English | Telugu
తెలుగు ఇండియన్ ఐడల్ లో రానాని బుక్ చేసిన చిరు!
Updated : Jun 14, 2022
ఆహా ఓటీటీ 'తెలుగు ఇండియన్ ఐడల్' సింగింగ్ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు తమన్, నిత్యామీనన్, శ్రీరామ్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ షోకు గెస్ట్ గా నందమూరి బాలయ్య ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో హల్ చల్ చేశారు. పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ అదరగొట్టారు. ఇక ఈ షో ఇప్పడు ఫైనల్ కు చేరింది. గ్రాండ్ ఫైనల్ ని మెగా ఫైనల్ గా ఏర్పాటు చేశారు. ఈ మెగా ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
రోల్స్ రాయిస్ కార్ లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ లోపలికి వస్తూనే తన గ్రేస్ తో ఆకట్టుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా తన స్టైల్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. శుక్రవారం 17న ఈ మెగా ఫైనల్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమోని ఆహా వర్గాలు విడుదల చేశాయి. ప్రోమోలో చిరు చాలా హుషారుగా కనిపించి సందడి చేశారు. ఒక దశలో ప్రోగ్రామ్ ని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడా? అనేంతగా హల్ చల్ చేశారు.
ఇదే షోలోకి 'విరాటపర్వం' ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా, హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారు. "డాన్స్ అంటే కొంచెం భయం.. పాట అంటే ఇంకా భయం వచ్చేస్తుంది" అని సాయి పల్లవి అంటే రానా 'నేను టెన్త్ .. లెవెన్త్ క్లాస్ లో వున్నప్పుడు..' అని చెబుతుండగానే చిరు అందుకుని "నేను దానికి ఎక్స్ టెన్షన్ చెబుతాను.. చరణ్ బాబు గదిలో కిటికీ తలుపుల గ్రిల్ తీశావ్" అన్నారు.. ఆ మాటలకు షాకైన రానా సిగ్గుపడిపోయాడు. ఈ ఒక్క మాటతోనే ఆగకుండా రానా చిలిపి అల్లర్లని చిరు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. రానా, చిరుల ఇంట్రెస్టింగ్ టాపిక్ లకు సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం 17న రాత్రి 9 గంటలకు `ఆహా`లో స్ట్రీమింగ్ కాబోతోంది.