఒకసారి చమురు కంపెనీలు రేట్లు రివైజ్ చేస్తుంటాయి. మే తరువాత అది కాస్తా రోజువారి వ్యవహారం అయిపోనుంది! దీని వల్ల ప్రధానంగా ఎదురయ్యే పరిణామం ఒకేసారి రేటు పెరిగిపోయినట్టు కాని, తగ్గిపోయినట్టు కాని అనిపించకపోవటం! తగ్గినా, పెరిగినా కొన్ని పైసల్లో మాత్రమే మార్పు వుంటుంది! అందుకే, ఇక ప్రతి పక్షాలు, మరీ ముఖ్యంగా, ఇంత కాలం ఇంధన ధరల పెరుగుదలకి శాశ్వత వ్యతిరేకులుగా వుంటూ వచ్చిన లెఫ్ట్ పార్టీలు… నిరసనలు, నినాదాలు చేయలేవన్నమాట!

మోజు తీరింది..ముక్కలుగా నరికాడు

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాహేతరం సంబంధాలు పెట్టుకుని నిండు జీవితాలు బలి చేసుకున్న ఎన్నో సంఘటనలు మనం చూశాం. ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను లోబరుచుకోవడం..విషయం బయటపడుతుంది అనుకున్న సమయంలో అత్యంత దారుణంగా చంపి వారిని అడ్డు తొలగించుకున్న కేటుగాళ్ల కహానీలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన లావణ్యకు అదే గ్రామానికి చెందిన దండ్ల రాజుకి పెద్దలు వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే బతుకు దెరువు కోసం రాజు గల్ఫ్ వెళ్లాడు..   ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములు అనే వ్యక్తితో లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం వీరి బంధం బాగానే నడిచినప్పటికి కొద్దిరోజుల నుంచి రాజు, లావణ్యల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత ఆదివారం బహిర్భూమికి వెళ్లిన లావణ్యపై అత్యాచారం జరిపి..అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఒక సంచిలో తీసుకెళ్లి ఊరి చివర్లో ఉన్న కుంటలో పడేశాడు.   ఆమె ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తలో దిక్కుకు వెళ్లి వెతికారు. అయితే ఊరి చివర చెట్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహాం ఉందని తెలియడంతో కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూశారు. కట్టుకున్న చీర, నగల్ని బట్టి లావణ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని డాగ్ స్వ్కాడ్ సాయంతో నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామ శివారు వరకు వెళ్లిన జాగిలాలు తిరిగి వెనక్కి వచ్చాయి. అయితే మృతురాలి మావయ్య ఫిర్యాదు మేరకు రాములుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

వన్ డే సీఎం కాబోతున్న చంద్రబాబు

ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకేఒక్కడు సినిమాని భారతీయులు మరచిపోలేరు. ఆ మూవీలో వన్ డే సీఎం కాన్సెప్ట్ జనానికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. హీరో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రిగా చేసిన పనులు అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో ప్రభుత్వాధికారుల అవినీతిని, నిర్లక్ష్యాన్ని దుమ్ము దులిపి ప్రజల సమస్యలు పరిష్కారిస్తాడు. ఇప్పుడు అచ్చం అలాంటి ఫార్ములానే అనుసరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందేనని ఆరోపణలు వస్తున్నాయి..దీంతో ప్రభుత్వంపై విమర్శలకు తోడు చెడ్డ పేరు వస్తుంది.   ఈ విషయం సీఎం దాకా వెళ్లడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. అవినీతి అంతానికి నడుం బిగించిన చంద్రబాబు తనకు బాగా నమ్మిన నెస్తం టెక్నాలజీనే ఇందుకు సరైన ఆయుధం అని భావించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీ నిపుణులు ఒక యాప్ రూపొందించారు. ఆ యాప్ ద్వారా ఒక్క సందేశం పంపితే చాలు..ఎలాంటి సమస్యకైనా కేవలం అరగంటలోనే పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగినా..పనులు నత్తనడకన సాగినా..అధికారులు వేధిస్తున్నా..ఈ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 14న సీఎం దీనిని ప్రారంభించనున్నారు. ఈ యాప్ కనుక సమర్థవంతంగా పనిచేయడం మొదలు పెడితే అవినీతి అధికారుల కథ కంచికే. అలా జరగాలని..అవినీతి రహిత సమాజాన్ని చూడాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల సాకారం కావాలని కోరుకుందాం.